"తల తిరుగుతున్నట్లుగా ఉంటుంది - తల ఎందుకు తిరుగుతుందంటే, మనసులో దిగులుగా వుండి - మనసులో దిగులెందుకు కుటుంబ పరిస్థితులు బాగుండక .... కుటుంబ పరిస్థితులు ఎందుకు బాగుండలేవంటే...."
"ప్లీజ్! ఒక్క నిముషం ఇప్పుడే వస్తాను...." అని భయపడుతున్నట్లుగా అక్కడనుంచి వెళ్ళిపోయాడు మచ్చల డాక్టర్.
నవ్వు ఆపుకోలేక పైకే పకపక నవ్వేసింది జ్యోత్స్న.
జ్యోత్స్న ఎందుకు నవ్వుతోందో తెలియక ఒక్క నిమిషం తెల్లబోయి చూసిన సుబ్బలక్ష్మి తను ఒక చవటనవ్వు నవ్వింది.
ఆ నవ్వు చూసి "ఆహ! అద్భుతమైన వ్యక్తి!" అనుకుంది తనలో తను జ్యోత్స్న.
"నువ్వు మీ పిన్నిగారింటికి నడవలేకపోతే, మా యింట్లో పడుకోవచ్చు" అంది.
సుబ్బలక్ష్మి ఎగిరి గంతేసింది. "నిజంగా? మీరెంత మంచివారు!" అంది.
ఆ క్షణం నుంచీ సుబ్బలక్ష్మి జ్యోత్స్నకి అన్ని విధాలా రక్షకురాలే అయింది.
ఆ రోజు సుబ్బలక్ష్మి వంట చేస్తుంటే భాస్కర్ కి కాఫీ కావలసివచ్చింది. సుశీల ఉండేరోజుల్లో తనంతట తనే కావలసినప్పుడు కాఫీ కలుపుకోవటం భాస్కర్ కి అలవాటు, ఆ అలవాటు చొప్పున వంటింట్లోకి వచ్చి స్టౌ మీద నీళ్ళు పడేశాడు.
సుబ్బలక్ష్మి తేలో, పామో కరిచినట్లు కంగారు పడుతూ "మీరెందుకొచ్చారు వంటింట్లోకి? మీకు కాఫీ కావాలంటే తయారుచేసి తీసుకొస్తాను కదా!" అంది.
"ఏదో అలవాటు చొప్పున వచ్చాను. కాఫీయేగా నేను కలుపుకుంటాను లే!" అన్నాడు భాస్కర్.
సుబ్బలక్ష్మి ముఖం చిట్లించి పైట సర్దుకుంటూ "నేను అలాంటిదాన్ని కాను" అంది.
తెల్లబోయాడు భాస్కర్....
సుబ్బలక్ష్మి తన ధోరణి ఆపలేదు. కథల్లో డైలాగులు గుర్తు చేసుకుంటూ....
"నేను కూటికి పేదనయినా కులానికి పేదను కాను. ఏ పరిస్థితుల్లోనూ ఆత్మాభిమానం వదులుకోను" అంది.
అసలే చిరాగ్గా ఉన్న భాస్కర్ ఈ మాటలకు మరింత చిరాకుపడి, "ఛా! నీ కేమైనా మతిపోయిందా! అసలు నాకు కాఫీ వద్దులే!" అని బయటకు వచ్చెయ్యబోయాడు.
సుబ్బలక్ష్మి గభాలున భాస్కర్ దారికి అడ్డుగా నిలబడి మళ్ళీ కథల్లో సంభాషణలు గుర్తు చేసుకుంటూ "మీరలా అలిగి వెళ్ళిపోతే నేను భరించలేను. నా గుండెలు పగిలిపోతున్నాయి, నేను అలాంటి దాన్ని కాను. కానీ, మీరు కోరితే ఏం చెయ్యమన్నా చేస్తాను" అంది.
