Previous Page Next Page 
మహాభారతము పేజి 22

 

    మాద్రీ! సకల లోకములకు శుభము కూర్చువాళ్ళు ఆశ్వీనీ దేవతలు. వారిని ఆహ్వానించుము" అన్నాడు పాండురాజు.
    మాద్రి స్నానమాడినది. శుచి అయినది. పాండురాజునకు ప్రదక్షిణము చేసినది. సమాధి చిత్త అయి కూర్చున్నది. మంత్రము అవలంభించినది. ఆశ్వీనీ దేవతలను ఆహ్వానించినది.
    ఆశ్వీనీ దేవతలు వచ్చినారు. మాద్రికి పుత్రవరము ప్రసాదించినారు. వెళ్ళినారు.
    మాద్రి గర్బవతి అయినది. సంవత్సరము పూర్తి అయినది. కవలలు కన్నది.
    వారు నకుల సహదేవులు.
    పాండురాజు భార్యలకు అయుడుగురు పుత్రులు కలిగినారు. వారు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవుడు. వీరు అయుడుగురు పంచపాండవులు.
    పంచ పాండవులు పెరుగుచున్నారు. వారిలో భీముడు మహా బలవంతుడు. అతడు పుట్టిన పడవనాడు తల్లి చంక నుంచి జారినాడు. ఒక రాతిమీద పడినాడు. కొండుకునకు దెబ్బ తగులును అని కుంతి విలపిల్లినది. కాని విపరీతము జరిగినది. భీముని తాకిడికి రాయి చూర్ణమయినది. అది చూచి తల్లి ఆశ్చర్యపడినది. తండ్రి చకితుడ అయినాడు. తమ పుత్రుడు ఏదో మహాకార్యము సాధించనున్నాడు అనుకున్నారు.
    పాండురాజు భార్యలు, పుత్రులతో హిమవంతమున ఉన్నాడు. శతశృంగ పర్వత సానువులందున్నాడు. శాంతముగ ఉన్నాడు. సుఖముగా ఉన్నాడు. ఇంతలో వసంతము వచ్చినది. అరణ్యము అలంకరించుకున్నది.
    సకల వృక్ష జాతులు పూసినవి. పూలతో అడవి నిండిపోయినది. చెట్లకు పూలు, చెట్ల కింద పూలు, అరణ్యము సాంతము పుష్పమయమయినది. అశోకము, చంపకము, మోదుగు, నిమ్మ, చందన వ్రుస్ఖములు అలంకరించుకున్నవి. శోభాయమానంగా ఉన్నవి. కొలనులలో తామరలు కొల్లలుగా పూసినవి. కనుల పండువుగా ఉన్నవి.
    హిమవత్పర్వమును రాచుకొని మలయ మారుతము వీచినది. అది చల్లగా ఉన్నది. పొగడ మున్నగు పూల పరిమళము పూసుకున్నది. పరిమళముతో కూడిన మలయ మారుతము ఎదలను ఎగురవేయుచున్నది.
    పూసిన చెట్లను చూచినవి పక్షులు. పరవశములు అయినవి. పచ్చని చిలకలు గుంపులు గుంపులుగా కలకల మన్నవి. కోకిలలు మధుర గీతములు పాడినవి. తుమ్మెదలు ఝుంకారములు చేసినవి.
    వాతావరణము మత్తుగా ఉన్నది. మైమరపించుచున్నది. పాండురాజు ముని శాపము మరచినాడు. పక్కన మాద్రి కనిపించినది. ఆమె అందముగా ఉన్నది. పూలు అలంకరించుకొని ఉన్నది. వసంతము వలె ఉన్నది.
    పాండురాజు మాద్రిని చూచినాడు. ఆమె చిరునవ్వు నవ్వినది. అతని మనసు వశము తప్పినది. మోహమగ్నుడు అయినాడు. మాద్రిని పట్టుకున్నాడు. ఆమె వారించినది. వలదన్నది. జరిగినది . గింజుకున్నది. పాండురాజు తన వశమున లేడు. మన్మధవశమున ఉన్నాడు. మాద్రి పైబడినాడు. అంతే హతుడు అయినాడు. చచ్చి కూలినాడు.
    చావువచ్చునని తెలిసి కూడ తప్పుకొనలేదు.
    పాండురాజు చనిపోయినాడు. మాద్రి అతనిని పట్టుకున్నది. ఏడ్చినది. మాద్రి ఎడ్పువిన్నది కుంతి. ఉరికి వచ్చినది. భర్త శవము చూచినది. కొయ్యబారినది. ప్రాణము వచ్చి గొల్లుమన్నది. గోడుగోడున ఏడ్చినది. భర్తను కౌగలించుకొని ఏడ్చినది. అతని పాదముల పై పడి ఏడ్చినది. మాద్రీ! నీవు జరుగుము. పాండురాజుతో పాటు నేను ప్రాణము విడుతును." అన్నది.
    "అక్కా! నీవు సమర్దురాలవు. పాండురాజునకు సంతానము కలిగించినావు. వారిని పెంచి సమర్ధులను చేయుశక్తి నీకే ఉన్నది. నేను తప్పు చేసినాను. మునిశాపము తెలిసియు వారించలేకపోయినాను. కాబట్టి భర్తతో పరలోకమునకు వెళ్ళుదును" అని కుంతిని సమ్మతింపచేసినది.
    పాండురాజు శరీరమునకు అగ్ని సంస్కారము జరిగినది. మాద్రి చితిలో దూరినది. భస్మము అయినది.
    పాండు రాజు కధ ముగిసినది.
    పాండవుల కధ మొదలు అయినది.

