Previous Page Next Page 
నిశాగీతం పేజి 27


    "మరి! ఆశ్చర్యంగా గిర్రున కళ్ళుతిప్పి చూసింది విజయకుమారి.
    "అదంతా ఓ పెద్దకథ. నాకే  సరిగా అర్థంకాలేదు. నీకేం చెప్పగలను. వెయిట్  అండ్ సీ!బైదిబై...డాక్టర్ రావ్ ఎన్ని గంటల కొస్తాడూ?" ఏదో ఆలోచిస్తూ వాచీ చూసుకున్నాడు ఉదయ్.
    ఆమె సమాధానం చెప్పే ప్రయత్నంలొ ఉండగానే  మళ్ళీ  అన్నాడు "ఒకపని చెయ్యి విఅజయా ఈ పూటకూడా అతడ్నే  పేషెంట్సును చూడమను. నా మూడ్ ఏమీ బాగాలేదు. వళ్ళంతా విరగొట్టేసినట్టుంది. నిద్రముంచుకొస్తున్నది. నేను ఇంటికెళ్తాను. మధ్యాహ్నం రెస్టు తీసుకొని సాయంత్రం  వస్తాను. డాక్టర్ రావును తన క్లినిక్ లొ పని ముగించుకొని సాయంత్రం ఆరుగంటలకల్లా రమ్మను ఇక్కడికి. ఈరోజు సాయంకాలం వచ్చిన వాళ్ళందరికీ డాక్టర్ గారు  యవైల్ బుల్ గా  లేరని చెప్పు!"
    "సారీ ! వాళ్ళు  ఒకపట్టాన వదలరు. సమాధానంచెప్పి వాళ్ళను పంపించేసరికి మా తల ప్రాణం తోకకు వస్తుంది డాక్టర్ , నాలుగు రోజుల్నుంచీ ఒకటే గొడవ డాక్టర్ గారు  ఎప్పుడోస్టారంటూ, డాక్టర్ రావుగారి ప్రాణాలు తోడేశారంటే నమ్మండి. వాళ్ళకు  సర్దిచెప్పడంతోటే ఆయనకు సరిపోతూంది ట్రీట్  మెంట్  మాట అటుంచి...."
    "అలా అయితే విజయా ఓ పనిచెయ్యి. నేను సాయంకాలం అసలు నర్సింగ్ హొమ్ కురాను. డాక్టర్ రావును తన క్లినిక్ లొ వుండమను అక్కడికి నేనే  వస్తానని చెప్పు. ఈ రోజు నువ్వూ మేరీ  కలిసి ఎలాగో పేషెంట్సును చూసుకోండి. డాక్టరుగారు రేపు ఉదయం తప్పకుండా వస్తారనీ, అందర్నీ  చూసుకుంటారానీ చెప్పి పంపించి వెయ్యండి."
    డాక్టర్ ఉదయ్ చంద్ర  ఇంటికి చేరుకోనేసరికి నౌకరు కుర్రాడు ఎదురొచ్చాడు.
    గేటు తెరిచి కారు లోపలకు వచ్చాక వెళ్ళి మెయిన్ డోర్ అన్ లాక్ చేసి డోర్  తెరిచాడు.
    "ఏం? తలుపు తాళంవేసి  వుంచారెందుకూ? అమ్మగారూ ఎక్కడి కెళ్ళారు?" గాబరాగా అడిగాడు ఉదయ్ .
    "రెండు రోజులనుంచి అమ్మగారు మీకోసం ఎదురుచూస్తున్నారు ఒకటే బాధపడిపోతున్నారు."
    "ఇప్పుడెక్కడి కెళ్ళారు?" ఆతృతగా అడిగాడు.
    "బి.పి. ఎక్కువైపోయింది. వంటమనిషి కాంతమ్మను తీసుకొని డాక్టర్ రామారావు గారి  దగ్గర కెళ్ళారు." చెప్తూ ఉదయ్ వెనకే ఇంట్లోకి నడిచాడు పని కుర్రాడు.
    ఉదయ్ నేరుగా ఫోన్ దగ్గిరకెళ్ళి డయల్ చేశాడు.
    "హల్లో! డాక్టర్! నేను డాక్టర్ ఉదయ్ ను మాట్లాడుతున్నాను. మా అమ్మగారు .....అనసూయమ్మ....."