తనదారికి అడ్డుగా నిలబడి ఎంతో సిన్సియర్ గా పరమ పూలిష్ గా మాట్లాడుతున్నా ఆ వ్యక్తిని చూసి భాస్కర్ కి నవ్వు వచ్చింది.
భాస్కర్ నవ్వుతోంటే తనూ నవ్వింది సుబ్బలక్ష్మి.
ఆ నవ్వు చూసి కంపరంతో "అడ్డులే!" అని చీదరించుకుంటూ సుబ్బలక్ష్మీని ఒక్కతోపు తోసి బయటకొచ్చేశాడు భాస్కర్.
"సుబ్బలక్ష్మి వంట పూర్తిచేసి అన్నానికి రండి" అంది.
"నువ్వు పో! నేను తింటాను!" అన్నాడు విసుగ్గా.
"మీరు తినకపోతే, నేను తినను" అంది కన్నీళ్ళతో సుబ్బలక్ష్మి.
భాస్కర్ కి మండిపోయి "ఇలాంటి వెధవ వాగుడు వాగావంటే ఇక్కడసలు పనిలో ఉండనియ్యను జాగ్రత్త!" అని కసిరాడు-
హడిలిపోయిన సుబ్బలక్ష్మి జ్యోత్స్న దగ్గిరకి పరుగులాంటి నడకతో వచ్చి జ్యోత్స్నని చూసి ఏడ్చేసింది-
జ్యోత్స్న కంగారుగా "ఏం జరిగింది?" అని అడిగింది -
సుబ్బలక్ష్మి కళ్ళు తుడుచుకుంటూ "అదేదో కథలో ఇల్లాలు లేనప్పుడు ఇంటి యజమాని పనిమనిషిని బలాత్కారం చేస్తారు. భాస్కర్ గారు నన్నలా బలాత్కారం చేస్తారనుకున్నాను - చెయ్యలేదు-" అంది -
జ్యోత్స్న తెల్లబోతూ "అందుకు ఏడుస్తున్నావా?" అంది.
సుబ్బలక్ష్మి తల అడ్డంగా తిప్పుతూ "అందుకు కాదు - ఆయన రాత్రి అన్నం తినలేదు. వండినవంట అంతా అలాగే ఉండిపోయింది. ఈ పూటా అన్నానికి రానన్నారు-" అంది -
"ఆయన అన్నం తినలేదని బాధపడుతున్నావా?"
"కాదు - ఇలా నావంట అవసరం లేకపోతే, నన్నూ పనిలోంచి తీసెయ్యరూ?"
'లోకంలో ఎన్నెన్నో వింతలున్నాయి - అలాంటి వింతలో వింత ఇలాంటి మనుష్యులు' అనుకున్న జ్యోత్స్న "ఫరవాలేదు నిన్ను పనిలోంచి తసెయ్యరు-" అని సుబ్బలక్ష్మిని సమాధానపరిచింది.
కానీ, భాస్కర్ సరిగా భోజనం చెయ్యటం లేదన్నసంగతి జ్యోత్స్నను స్తిమితంగా ఉండనియ్యలేదు - అతడు ఎంత అశాంతితో బాధపడుతున్నాడో ఊహించుకోగలిగింది -
తను అతడి అశాంతిని మరపింప చెయ్యగలదు. దగ్గిరుండి అన్నం తినిపించగలదు- కానీ, రేవతి ఐరావతమ్మలు ఊరుకుంటారా రాబందుల్లా పీక్కుతినరూ? ఏమీ లేకుండానే,ఏదో వాదో మాట్లాడుకునే మనుష్యులు. అవకాశం వస్తే వదులుకుంటారా?
ఎక్కువసేపు ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ నిగ్రహించులేకపోయింది జ్యోత్స్న - ఏమయితే అది అవుతుందని భాస్కర్ వాటాలోకి వచ్చేసింది - అస్తవ్యస్తంగా ఉన్న పక్కమీద అడ్డదిడ్డంగా కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడు భాస్కర్. అతణ్ణి ఆ దశలో చూసి భరించలేకపోయింది జ్యోత్స్న....