Previous Page
నారి నారి నడుమ మురారి పేజి 20

 

రేణూ, విద్య లకి అర్ధం కాలేదు ఎందుకబ్బా ఈ వీడియో కాన్ఫరెన్స్ అని.
అందరికీ వాట్సాప్ లో మెస్సేజ్ ఇచ్చారు.
అందరూ అడిగారు ఎందుకు ఎందుకు అని.
ఏమో తెలీదు ఆయన సస్పెన్స్ లో ఉంచారు అన్నారు.
శైలజ ఆగే రకం కాదుగా.
ఒరేయ్ కృష్ణా  ఎందుకురా వీడియో కాన్ఫరెన్స్ అని వాట్సాప్ లో బోలెడు మెస్సేజీలు పెట్టింది అప్పటికే.
చెప్తా వెయిట్ చెయ్యి అప్పటివరకు అని రిప్లై ఇచ్చాడు.
కాలం భారంగా గడుస్తోంది విద్య, రేణూ ఇద్దరికీ.
అంతా మౌనంగా, అర్ధంకానట్లు, ఏమి జరుగుతుందో అన్నట్లు ఊపిరి బిగబట్టి ఉన్నారు సాయంత్రం ఎనిమిదివరకు.
పిల్లలు కూడా తల్లులని సతాయించారు వాట్సాప్ లో ఏంటి మమ్మీ ఎందుకూ అంటూ.
ఏమోరా తెలీదు అని రిప్లై ఇచ్చారు ఇద్దరు తమ పిల్లలకి.
కృష్ణకుమార్ మాత్రం ఏ టెన్షన్ లేకుండా భార్యలిద్దరూ వడ్డిస్తుంటే చక్కగా భోజనం చేసి ఏ టెన్షన్ లేకుండా తన రూమ్ లో ప్రశాంతం గా నిద్రపోయి ఏడింటికి లేచి ఫ్రెష్ అప్ అయ్యి , కాఫీ తాగి ఎనిమిదిగంటలకి హాల్ లోకి వచ్చాడు.
అప్పటికే లాప్ టాప్ ఆన్ లో ఉంచి అతని కోసం ఎదురు చూస్తున్నారు భార్యామణులిద్దరూ ఉత్కంఠగా.
వీడియో కాన్ఫెరెన్ లో అందరూ కనెక్ట్ అయ్యున్నారు అప్పటికే.
ఎవ్వరూ మాట్లాడటల్లేదు.
వాగుడు కాయ శైలజ కూడా మూగదానిలా మాటలుడిగినట్లు చూస్తోంది ఎందుకు తనని కూడా ఇందులో పిలిచినట్లూ అని. 
కృష్ణకుమార్ వచ్చి సోఫాలో రేణూ, విద్య ఇద్దరిమధ్య కూర్చున్నాడు.
పెద్దలు, పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు ఏం చెప్తాడా అని.
గొంతు సవరించుకున్నాడు కృష్ణకుమార్.
అటు ఇటు ఇద్దరి భార్యలని చూసాడు.
బిల్డ్ అప్ చాలురా బాబు. ఇద్దరూ నీ భార్యలేలే. 
ఇక మొదలు పెట్టు. టెన్షన్ తో చస్తున్నాం పొద్దుటినుంచి అంది శైలజ.
మొదటి సారి ఆమెకు కూడా ఎదో సస్పెన్స్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది.
చెప్పడం మొదలుపెట్టాడు కృష్ణకుమార్.
మొదటగా రేణూ కాన్సర్ థర్డ్ స్టేజి విషయం చెప్పాడు.
పిల్లలకి అప్పటిదాకా ఆ విషయం తెలీదు.
అతను చెప్పిన తరువాత అందరూ భోరున ఏడవడం మొదలు పెట్టారు.
మోహిత్ మమ్మీ అని ఏడుస్తూ అరుస్తున్నాడు అమెరికా నుంచి.
అందరూ దుఃఖసాగరంలో మునిగిపోయున్నారు.  
ఎప్పుడూ జోక్స్ వేసే శైలజ  కూడా సారీ రా కృష్ణా ఎంత కష్టమొచ్చింది నీకు అంటోంది దిగులుగా .
విద్య కళ్ళలోంచి నీళ్లు బొట బొట కారుతున్నాయి.