    "యస్! యస్. ఇక్కడే వున్నారు. ఇప్పుడే ఎగ్జమిన్ చేశాను చాలా హై బి.పి. ఉంది. వన్ ట్వెంటీ బైవన్ యైటీ  వుంది. ఆమె చాలా వర్రీ అయిపోతున్నారు. మీవల్లనే ఆమెగారికి బి.పి. పెరిగింది. రెండు రోజుల్లో వస్తానని  చెప్పి వెళ్ళావట నాలుగురోజులైంది. ఇంకా రాలేదని ఆమె బెంగపెట్టుకొని ఇదయిపోతున్నారు ఐయామ్ గ్లాడ్ ఇప్పటికైనా వచ్చావు."
    "ఓ మై గాడ్! అంత బి.పి వుందా? డాక్టర్  యూడూ వన్ ధింగ్. మీ నర్సింగ్ హొమ్ లొ అడ్మిట్ చెయ్యండి. నేను బయలుదేరి వస్తున్నాను."
    "అరెరే! అంత ఖంగారెందుకూ? షి ఈజ్ ఆల్ రైట్."
    "నేను బయలుదేరుతున్నాను. ఆమెను అక్కడే వుంచండి."
    "ఇంజక్షన్ ఇచ్చిపడుకొబెట్టాను. నువ్వు వచ్చావని తెలిస్తే ఆమె బి.పి. అంతా నార్మల్ అవుతుందిలే. డొనేట్ వర్రీ . మళ్ళీ నువ్వు రావడమెందుకూ?"
    "నేను కారు తీసుకొస్తాను."
    "అక్కర్లేదు. నా కార్లో పంపిఅస్తాను. మెడిసన్ కూడా ఇచ్చి పంపిస్తున్నాను. ఆమె రెగ్యులర్ గా మందులు వాడేట్టు చూడు  ఉదయ్. ఉంటాను."
    "థాంక్యూ డాక్టర్!"
    డాక్టర్  రిసీవర్ పెట్టేశాడు. తల్లి ఆరోగ్యం గురించి అశ్రద్ధ చేశానన్న బాధ, మనసులో మెదులుతున్నది. బయటికి వచ్చి  గెట్లో తల్లికోసం ఎదురుచూస్తూ నిల్చున్నాడు.
    రెండురోజులకు వస్తానని చెప్పి  నాలుగు రోజులదాకా రాకపోయే సరికి ఆమె చాళా ఖంగారు పడిపోయి వుంటుంది. తనకు ఊహ తెలిసిన  దగ్గర్నుంచి ఆమె  తనను ఒక్కరోజుకూడా  వదిలి ఉన్నట్టు గుర్తులేదు.
    ఒక్కగంట ఆలస్యంగా వస్తేచాలు నానా హైరానా పడిపోతుంది. అలాంటిది రెందురోజులు ఆలస్యంగా వస్తే బి.పి. పెరగడంలొ ఆశ్చర్యపడవలసిందేమీ లేదు.
    థ్యాంక్  గాడ్! తను  ఇప్పటికైనా రాగలిగాడు.
    ఆమె మానస్తత్వం తనకు  తెలుసు. ప్రతిక్షణం తనకు ఏదో అయిపోతుందనే  భయంతోనే వుంటుంది. ఒకటే ఆందోళన పడుతూవుంటుంది. ఆమె భయానికి కారణం తను ఎంత తరిచి తరిచి చూసినా, ఆలోచించినా అర్థంకావడంలేదు.
    బహుశా తను ఆమె ఏకైక సంతానం కావడమే  కావచ్చు.
    తల్లీ తండ్రీ  తనే అయి తనను పెంచింది.
    ఆమె ఆశలన్నీ తన చుట్టూనే  అల్లుకొన్నది.
    ఆమె నుంచి  మమకారం పెంచుకొనే మరో వ్యక్తి ఎవరూ లేరు. ఇరవైఏళ్ళనాడు, పుట్టిపెరిగిన ఊరూ, దేశమూ, వదిలేసి, పసివాడైనా తనను తీసుకుని అమెరికా వెళ్ళింది. న్యూజెర్సీలొ తనను కంటికిరెప్పలా కాపాడుకుంటూ వచ్చింది.
    ఆమెకు అమెరికానుంచి ఇక్కడకు రావడం ఇష్టంలేదు. తన బలవంతంమీదే వచ్చింది. వచ్చినప్పటినుంచి ఏదో ఆపదను శంకిస్తున్నట్టే అందోళనగా వుంటున్నది, అనుక్షణం ఏదో భయం ఆమెను వెంటాడుతున్నట్టు తను గ్రహించాడు.
