కృతఘ్నునకు చేసిన మేలు వ్యర్ధమగును. ఫలించదు. అట్లే దుర్యోధనుడు చేసిన కుయత్నములు వ్యర్ధములు అయినవి. ఫలించలేదు. అయినను దుర్యోధనుడు మానలేదు. పన్నుగడలు విడువలేదు. సమయము కొఱకు వేచి ఉన్నాడు.
వ్యాసుడు ఇదంతయు చూచినాడు. తల్లియగు సత్యవతితో అన్నాడు :-
"అమ్మా! ఈ సంసారము చంచలము. ఆశలు కనిపించును. అందవు. ఎండమావులవంటిది. దీనికి అసలు రూపము లేదు. మిధ్యారూపము గలది. వచ్చుకాలము కన్న పోయిన కాలము మిన్న. దుర్యోధనాదులు క్రూరులు. పాపచిత్తులు. కల్మష మనస్కులు. వారు అకారణవైరములు తేనున్నారు. కౌరవ కులమునకు చేటు తేనున్నారు. అట్టి కీడును ధృతరాష్ట్రుడు అనుభవించును. మీరు భరించలేరు. మీరు హస్తిన విడువుడు. అడవులకు వెళ్ళుడు. తపోవృత్తి అవలంభించుడు."
సత్యవతి వ్యాసుని మాటలు విన్నది. సత్యము గ్రహించినది. భీష్మాదులకు చెప్పినది. అంబిక, అంబాలికతో అడవులకు వెళ్ళినది. వారు తపోవృత్తిని అవలంబించినారు. కొంతకాలము గడచినది. దేహములు విడిచినారు. పుణ్యగతులు పొందినారు.
ఆలోచనామృతము
1. మేధ మానవుల కున్న గొప్ప సంపద. మేధ మదించిన అమృతము అవతరించును. అది ఆలోచనామృతమగును. అంతేకాదు, అందు ఇసుమంత హాలాహలము కూడ ఉందును.
మానవుని ఆలోచనమునకు ప్రతిరూపము నాగరికత. నాగరికత అనుపదము ఒక్కటి. అంతేగాని అది ఎల్లప్పుడు ఒకరీటిగా ఉండదు. అది మారుచుండును.
నాగరికతకు భద్రతకు దగ్గరి సంబంధమున్నది. మానవుడు లభించు భద్రతను బట్టి నాగరికత స్వరూపము మారుచుండును. ఆటవిక దశ యందు భద్రత తక్కువ. సమూహము లేకున్న జీవించుట దుర్లభము. కాబట్టి అక్కడ సంఘమున్నది వ్యక్తీ లేడు.
నాగరికత పెరిగినది. రాజ్యము త=ఏర్పడినది. భద్రత పెరిగినది. రాజు బలపడినాడు. రాజు అనుమతించినదే ధర్మము. రాజునకు రక్షణ భాధ్యత అప్పగించినారు . ప్రజలు ఇతర పనులలో నిమగ్నులు అయినారు.
రాజ్యము అంత పటిష్టము కాని దశ. రాజు కుటుంబము లందు అంతకలహములు అంతగా కనిపించవు. రాజు తరువాత యువరాజు రాజయినాడు. తండ్రి కోరిన యౌవనము సహితము ఇవ్వవలసినదశ. అట్లుకాకున్న రాజ్యము క్షీణించును. భద్రత మాయమగును.
రాజుకు పని తగ్గినది. కార్యవిభజన జరిగినది. ఎవరి పనులు వారు చూచుకొనుచున్నారు. అప్పుడు రాజ కుటుంబములలో అంతకలహాములు అరంభామయినవి.
ఇంతవరకు జరిగిన కధలలో పాలిపగలు లేవు. రాజ్యము కొఱకు స్పర్ధలు లేవు. సమాజమున పాలిపగలకు అంకురార్పణ జరిగినది.
పాలిపగలకు పరాకాష్ట భారత కధ. మానవుని దశ నాటి నుండి నేటివరకు అట్లే ఉన్నది. మానవుని సామాజిక దశ నాటికీ, నేటికీ అంతగా మారినట్లు కనిపించదు. అదే కధ పునరావృత్తము అగుచున్నది.
2. పాండురాజునకు జరిగిన ఉత్తర క్రియలు విపులముగా వర్ణించుట జరిగినది. ఆ వ్యవస్థ అప్పటికి స్థిరపడినట్లు కనిపించుచున్నది.