                                                                ఆలోచనామృతము
    సామాజికము అయిన మార్పులు తెచ్చుట కష్టతరము. సంప్రదాయములను ఏర్పరచుట బహు కష్టము. మానవుడు తన స్వేచ్చను వదులుకోనడు. బలవంతము చేసిన తిరుగబడును. నేడు కుటుంబ నియంత్రణము అవసరము అయినది. అది సమాజమునకు అవసరము. ఒక ప్రభుత్వము దానిని బలవంతముగా అమలుపరచినది. ప్రజలు ఆ ప్రభుత్వమును ఓడించినారు. ఇది ఇంత నాగరికత బలసిన ఈనాటి మాట. ఇన్ని ప్రయాణ సౌకర్యాములు, ఇన్ని వార్తా సౌకర్యములు ఉన్న నాటిమాట.
    ఆనాడు ఇన్ని రవాణ సౌకర్యములు లేవు. మానవ కళ్యాణమునాకు ఒక అచారమును ఏర్పరచుట సామాన్య విషయము కాదు. ఎంతో పరిశీలన జరుగవలసి ఉన్నది. ఎంతో పరిశోధన జరుగవలసి ఉన్నది. ఇది జంతువుల మీద, పురుగుల మీద చేసినటువంటి ప్రయోగము కాదు. మానవుని ప్రవర్తనను పరిశీలించుట సామాన్యము అయిన పని కాదు. అందుకు ఎన్ని ముని సంఘములు, ఋషి సంఘములు కృషి చేసినవో , ఎన్ని చర్చలు జరిగినవో, ఎన్ని గోష్టులు నిర్వహించబడినవో చెప్పుట కష్టము. అంత పరిశీలన అంత పరిశ్రమ తరువాత మానవ ప్రవర్తనమునకు ఒక నియమము ఏర్పరచ వచ్చును. ఏర్పరచిన నియమమును మనిషితో ఆచరింప చేయుట అతి కష్టము.
    ఈ మధ్య పొగలేని పొయ్యి కనుగొనుట జరిగినది. పౌష్టిక ఆహారమును కనుగొనుట జరిగినది. అందు గురించి రేడియోలు, టీవీలు, పత్రికలూ, ప్రచారము చేయుచున్నవి. ఇంత కృషి చేసినను వాటిని ఎంతమంది వాడుచున్నారో మనకు తెలియును. ఇది బౌతికము అయిన మార్పు మాత్రమే.
    మానవ సంబంధములలో మార్పు తెచ్చుట అతి కష్టము. ఆనాడు పరిశోధనలు, జరిపిన వారికి, ప్రచారము చేసినవారికి రాజకీయ బలము లేదు. వారు స్వచ్చంద సేవకులు. అడవులందుండి కాయగసరులు తిన్నవారు, నిస్వార్ధపరులు. అట్టివారు సమాజమున చొచ్చుకుని, ఆసేతు హిమాచలము పయనించి మానవ జీవితము సుఖతరము అగుటకు నిరంతర కృషి సాగించినారు. వారి కృషి, వారి తపస్సు, వారి మధన వృధా కాలేదు.
    అది కాలమున స్త్రీ పురుష సంబంధమునకు తల్లి, చెల్లి , కూతురు అను నియమము కూడా లేదు. కొందరు మహామహుల నిరంతర కృషి వలన మానవుడు నియమములకు లొంగినాడు. ఎంత దుర్మార్గుడయినను , ఏ పరిస్థితిలోను తల్లిని, చెల్లిని , కూతురును కోరడు. మానవుని ఈ దశకు తెచ్చుటకు ఎంత కృషి జరిగినదో తలచుకొనిన ఆశ్చర్యము కలుగును.

 Previous Page Next Page