Previous Page Next Page 
ఆనందం పరమానందం పేజి 28

ఆ దృశ్యం చూచి, కుక్కలకి కళ్లతో థేంక్స్ చెప్పేడు గోవిందం. కుక్కలు తోక లూపేయి.
ఇంకా ఆ ప్రేమికులు అదే భంగిమలో వున్నారు. గోవిందం తలుపు శబ్దం చేసేడు.
ఆ శబ్దానికి ప్రేమ జంట విడిపోయింది. వంటవాడు  యజమానిని చూచి వణికిపోతున్నాడు. సుబ్బులు చెంగుతో మొహం దాచుకుంది.
గోవిందం గాండ్రించేడు -
"ఏరా? పాకశాస్త్రంలో నుంచి కామశాస్త్రంలోకి బదిలి అయ్యేవా?"
"లేద్సార్! కళ్లు తిరుగుతుంటే తల వాల్చా!"
"ఎక్కడ వాల్చేవు? సుబ్బులు గుండెల పైనా? ఎన్నాళ్లుగా సాగిస్తున్నారు ఈ లవ్వాట? మాటాడు! నాకు ప్రేమంటే గిట్టదని తెలుసా? ఎవరైనా సరే  ప్రేమా  దోమా అన్నారంటే కాల్చిపారేస్తాను ఖబడ్దార్! ఊఁ....ఇంకా  నిలబడ్డారే? నడవండి! మీ ఉద్యోగాలు పీకిపారేస్తున్నా! ప్రేమించుకుంటో అడుక్కుతినండి! పోండి!" అన్నాడు గోవిందం.
సుబ్బులు దిగులుగా అన్నది-
"బాబుగారు! ఈ ఒక్క తప్పు కాయండి! ఆడకూతుర్ని..."
"ఆడకూతురైనా, సొంత కూతురైనా రూలు రూలే! తేడాలుండవు. ప్రేమించకూడదు. జాకీ, టైగర్ -మీ రిద్దరూ ఈ ఇద్దర్నీ బయటికి పంపించే పని మీదుండండి!" అని కుక్కలకి ఆర్డరు వేసి గోవిందం వెళ్లిపోయేడు.
వంటవాడు గోవిందం ఆర్డర్స్ ని కొట్టి పారేసే రీతిలో సుబ్బులికి ధైర్యం చెబుతున్నాడు -
"దిగులు పడమాకే సుబ్బులు! మన చేతిలో విద్య వుంది. ఈ కొంప కాకపోతే మరో కొంప! భయపడమాకు! లవ్వాట అన్నాడు కదూ? ఆ ఆటలో మనం ఎక్కడున్నాం?"
"అమ్మో! మళ్లా మొదలెడతావా? కుక్కలున్నాయి!" సుబ్బులు గుర్తుచేసింది.
"ఉంటే ఉండనీ! నువ్వురా!" అనిసాక్షాత్తూ కుక్కల ముందే సుబ్బులి గుండెలపైన వాలి పోయేడు.
ఆ దృశ్యం చూళ్లేక కుక్కలు రెండూ గోడ వేపు మొహాల్ని తిప్పి, కూడదంటూ మొరుగుతున్నాయి.
                                      30
చింతామణి శారీమందిర్ ముందు కారు ఆగింది.
ఆ కారులోంచి కైలాసం దిగేడు. అతనిప్పుడు చాలా ఖరీదైన వేషంలో వున్నాడు. నిలువంతా ధగధగా మెరిసిపోతున్నాడు. అతన్ని చూడగానే ప్రొప్రయిటరే స్వయంగా స్వాగతంచెప్పేడు.
"శారీసా? పట్టుచీరలా సార్?"
"అన్నీ పట్టుచీరలే కావాలి."
"ఎన్ని కావాలి సార్?"
"పాతికవేలు తక్కువ కాకుండా బిల్లు చేయమని సిస్టరు చెప్పింది."
"సిస్టరు గారు రాలేదు సార్?"
"వారు బయటకు రారు. హొటల్లోనే వుంటారు. ఇదిగో డబ్బు, పాతికవేలు. లెక్కపెట్టుకొండి!"
"ప్రొప్రయిటరు డబ్బు తీసుకుంటూ అన్నాడు-
"డబ్బు దేముందిలేండి! ముందు చీరలు ఎంచుకోండి."
