Previous Page Next Page 
అహో! విక్రమార్క పేజి 26


    ఆ నేరస్థుడు స్వామీజీ... ఎంత గొప్ప పొలిటికల్ స్వామీజీయో... అతగాడ్ని పట్టుకోవడం వల్ల ఎంత సెన్సేషన్ క్రియేట్ అవుతుందో తెలుసు అతనికి. విధి నిర్వహణలో ఎప్పుడూ ఎవరికీ తలవంచని అన్వేషి వుత్సాహంగా ముందుకు చూస్తున్నాడు.

 

    సరిగ్గా అయిదు నిమిషాల టైముంది.

 

    ఇంకా రావాల్సిన ఆఖరి ప్రయాణీకుడు కోసం ఎదురుచూస్తోంది ఎయిర్ హోస్టెస్.

 

    సరిగ్గా అదే సమయంలో మూసివున్న బ్యాక్ గేటును చీల్చుకుంటూ రివ్వున బాణంలా దూసుకెళ్ళి జీపు లాడర్ దగ్గర ఆగడం-

 

    జీపులోంచి ఒక్క ఉదుటున జంప్ చేసిన అవ్వేషి ఫ్లయిట్ మెట్లెక్కి గబగబా ఎయిర్ హోస్టెస్ ను తోసుకుని, విమానంలోకి జొరబడడంతో-

 

    సిబ్బందిలో హాహాకారాలు మొదలయ్యాయి.

 

    ఎప్పటిలాగే అన్వేషి- ఎగ్జిక్యూటివ్ క్లాస్ లోకి దూసుకుపోయాడు. అతని డేగకళ్ళు, తనకు కావలసిన నేరస్తుడి కోసం వెతుకుతున్నాయి.

 

    మూడో వరుసలో ఠీవిగా కూర్చుని, పక్కనున్న వ్యక్తితో ఏదో మాట్లాడుతున్న స్వామీజీ తన జబ్బమీద ఉక్కుపిడుగులా పడిన దెబ్బకు తలతిప్పి పక్కన మృత్యువులా నిలబడ్డ మనిషిని చూసి- "కౌన్ హై.... తుమ్... యహ్ క్యాహై?" అని చికాగ్గా అరిచాడు.

 

    "మై తుమ్ హారా బాప్ హై...." కండువాని, కళ్లీ లాల్చీని పట్టుకొని లేపి, ముందుకు తోశాడు సి.బి.ఐ. ఆఫీసర్ అన్వేషి.

 

    ఆ స్వామీజీ పేరే వీరేంద్రస్వామీజీ.

 

    అరవైఏళ్ళ వీరేంద్రస్వామీజీ అరుస్తున్నాడు.

 

    పిచ్చిగా కేకలేస్తున్నాడు.

 

    "నువ్వు అరచినా, కేకలేసినా, తప్పుకోవడానికి చూసినా ఇక్కడే ఘాట్ చేసి పారేస్తాను. క్వీప్ క్వయిట్, కమాన్ విత్ మీ" వీపుమీద ఒక్కటిచ్చి బలంగా ముందుకు తోశాడు అన్వేషి.

 

    లాడర్ నుంచి రన్ వే మీద పడిన వీరేంద్రస్వామీజీ ఒక్క ఉదుటున లేచి పరుగెత్తడం ప్రారంభించాడు.

 

    సింహంలా లంఘించి, వీరేంద్రను కాళ్లతో తన్నాడు అన్వేషి. బొక్కబోర్లా పడ్డాడు వీరేంద్రస్వామీజీ.

 

    అతని పక్కనే వచ్చి ఆగింది జీపు. అన్వేషి హేండ్ కఫ్స్ తీసి స్వామీజీ చేతులకు తగిలించాడు.

 

    "ఈ దేశంలో ఏ పొలిటికల్ లీడర్ నన్నేమీ చెయ్యలేడు. నా చేతులకే నువ్వు బేడీలు వేస్తావా? యూనో హూయామై.... అయామ్... లివింగ్ గాడ్... లివింగ్ డివైన్ స్పిరిట్....." గింజుకుంటూ అరుస్తున్నాడా స్వామీజీ.

 

    "నోర్ముయ్! మనదేశపు అత్యున్నత న్యాయస్థానం కళ్ళు తెరిస్తే నువ్వే కాదు. మంత్రులూ, గవర్నర్స్ అందరూ ఎగిరిపోతారు. పోతున్నారు కూడా, ఇకపై అవినీతి, అక్రమాలపై న్యాయస్థానాలు చూస్తూ కూర్చోమని నీకిప్పటికే తెల్సుండాలి పద" రాష్ గా ఒక్కటి యిచ్చాడు అన్వేషి.

 

    అప్పటికే రన్ వే పైన జనం... పోలీసుల్తో నిండిపోయింది. ఎక్కడ నుంచి వచ్చాడో ప్రెస్, ఫోటోగ్రాఫర్స్... కెమెరాలు... క్లిక్... క్లిక్... మంటున్నాయి నిర్విరామంగా. స్వామీజీ ముఖం చాటేసుకుని జీపులో కూర్చుని తల దించుకున్నాడు. జనం మధ్య నుంచి అతికష్టం మీద జీపు బయటికి వెళ్ళిపోయింది.

