Previous Page Next Page 
ఒక అక్క ప్రేమ కధ పేజి 5


    ప్రయాణానీకింకా నాల్గురోజుల సమయముంది. ఈ నాలుగు రోజుల్లోను పిల్లలతో చాలా ఇబ్బందయింది. అక్క పిల్లలు కాస్త దుడుకువాళ్ళు. చీటికీ, మాటికీ నా పిల్లల్ని కొడుతుండేవారు. నా పిల్లలు అక్కతో పిర్యాదు చేస్తే, "వాళ్ళుత్తినే ఎందుకు కొడతారు? మీరేదో అనే ఉంటారు" అని మందలించి పంపేసింది. పిల్లలేదురు గుండా అలా అన్నా అది తన పిల్లల్ని మందలిస్తుందేమోనని చూశాను. అలా చేయలేదు. ఒకటి రెండు రోజులు చూసి నేనే అక్కతో, 'అక్కా! పిల్లల అల్లరిని సమర్ధించ కూడదే....ఎవరైనా మన పిల్లల గురించి నేరం చెప్పినప్పుడు మనం మన వల్లనే వెనకేసుకొస్తే వాళ్ళు చేడిపోతారే!" అన్నాను. అది పెద్దగా పట్టించుకోలేదు. కానీ నాకు కలగాజేసుకోక తప్పలేదు. ఒకసారి అక్క పెద్ద కొడుకు నా చిన్న కూతుర్ని డొక్కలో గట్టిగా పోదిచేశాడు. అది మెలికలు తిరుగుతూ నేల మీద పడిపోయింది. నేను వెంటనే అక్క కొడుకుని మందలించాను. వాడు ఏడుస్తూ అక్క దగ్గరకు వెళ్ళిపోయాడు. ఇంకో క్షణంలో కోపంగా అక్క నా దగ్గరకు వచ్చింది. నేను అక్కకు జరిగింది చెప్పాను.
    అక్క నా కూతుర్ని ఎలా ఉందని అయినా పలకరించలేదు. సానుభూతి కోసం చూసే నా కూతురి కంటి చూపుల్ని తిరస్కరిస్తూ అది అక్కణ్నుంచి వెళ్ళిపోయింది. నేను దాని ననుసరించి వెళ్ళేసరికి అది కొడుకుని ఓదారుస్తోంది. వాడేమో పిన్ని తిట్టిందని ఎడ్చేస్తున్నాడు.
    అక్కకు నా స్వభావం పూర్తిగా తెలుసు. అకారణంగానే నెవ్వరినీ ఏమీ అనను. నా పిల్లల్నయితే చిన్న తప్పుకు కూడా తీవ్రంగా మండలిస్తాను. అయినా మరోసారి అదే తప్పు చేయకుండా ఉండడం కోసమే నేను తన కొడుకును మందలించానని అది ఎందుకు అర్ధం చేసుకోదు?
    ఆ పూటకు అక్క తలనొప్పి వచ్చిందని పడుకుంది. ఎంత పిలిచినా భోజనానికి రాలేదు. అది తలనొప్పి కాదనీ, కోపమనీ నాకు తెలుసు. కోపం కూడా తను చేసిన తప్పుకే.
    ఎలాగో సాయంత్రానికి అక్క మనసు సరిపెట్టుకుంది. నాతొ అదీ ఇదీ మాట్లాడుతూ "నా పిల్లలు పుట్టినప్పట్నించీ అబ్బురంగా పెరిగారు. వాళ్ళు మాట పడరు. నాది నడమంత్రపు సిరి కాదని నీకు తెలుసు" అంది.
    ప్రయాణానికి బట్టలు సర్దుకునేటప్పుడు , "కాస్త ఖరీదయిన చీరలు వేసుకోవే బాబూ - మన హోదాకు తగ్గట్లుగా ఉండాలి - ఏ వూళ్ళో ఉన్నా" అంది అక్క.
    "ఇందులో అన్నీ ఖరీదైనవే!" అని చెప్పాను అక్కకి. ఖరీదులు విచారించి చూడగా నేను వేసిన పది చీరల్లోనూ ఆరు చీరలు అక్క చీరల కంటే ఖరీదైనవి.
