Previous Page Next Page 
వదిన గారి చెల్లెలు పేజి 4

                                 


                                            
    రాజా పిలుపు వినబడగానే జడ అల్లుకుంటున్న సుమిత్ర సంభ్రమంగా వచ్చింది.
    'వదినా! బొంబాయి నుండి రెక్కలు కట్టుకొని మీ దగ్గరకు వచ్చేసాను. ఇహ మీరు పొమ్మన్నా , ఆరునెల్ల వరకూ పోను. ఈ ఆరునెల్లు నా భారమంతా మీదే!' ముందుగానే అప్పగింతలు పెడుతూ వదిన గారు తనకు చెయ్యాల్సిన పరిచర్యల్ని ముచ్చటగా గుర్తు చేశాడు. మరిది భావాన్ని గ్రహించి , సుమిత్ర నవ్వేసింది.
    'వయసు పెరుగుతున్న కొద్ది, నీలో చిలిపితనం ఎక్కువవుతోంది రాజా! ముందు లోపలికి పద. కాఫీ తాగి స్నానం చేద్దువు గాని' సుమిత్ర వంట గదిలోకి దారి తీసింది. రెండు సూట్ కేసులు, గోడ ప్రక్కగా పెట్టాడు. చెక్కిట చేయి చేర్చి బొమ్మలా కుర్చీ కానుకొని నిలబడ్డ సంధ్య వైపోసారి చూశాడు. రాజా చూపుని తప్పించుకుంటూ , మాల చేతిలోకి తీసుకుంది సంధ్య.
    "ఈ అమ్మాయేవరు? వదిన పరిచయం చెయ్యడం మర్చి పోయినట్లుంది' అనుకున్నాడు. రాజా లోపలికి వెళ్ళగానే, అటు వైపే వో క్షణం చూసి దీర్ఘంగా నిట్టూర్చింది సంధ్య.
    'ఇతడేనా సుమిత్రక్క ముద్దుల మరిది! అతడి కళ్ళు తన కళ్ళు కలుసుకోగానే తన గుండె ఝల్లు మన్నట్లయింది. ఎందుకు? అతడి నీడ కూడా తన మీద పడితే భరించ లేదనుకున్న తను, అతడి చూపులకే కరిగి పోతున్నదే!' జవాబు వెతుక్కోవడానికి అరాతపడింది సంధ్య మనసు.
    'సంధ్యా! కొంచెం కాఫీ కప్పులు తెచ్చి పెట్టమ్మా!"
    సుమిత్ర పిలుపుకి ఉలిక్కిపడి, తన అలోచనలు కట్టిపెట్టి , లోపలికి నడిచింది. కాఫీ కప్పులో పోస్తూ, అంది సుమిత్ర. 'తను, మా పిన్ని కూతురు సంధ్య, ఇది వరకు , రెండు మూడు సార్లు చెప్పాను. గుర్తుందా?' రాజా గుర్తుందని తలాడించాడు. 'అబ్బ! పెద్ద తన గురించి చెప్పడాని కేముందో? ఏం చెప్పి ఉంటుంది. యీ మహాను భావుడికి?' సంధ్య మనసులో కుతూహలం కెరటం లా లేచి పడింది. 'తన' అనేప్పటికి ప్రతి వాళ్ళకి ఎంత ఆసక్తి గా అన్పిస్తుంది! ఇద్దరికీ చెరో కప్పు అందిస్తూ, "మా సంధ్య బి.యస్ .సి ఫస్టు క్లాసు లో పాసయింది రాజా! ఎంత చక్కగా కబుర్లు చెప్తుందో, వినేవాళ్ళ కి వోపికుండాలే గాని, నీలాగే అల్లరి ఎక్కువ.' సుమిత్ర మాటలకి సంధ్య మొహం సిగ్గుతో, ఎర్రబడి, తల మరింత క్రిందికి వాలిపోవడం రాజా గమనించాడు. మొదటి చూపులోనే, సౌజన్యం, ముగ్ధత్వం మూర్తీ భవించి నట్లున్న సంధ్య రాజా మనసులో ముద్ర వేసింది. సంధ్య కేసి ప్రశంసా పూర్వకంగా చూస్తూ అన్నాడు.