"ఆ విద్య మాకు చేతకాదు. పైకానికి సరిపడా చీరలు పేక్ చేయించి, వాటిని మీ గుమాస్తా కిచ్చి పంపిస్తే - ఎల్లాంటివి కావాలో చెబుతుంది!" అన్నాడు కైలాసం.
"సత్యమూర్తి!" అని పిలిచేడు ప్రొప్రయిటరు.
అక్కడికి సత్యమూర్తి రాగానే, అతను చేయవలసిన పని చెప్పికైలాసానికి కూల్ డ్రింకు పట్టుకురమ్మని కుర్రాడ్ని బయటకు పంపించేడు.  
                             *        *        *
కైలాసంతో పాటు సత్యమూర్తి ఆ ఖరీదైన హొటల్ గదిలోకి అడుగుపెట్టేడు.
వెయిటర్ బట్టలు మూటని ఆ గదిలో దించి వెళ్లిపోయేడు.
గదిలో వున్న అప్సరసను సత్యమూర్తికి పరిచయం చేస్తున్నాడుకైలాసం-
"మా సోదరి, భువనేశ్వరీ దేవి!"
సత్యమూర్తి నమస్కరించేడు. భువనేశ్వరి అందంగా ప్రతినమస్కారం చేసింది.
"చీరలు ఎంపికచేయండి. ఈ లోగా నగల షాపుకి వెళ్లి వస్తాను!" అంటో అక్కడ్నించి కైలాసం నిష్క్రమించేడు.
సత్యమూర్తి బట్టల మూటని విప్పుతున్నాడు. అతన్ని ఆసక్తిగా చూస్తోంది భువనేశ్వరి. ఆమె చూపులు నచ్చని సత్యమూర్తి కొంచెం చిరాకు పడుతున్నాడు.
భువనేశ్వరి కావాలని సత్యమూర్తి భుజాల మీద పడి చీరలు చూస్తోంది. ఆ చీర బావుంది. ఇది బాగోలేదని చెబుతోంది.
ఆమె వరస నచ్చని సత్యమూర్తి అన్నాడు-
"నేను ఆ సోఫాలో కూచుంటాను, మేడమ్! మీకు ఏ చీరలు కావాలో, ఏవి నచ్చలేదో ఎంపిక చేయండి!" అని అతను అక్కణ్నించి కదలబోయేడు.
భువనేశ్వరి అతని చెయ్యి పట్టుకుంది.
"నేను నీకు  నచ్చలేదా?"
"మేడమ్!
"నాకు నువ్వు నచ్చేవు. నువ్వు అంగీకరిస్తే నిన్నే పెళ్లి చేసుకుంటాను. నా సిరిసంపదలూ, ఆస్తి ఐశ్వర్యాలు అన్నీ  నీకు సొంతమవుతాయి. అప్పుడు నువ్వు  ఇల్లాంటి ముష్టి ఉద్యోగాలు చేయక్కర్లేదు. మహారాజులా దర్జాగా  బతకొచ్చు. ఏమంటావ్?"
సత్యమూర్తి ఆమె చేతి లోంచి తన చెయ్యి లాక్కుని అన్నాడు -
"చూడండి! మీలాంటి గొప్పవాళ్ళకి కొనుగోలు శక్తి ఎక్కువ వుంటుంది. ఏ వస్తువైనా, ఎంత ధరకైనా కొంటారు, కానీ, నా మనస్సు అమ్ముకునేందుకు నేను సిద్దంగా లేను" అని గుమ్మం వరకు వెళ్లి, అక్కడ ఆగి అన్నాడు -
"కొద్ది నిమిషాల పరిచయంతోనే పరాయి మగాడి చేతులు పుచ్చుకోవడం,  పెళ్లాడమని ఆశలు చూపడం మంచిది కాదు. అందరూ మంచివాళ్లే వుండరు. గుర్తుంచుకోండి!" అని వెళ్లిపోయేడు.
అతను వెళ్లిం తర్వాత భువనేశ్వరి  మంచమ్మీద వాలిపోతూ అనుకున్నది - "అందగాడే కాదు, గుణవంతుడు కూడా! అతని లాంటి భర్త దొరకడం ఆడపిల్ల అదృష్టం!"  