    "బొత్తిగా సెలక్షన్ తెలియదే నీకు? ఇంతంత ఖరీదులు పోసి ఇలాంటి చీరలా కొనుక్కోవడం?' అంది అక్క, ఏమనాలో తెలియక అక్క అలా అన్నదని నా అభిప్రాయం. ఎందుకంటె నా చీరలు నాకు అక్క చీరలకంటే బాగున్నాయి.
    నా అనుమానాన్ని నిజం చేస్తూ అక్క ఆరోజునే బావను బజారుకు తీసుకెళ్ళి ఓ అరడజను కొత్త చీరలు కొనిపించింది. అన్ని చీరల కంటే ఖరీదయినవి అవి.
    ఇది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అవతల ప్రయాణంలో బోలెడు ఖర్చులుంటాయి కూడాను, డబ్బును ముందే ఇలా ఖర్చు పెట్టేసిందేమిటా అనుకున్నాను. అలాగని వాళ్ళు తెచ్చుకున్న డబ్బు కూడా ఎక్కువున్నట్లు లేదు. వెళ్ళగానే తిరిగి ఇచ్చేస్తామని అది 3 వేల రూ. లు మా దగ్గర అప్పు తీసుకుంది ----ఈ చీరలు కొనడం అయ్యేక.
    పిల్లలతో ప్రయాణం నాకు బెంగగానే ఉంది. ఎదుటి వాళ్ళ పిల్లల్ని కొట్టడం తప్పని నా అక్క పిల్లలకి తెలియదు. అందుకు యా పిల్లల్ని తప్పు పట్టలేదు. వాళ్ళు కాసేపు స్నేహంగా ఉంటారు. కాసేపు విరోధంగా ఉంటారు. కానీ పెద్దలు సరిగా ఉంటే బాధలేదు కదా!
    ప్రయాణంలో ఈ పిల్లలతో చాలా ఇబ్బంది అయింది.
    మా అక్క బట్టలకు తప్ప మరి దేనికీ డబ్బు ఖర్చు పెట్టదు. నాకు బట్టలకం టే కూడా పిల్లల అట వస్తువులపై మోజు ఎక్కువ. మా పిల్లలకు లేని అట వస్తువులు లేవు. బజార్లో ఏ వస్తువు చూసినా కొనమని అక్క పిల్లలు కాల్చేసే వారు. మా పిల్లలు అడిగేవారు కాదు. ఇలా అన్నీ  మాకున్నాయని మా వాళ్ళు అంటుంటే అక్క కొడుక్కి కోపం వచ్చి ------"మా నాన్నగారు మీ నాన్నగారి కంటే గొప్ప కదా! మేం కొనుక్కో లేనివి మీరెలా కొనుక్కో గలిగారు?" అనడిగాడు.
    నేను చాలా ఆశ్చర్య పోయాను. 'ఈ పెద్ద - చిన్న, గొప్ప- తక్కువ ఆలోచనలు పిల్లల బుర్రల్లోకి వాటంతటవే వచ్చాయా?' నా సందేహానికి సమాధానం త్వరగానే లభించింది.
    "వాళ్లన్నీ ఉన్నాయంటే  నమ్మక్క ర్లేదు . చూసినపుడే నమ్మాలి!" అంది అక్క.
    అక్కకు కొంత అసహనం ఏర్పడిందని నాకు అర్ధమై పోయింది. పిల్లలకు అబద్ధాలాడే అవకాశాలు సృష్టిస్తోంది తను. ఈరోజు నా పిల్లల మాటల్లో అబద్దాన్నూహించుకుంటే రేపు అక్క పిల్లలు ప్రపంచంలోని ఎవరిని నమ్మగలరు? తాత్కాలికమైన అసహనంలో అక్క తన పిల్లల కెంత అన్యాయం చేస్తుందో గ్రహించడం లేదు. చిన్నప్పుడు నన్ను కంటికి రెప్పలా చూసుకున్న అక్క పిల్లలకు జరిగే ఈ అన్యాయాన్ని వారించాలని నాకుంది.