 

    "యాదగిరి! జీపుని సి.బి.ఐ. చీఫ్ రెసిడెన్స్ కు పోనీ...." గంభీరంగా ఆజ్ఞాపించాడు అన్వేషి.

 

                               *    *    *    *

 

    సి.బి.ఐ. హెడ్ క్వార్టర్స్... న్యూఢిల్లీ...

 

    విశాలమైన వరండామీద ఠీవిగా నడుస్తూ వెళుతున్న అన్వేషి వైపు చాలామంది స్టాఫ్ విచిత్రంగా చూస్తున్నారు. "వీరేంద్రస్వామీజీని అరెస్టు చేసిన అన్వేషి ఇతనే" గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ గుసగుసల్ని వింటూ చిన్నగా నవ్వుకున్నాడు అన్వేషి.

 

    కొంతమంది ముఖపరిచయస్తులు దగ్గరగా వచ్చి, అభినందించి వెళ్తున్నారు.

 

    నిజాయితీతో కూడిన పనికి గొప్ప పురస్కారం కంటే, చిన్న పొగడ్తే ఉపాదేయంగా నిలుస్తుంది.

 

    అందరి అభినందనలూ అందుకుంటూ సి.బి.ఐ చీఫ్ ప్రవర్ధమాన్ ఛాంబర్స్ ముందు ఆగి-

 

    పర్మిషను తీసుకొని లోనికి నడిచాడు అన్వేషి.

 

    అన్వేషిని చూడగానే సి.బి.ఐ. చీఫ్ ప్రవర్ధమాన్, ఒక్కసారిగా సీట్లోంచి లేచిపోయి, ముఖం నిండా సంతోషాన్ని, కళ్ళనిండా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కరచాలనం చేశాడు.

 

    "యూ డిడ్ ఎ వండర్ ఫుల్ జాబ్.... మైడియర్ యంగ్ బోయ్... నువ్వు వీరేంద్రస్వామీజీని డాక్యుమెంట్స్ తో సహా అరెస్టు చేశావని తెలియగానే అసలు నేనే ఒక్కక్షణం వణికిపోయాను తెల్సా- ఇంటర్ పోల్ లాంటి సంస్థలే వీరేంద్రను అరెస్టు చేయడానికి వెనుకంజ వేశాయి. అయినా నువ్వు కరెక్టు డాక్యుమెంట్స్ తో కరెక్ట్ ప్లేస్ లో అరెస్ట్ చేయడం చాలా గొప్ప నిజాయితీతో కూడుకున్న అద్భుతం.

 

    ఇంతకీ ఆ డాక్యుమెంట్స్ నీ దగ్గరే వున్నాయి కదూ..." ఎదురుగుండా వున్న సీటుని చూపిస్తూ అన్నాడు ప్రవర్థమాన్.

 

    షర్ట్ వెనుక బనియన్ లో దాచిన డాక్యుమెంట్స్ ని తీసి ఇద్దరి మధ్యా టేబిల్ మీద పెట్టాడు అన్వేషి.

 

    ఆ పేపర్స్ ను వేగంగా అందుకున్నాడు ప్రవర్థమాన్.

 

    ఢిల్లీ కేంద్రంగా వీరేంద్రస్వామీజీ చేస్తున్న అతి కీలకమైన అక్రమ వ్యాపారానికి సంబంధించిన అతి విలువైన డాక్యుమెంట్స్ అవి.

 

    ప్రవర్థమాన్ భృకుటి ఒక్క క్షణం ముడిపడింది.

 

    అయిదు నిమిషాల వరకూ అతనేం మాట్లాడలేకపోయాడు. ఆపైన భారంగా నిట్టూర్చాడు.

 

    బయటికొచ్చిన అన్వేషి జీపులో కూర్చున్నాడు.

 

    "ఎక్కడికి సార్?" అడిగాడు డ్రైవర్ యాదగిరి.

 

    "యాదగిరీ! ఇవాళ నాకు ఆనందంగా వుందయ్యా. డిపార్టుమెంట్ లో ఎవరూ చెయ్యని, చెయ్యలేని పనిని నేను చేశాను. చీఫ్ కూడా అదే చెప్పారు" అన్నాడు అన్వేషి ఆనందోద్వేగంతో.

 

    జీప్ స్టార్ట్ చేస్తూ పసితనం మాయని ముఖంవైపు చూసాడు యాదగిరి.

 

    "మీకైతే ఏ నమ్మకం వుందో నాకర్థం కాదుగానీ, నా సర్వీస్ లో ఇలాంటి కేసుల్ని చాలా చూశాను. రాత్రికి రాత్రి హైకమాండ్ పేరుతో ఫోన్లు రావడం, ఏ చేతుల్తో అయితే మీరు అరదండాలు వేశారో అదే చేతులతో నిలువెత్తు దండలు వేసి అదే ఎయిర్ పోర్టులో ఘనంగా సాగనంపడం కూడా జరిగింది. చట్టాలు, శిక్షలు చిన్నవాళ్ళకి- బక్కవాళ్ళకే సార్! దేశం స్వామీజీల చేతుల్లో, రాజకీయ నాయకుల చేతుల్లోపడి నాశనమైపోయింది సార్" నిరాసక్తంగా అన్నాడు యాదగిరి.

 Previous Page Next Page