తుడుచుకో అక్కా అంటూ తన కొంగు ఇచ్చింది రేణు. 
అందరూ ఏడవడం అయిపోయిందా.
ఇంకా ఎవరన్నా మిగిలున్నారా అన్నాడు కృష్ణకుమార్ తాపీగా.
తల్లితండ్రులు కోప్పడ్డారు కొడుకు మీద.
మేము ఇంత ఏడుస్తుంటే నీకు అంతా వేళాకోళంగా ఉందా అని అరిచి కొట్టినంత పని చేశారు వీడియో లో .
శైలజ కూడా తిట్టింది స్టుపిడ్ అంటూ.
విద్య ఏంటి ఇతను అని గాభరాగా భర్త వైపు చూస్తోంది.
రేణు అప్పుడు మొదలుపెట్టింది ఆరునొక్క రాగం తనకున్న జబ్బు గుర్తుకొచ్చి. 
ఇక అందరూ ఆపి నేను చెప్పేది శ్రద్ధగా వినండి అంటూ జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు.
మొదటగా రియాక్ట్ అయింది రేణు.
అంటే నాకు కాన్సర్ లేదా అంది ఆనందంగా. 
రచయిత్రులకు ఎక్కడన్నా అలాంటివి వస్తాయా చెప్పు రేణూ.
మిమ్మల్ని చూసి ఏ రోగమైనా పారిపోదూ అన్నాడు నవ్వుతూ కృష్ణకుమార్.
నీ మితిమీరిన ప్రేమ చూడు ఎంత దూరం తెచ్చిందో.
నీకేదో జరిగిపోతుంది అన్న తొందరలో నా పెళ్లి చేసేసావు. 
ఇప్పడు చూడు అంటూ తన పక్కన అటూ ఇటూ కూర్చున్న ఇద్దరు భార్యల వైపు చూసాడు.
విద్య, రేణూ ఇద్దరూ సిగ్గుపడ్డారు అతని మాటలకి. 
రేణూ ఆరోగ్యానికి ఏ సమస్యా లేదని కృష్ణకుమార్ చెప్పిన విషయానికి పెద్దవాళ్లంతా ఎంతో సంతోషపడ్డారు.
మంచి వార్త చెప్పావురా అని తల్లితండ్రులు కృష్ణకుమార్ ని ఆశీర్వదించారు ఇద్దరు భార్యలతో శ్రీకృష్ణుడిలా సుఖంగా ఉండమని.
ఈసారి కృష్ణకుమార్ సిగ్గుపడ్డాడు.   
రేణూ తల్లి తండ్రులు కూడా తమ కూతురికి ఏ ప్రమాదమూ లేదని తెలుసుకుని చాలా ఆనందపడ్డారు.
విద్య కూడా తమ కూతురే అని చెప్పారు.
అల్లుడిని, భార్యలిద్దరిని దీవించారు. 
ఇక పిల్లలైతే డాన్స్ చెయ్యడం మొదలుపెట్టారు ఆనందంతో. 
ఏమైనా నువ్వు లక్కీరా కృష్ణా అంది శైలజ పెద్దగా నవ్వుతూ.
ఇంకో వేకెన్సీ ఏమైనా ఉందా నీ దగ్గర అని జోక్ చేసింది కృష్ణకుమార్ తో.
తనకీ ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమోనని. 
మరి షెడ్యూల్ ఎలారా అంది ఆందోళనగా.
ఇద్దరికీ ఎలా టైం అల్లాట్ చేస్తున్నావ్ అంటూ జోక్ చేసింది. 
ఓ గంట సేపు అందరూ ఆనందంగా కబుర్లు చెప్పుకున్నారు. 
ఇక చాల్లే రా.
ఇప్పటికే బోలెడు టైం అయ్యింది.
ఇప్పుడు నీకు ఇద్దరు భార్యలు కదా.
టైం సరిపోదు అంటూ పెద్దవాళ్ళు సెలవుతీసుకున్నారు.
వీడియో కాన్ఫెరెన్స్ కాగానే రేణూ ని దగ్గరికి తీసుకున్నాడు కృష్ణకుమార్ మా బుజ్జి బంగారం అంటూ.
ఇంకో బుజ్జి బంగారం కూడా ఉంది మీకు ఇప్పుడు అంటూ అక్క వైపు చూపించింది.