    ఎందుకంటే ఆ పిల్లలు ఇరవై నాలుగు గంటలూ తమ తండ్రి గొప్పతనం గురించీ, తల్లి గొప్పతనం గురించి , తమ వైభవం గురించీ, తమను చూసి ఇతరులసూయ పడే వైనం గురించి తప్ప ఇంకేమీ మాట్లాడడం లేదు. సర్వ మానవ సమానత్వం, సహా జీవన సౌభాగ్యం - ఈ వయసులో దూరం చేసుకుంటే వాళ్లకు మళ్ళీ అలాంటి అవకాశం లభిస్తుందా?
    ఒకసారి మందలించ బోయి నందుకు అక్క నన్ను స్పష్టంగా హెచ్చరించింది ---"నా పిల్లల్ని ఆఖరికి నా చెల్లెలు మందలించిన నేను సహించలేను."
    పిల్లల సంగతి అలా ఉంటే అక్క నన్ను కూడా చాలా ఇబ్బందుల్లో పెట్టింది. నా అలవాట్లనూ, అభిరుచులనూ అన్నింటినీ విమర్శించి - తన అలవాట్లనూ, అభిరుచులనూ ప్రశంసిన్చుకుని --నేను తనకిలా ఎప్పటికి మారతానోనని వాపోయింది. ఈ ప్రయాణంలో నేను గమనించిన దేమిటంటే నేను చేసే ఒక్క ప్రతిపాదన కూడా అక్క ఆమోదించలేదు. అందుకు పోనీ తర్కాన్నయినా పాటించలేదు.
    ఒకసారీ నేను వేరుశనగక్కాయలు కొంటుంటే ---" అసహ్యంగా రోడ్డు మీద సరుకు ఏం కొంటామే " అని తీసి పారేసింది.
    మరోసారి తనే వేయించిన కారపు శనగలు కొందామంది.
    మేము త్రివేండ్రం లో ఉండగా కోవలం బీచికి టాక్సీలో వెడదామని అన్నాను నేను. అక్క సిటీ బస్సులో వెడితే డబ్బు అదా అవుతుందంది.
    "టాక్సీలో వెడితే ఓ గంటలో వెనక్కి రావచ్చు. అందువల్ల ఓ పది రూపాయలు ఎక్కువైనా మధ్యాహ్నం బస్సులో వెళ్ళి పోవచ్చు. అదే బస్సులో వెడితే - ప్రయాణం రాత్రికి వాయిదా వేసుకోవాలి. సాయంత్రం మూడు దాటితే మనం ఇంకో రోజు అద్దె ఇచ్చుకోవాలి. ఇద్దరికీ కలిపి అరవై రూపాయల నష్టం" అన్నాను.
    "ఏమిటో ---లెక్కలు చెప్పి కంగారు పెట్టేస్తున్నావు. నీ బాష నా కార్ధం కాదె బాబూ! పోనీ డబ్బు నష్టమైందనే అనుకుందాం ------అసలింట్లో కూర్చుంటే ఏ ఖర్చులూ ఉండేవి కాదు గదా! చిన్నప్పట్నించి ఇంతే నువ్వు. నీ పిసినారితనం ఎప్పటికి పోతుందో కానీ!" అంది అక్క.
    బెంగుళూర్లో చీరలు కొనుక్కున్నాను నేను. ప్రయాణాల్లో చీరలు కొనడం దండగని గట్టిగా చెప్పింధది. కానీ నేను వినలేదు ఆఖరికి చీరలు కూడా నాకు నచ్చినవే, అది బాగోలేదని అన్నప్పటికీ కొన్నాను. తర్వాత అది కూడా అంత కంటే కాస్త ఖరీదైన చీరలు తనకు మళ్ళీ కొనుక్కుంది.
    కొత్త కొత్త ప్రదేశాలు చూడ్డం నాకెంతో ఆనందంగా ఉన్నప్పటికీ అక్క ప్రవర్తన నాకు చాలా బాధ కలిగింది. అదిలా ఎందుకు మారిపోయిందో -- నా పట్ల ఇంత అసహనంగా ఎందుకుంటుందో నాకు తెలియలేదు. అక్క ప్రేమను పోగొట్టుకోవడానికి నేనేం తప్పు చేశానో కూడా నాకు తెలియలేదు. అయితే తిరుగు ప్రయాణంలో నేను తిరిగి అక్క ప్రేమను పొందగలిగే వరకూ అసలు సంగతి నాకు అర్ధం కాలేదు.