    'మరి ఫర్ దర్ స్టడీస్ కి వెళ్లలేదే?'
    'చదివింది చాలు బాబు. అసలే కొంచెం బలం తక్కువ. మరీ సున్నితం. ఇంట్లో కూర్చుని రెస్ట్ తీసుకో బట్టి యీ మాత్రం ఉంది.' సంధ్య వైపు చూసిన సుమిత్ర నేత్రాల నుండి వాత్సల్యం వర్షించింది. తెల్లటి చాయలో, సన్నగా, పొడవుగా , అతి సుకుమారంగా ఉన్న సంధ్యని చూస్తూ 'నిజమే' అనుకున్నాడు రాజా. సుమిత్రమాటలు రాజా చూపులు, సంధ్య కి యిబ్బందిగా అన్పించాయి.
    'వదిన పెళ్ళికి మీరు రాలెదను కుంటాను.'
    మొదటిసారిగా సంధ్య నుద్దేశించి మాట్లాడాడు. సంధ్య తడబడింది. 'పరిక్షలు జరుగుతున్నాయి. అప్పుడు.' నెమ్మదిగా గొణిగింది. సంధ్యకి, అక్కడ వాతావరణం ఉక్కిరిబిక్కిరి గా అన్పించి, ఎప్పుడెప్పుడు , అక్కడ్నుంచి పోదామా, అని ఆరాటపడ సాగింది. స్టౌ మీద అన్నం వారుస్తున్న సుమిత్ర గేటు చప్పుడవడం తో 'బావగారు వచ్చినట్లున్నారు చూడు సంధ్యా' అంది. సంధ్య ఒక్క ఉదుటున ముందు గదిలోకి వెళ్ళింది. అప్పుడు కాని ప్రాణం కొంచెం తెరిపిన పదినట్లన్పించ లేదు. రాజా ఆశ్చర్యంగా, సంధ్య వెళ్ళిన వైపు చూశాడు. 'సంధ్య ఎందుకో అన్ యీజీగా ఫీలవుతున్నది. క్రొత్త వాళ్ళ దగ్గర ఆ అమ్మాయికి అలా అన్పిస్తుందేమో! కాని వదిన యిదివరకో సారి సంధ్య కి క్రొత్త, పాత ఏం లేదని అందరితో, చాలా సోషల్ గా ఉంటుందని చెప్పినట్లు గుర్తు. మరి ఆలాంటమ్మాయి , తన మాటలకి సరిగ్గా రెస్పాన్స్ కూడా యివ్వలేదే?!' పెద్ద ప్రశార్ధకం తేలు కొండి లా రాజా బుర్రలో నిలబడింది.
    'రాజా వచ్చాడా?' ఆదుర్దాగా అడుగుతున్న సారధి స్వరం విన్పించడంతో, టవల్ భుజాన వేసుకుంటూ ముందు గదిలోకి వెళ్లాడు రాజా!
    'రాజా! ' సంవత్సరం తర్వాత తమ్ముడ్ని చూసిన ఆనందాతిశయంతో , సారధి ఆలింగనం చేసుకున్నాడు. సారదెప్పుడూ అంత త్వరగా బయట పడడు. తన ఎమోషన్స్ ని, తన కంట్రోల్ లోనే వుంచు కొంటాడు. కాని సంవత్సరం తర్వాత చూసేప్పటికి తన ప్రేమను దాచుకోలేక పోయాడు. అన్నయ్య అనురాగ మాధుర్యాన్ని నింపుకొని తనివి చెందిన రాజా మనసు పొంగిపోయింది. 'తనెంత అదృష్ట వంతుడు! కంటికి రెప్పలాగా ఎంతో జాగ్రత్తగా , తన మనసు నొప్పించకుండా మెలిగే తల్లితండ్రులు, ఆత్మీయతను , ఆపేక్షను తన పట్ల నింపుకొన్న సీతారాము ల్లాంటి వదినా, అన్న ఇంత కన్నా ఇంకేం కావాలి?' సంధ్య కన్పడింది ఎదురుగా రేడియో ట్యూన్ చేస్తూ.
