Read more!
Next Page 
చీఫ్ మినిస్టర్ పేజి 1

                                 

చీఫ్ మినిస్టర్

కంఠంనేని స్వప్న

 

రోడ్ నిర్మానుష్యంగా ఉంది. ఎక్కడి ట్రాఫిక్ అక్కడే ఆపేశారు. కాసేపట్లో సీఎం కాన్వాయ్ ఆ దారిలో రాబోతోంది. 

ఆఫీస్ లకి వెళ్లాల్సిన వాళ్ళు, అర్జెంట్ పనులున్న వాళ్ళు తలలు పట్టుకున్నారు. టైమ్ కి చేరలేమని వాళ్ళకి అర్ధమయిపోతోంది. 

"వీళ్లేదో వొరగబెడతారని గెలిపిస్తాం. ప్రతి పనికీ వీళ్ళు అడ్డమే". నిస్పృహ గా అన్నాడు బైక్ మీద ఇంటర్వ్యూ కి బయల్దేరిన ఒకతను. 'ఇవ్వాళ ఇంటర్వ్యూ పోయినట్లే ' ఉసుూరుమన్నది అతని మనసు.

"ప్రాణాలకు తెగించి సోషల్ మీడియా లో ప్రచారం చేసి గెలిపించారు గా. ఏం ఉద్దరించాడు ఈ సీఎం. ఎవరైనా ఒకటేరా. రాజకీయ నాయకులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది" పక్క బైక్ మీద వెనక కూర్చున్నాయన ముందున్న కొడుకు కి క్లాస్ పీకుతున్నాడు.

తిట్టుకుంటూ నే అంతా సీఎం కనపడతాడేమో అని ఎగిరి ఎగిరి  చూస్తున్నారు.

కాసేపటికి పోలీస్ జీప్ ఆ దారిలో సైరన్ మోగిస్తూ వెళ్ళింది. కొన్ని సెకండ్ల తర్వాత నాలుగు బైక్ ల మీద కొంత మంది సెక్యూరిటీ సిబ్బంది వెళ్లారు. కాసేపటికి మరో పోలీస్ జీప్. దాని వెనక ఒకే మోడల్, ఒకే కలర్ ఉన్న ఎస్యూవీ లు అయిదు స్పీడ్ గా వెళ్లిపోయాయి. చివర్లో మరో పోలీస్ జీప్.

మూడవ కార్లో ఉన్నాడు సుధీర్. జనం ట్రాఫిక్ ఆపినందుకు తనను తిట్టుకుంటూ ఉండి ఉంటారు అనిపించింది అతనికి. ఒకటే నంబర్ కార్స్ అన్నీ. నక్సలైట్లు తనని టార్గెట్ చేసినా దొరక్కుండా ఉండటానికి అంట. తన తాతల కాలం నుంచీ ఇదే టెక్నిక్. అవతల వాళ్ళేమో డ్రోన్స్ వాడేంత అడ్వాన్స్ అయ్యారు.

తను సీఎం కాకముందు నుంచే  ఇంతకంటే ఎక్కువ కార్స్ తో కాన్వాయ్ మైన్టెయిన్ చేశాడు. మొత్తం తొమ్మిది కార్స్ ఉండేవి అప్పుడు. ఒకే రకంవి. పనీ పాటా లేని వాళ్లంతా వాటిలో ఎప్పుడూ తనతోనే తిరిగేవారు. తనేం చేసినా వాళ్ళు వెనకేసుకు వచ్చేవాళ్ళు. కూర్చుని లేచినా అన్న సింహం, పులి అని పొగిడే వాళ్ళు. ఆ రోజులే వేరు...ఆప్యాయం గా గుర్తు చేసుకున్నాడు.  

సీఎం అయ్యాక సెక్యూరిటీ ఆంక్షలు అనీ, అదనీ, ఇదనీ తన కాన్వాయ్ లో కార్స్ ని కుదించి, తన తో వచ్చే వాళ్ళని కూడా మార్చేశారు.

అతి సురక్షితం గా లోపల కూర్చున్న సుధీర్ కి ఊపిరి ఆడట్లేదు. కార్ దూకి ఎటన్నా పారిపోవలనిపిస్తోంది. 

రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. 

వెధవ ప్రోటోకాల్. రాక్షసులు వస్తుంటే ఖాళీ అయినట్లు గా రోడ్లు బోసిపోయున్నాయి. 

మామూలు మనుషులనే వాళ్లే కనపడటం మానేశారు cm అయ్యాక. కనపడ్డ కొంతమందీ చేతిలో ఏదో ఒక వినతి పత్రం పట్టుకుని ఉంటారు. ఎన్నని చేయగలడు తనైనా. అందరికీ ఎప్పుడూ కష్టాలు, కన్నీళ్ళే. వినీ వినీ విసుగొస్తోంది.

మొదట్లో గొప్పగా అనిపించేది నన్నే కదా అడుగుతున్నారు అని. ఇప్పుడు లాగి కొట్టాలనిపిస్తోంది జనాలకి ఎప్పుడూ బీద ఏడుపులే.

ఈ మధ్య కాలం కలిసి రావటం లేదు. తను ఏ నిర్ణయం తీసుకున్నా బెడిసికొడుతోంది. ప్రతి విషయానికి రోడ్లెక్కి అల్లర్లు, లేదంటే సోషల్ మీడియాలో trolling. పొరపాటున ఏదైనా మంచి పని చేద్దాం అన్నా చివరకొచ్చేసరికి అది రచ్చగా మారుతోంది. 

నిన్ననే ఒక హత్య జరిగింది. నగరం నడిబొడ్డున. తను ఆ టైమ్ కి ఓ విదేశీ కంపెనీ వాళ్ళతో మీటింగ్ లో ఉన్నాడు. తన రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టటానికి వచ్చారు వాళ్ళు. ప్రతిపక్షాల వాళ్లు ఆ హత్యనూ తమ అకౌంట్ లోకి వేస్తున్నారు. తనే దగ్గరుండి చేయించినట్లు. 

ప్రతిపక్షం లో కాని, ప్రజలలో ఎవరికైనా గానీ stomach upset అయినా కల్తీ ఆహారం, పట్టించుకోని సీఎం అని headlines. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ కాదేదీ కవిత కి అనర్హం అన్నట్లు గా ప్రతి అవకతవక తన మీదే.

తన మీద తనకి అంత గొప్ప అభిప్రాయం ఏమి లేదు ఇన్నాళ్లూ. కానీ ఈ అరాచకత్వం చూస్తుంటే తన మీద తనకే జాలేస్తోంది. 
 

 

Next Page