Read more!
 Previous Page Next Page 
కాలాన్ని వెనక్కి తిప్పకు పేజి 2


    "పెళ్ళికాకపోతే కొంప మునగదులే..." మొండిగా వాదించబోయింది.
    "అవును, నీకు పెళ్ళవసరం ఏమిటిలే. ఇంతకు తెగించినదానివి.." కల్యాణి కోపంగా ఏదో అనబోయింది.
    చిత్ర కోపంగా "స్టాపిట్ మమ్మీ. నిన్ను హెల్ప్ అడగడం నాదే బుద్ధి తక్కువ. ఏదో ఎక్స్ స్టార్డినరీ థింగ్.. లోకంలో నీ కూతురే చేసిందన్నట్లు మాట్లాడకు. ఇట్ జస్ట్ ఎ నార్మల్ థింగ్ దట్ హేపెండ్... అమ్మాయిలు, అబ్బాయిల మధ్య ఎట్రాక్షన్ ల మధ్య అప్పుడప్పుడూ ఇలాంటి జరగడం ప్రపంచ వింతలా మాట్లాడకు. నీవు డాక్టరు దగ్గరకు తీసుకెళతావో, నన్నే వెళ్ళమంటావో త్వరగా చెప్పు." అసహనంగా అంది. కల్యాణి తిరస్కారంగా కూతురి వంక చూసింది.
    "డాడీకి చెప్పి ఏం చెయ్యమంటారో అడగాలి. ఇప్పుడు ఆయన నన్ను తిట్టిపోస్తారు. నిన్ను నెత్తికెక్కించుకుని పాడు చేశానని. నిన్ను నమ్మి ఇంత స్వతంత్ర్యం ఇచ్చినందుకు నా నెత్తిమీదకు తెచ్చావు."
    "ఆయనకెందుకు చెప్పడం? డాడీ అసలే ఓల్డ్ ఫ్యాషన్... నీవే అర్ధం చేసుకోనిది ఆయనెలా చేసుకుంటారు?"
    "ఆయనకు చెప్పకుండా దాస్తే రేపొద్దున ఈ విషయం తెలిస్తే నా ప్రాణం తీస్తారు. నాకు మతిపోతోంది. నన్ను ఆలోచించుకోనీ అసలేం చెయ్యాలో. నాకు ఆఫీసుకు టైమైపోతోంది. పనంతా అలాగే ఉంది. నీవిక్కడ నుంచి వెళ్లు తల్లీ." గాభరాపడుతూ వంట పని పూర్తిచేయసాగింది.
    "నీవు డాడీకి చెబితే నేనూరుకోను. నీవు హెల్ప్ చెయ్యకపోతే చెయ్యకు." విసురుగా వెళ్లిపోయింది చిత్ర.
    "ఇదుగో నీవు ముందు ఆ సందీప్ ని ఇంటికి తీసుకురా. నేనొకసారి మాట్లాడాలి వాడితో" కల్యాణి వెనకనుంచి అరిచింది.
    చిత్ర చటుక్కున వెనుదిరిగి తల్లిని మింగేసేట్లు చూస్తూ "నీవేం వాడితో మాట్లాడనక్కరలేదు. ఆ రాస్కెల్ నన్ను తిప్పించుకు తిరుగుతున్నాడు. వాడితో నేను మాట్లాడను" అంటూ వెళ్ళిపోయింది.
    "హుఁ.. వీళ్ల ప్రేమ మోజు అన్నీ అప్పుడే అయిపోయాయన్న మాట. "విరక్తిగా అనుకుంది. జరగబోయేది తల్చుకుంటే, ఇంట్లో రాబోయే తుఫాను తల్చుకుంటే భర్తని ఎలా ఎదుర్కోవాలో తల్చుకుంటే ఆమె కాళ్ళు వణుకుతున్నాయి. గుండెలు దడదడలాడుతున్నాయి.

