Previous Page Next Page 
ఊగవే ఉయ్యాల పేజి 22


    మాధవీ, రాజా ప్రక్కప్రక్కన నిలబడి గేమ్ ని చాలా ఆసక్తిగా తిలకిస్తున్నారు.

 

    "రాజా!"  అని పిలిచింది మాధవి.

 

    అతనామెవైపు తలత్రిప్పి చూశాడు.

 

    "నా రెండోపరీక్ష ఇప్పుడు మొదలవుతోంది."

 

    అతను ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు.

 

    "ఇందాకట్నుంచి కాలిక్యులేట్ చేస్తున్నాను. జాగ్రత్తగా ఆడితే నూటయాభై సెకన్లలో వెయ్యి పాయింట్లు స్కోర్ చేయవచ్చు. ఈ గేమ్ నువ్వు ఆడాలి. వెయ్యి పాయింట్లు వచ్చేలోగా ఒక్కసెకను ఎక్కువైనా, నూటయాభై సెకన్లు తిరిగేసరికి వెయ్యికి ఒక్క పాయింటు తక్కువైనా నువ్వు  ఓడినట్లే. ఓ.కే?"

 

    "ఓ.కే."

 

    రాజా సెట్ ముందుకు వచ్చాడు.

 

    "చాలా సింపుల్ పరీక్ష రాజా! ఇందులో డేంజర్ ఏమీలేదు."

 

    రాజా నవ్వాడు. నిజమే, ఇందులో డేంజర్ ఏమీలేదుకానీ అతనికి తెలుసు, ఓడిపోయేందుకే ఎక్కువ అవకాశాలున్నాయి.

 

    రెండు అర్థరూపాయి కాయిన్స్ కంప్యూటర్ లో వేశాడు.

 

    సెట్ ఆన్ అయింది.

 

    అంతరిక్షంలో గ్లోబ్ పరిభ్రమిస్తుంది. ఫ్లయింగ్ సాసర్స్ దూసుకుపోతున్నాయి.

 

    ఎడమ చెయ్యి గ్లోబ్ ని ఆపరేట్ చేస్తుంది. కుడిచేతిలో గన్ వుంది. షూట్ చేసి పారేస్తున్నాయి.

 

    ఫ్లయింగ్ సాసర్స్ కూలిపోయిన మరుక్షణం కొత్తవి పుట్టుకువస్తున్నాయి.  

 

    అతని కళ్ళు అతి నిశితంగా, చురుగ్గా కదులుతున్నాయి. వాటి కదలికలతో చేతులు సింక్రొనైజ్ అవ్వాలి.

 

    ధన్ ధన్ ధన్ మని షూట్ చేస్తున్నాయి. సర్వశక్తులూ కూడదీసుకుని పరిశీలిస్తూ ఎంత వేగంగా అతని చేతి కండరాలు పనిచేస్తున్నా మధ్య మధ్య ఫ్లయింగ్ సాసర్స్ గ్లోబ్ ని ఎటాక్ చేసి కొన్ని పాయింట్లు మైనస్ అయిపోతూనే వున్నాయి.

 

    సెకన్లు చకచక జరిగిపోతున్నాయి.

 

    పది సెకండ్లు...డెబ్భై పాయింట్లు వచ్చేశాయి.

 

    ఇరవై సెకండ్లు...కొంచెం పుంజుకున్నాడు. నూటయాభై పాయింట్లు...

 

    ముప్పై సెకండ్లు...అదేవేగం మెయింటెన్ అవుతోంది...రెండువందల ముప్పై పాయింట్లు.


                                                            * * *


    అరవై సెకండ్లు...నాలుగొందల యాభై పాయింట్లు.

 

    మాధవి అప్రయత్నంగా అతని భుజంమీద చెయ్యివేసింది.

 

    కొద్దిగా చలించాడు ఒక్క సెకన్...అంటే ఇరవై పాయింట్లు మైనస్ అయిపోయాయి.

 

    సెకన్లు ముందుకు జరుగుతున్నాయి.