భద్రత కలిగిన మానవుడు జీవితమును గురించి అలోచించును. అంతటితో ఆగదు. జీవితము ఎంత? అని ఆలోచించును. మరణము జీవితమునకు అంతమా? ఆ తరువాత ఏమున్నది? ఇందును గురించి నిరంతర ఆలోచన సాగినది. సాగుచున్నది. అది ప్రస్తుత అంశము కాదు.
తాను మరణించును. అయినను తన ప్రేమ లోకమందు నిలువవలె అనునది మానవుని ఆకాంక్ష. సంతానము అందుకు ఉపకరించును. అందుకే సంతానము అవసరము.
తండ్రికి కొన్ని భాద్యతలున్నవి. తండ్రిపోయినను ఆ భాద్యతల ఫలితములు పోవు. తలిదండ్రులు బిడ్డలను కనుట మాత్రమే కాదు, వారిని పెంచి పోషింతురు. వారికి జీవనమార్గము చూపుదురు. ఉన్నవారు ఆస్తులు ఇత్తురు. అట్లు తలిదండ్రులు పోయినను వారి కృషి ఫలితములు నిలిచి ఉన్నవి.
పిల్లలకు కొన్ని బాధ్యతలు కలవు. అవి తలిదండ్రుల మరణముతో ముగియవు. వారి పేరు తామున్న వరకు లోకమున నిలుపుట సంతానపు బాధ్యత. అందు కొఱకే ఉత్తరక్రియలు ఏర్పడినవి. ఆ క్రియలందు పూర్యులను తలచుకొనుట జరుగును.
ఉత్తరక్రియల సందర్భమున దాన ధర్మములు ఏర్పరచినారు. అవి చనిపోయినవారి పేర జరుగును. దానములు పొందినవాడు అది ఉన్నంత కాలము అతనిని తలచుకొనును. ఒక చెంబు దానము చేసినాము. అది ఉన్నంతకాలము దాటాను గుర్తుంచుకొనును. భూములు, ఇండ్లు అట్టి జ్ఞాపకములను మరింతకాలము నిలిపి ఉంచుము.
ఇది సదాచారము. ఇది భాద్యతల నిర్వహణ.
3. తరాల అంతరమును గురించి విశేష పరిశోధనము జరిగినట్లు కనిపించుచున్నది. సత్యవతి హస్తినను వీడిపోవుట అందుకు నిదర్శనము, ఒక తరమునకే ఎంతో అంతరము కలుగుచున్నది. అనేక మానసిక సంఘర్షణలు జరుగుచున్నవి. చిత్తక్షోభమునాకు కారణము అగుచున్నవి. ఇక్కడ మూడు తరములు వచ్చినవి. ఈ మానసిక అశాంతి భరించుట కష్టము. ఆ వయసున కావలసిన చిత్త శాంతి అరణ్యములందే లభించును. అందువలన తరములను వదలి అడవులకు వెళ్ళమన్నాడు వ్యాసుడు.
ఆ వయసులో మోహములు వదులుకొనుట మంచిది. మనశ్శాంతికి అది అవసరము.
ద్రోణాచార్యుల వృత్తాంతము
భరద్వాజుడు గొప్ప ఋషి. అతడు గంగా తీరమున తపస్సు చేయుచున్నాడు. ఘ్రుతాచి అప్సరస. ఆమె అక్కడికి వచ్చినది. జలక్రీడలు ఆడినది. భరద్వాజుడు అప్సరసను చూచినాడు. ఇంద్రియ స్థలనము అయినది. ఆ వీర్యమును ద్రోణమందు ఉంచినాడు. భద్రపరచినాడు. కొంతకాలము గడచినది. వీర్యము పక్వము అయినది. బాలుడు అయినాడు. అతడు ద్రోణుడు.
పృషతుడు పాంచాల దేశపు రాజు. అతడు గంగ ఒడ్డున తపస్సు చేసినాడు. మేనక అక్కడికి వచ్చినది. పూలు కోసినది. పృషతుడు మేనకను చూచినాడు. మోహము కలిగినది. ఇంద్రియ స్థలనము అయినది. పృషతుడు ఇంద్రియమును పాదము చేత కప్పి ఉంచినాడు. అందు నుండి ద్రుపదుడు పుట్టినాడు.
ద్రోణుడు , ద్రుపదుడు భరద్వాజ ఆశ్రమమున పెరిగినాడు. కలసి ఆడినారు. కలసి చదివినారు. వేదమును అభ్యసించినారు. కొంతకాలము గడచినది. పాంచాల రాజు మరణించినాడు. ద్రుపదుడు పాంచాలమునకు వెళ్ళినాడు. పట్టముకట్టుకున్నాడు. రాజ్యము ఏలుచున్నాడు.