                                                 *        *        *
గోవిందానికి  హొటల్లో జరిగిన ఉదంతం మొత్తం మనవి చేసేడు కాబోలు - ముక్తసరిగా ముగింపు కూడా చెబుతున్నాడు కైలాసం-
"తమరు పెట్టిన పరీక్షలో సత్యమూర్తే గెలిచేడు!"
ఆ మాట వినగానే గోవిందం కైలాసం చెంప చెళ్లుమనిపించేడు.
కైలాసం చెంప సవరించుకుంటుంటే గోవిందం అన్నాడు-
"ఈ దెబ్బ  నీ క్కాదు. ఆ ఫకీరు వెధవకి! సేంపిల్ దెబ్బన్నమాట. వ్యవహారం ముదిరింది స్వయంగా నేనే  రంగంలోకి దిగాలి! తప్పదు."
స్టోరు గదిలోంచి డబ్బాల మోత వినిపించింది. గబగబా ఆ గది వేపు  నడిచేడు గోవిందం.
కైలాసం ఆఫీసు గదిలోకి వెళ్లిపోతున్నాడు చెంప సవరించుకుంటూ.
స్టోరు గదిలో గోవిందం పాతఫోటోతో అంటున్నాడు కోపంగా- అంతా విని చచ్చేవా? ఛస్తే  చచ్చేవు గాని నీ మాట నేను చచ్చినా వినను."
"ఆ కుర్రాడు  యోగ్యుడు. గుణవంతుడని నువ్వు పెట్టిన పరీక్షలో  తేలిపోయింది గదా!"
"యోగ్యులు, మునీశ్వరులు కాదు నాక్కావల్సింది! నా అల్లుడు కూడా నాకు మల్లె కోటీశ్వరుడై వుండాలి!"
"ఒరే గోవిందం! పంథాలకు పోయి పిల్లల బతుకులు నాశనం చేస్తే నీకు పుట్టగతులుండవురా!"
"నేను మళ్లీ మళ్లీ పుట్టేందుకు బేవార్సు పనులు చేయను. చూస్తూండు. నా పిల్లను మాయ చేస్తున్న ఆ ఫకీరు వెధవని బురిడీ కొట్టించేందుకు స్వయంగా నేనే రంగంలోకి దిగుతున్నాను. వాడికి సుఖశాంతుల్లెకుండా చేస్తాను. నా దెబ్బకి తట్టుకోలేక వాడు  ఆత్మహత్య చేసుకునే వరకు వదిలిపెట్టను. ఇది నా ప్రతిజ్ఞ! నీ డబ్బా  చప్పుళ్ళు  నన్నేం చేయలేవు!" అంటో ఆ గది నుంచి బయటికి వచ్చి, గదికి తాళం పెట్టేడు.
రెండు రోజుల తర్వాత -
ఆ ఇంటో చిన్న  డ్రామా ఒకటి చోటు చేసుకుంది.
మేడ మీద తన గదిలో శారద ముస్తాబవుతుండగా, కింద హల్లో గోవిందం ఎవర్నో కోప్పడుతున్నాడు. ఆ తతంగం చూడటానికి శారద గదిలోంచి బయటకు వచ్చింది.
గోవిందం అరుస్తున్నాడు -
"షటప్! మాటాడకు! సిగ్గు లేదుటయ్యా! కన్న కూతురు జీవితంతో ఆడుకుంటావా?"
""మీకేం బాబు? మీ రలాగే అంటారు. కులం లేని ఆ పేదవాణ్ని చేసుకుంటే, పదిమందిలో పరువు పోగొట్టుకునేది నేను! ఆ బాధేమిటో అనుభవించవలసింది నేను!" అన్నాడు ఆ వ్యక్తి.
ఓరకంట శారదని గమనిస్తూ ఒక్కోమాట వత్తి వత్తి పలుకుతూ అన్నాడు-
"కులం కన్నా, ఆస్తీ అంతస్తుల కన్నా, గుణం...గుణం గొప్పదయ్యా! నీ పిల్ల ఆనందం అంతకంటే  ముఖ్యం. నామాట విను. మీ అమ్మాయి ఇష్టప్రకారమే పెళ్లి జరిపించు. నీ పెద్ద  మనసుని చాటుకో!" 

 Previous Page Next Page