 

    డెబ్భై...ఎనభై...తొంభై...నూరు....నూటపది...నూట ఇరవై....

 

    ఎనిమిది వందల ఇరవై పాయింట్లు...

 

    రేసులో కొన్ని సెకన్లు వెనుకబడే వున్నాడు. ఇలాగైతే ఓటమి తథ్యం.

 

    ఫ్లయింగ్ సాసర్స్ ని ఎటాక్ చెయ్యడానికి ఏమాత్రం అవకాశం యివ్వకూడదు.

 

    తల్లోని నరాలు విద్యుత్ వేగంతో పనిచేస్తున్నాయి. ప్రపంచంలోని శక్తులన్నీ ఈ మినీ అంతరిక్షంమీద కేంద్రీకరించినట్లు...తీక్షణమైన...తీవ్రమైన...ఏకాగ్రత.

 

    తల్లో ఓ భాగంలో నొప్పి మొదలయింది.

 

    కొన్ని రోజులక్రిందటే ఆపరేషన్ జరిగిన ప్రదేశం నరాల ఒత్తిడి తట్టుకోలేకపోతుంది.

 

    ఏదో విస్సత్తువ....శరీరమంతా స్వేదబిందువులు అలుముకుంటున్నాయి.

 

    నూట ముప్ఫై సెకన్లు...

 

    తల్లోని నొప్పి క్షణాల్లో ఎక్కువై రానురానూ భరించరానిదవుతోంది.

 

    కళ్ళముందు మసకచీకట్లు....

 

    నూటనలభై సెకన్లు....తొమ్మిదివందల పది పాయింట్లు.

 

    రాజా భుజంమీద మాధవి అరచెయ్యి బిగుసుకుంటోంది.

 

    నూట నలభై రెండు

 

    తల్లో భూకంపాలు...రక్తం మెదడులోని ఏ బిందువునుంచో బొట్లు బొట్లుగా కారినట్లు....భరించ శక్యంకాని బాధ....

 

    నూటనలభై మూడు...తొమ్మిదివందల యాభై పాయింట్లు.

 

    ఫ్లయింగ్ సాసర్స్ గ్లోబ్ మీదకు విశృంఖలంగా విజృంభిస్తున్నాయి.

 

    వణికే వ్రేళ్ళమధ్య...జారిపోతున్న పట్టులోంచి గన్ ధన్ ధన్ మని గర్జిస్తోంది.

 

    నూటనలభై అయిదు....తొమ్మిదివందల అరవై పాయింట్లు.

 

    కళ్ళముందు మసకలు...

 

    నూటనలభై ఆరు...

 

    కళ్ళముందు చీకట్లు...

 

    నూటనలభై ఏడు...

 

    కపాలం పగిలినట్లు...రక్తం లావాలా పొంగినట్లు తల్లో ప్రళయ గర్జనలు...

 

    నూటనలభై ఎనిమిది....తొమ్మిదివందల ఎనభైనాలుగు పాయింట్లు...

 

    కళ్ళనుంచి నెత్తురుచుక్కలు ఉబుకుతున్నట్లు, అంతరిక్షమంతా శోణిమ జ్వాలలు...

 

    నూటనలభై తొమ్మిది...తొమ్మిదివందల తొంభైఆరు పాయింట్లు.

 

    రక్తం గడ్డకట్టి పోయినట్లు మెదడంతా శూన్యం. నాడీమండలం స్తంభించిపోయింది.

 

    కళ్ళముందు నక్షత్రాలు....మస్తిష్కంలో వెయ్యి భూకంపాలు..

 

    చేతుల స్వాధీనం బొత్తిగా పోయింది.

 

    అయినా...అతీంద్రియ శక్తి ఏదో పనిచేస్తున్నట్లు...ఎక్కడాలేని ఏకాగ్రత...

 

    నూట యాభయ్యో సెకను ఇంకా బోర్డుమీదకు రాలేదు. వెయ్యిపాయింట్లూ పూర్తయిపోయాయి.

 

    తర్వాతేం జరిగిందో అతనికి తెలియదు.

 Previous Page Next Page