    'ముందు తొందరగా స్నానం కానివ్వురా రాజా! మీ వదిన వంట చాలా రోజుల తర్వాత, రుచి చూద్దువు గాని' సారధి రాజాని తొందర పెట్టేశాడు.
    "అంతదూరం నుండి ప్రయాణం చేసి వచ్చిన రాజా కన్నా, మీకు తొందరగా ఉందే భోజనానికి.' సుమిత్ర వెక్కిరించింది. రాజా వస్తాడు, తొందరగా యింటికి వస్తే స్టేషన్ కు వెళ్ళచ్చని చెప్పింది సుమిత్ర. ఆఫీసు పనిలో, రివాజు ప్రకారం ఆలస్యంగా వచ్చాడు.అదీ కోపం సుమిత్ర కని సారధి కి తెలుస్తూనే వుంది.
    "హతోస్మీ! మీ ముద్దుల మరిది వచ్చాడని నన్ను వెలేస్తున్నా వల్లే ఉంది. ఇహ, సంధ్యా మనిద్దరి పని ఆఖరు. సీతాపతే చాప గతి...' నీరసంగా కుర్చీలో కూలబడ్డ సారధిని చూసి, సుమిత్ర, సంధ్య ఫక్కున నవ్వారు. సుమిత్ర నవ్వడం చూసిన తర్వాత గాని సారధి మనసు కుదుట పడలేదు. 'బతుకు జీవుడా' అనుకుంటూ కుర్చీలోంచి లేచాడు.
    'ఆన్నయ్యా! అమ్మా, నాన్న ఎప్పుడొస్తారంట?' తల దువ్వుకుంటూ అడిగాడు రాజా. "అప్పుడే ఎక్కడ రాజా! దేశంలో ఉన్న పుణ్యక్ష్తెత్రాలన్నీ దర్శించుకొని తిరిగి వచ్చేప్పటికి రెన్నేల్లు పడుతుంది. నాన్న శ్రీశైలం నుంచి మొన్ననే ఉత్తరం వ్రాశారు.' సారధి టవల్ తో తడి ముఖం తుడుచుకుంటూ జవాబిచ్చాడు. రాజా పరధ్యానంగా దువ్విన తలనే దువ్వడం మొదలు పెట్టాడు.  'అమ్మా వాళ్ళని చూసి, ఎన్ని రోజులయింది! తనకి హైదరాబాద్ ట్రాన్స్ ఫరయిందని తెలియక ముందే, వాళ్ళు తీర్ధయాత్రలకు వెళ్ళిపోయారు. బొంబాయి కి, తనను చూడటానికి వెళ్తామని అన్నయ్యతో చెప్పారట. అమ్మ ఎలా ఉందొ? తనంటే యెంత ప్రాణం అమ్మకి! 'వెర్రి నాన్నా! మరీ అంత మెత్తగా ఉండకురా! మంచికి రోజులు కావు' అని తన గురించి ఆదుర్దా పడేది. తనను చూడాలని ఎన్ని ఉత్తరాలు వ్రాసింది! తీరా వచ్చేప్పటికి వెళ్ళిపోయారు.' నిరుత్సాహంగా అన్పించింది , ఒక్క క్షణం రాజాకి.