విద్యని కూడా దగ్గరికి తీసుకున్నాడు. 
అక్కాచెల్లెళ్ళిద్దరికి సందేహం వచ్చి అడిగారు మరి ఈ రెండు కేజీల స్వీట్స్, అన్ని మల్లెపూలు ఎవరికీ అని.  
ఒక వారం విద్యకి, ఒక వారం రేణూకి అన్నాడు కన్నుగీటి ఇద్దరివైపు చూస్తూ.
ఇద్దరూ సిగ్గుతో ముడుచుకుపోయారు. 
హాల్ లో ఉన్న ఆంజనేయస్వామి ఫోటో పక్కన శ్రీకృష్ణుడి ఫోటో కూడా పెట్టాడు కృష్ణకుమార్ విద్యతో పెళ్ళైన తరువాత, వ్రతభంగం అయిందన్న కోపంతో. 
ఎదురుగా చూస్తే శ్రీకృష్ణుడు నవ్వుతూ తన చేతిలో పిల్లనగ్రోవితో 'నారీ నారీ నడుమ మురారి' అన్నట్లు అభయహస్తమిస్తూ కనిపించాడు గోపికల నడుమ.  
****
విద్యావతి తో పెళ్లి, శోభనానికి ఓ నెలరోజులపాటు సిక్ లీవ్ పేరుతో సెలవు తీసుకున్నాడు  కృష్ణ కుమార్. 
కారు డ్రైవర్ ని కూడా ఆ నెలరోజులు వూర్లో ఉండట్లేదని రావొద్దన్నాడు. 
పి ఏ ప్రమోద్ కి తను వూరికెళుతున్నట్లు చెప్పాడు. 
ఏమైనా అర్జెంటు ఫోన్స్ ఉంటె కాల్ చెయ్యమని చెప్పాడు. 
అసలు విషయం బాంకులో తెలిసిందంటే నవ్వులపాలవుతానని అన్నికార్యక్రమాలు ముగించుకుని ఏమీ ఎరగనట్లు ఆ రోజు బాంకు లో జాయిన్ అయ్యాడు. 
ఆఫీసులో ఎవ్వరూ తన వైపు చూడట్లేదని నిర్ధారించుకుని అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని తన కేబిన్ లోకి వెళ్ళాడు.  
ఓ పది నిముషాల తరువాత స్టాఫ్ అందరూ బిల బిల మని క్యాబిన్లోకి 
చొచ్చుకొచ్చారు హార్టీ కంగ్రాట్యులేషన్స్ ఫర్ న్యూలీ మారీడ్ లైఫ్ సార్ అంటూ. 
అంతేకాదు అందరి చేతుల్లో బొకేలున్నాయి.  
కృష్ణ కుమార్ ఒక్కమారు అవాక్కయ్యాడు  వీళ్ళందరికీ ఎలా తెలిసిందబ్బా అని.అతని ప్రస్నార్ధకపు మొహాన్ని అర్ధం చేసుకున్న ఓ లేడీ స్టాఫ్ ముందుకొచ్చి మీమ్యారేజ్ వీడియో ఎవరో లైవ్ పెట్టారు సర్ యూట్యూబ్ లో అంది. మేమంతా బాగా ఎంజాయ్ చేసాము సర్ అంది ముసి ముసి నవ్వులు నవ్వుతూ. 
అందరికి అంతా తెలిసిపోయిందన్న ఆలోచనతో, చేసేదిలేక, నవ్వలేక  నవ్వుతూ, పెదాలపై చిరునవ్వు అప్పు తెచ్చుకుని బలవంతంగా అందరికి థాంక్స్     చెప్పాడు. 
ఆ రోజు నుంచి ఓ నెలరోజులపాటు కృష్ణ కుమార్  పెళ్లి విషయం ఆ బాంకులో మారు మ్రోగింది.
కొంటె కుర్ర స్టాఫ్ కొందరు 'అంటే కృష్ణ కుమార్ కి!!' అన్న టైటిల్ తో ఓ థీమ్ తయారు చేసి ఫేస్బుక్ లో సరదాగా పోస్ట్ చేసి చాలా రోజులపాటు ఎంజాయ్ చేశారు.


శుభం


(ఇందులోని పాత్రలు, వాటి పేర్లు ఎవరిని ఉద్దేశించినవి కావు.
కేవలం కల్పితాలు మాత్రమే)

 

 

 Previous Page