                                                     *  *  *

    కల్యాణి ముందునుంచీ ఆధునిక భావాలు కలిగిన యువతి. స్త్రీ స్వాతంత్ర్యం, వ్యక్తిత్వం, ఆత్మాభిమానం లాంటివి ఆమెకిష్టమైన పదాలు. ఆడది మగాడికన్నా దేన్లోనూ తీసిపోదని. అవకాశం ఇస్తే అతన్ని మించి పోగలదని, ఆడది చదువుకొని తన కాళ్లమీద నిలబడాలని, ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలని, తనకంటూ ఓ వ్యక్తిత్వం ఉండాలని అభిలషించేది. తన తల్లి చదువు, ఆర్థిక స్వాతంత్ర్యం లేక తండ్రి ఎన్నన్నా పడే దుఃస్థితి లాంటిది తనకు కలగరాదని పంతం పట్టి ఏడ్చి రాగాలు పెట్టి, నిరసన వ్రతాలు చేసి, ఇంటర్ తో చదువాపేసి పెళ్ళి చేస్తానంటే ఎదురుతిరిగి, డిగ్రీ తెచ్చుకుని, బ్యాంక్ పరీక్షరాసి, క్లర్క్ ఉద్యోగం సంపాదించి, ఇప్పుడు ఆఫీసరు స్థాయికి ఎదిగింది. ఉద్యోగం వచ్చేవరకూ పెళ్ళి మాటెత్తనన్నమాట మీద నిలబడింది.
    తన తరువాతి తరం - తన కూతురు తాను పడిన అవస్థలు పడరాదని, ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా బాగా చదివించింది. మంచి పొజిషన్ లో ఉండాలని ముందు నుంచి కూతురికీ, కొడుక్కీ ఎలాంటి తేడాలు చూపకుండా పెంచాలని ఆరాటపడింది.
    రామకృష్ణ పల్లెటూరిలో పెరిగినవాడు. కాస్త సంప్రదాయాలు పట్టింపులున్నవాడు. దేవుడు, పూజలు, గుళ్ళూ, గోపురాలు అంటూ తిరిగే రకం. ఆడపిల్లని ఆడపిల్లగా పెంచని భార్యని దుయ్యబడుతుండేవాడు.
    "దానికి చక్కగా రెండు జడలు వేసి, బొట్టుకాటుక పెట్టకుండా ఆ క్రాఫేమిటి? ఆడపిల్ల మగపిల్లాడితో సమానంగా ఆ పరుగులు, ఆ సైకిలు తొక్కడం ఏమిటి? వయసొచ్చిన పిల్ల ఆ షార్ట్స్, బనీన్లు వేసుకుని మగపిల్లలతో షటిల్ ఆడుతుంది. దాన్ని నీవే పాడుచేస్తున్నావు. వాడితో సమానంగా దానికీ మోపెడ్ కొనాలా? ఆ పాంట్లు వేసుకుని అది మగరాయుడిలా తిరగాలా? అబ్బాయికీ, అమ్మాయికీ ఇద్దరికీ ఇంజనీరింగ్ చెప్పించాలా? మగపిల్లాడికంటే తప్పదు. ఇది ఏ బి.ఏ.నో చదవచ్చు. తరువాత ఏదో చదివించవచ్చు. ఆ మగపిల్లలని ఇంటికి రానిస్తావెందుకు? అది, నీ కూతురు ఎవడి స్కూటరు వెనకాలో ఎక్కి వెళ్తోంది తెలుసా? నేను కళ్ళారా చూశాను. ఇది నీవు ఇచ్చిన అలుసు. దాన్నెందుకూ పనికిరాకుండా చేస్తున్నావు."