    విజయవాడలో ప్లాట్ ఫారం మీదకు వొంగి చూస్తుండగా ఓ దొంగ నా మెడలోని గొలుసు తెంపుకు పోయాడు. బంగారపు గొలుసు. రెండు వేలకు తక్కు వుండదు.
    "దొంగ " అని అరవడం జరిగింది కాని వాడు మెరుపులా మాయమయ్యాడు.
    నాకు కళ్ళ నీళ్ళ పర్యంతమైంది.
    "బాధపడకు! నీ అంత జాగ్రత్త పరురాలి దగ్గర గొలుసు తెంపు కెళ్ళడం ఆ దొంగ గొప్పతనాన్ని చాటుతోంది." అన్నారాయన నన్ను ఓదారుస్తూ.
    అక్క నాకు దగ్గరగా జరిగింది ప్రేమగా భుజం మీద నిమిరింది. "ఇంతవరకూ అంతా ప్రయాణంలో సవ్యంగా జరిగిపోయిందనుకున్నాను. ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది . ఆ గొలుసు నేను నీకు చేయించి పెడతానులే" అంది.
    నేను ఆశ్చర్య పోయాను. దాని చేయి నా భుజాన్ని తాకుతుంటే నాలో దుఖం పొంగు కొచ్చింది. దాని ఒడిలో తల పెట్టుకుని ఏడ్చేశాను. అది ఆప్యాయంగా నా జుట్టులో తన వెళ్ళు కదుపుతోంది.
    కాసేపటికి నేను తేరుకున్నాను. కానీ బాధ నన్ను వదల్లేదు.
    "అది పోలేదనే అనుకో. నేను నీకు చేయించి పెడతాగా " అంది అక్క.
    "గొలుసు వద్దు అక్కా! నేనే చేయించు కొంటాను. నీ అభిమానం ఎప్పటికీ ఇలా ఉంటే చాలు" అన్న నాకు అక్క అభిమానంలోని రహస్యాన్ని తెలిసిపోయింది. ఇంత కాలం అక్క నన్ను ప్రేమిస్తోందని భ్రమ పడ్డాను. దానికి నా మీద ఉన్నది ప్రేమ కాదు- జాలి! ప్రేమ ఏదైనా ఉంటె అది జాలి కారణంగా పుట్టినదేనని అర్ధమైంది.
    నేను కష్టాల్లో ఉండేదాన్ని, ఇప్పుడు కష్టాలు లేవు. నోరులేని దాన్ని. ఇప్పుడు నోరు లేక పోయినా ఇబ్బంది లేదు. ఒకప్పుడెవరి ప్రేమనూ నోచుకోలేదు. ఇప్పుడు నన్ను ప్రాణాధికంగా ప్రేమించిన భర్త ఉన్నాడు. ఒకప్పుడు నాకు డబ్బు లేదు. ఇప్పుడు నాకు డబ్బుకు లోటు లేదు. ఒకప్పుడు నేను అన్నింటికీ అక్క సలహాలే తీసుకునేదాన్ని. ఇప్పుడు వ్యక్తుత్వం వచ్చింది. నా పిల్లలు, నలుగురూ మెచ్చే క్రమశిక్షణ కలిగి ఉన్నారు.
    ఏ విధంగా చూసినా జాలి పడవలసిన స్థితిలో లేను నేను. అందుకు అక్క సంతోషించాలి. జాలిపడవలసిన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ప్రేమించగల నా అక్క నన్నిప్పుడేలా ప్రేమించగలదు? ఇప్పుడు  నా అక్క నన్ను ప్రేమించాలంటే నేను నగలైనా పోగొట్టుకోవాలి, లేదా నన్ను కష్టాలు తరుముకు రావాలి.
    అక్క ప్రేమ నాకు బాగుంటుంది. కానీ ఆ  ప్రేమ కోసం ఇంత త్యాగం చేయగలనా?
    మరోసారి అక్క వంక చూశాను.
    అక్క ఇంకా నా వంక జాలిగా చూస్తూనే ఉంది.
                                         ***

 Previous Page Next Page