Read more!
Next Page 
ఆమని కోయిల  పేజి 1

       

                                                        ఆమని కోయిల


                                                                    -కురుమద్దాలి విజయలక్ష్మి

       
    టక్! టక్!

    తలుపుమీద వేళ్ళతో సుతారంగా కొట్టింది దీక్ష.

    తలుపులు తెరుచుకోలేదు.

    ఈదపా తలుపు మీద మరికాస్త గట్టిగా కొట్టింది దీక్ష.

    "ఎవరది?" లోపల నుంచి అడిగారు.

    వినవచ్చిన స్వరం స్త్ర్రీది కావటంతో "మేడమ్! ఓసారి తలుపులు తీస్తారా?" వినమ్రంగా అంది దీక్ష.

    తలుపు వకటి కొద్దిగా తెరుచుకుంది. తలుపు చాటున దేహం మొత్తం వుంచి తల కొద్దిగా బైటికిపెట్టి "ఏం కావాలి" అంది ఆమె.

    "నాకేమీ అక్కరలేదు మేడమ్! పాంప్లెట్ యిచ్చి పోదామని పిలిచాను. సారీ టు డిస్ట్రబ్ యు!" అంటూ దీక్ష మర్యాదగా పలికి చేతికి తగిలించుకున్న గుడ్డ సంచీ లోకి చేయి పోనిచ్చింది.

    తల బైటికి పెట్టి దేహాన్ని తలుపు చాటుకి చేరేసిన ఆమె దీక్షని పరికించి చూసింది. ఆ చూపుల్లో అనుమానం తాండవమాడుతున్నది.

    పిల్ల ఎర్రగా బుర్రగా చావతేలిన కొయ్యముక్కలా బాగానే వుంది. కట్టుబొట్టు కుదురుగానే వున్నాయి. ఏ వయసుకా ముచ్చటన్నట్లు నలుగురు పిల్లలను కనే తల్లివయసు పిల్లదానికి వచ్చినా పెళ్ళిళ్ళు కాక పోతుండె. తల్లి తండ్రుల ఖర్మ ఆడపిల్లల రాత...

    ఆమె అలా ఆలోచిస్తుండగానే దీక్ష అరచేయి అంత తెల్ల కాగితం తీసి చేతిలోపెట్టి "వస్తా మేడమ్! చాలా యిల్లు తిరగాలి. పాంప్లెట్ లో రాసిన దాన్ని గురించి కాస్త ఆలోచించండి." అని చెప్పి అక్కడనుంచి వెళ్ళిపోయింది.

    ఆమె కాయితం మీదది చదివి అనుమానంగా అటూయిటూ తిప్పిచూసింది. ఆ తర్వాత వచ్చిన అమ్మాయికోసం చూసింది. దీక్ష ఆ యింటికి మూడో యింటి తలుపులు తడుతూ కనిపించింది.

    ఆమె మరోసారి ఆ కాగితం మీద రాసి వున్నది చదివింది.

    రక్షించండి! రక్షించండి!

    ఎవరిని రక్షించాలి! ఎందుకు రక్షించాలి! అసలు ఏమైంది? ఆమెకి పాంప్లెట్ మీద రాసి వున్నది అర్ధమవుతూనే వుంది రక్షించండి అన్న మాటవరకు. అర్ధం కానిదల్లా ఎవరిని రక్షించాలన్నదే. పోనీ ఈ కాగితం యిచ్చిన ఆ పిల్లనా అంటే గజ్జెల గుర్రంలా నిక్షేపంగా వుంది. పోనీ ఆ పిల్లదానినే అడుగుదామా అంటే అప్పటికే ఆ అమ్మడు మూడో యిల్లుకూడా దాటి ఆరో యింటి తలుపు తడుతూ దూరంగా కనిపించింది.

    ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకి అదనపు అధికారాలు యిచ్చిం తరువాత మూడు రేపులు ఆరు హత్యలుగా తయారయింది రాష్ట్రం.

    రాష్ట్రంలో యిదీ ఒక వూరు కాబట్టి గత కొద్దినెలలనుంచీ ఈ వూళ్ళో కూడా దొంగతనాలు, ఏడాది ఆడపిల్ల మొదలు ఎనభై ఏళ్ళ వృద్ధురాలి వరకూ మానభంగాలు, వరకట్నం చావులు మరీ ఎక్కువ అయిపోయాయి. వెనుక చూస్తే నుయ్యి ముందు చూస్తే గొయ్యి. అటు చూస్తే దొంగలు ఇటు చూస్తే పోలీసులు. అన్యాయం పేరిట దొంగలు దోచుకుంటుంటే న్యాయం పేరిట పోలీసులు దోచుకుంటున్నారు. దాంతో ధనమాన ప్రాణాలు మగవాళ్ళు జేబుల్లోను ఆడవాళ్ళు గుప్పెటలోను పెట్టుకుని తిరుగుతున్న వేళ ఈ కొత్తపిల్ల ఓ పాంప్లెట్ చేతిలో పెట్టివెళ్ళింది.

    రక్షించండి! రక్షించండి! ఎవరినో అర్ధం కాకపోయినా ఆమె ఆ కాగితంతో సహా లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది. ఆఫీసు నుంచి భర్త వచ్చిం తరువాత ఇదేదో తెలుసుకుందామనుకుంది.

    అసలే గుండెలమీద కుంపట్లా ఎదిగిన ఆడపిల్లలు అయిదుగురున్నారామెకి. అదనంగా బి.పి. కూడా వుంది. అసలే రోజులు .మంచిగా కూడా లేవు. ఇవన్నీ ఆమె అసలు సిసలు వ్యవహారాలు. ప్రతి విషయానికి ఆమె భగవంతుడిని, రక్షించు దేముడా అని ప్రార్ధిస్తుంటుంది. ఆవిడ ప్రాణానికి కొత్తగా ఈ పాంప్లెట్ ఒకటి వచ్చిపడింది.

Next Page