    వయసు, దానికితోడు రక్తపుపోతూ ఉండటంవల్లనే  ఆమె అలా ఆందోళనకు గురి అవుతున్నదని తనకుతానే సర్దిచెప్పుకుంటూ వున్నాడు.
    తల్లి గురించి  పరిపరివిధాల ఆలోచిస్తూ గెట్లో నిల్చుని వున్న ఉదయ్ కు, తల్లి  కారుదిగి వంటమనిషి సాయంతో లోపలకు రావడం కన్పించింది.
     ఎదురెళ్ళి ఆమెను ఆప్యాయంగా పట్టుకొన్నాడు.
    ఆమె కోపాన్ని నటిస్తూ ముఖం పక్కకు తిప్పుకుంది.
    "అమ్మకు  కోపం  వచ్చింది కాంతమ్మా! చూడు?"
    "మరిరాదా బాబూ? మీరెళ్ళి ఎన్నాళ్ళయిందీ?" కాంతమ్మ వత్తాను పలికింది.
    "వచ్చేశానుగా ? ఇంకా  వారంరోజులుండాల్సిన పని వున్నది. అయినా వచ్చేశాను. అమ్మకోసం వచ్చేశాను."
    ఆఁ! మహ ప్రేమ! వచ్చేశావులే" తల్లి కళ్ళల్లో కదిలిన  వెలుగు రేఖలు చూసి ఉదయ్ ఆనందంతో ఉబ్బిపోయాడు.
    లోపలి వచ్చాక కాంతమ్మ  "అమ్మగారూ? మీ మందులు ఈ టేబుల్  మీద పెడ్తున్నా" అన్నది.
    "ఇంకా నాకా మందులు ఎందుకు కాంతమ్మ? ఇక వాటి అవసరం లేదు. నువ్వెళ్ళి వంటపని చూసుకో త్వరగా వంటపూర్తిచెయ్. ఈ నాలుగు రోజుల్నుంచీ ఏం  తిన్నాడో ఏమో? ఆ ముఖం చూశావుగా? వారంరోజులు లంఖణాలు పడి లేచిన వాడిలా వున్నాడు.
    "నిజమే అమ్మగారు! బాబుగారేమిటిలా అయిపోయారు?" ఉదయ్ ను ఎగాదిగా  చూసి కాంతమ్మ  వంటగదిలోకి వెళ్ళింది.
    "అమ్మా డాక్టర్ రామారావుగారు ఏం చెప్పారో తెలుసా,"
    "ఏం చెప్పారేమిటి?"
    "నువ్వు మందులు తప్పకుండా వేసుకోవాలని...."
    "విన్నానురా" కొడుకును ఆప్యాయంగా చూచుకొంటూ హాయిగా నవ్వింది ఆమె.
    డాక్టర్  జయంత్ రావు నర్సింగ్ హొమ్.
    రాత్రి ఎనిమిది గంటలు దాటింది.
    "సో! జరిగింది ఇది."
    డాక్టర్ ఉదయ్ చంద్ర డైరీ మూశాడు.
    డాక్టర్ రావు ఉదయ్  చెప్పిందంతా నోట్ చేసుకున్న కాగితాలు సర్ది పెట్టుకొని తలెత్తి  ఉదయ్ ముఖంలోకి చూశాడు.
    "ఓ రౌండ్  విస్కీ.... షల్ ఉయ్?" రావు అడిగాడు.
    "ఏం తల దిమ్మెక్కిపోయిందనుకొంటాను." రావు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మెల్లగా అన్ బిలీవబుల్ స్టోరీ! నా మెదడు మొద్దుబారి పోయింది. ఐ మస్ట్ హేవ్...."
    "గో ఎ హెడ్! నో అబ్జెక్షన్"
    "డాక్టర్ రావు రెండుగ్లాసుల్లో విస్కీపోసి సోడా కలిపాడు. ఉదయ్ కు ఒక గ్లాసు అందించి "ఛీర్ ఫర్ యువర్ హెల్త్" అంటూ తనగ్లాసు ఎత్తి పట్టుకున్నాడు.
    "నా ఆరోగ్యానికేమైంది?" పెద్దగా నవ్వాడు ఉదయ్ చంద్ర.
    "ప్రాణాలతో తిరిగోచ్చావు చాలదా?"
