Previous Page Next Page 
నేటి కాలపు మేటి కథకులు పేజి 3


    నాల్రోజులు పోయాక రచయిత్రి స్వయంగా ఆ అమ్మాయితోమాట్లాడితే విషయాలు తెలిసాయి. ఎనిమిది మంది పిల్లలున్న కుటుంబంలో తండ్రి చనిపోతే తల్లి పక్కింటి అబ్దుల్ భాయ్ బొంబాయిలో పని చూపిస్తానంటే ఆ అమ్మాయిని పంపిందనీ, అతను ఒకావిడకు అమ్మితే ఆమె డాన్స్ నేర్పించి బెంగుళూరు నైట్ క్లబ్ లో డాన్స్ లకు పెడితే పోలీసుల రైడ్ లో దొరికిందనీ, అక్కడినుంచి ఒకడు విడిపించి హైదరాబాద్ తీసుకొచ్చి ఆరునెలల తర్వాత వదిలేసాడనీ, తరువాత ఇలా ఫ్యామిలీస్ ఉన్న చోట అయితే ఎవరికీ అనుమానం రాదని ఇక్కడికి ఎవరో తీసుకొచ్చారనీ ఆ అమ్మాయి తన దీనగాథ చెబుతుంది.
    ఈ కథకు పెద్దగా వివరణ అక్కర్లేదు. రచయిత్రి మాటల్లోనే చెప్పాలంటే 'ఆడపిల్ల పొట్ట కోసం తన వాళ్ళు ఉన్నా, తన బతుకుతోవ తానే చూసుకోవాల్సి రావడం....దానికి కారణమైన బీదరికం, కన్నతల్లి కూడా పట్టించుకోకుండా వదిలేయడం, డబ్బు కోసం పిల్లని నిర్ధాక్షిణ్యంగా అమ్ముకోవడం ఇలాంటి కథలు ఎన్నెన్నో రోజుకి జరుగుతుంటాయి. ముఖ్యంగా ముస్లిం బీద కుటుంబంలో మగాళ్ళు రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకుని డజన్ల కొద్దీ పిల్లల్ని కనడం, డబ్బులకి అమ్మడం అరబ్ దేశాలకు పెళ్ళి పేరుతో ఎవరితోనో పంపడం.... ఇలాంటి వార్తలన్నీ పేపర్లలో చదువుతూ ఉంటాం. ఇలాంటి అమ్మాయిలని ఎవరాదుకుంటారు? ప్రభుత్వం ఆదుకోవాలి. అలాంటి హోములలో పెట్టిన పిల్లలు ఆ కట్టడికి ఉండలేక, తిండి సరిగా దొరక్క స్వేచ్చ కోసం పారిపోయి ఇలాంటి జీవితాలే ఎన్నుకుంటారు. ఈ బతుకులింతే!'
    ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎంత శక్తిమంతమైందో అందరికీ తెలుసు. ఫేస్ బుక్ లో చూశానంటూ, కష్టపడి మొబైల్ నెంబర్ సంపాదించానంటూ, నీ స్నేహం కావాలంటూ ఓ అబ్బాయి తీయని మాటల్తో ఓ అమ్మాయితో స్నేహం మొదలు పెడతాడు. అది ప్రేమ పేరుతో తరచూ కలుసుకోవడం దాకా సాగి, శారీరక సంబంధంతో ముగుస్తుంది. అప్పట్నుంచీ అబ్బాయి మొబైల్ మారుస్తాడు, అడ్రస్ మారుస్తాడు, అన్నివిధాలా దొరక్కుండా జాగ్రత్తపడతాడు. అతనిపై ఆకర్షణలో, క్షణిక మోహంలో తొందరపడిన అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. అబార్షన్ కోసం ఓ డాక్టర్ ని సంప్రదిస్తుంది. ఆ డాక్టర్ చెప్పిన మాటలు.....' అమ్మాయిలని