"మా కైలాసాన్ని బస్సెక్కించి వస్తున్నాను" అన్నాడు.
"ఏమిటి? అయ్యగారు ఊరికి వెళ్ళిపోయారా?" అడిగారు వాళ్ళు.
కైలాసగణపతి ఎవరో సగంమందికి తెలిసిపోయింది. సాధారణంగా ఊళ్ళోకి కొత్త మనిషి వచ్చి నాలుగు రోజులు వుంటే పల్లెటూరిలో అందరికీ తెలిసిపోతుంది.
"పని ఉండి పట్నం వెళ్ళాడు. ఏవో మందులు తెచ్చుకోవాలట. రెండురోజులు ఆగి వస్తాడు." అని చెప్పి ముందుకి సాగాడతను.
మధ్యలో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఇంటికి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యం అయింది.
"గవర్రాజుగారి ఇంటికి వెళ్ళి వచ్చారా." మాణిక్యాంబ అడిగింది.
"లేదు! మధ్యలో వాళ్ళతో వీళ్ళతో మాటాడేసరికి ఆలస్యం అయింది. సాయంత్రం వెళతాలే." అన్నాడు సూర్యారావు.
కొండ ఎక్కిన విషయం మాత్రం చెప్పలేదు.
"అన్నయ్యగారిని జాగ్రత్తగా బస్ ఎక్కించారా?"
"ఆఁ! మీ ఘనత వహించిన అన్నయ్యగారు తప్పిపోయే ప్రమాదం లేదు. మారుపడిపోయే ప్రమాదం అంతకన్నాలేదు. వందమందిలో కూడా గుర్తుంచుకోదగిన స్పెషల్ మనిషి. వాడూ.... వాడి పరథ్యానమూ." అంటూ నవ్వాడు సూర్యారావు.
"ఏమిటో! చాలా హుషారుగా వున్నారు?" అంది మాణిక్యాంబ.
దరిదాపుల్లో పిల్లలు వున్నారేమో అని చూసి ఎవరూ లేకపోవటంతో గొంతు తగ్గించి "కారణం చెప్పనా!" అన్నాడు.
"చెప్పండి."
"రెండు చుక్కలు పుచ్చుకున్నాలే." హుషారుగా అన్నాడు అతను.
"ఛీ పొండీ పిల్లలు వింటారనికూడా లేదు" సిగ్గుపడుతూ అంది మాణిక్యాంబ. మరోపక్క ఈ వయసులో కూడా భర్తకుర్ర చేష్టలకి మురిసిపోతూ.
"పిల్లలు వింటం లేదనే" అతను నవ్వుతూ అన్నాడు.
మాణిక్యాంబ నవ్వేసి ఊరుకుంది.
18
"ఈ సంగతి విన్నావా బావా!"
"ఏ సంగతి?"
"అప్పయ్య కూతురు మంగలేదూ - "
"వుంది"
"అదికాదు మంగని ఎవరో చంపారు."
"ఆ...." అంటూనోరు తెరిచాడు సూర్యారావు.
రెండు రోజులబట్టీ వంట్లో నలతగా వుందని ఇల్లు కదలలేదు సూర్యారావు. చిన్న చిన్న నెప్పులని అసలు లెక్కచేయడు. అలాంటిది మాడునొప్పని అరికాళ్ళు మంటలని ఆముదం పట్టించి రెస్ట్ గా కూర్చున్నాడు.
కైలాసగణపతి నిన్న ఉదయం బస్సు ఎక్కించి యింటికి వచ్చిన తరవాత కూడా బాగానే వుంది. మధ్యాహ్నము నుంచి మాడునెప్పి అరికాళ్ళు మంటలు వచ్చాయి.
పుల్లారావు సూర్యారావు మాటవరసకి బావా అంటే బావా అనుకుంటారు. అంతకుమించి వాళ్ళ మధ్య బంధుత్వం లేదు.
ఆ వీధిన వెళుతున్న పుల్లారావు "బావా! ఇంట్లో వున్నావా?" అంటూ ఇంట్లోకి వచ్చి ఈ విషయం చెప్పాడు.
మంగని చంపిన విషయం విని కొద్దిసేపటిదాకా తేరుకోలేకపోయాడు సూర్యారావు.
"నిక్షేపం లాంటి పిల్ల. చిదిమి దీపం పెట్టొచ్చు. మొన్న శ్రావణానికి పదివెళ్ళి పదకొండు వచ్చాయి. పెళ్ళికూడా చేద్దామనుకుంటున్నారు. ఆ మధ్య సాంబమ్మ కనిపించి చెప్పింది.
"పిల్ల బాగుంటే సరాతల్లీ! డబ్బు అంతా డబ్బులో వుంది. ఆయన సంగతి తెలిసిందే కదా! అసలే అంతంత మాత్రం సంసారం. అది చాలక తాగుడికి ఎంత డబ్బు చాలదు" అంటూ సాంబమ్మ బాధపడి చెప్పుకుంది" అంది మాణిక్యాంబ.
అప్పయ్య కూలీనాలీ చేసుకునే మనిషి. ముగ్గురు సంతానం అంతా ఆడపిల్లలే. రూపాయి ఇంట్లో యిస్తే రూపాయి తాగుతాడు. "ఎందుకురా ఇంట్లో అందరినీ అర్థాకలితో పస్తుపెట్టి తాగుడికి డబ్బు తగలేస్తావు" అంటే "ఆయిలు పొయ్యకపోతే ఇంజను ఆడదు" అంటాడు ఓ వెధవ నవ్వు నవ్వి.
పెద్దపిల్ల మంగకి పదకొండేళ్ళు. అందంగా ఉంటుంది శరీర ఆకృతికూడా చక్కగా వుంటుంది. హత్య చెయ్యటానికి చేతులు ఎవరికి ఎలా వచ్చాయో ఆ దేముడికి తెలియాలి.
"ఇంతకీ మంగని ఎవరు చంపారు? ఎలా చంపారు?" ఈ మాట సూర్యారావు అడగలేదు మాణిక్యాంబ అడిగింది.
"ఎప్పుడు వెళ్ళిందో ఎలా వెళ్ళిందో ఎవరికీ తెలియదు మంగ కొండ ఎక్కి గుహలోకి వెళ్ళింది. అలా అని అనుకోవాలి ఎందుకంటే శవం గుహలో వుంది కాబట్టి" పుల్లారావు చెప్పాడు.
"కొండ గుహలోనా?"
"అవును అక్కడే."
"చంపి అక్కడ పడేయలేదు కదా?"
"అలాగూ జరిగి వుండవచ్చు చెప్పలేము."
"ఎప్పుడు తెలిసింది?"
"ఇందాకే గంటో గంటన్నర అయిందో తెలిసి. అందరూ ఈ విషయం చెప్పుకోటమే. నేను వెళ్ళి చూద్దామనుకున్నాను. ఇటు వస్తుంటే బావ గుర్తుకు వచ్చాడు. ఇంట్లో వున్నాడేమో ఇరువురం కలిసి వెళ్లవచ్చు కదా అని ఇలా వచ్చాను. "ఏం బావా! వెళదామా చూడటానికి?" పుల్లారావు అడిగాడు. అంతవరకూ మాణిక్యాంబ ప్రశ్నలు వేస్తుంటే సమాధానం ఇస్తున్నాడు.