    "నన్ను చంపితే వాళ్ళకేమొస్తుంది? పైగా ఇన్నిరోజులనించి వాళ్ళు పడ్డ శ్రమంతా వ్యర్థం అయివుండేది.
    "ఎలా?" రావ్ గ్లాసు టేబుల్ మీద ఉంచి సిగరెట వెలిగించాడు .
    "రావ్ ! నువ్వు రాసుకొన్న నోట్సు మరోసారి జాగ్రత్తగా చూడు! చాలా  గేప్స్ వుండొచ్చు. గుర్తున్న వివరాలన్నీ  చెప్పాను  నేను  ఇరవై తొమ్మిది ముప్పైఒకటి అంటే నిన్న జరిగిన సంఘటనలుకూడా అన్నీ చెప్పననే అనుకుంటున్నాను. ఏమైనా  మైనర్ విషయాలు వదిలేస్తే వదిలేసి  వుండొచ్చు ముఖ్యమైన విషయాలన్నీ బాగానే గుర్తున్నాయ్" ఓ క్షణం ఆగి..."జయంత్! చూడు . నేను కొన్ని నిర్ణయాలకొచ్చాను అందులో కొన్ని  సరైనవికావచ్చు, కాకానూపోవచ్చు. నువ్వుఆలోచించి విశ్లేషణ చెయ్యడానికి ప్రయ్నంచు! నువ్వుకూడా ఒకనిర్ణయానికి వచ్చాక ఏంచెయ్యాలో ఆలోచిద్దాం" అని విస్కీ  సిప్ చేశాడు ఉదయ్.
    "తొందరేంలేదు. సావధానంగానే ఆలోచించు" ఓ క్షణం ఆగి మళ్ళీ  అన్నాడు డాక్టర్  ఉదయ్
    డాక్టర్ రావు  గ్లాసు  ఖాళీచేసి  మరో పెగ్  విస్కీ  పోసుకున్నాడు.
    "ఊ? కమాన్ ఫినిషిట్?"
    ఉదయ్  గ్లాసు  ఎత్తి  త్వరత్వరగా సిప్ చేసి ఖాళీ గ్లాసు రావు ముందుంచాడు.
    డాక్టర్ రావు గ్లాసు విస్కీ సోడాతోనింపి ఉదయ్ కు  అందించాడు.
    జయంత్ మౌనంగా కూర్చుని దీక్షగా రాస్తున్న నోట్సు చూస్తున్నాడు.
    ఉదయ్ గ్లాసు చెత్తోపట్టుకొని కిటికీదగ్గర నిలబడి, వెన్నెల్లో అందంగా తీర్చిదిద్దిన పూలమొక్కల్ని  చూస్తున్నాడు.
    అరగంట గడిచిపోయింది.
    "ఉదయ్!"
    "ఊఁ" తల తిప్పకుండానే  పలికాడు నిలబడ్డాడు.
    "కమాన్___లేటజ్ స్టార్ట్" డాక్టర్ జయంత్ రావు ఉత్సాహంగా అన్నాడు.
    ఉదయ్, జయంత్ దగ్గిరకొచ్చి నిలబడ్డాడు.
    "ఊఁ ప్రారంభించు!" కుతూహలంగా జయంత్  ను చూస్తూ అన్నాడు ఉదయ్.
    "నేను మొదటినుంచి వస్తాను సరేనా?"
    "అసలు నువ్వు  చెయ్యవలసిందే అది. అలా చేస్తేనే మిస్సింగ్ లింక్స్ ఏమైనావుంటే బయటపడ్తాయి."
    "రైట్! దెన్ ఐ విల్ స్టార్ట్!"
    "ఓ.కె." కుర్చీ లాక్కుని  జయంత్ కు ఎదురుగా కూర్చున్నాడు ఉదయ్.
    గొంతు  సవరించుకొని ప్రారంభించాడు జయంత్.
    ఉదయ్  ముందుకు వంగి శ్రద్దగా వినసాగాడు.
    "మానసికి ఎ రకమైన రుగ్మతాలేదు. అసలు  పేరుకూడా మానసి  కాకపోవచ్చు. నాటకాల్లో అనుభవం గడించిన నటీమణి అయివుండాలి."
    "మానసి అనే పేరు ఆమె పెట్టుకుందంటావా?" కనుబొమ్మలు ముడిచి అడిగాడు ఉదయ్.    

 Previous Page Next Page