    చిన్నప్పటినుంచి రామకృష్ణ, కల్యాణిల మధ్య ఆడపిల్ల విషయంలో ఎన్నో వాదనలు, దెబ్బలాటలు, "ఆడపిల్ల" అంటే కల్యాణికి కోపం, "ఏం, ఆడపిల్లయితే పాంటు వేసుకోకూడదని రూలుందా?" "షటిల్ ఆడితే తప్పేమిటి? ఆడేటప్పుడు షార్ట్స్ కాక మరేం వేసుకుంటారు?" మగపిల్లాడు వాడికి మోపెడ్ కొంటే, వాడికంటే ఇది దూరం వెళ్ళాలి. దీనికెందుకు కొనరు?" క్లాస్ మేట్స్ ఏదో సరదాకి ఇంటికి వస్తే తప్పేమిటి?" "వాళ్ళబుర్రల్లో ఆడ, మగ తేడాలు పెట్టి మనమే పాడు చేస్తాం. ఫ్రెండ్సుకు ఆడమగ తేడాలెందుకు?" దాని మోపెడ్ చెడిపోతే ఫ్రెండు స్కూటరెక్కి వస్తే కొంప మునిగిపోదు.'
    ఇలా కూతురిని వెనకేసుకు వస్తూ "ఆడపిల్ల" అన్న తేడా లేకుండా పెంచింది. "ఇద్దరం ఉద్యోగాలు చేస్తూ వాళ్ళక్కావలసిన చదువులు చెప్పించలేమా? ఆడపిల్లయితే ఇంజనీరింగ్ చదవకూడదా? వాడికంటే దీనికే లెక్కలు బాగావచ్చు. దాని ఛాన్సు మనం పాడు చెయ్యాలా" అంటూ పంతంగా కూతురుని ఇంజనీరింగ్ లో పెట్టింది. చిత్ర, చైతన్య ఇద్దరికీ ఏడాది తేడా ఉండడంతో ఇద్దరూ కొట్టుకోకుండా రెండు సైకిళ్ళు, రెండు మోపెడ్లు, రెండు పుస్తకాలు సెట్లు - ప్రతీది వంతులు లేకుండా చేసేది.
    "నీ కర్మ. అలా గాలికి వదిలేసి నెత్తికెక్కించుకుంటున్నావు. అలా స్వేచ్చగా మగపిల్లలతో స్నేహాలు ఎంకరేజ్ చేస్తున్నావు. ఎప్పుడో అది కొంప ముంచుతుంది. అప్పుడేడుస్తావు" ఒకసారి బాయ్ ఫ్రెండ్స్ తో అమ్మాయిలంతా పిక్నిక్ కు వెళితే ఆరోజు పెద్దగొడవ చేశాడు రామకృష్ణ. "ఈ కాలం పిల్లలు తెలివైనవాళ్ళు, వాళ్ళ లిమిట్స్ వాళ్లకు తెలుసు. స్వేచ్చ ఇవ్వకపోతే దొంగచాటుగా తిరుగుతారు. అబద్ధాలు చెపుతారు" ఇలా అయితే ఫ్రాంక్ గా మనతో అన్నీ చెబుతారు." అంటూ వాదించింది ఆరోజు. తల్లి సపోర్ట్ తో చిత్ర చాలా బోల్డ్ గా, ఎవరినీ లెక్కచెయ్యని రీతిలో ప్రవర్తించడం రామకృష్ణకి అసలు నచ్చేదికాదు. ఇప్పుడు భర్తకి చెపితే తానే కారణం అని దుమ్మెత్తి పోస్తాడు. అతను అనడం సరే ఎలాగూ తప్పదు. తాను ఇంత స్వేచ్చ, స్వాతంత్ర్యం ఇస్తే అది దుర్వినియోగం చేసిన కూతురిని క్షమించలేకపోతోంది కల్యాణి. ఇప్పటికీ జరిగిందాన్ని సమర్ధించుకుంటున్న కూతురిని ఈ విషయంలో తేలిగ్గా తీసుకోలేదు. తానేం చేసినా తల్లి గుడ్డిగా సపోర్ట్ ఇవ్వదు అన్నది అర్ధం కావాలంటే తాను రెండు మూడురోజులు పట్టించుకోకుండా బింకంగా ఉంటే కాళ్లబేరానికి వచ్చి ప్రాధేయపడితే, అప్పుడు చీవాట్లు పెట్టి డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళాలని నిర్ణయించుకుంది. డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళేముందే భర్తకి ఈ విషయం చెప్పచ్చు. ఒకటి రెండు రోజులు ఊరుకుని కూతురు రియాక్షన్ గమనించాలని నిర్ణయించుకుంది కల్యాణి.

                                                     *  *  *

 Previous Page Next Page