    'ఏమయ్యా! ఇంకా అవలేదా? కొత్త పెళ్లి కొడుకు లాగా,మ్ అద్ద ముందు నుంచి ఇంకా కదలవే!' వంటగది గడప దగ్గర నిల్చిని రాజా గదిలోకి తొంగి చూస్తూ అంది. రాజా కొంచెం సిగ్గుపడ్డాడు. 'అమ్మని గురించి ఆలోచిస్తున్నా వదినా!' సంజాయిషీ చెప్పుకొంటున్నట్లు అన్నాడు.
    నలుగురూ, భోజనం టేబుల్ ముందు కూర్చున్నారు.
    'ఇదిగో విన్నారా! మన రాజా అమ్మ మీద బెంగ పెట్టుకున్నాడు.' సుమిత్ర అంది.
    'ఇంకా ఏమిట్రా చిన్న పిల్లాడిలా. అమ్మ కొంగు మానేసి, రాబోయే వాళ్ళ కొంగు పట్టుకోవడం నేర్చుకో. నేను చూడు అస్తమానం మీ వదిన కొంగు పట్టుకుని తిరగాబట్టే ఈ మాత్రం చూస్తోంది. సంధ్య నవ్వుని పెదాల వెనుకే దాచుకుంది. సుమిత్ర , అతి కష్టం మీద నవ్వాపు కుంటూ 'ఇహ చాల్లెండి మీ అబద్దాలు, రాజా నిజమేనని నమ్మగలడు' అంది. రాజా పెదాల మీద నవ్వు చిందు లేసింది.
    'ఇదిగో బాబూ! ఈసారి అత్తయ్య గారు యాత్రల నుండి రాగానే, నీ పెళ్లి చెయ్యడం కాయమని చెప్పారు. ఎవరినన్నా ప్రేమించావంటావేమో! ముందుగా మాతో చెప్తే మీ నాన్నగారి కి రికమెండ్ చేస్తాం. ఇపుడు చెప్పకుండా, ఆ తర్వాత విచారించి లాభంలేదు. అంతే కదండీ!' సారధి సపోర్ట్ కోసం అడిగింది సుమిత్ర. సారధి ఏం మాట్లాడలేదు కాని, ప్రశ్నార్ధకంగా తమ్ముడి వంక చూశాడు. రాజా యిబ్బందిగా నవ్వాడు. 'అలాంటిదేం లేదు .' సారధి మనసు కొంచెం శాంతించింది. 'ఐతే తననుకున్నట్లే జరుగుతుంది. రాజాకి తన మాటంటే చాలా గౌరవం' ఆనుకున్నాడు.
    భోజనాలయి పోయాయి. సంధ్య నోరెత్తలేదు కాని, సారధి నవ్వులతో, రాజా జోక్స్ తో సుమిత్ర పరిహసంతో, వాతావరణం చైతన్య వంతమైంది. పసిపిల్లల అమాయకతను నింపుకొన్న రాజా స్వచ్చమైన నవ్వు, నిష్కపట మైన అతడి ముఖ కవళికలు , గమనించిన కొద్దీ , సంధ్య కి , తను రాజాని గురించి విన్నది అబద్దమేమో అన్న అనుమానం పీడించసాగింది. చెయ్యి కడుక్కోవటానికి లేస్తూ రాజా అడిగాడు 'వదినా! మంచినీళ్ళు' గిన్నెలు సర్దుతున్న సుమిత్ర సంధ్య కోసం చూసింది. రాజా అంటుండ గానే అక్కయ్య తన్నేక్కడ యిమ్మంటుందో అనే భయం కొద్దీ సంధ్య అక్కడ్నుంచి అప్పుడే జారుకుంది, రాజా మాటలు వినపడనట్లు నటిస్తూ. అతడి సామీప్యమే మహాకష్టంగా ఉన్నప్పుడు, అతడి కోసం , ఎంత చిన్న పనైనా సరే చేయడానికి సంధ్య మనసు వ్యతిరేకిస్తుంది. కనీసం, అలా అని ఆ క్షణంలో సంధ్య అనుకుంది. 'తనదిగింది సంధ్య కి తప్పకుండా వినపడే వుండాలి. మరి అలా నిర్లక్ష్యంగా , పట్టనట్లు వేల్లిపోతుందే!' అర్ధంకాక రాజా కనుబొమలు ముడిపడ్డాయి.