ఎలా ఆకర్షించాలో, ఏ తీయని కబుర్లు చెప్పాలో, ఏ కవిత్వాలు చెప్పాలో.... ఇలాంటి అమ్మాయిలని పడగొట్టే విధానాలన్నీ తెలిసిన అబ్బాయిలే ఇంత ధైర్యం చేస్తారు. ఒక మామూలు అమ్మాయిని అందలమెక్కించి ఆరాధన భావం చూపిస్తే ఏ ఆడపిల్ల అయినా లొంగిపోతుంది. అలాంటి వాళ్ళని మగవాళ్ళు దగా చేస్తూనే ఉంటారు. ఆడపిల్లలు ఎన్నాళ్ళైనా గ్రహించకుండా మోసపోతూనే ఉంటారు. కాలక్షేపం కబుర్లు, మాటలన్నీ, ప్రేమలన్నీ వయసు వేడిలో ఆకర్షణ మోజులో సులువుగా దొరికే అమ్మాయిలకి వేసే వల అన్నది గుర్తించరు. అమ్మాయిలు ఎన్నో కథలు చదువుతారు. టీవీలు సినిమాలు చూస్తారు. అయినా సులువుగా బుట్టలో పడిపోతూనే ఉంటారు. 'నాలో ఏముందీ, పెద్ద అందగత్తెను కాను, మామూలు చదువు, అతి మామూలు కుటుంబం, నాలో ఏం చూసి ప్రేమిస్తారు?' అని ఏ అమ్మాయీ ఆలోచించదు. దీపం వేడికి మాడి మసి అవుతున్నా, ఆలోచన లేకుండా ఆ వెలుగుకి ఆకర్షితమై పురుగు భస్మమవడం సృష్టిలో సహజం. ఇలాంటి అమ్మాయిలు కూడా అంతే! దీప భ్రమర న్యాయం అంటే ఇదేనేమో!'.
    'దీప భ్రమర న్యాయం' కథలో లేడీ డాక్టర్ చెప్పిన పై మాటలు నేటి బాలికలకు, యువతులకు చేరాల్సి ఉంది. ఇవాళ పదమూడు, పధ్నాలుగేళ్ళ అమ్మాయిలు కూడా ఆకర్షణలో పడి శారీరకంగా చాలా దూరం వెళుతున్నారు. తెలిసో తెలియకో ఇద్దరూ కలిసి పొందిన క్షణిక అనుభావం తొంభై శాతం కేసుల్లో ఆడపిల్లలను వదిలిపెట్టదు. తీరా తల్లి కాబోతున్నారని తెలిసి అమ్మాయిలు అనుభవం లేని డాక్టర్లను, ప్రమాదకరమైన నాటు మందులను ఆశ్రయించి తమ ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటున్నారు. ఈ విషయం ఒక బాధ్యత గల తల్లిలాగా రచయిత్రి ఎన్నో కథల్లో పదేపదే చెప్పారు. ఏ ఒక్కరు చదివి కొంచెం జాగ్రత్తపడినా అది తన గొప్ప అని కాకుండా సాహిత్యం యొక్క పరమ ప్రయోజనంగా భావిస్తారు కామేశ్వరి.
    ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయాయి. ఏ పేపర్ చదివినా ఏ ఛానల్ చూసినా అవే వార్తలు. చివరికి వావీ, వరసా..చిన్నా పెద్దా ఏమీ చూడడం లేదు. ఆడ పిల్ల కనిపిస్తే చాలు... రాక్షసుల్లా, పిశాచాల్లా పీక్కుతినే మగవాళ్ళు ఎక్కువయ్యారు. వాళ్ళను తప్పించుకుని తమను  తాము కాపాడుకోవాలంటే ఆడవాళ్ళు ఏం చేయాలో ఓ పక్క చెబుతూ కూడా 'ఈ కథలు మారవా?' అంటూ పాఠకులకు ప్రశ్నను సంధిస్తారు రచయిత్రి.
    ఇళ్ళల్లో పనిచేసే శోభమ్మకు ఒక్కగానొక్క కూతురు కవిత. తాగుబోతూ వ్యసనపరుడూ అయిన భర్త రాజన్న చూపు అందంగా ఉండే కన్నకూతురు పైన పడిందనీ, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనీ శోభమ్మ స్త్రీ హృదయం పసిగడుతుంది. ఓ రోజున కూతుర్ని లక్షన్నరాకు ఎవరికో బేరం పెట్టడం ఫోన్లో విని అర్జెంట్ గా హైదరాబాద్ లో ఉంటున్న తన తమ్ముడు, మరదలు దగ్గర కవితను దింపి వస్తుంది. ఏమీ తెలియనట్టు కూతురు భర్త మాటలు విని ఎటో వెళ్ళిపోయినట్టు ఏడుస్తుంది. మధ్యమధ్య తనే వెళ్ళి చూసివస్తుంది. రెండేళ్ళ తరువాత ఓ రోజు పెట్టేబేడా పట్టుకుని కవిత వచ్చేస్తుంది. ఎందుకని అడిగితే కవిత చెప్పిన సమాధానం విని శోభమ్మ నిర్ఘాంతపోతుంది. మొదట్లో బాగానే ఉన్న ఆమె తమ్ముడు వెంకటేష్ కూడా కవితపై కన్నేసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనీ, ఓ రోజు భార్య సుజాత ఇంట్లో లేని సమయంలో కవిత వెంటబడితే, తప్పించుకుని అప్పుడే ఇంటికి వచ్చిన సుజాతకు విషయం చెబుతుంది కవిత. బట్టలు సర్ది అత్తే వచ్చి బస్ ఎక్కించిందని కవిత చెబుతుంది. తను పని చేసే ఇంటి యజమాని సలహాతో భర్తపై పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది శోభమ్మ. వాళ్ళు రాజన్నను నాలుగు తన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. రెడ్ హ్యాండెడ్ గా నేరం చేస్తూ దొరకనందున ఇకముందు ఏదైనా జరిగితే శిక్ష పడుతుందని గట్టిగా బెదిరించి పంపుతామని శోభమ్మకు చెబుతారు. 
    శోభమ్మ పోలీస్ వాళ్ళతో అన్న మాటలు అక్షర సత్యాలు. ఈ సమాజాన్ని సంధించిన బాణాల్లాంటి ప్రశ్నలు! 'సంపుతేనే, దదొంగతనం సేస్తెనే నేరాలా? కన్నబిడ్డ అమ్మకానికి పెట్టడం నేరం కాదా? తాగొచ్చి పెళ్ళానికి, కూతురికి తేడా లేకుండా కన్నబిడ్డ బతుకు బండలు సేయాలనుకోవడం నేరం కాదా?
    మాకు  ఎవరు దిక్కు? మీరు ఆడోళ్ళు, పోలీసోళ్ళు, ఓ ఆడకూతురు కట్టం ఇనుకోరా? మరి మాలాంటోళ్ళం ఎవరికి సెప్పుకోవాలి? ఆడపిల్లకి ఇంట్లో కన్నతండ్రి తోడబుట్టినోడి దగ్గర కూడా బతికే వెసులుబాటు నేదా? ఇంట్లో బతకనీరు, స్కూల్లో బతకనీరు, ఆస్టల్లో సదువుకోనీరు, రోడ్డుమీద ఒంటరిగా ఎలితే భయం. ఊరికంపితే భయం, సదూకునే పిల్లగాళ్ళ దగ్గర నుంచి ఆటోవాడు, బస్సు వాడు, ఆస్టల్లో వాళ్ళు, పనిచేసే చోట, ఏడ ఆడపిల్ల భయం నేకుమ్డా బతికే వీలు లేదా?!' అనే శోభమ్మ మాటలకు ఈ పోలీస్ వ్యవస్థ గానీ, మొత్తం సమాజం గానీ సమాధానం చెప్పగలుగుతుందా?! అయితే ఆడపిల్లలు స్వీయ రక్షణ పద్ధతులు నేర్చుకోవడం. మగవారితో మెలిగాల్సి వచ్చినపుడు వాళ్ళ ప్రలోభాలకు లొంగిపోయి ఒళ్ళు మరిచి పోకుండా తగు జాగ్రత్తలో ఉండడం అనేవి రచయిత్రి చెప్పక చెప్పిన మాటలు.

 Previous Page Next Page