    'సంధ్య ఏం చేస్తుంది?' సుమిత్ర చేతిలో తమలపాకు చిలకల్ని వంగి అందుకుంటూ అడిగాడు సారధి.
    'తలనొప్పిగా వుందని పడుకొంది.' ఆకులకు సున్నం రాస్తూ సమాధాన మిచ్చింది. బద్దకంగా సోఫాలో వాలిన రాజా మనసులోనే అనుకున్నాడు.
    'ఇందాకంతా బాగానే ఉందిగా! ఇంత హటాత్తుగా ఎలా వచ్చిందో? మేలుకుంటే ఇక్కడ కూర్చోవలసి వస్తుందని భయమేమో!' పాపం, రాజా తనకి తెలియకుండానే సరిగా ఊహించ గల్గాడు. రాజాకి కల్గిన సందేహమే సారధికి కల్గింది.
    "ఇంతాకంతా బాగానే ఉందిగా! రోజూ భోజనాల దగ్గర, తెంపు లేకుండా కబుర్లు చెప్పేది ఇవాళసలు పెదవి కదిపినట్లు లేదే' ఆశ్చర్యంగా అన్నాడు. ప్రక్కగదిలో పడుకున్న సంధ్యకి సంభాషణ అంతా వినపడుతూనే ఉంది.
    'అబ్బబ్బ! ప్రతిదానికీ మీ  కనుమానమే ఇందాక రాకపోతే, యిప్పుడు రాకూడదని రూలా?  విసుక్కుంటూ అన్నా, సుమిత్రకి సంధ్య ప్రవర్తన కి కారణం తెలుసు. అంత రంతారాల్లో సుమిత్రకి, సంధ్య ప్రవర్తన సమంజసం గానే తోచింది.
    'అవును, సంధ్య పద్దతే మంచిది. తర్వాత ఎలాంటి సమస్యలు ఎడురవ్వవు. తను జోక్యం చేసుకోకుండా, సంధ్య ని , తన మార్గానికే వదిలేస్తాను.' సుమిత్ర మొదటి సారి గట్టిగా అనుకుంది.

                            *    *    *    *
    ఉదయకిరణాలు వెచ్చగా, గిలిగింతలు పెట్టడం లో , రాజా నిద్రమత్తు వదిలింది. బద్దకంగా లేచి, బ్రష్ మీద పేస్టు వేసుకుంటూ, కిటికీ కేసి యధాలాపంగా చూశాడు. తోటలో సంధ్య కన్పించింది. నిర్మలంగా ఉన్న సంధ్య ప్రశాంత వదనాన్ని చూడగానే రాజాకి 'ఉషా కన్యలా....మంచులో తడిసిన మెత్తటి విరిబాలలా....' అన్పించింది. ఉదయం లేవగానే సంధ్యా దర్శనం అయినందుకు ఎందుకో ఉల్లాసంగా, తృప్తిగా అన్పించి, ముఖం కడుక్కోటానికి 'వాష్ బేసిన్' దగ్గరకు వెళ్లాడు.
    తోటలో, అన్యమస్కంగా పచార్లు చేస్తున్న సంధ్య మనసులో, ఎంత వద్దనుకున్నా, రాజా గురించిన ఆలోచనలు అల్లుకుంటున్నాయి. ఎర్రటి దేహచాయ లో, పాడవు కు తగ్గ లావుతో, చిన్నవైనా చురుగ్గా చూసే కళ్ళతో చెరగని చిరునగవుతో సున్నితంగా, సౌమ్యంగా మాట్లాడే రాజాని తలచుకొన్న కొలది, సంధ్య హృదయం పరవశంతో ఆదీనం తప్పసాగింది.

 Previous Page Next Page