"రవి నాయనమ్మ చెప్పినకథ" "హంబక్? అదంతా ఆ మతి లేనివాడు చెప్పింది. నాకు తెలుసు" "ఆమె నాతో స్వయంగా చెప్పింది" "ఆమె నిజంగా ఉందా?" డోర్ దగ్గర నిలబడే అడిగింది. "ఇంకా బతికే ఉంది. మనవాడికి కాబోయే పెళ్ళాం ఎలా ఉంటుందో చూసి చచ్చిపోతుందట". గిర్రున తిరిగొచ్చి ప్రొఫెసర్ పక్కన కూర్చుంది మహతి. "రవి నాయనమ్మను గురించి చెప్పిందీ, కిరణ్ తాతయ్యను గురించి చెప్పిందీ నిజమేనన్నమాట?" "అక్షరాలా" అంటూ ఆమె భుజంతట్టాడు. "కిరణ్ తాతయ్యో?" "ఈ మధ్యనే పోయాడు" అయితే కిరణ్ చెప్పింది నిజమేనన్న మాట! "ఆ ఇద్దరికీ పడదా?" "--ధు----"ఆ ముందక్షరాలు పరశురాం విస్కీతోపాటు మింగేశాడు. "డైవర్సు ఇచ్చుకొన్నారా?" "వాళ్ళిద్దరూ భార్యాభర్తలైతేగా డైవర్సు ఇచ్చుకోవటానికి?" "మళ్ళీ------" అరిచింది మహతి. "అవును బేబి. నాయనమ్మేమో తండ్రి తల్లి" "ఆ సంగతి తెలుసు, బోరు కొట్టకు అంకుల్." "తాతయ్యేమో తల్లితండ్రి. వాళ్ళిద్దరూ మొగుడూ పెళ్ళాలెలా అవుతారూ?" "అదా సంగతి? సారీ అంకుల్! నాయనమ్మా, తాతయ్యా అంటే అలా అనుకొన్నాను" తన తొందర పాటుకు మహతి ముఖం చిన్నబుచ్చుకొంది. "ఊ( అంకుల్! మొదలుపెట్టండి నాయనమ్మకధ" "నాయనమ్మ కధకాదు. నాయనమ్మ చెప్పిన కధ" "అదే చెప్పండి" "అమ్మా నాన్నా చనిపోయేసరికి రవికిరణ్ కు నాలుగేళ్ళు. పితామహులూ, మాతామహులూ కోర్టు కెక్కారు. రవికిరణ్ ను తమ పోషణలో ఉంచాలని ఇరువురూ కోరారు, కోర్టు మధ్యే మార్గంగా తీర్పు ఇచ్చింది. ఆరునెలలు అమ్మమ్మదగ్గర, మరో ఆరునెలలు నాయనమ్మ దగ్గర ఉండేట్టు తీర్పు ఇచ్చింది కోర్టు. మొదటి ఆరునెలలు నాయనమ్మ వంతు. అక్కడ కుర్రవాడ్ని "రవి"గా పిల్చుకొనేవాళ్ళు. అమ్మమ్మగారి ఇంటిదగ్గర కిరణ్ గా పెరిగాడు. తొమ్మిదేళ్ళు వచ్చేదాకా ప్రతి ఆరునెలల కొకసారి అటూఇటూ తిరుగుతూ ఉండేవాడు. నాయనమ్మ ఇంటి దగ్గర ఉన్నప్పుడు రవికి నూరిపోసేవాళ్ళు----" "ఏమని?" ఆతృతగా మధ్యలోనే అందుకొని అడిగింది మహతి. "రవి తల్లే తమకొడుకు చావుకు కారణమని-----" "కదా(మరి!" మహతి పరశురాం ముఖంలోకి చూసింది. ఆయన వినిపించుకొన్నట్టులేడు. "అలాగే అమ్మమ్మగారి ఇంట్లో తమ కూతుర్ని కిరణ్ తండ్రే చంపివేశాడనీ...." "అయితే అది నిజమేనా?" "ఏది?" "కిరణ్ చెప్పింది తన తల్లిని రవి తండ్రే చంపేశాడని----" సాగర్లో ఆ రాత్రి అతడు చెప్పింది గుర్తుచేసుకొంది మహతి. "మహతీ! అంతత్వరగా నిర్ణయాలకు రాకు. ఇది చాలా జటిలమైనకేసు" "ఏం కేసో కానీ...." ఏదో అనబోయి పరశురాం ముఖంచూసి ఆగిపోయింది మహతి. "ఇలాంటి కేసు ఇంతవరకు నేను వినలేదు, చదవలేదు, చూడలేదు. మానసిక శాస్త్రాధ్యయనంలో ఎన్నో కేసులు చదివాను. భిన్న మనస్తత్వాలున్న కేసులు చాలా ఉన్నాయ్. కాని ఇది చాలా వింతైనకేసు----ఇరుపక్షాల వారూ పసివాడ్ని నిలువునా చీల్చారు. అతని పర్సనాలిటీ రెండు ముక్కలయింది. నాయనమ్మ పసివాడిమనసులో తల్లిమీదద్వేషాన్ని నింపింది. ఆ పసిమనసు ఘర్షణకు గురిఅయింది దాని పర్యవసానమే రవికిరణ్ గా చీలిన వ్యక్తిత్వాలు. తొమ్మిదవఏటనే అతన్ని ఉదకమండలంస్కూల్లో చేర్పించారు. కుర్రాడు అటూ ఇటూ గాకుండా పాడై పోతున్నాడని తాతయ్య లిద్దరూరాజీపడి ఆ పని చేశారు. అతను స్కూలు పనిముగించుకుని వచ్చేసరికి తాతయ్య లిద్దరూఅమ్మమ్మా చనిపోయారు. ఇప్పుడు మిగిలింది నాయనమ్మ ఒక్కతే. ఆవిడ కిప్పుడు కళ్ళు కన్పించవు. అయినా ఆ పాత పాటే పాడుతుంది. తన కొడుకు భార్య కారణంగానే చచ్చిపోయాడంటుంది." "నిజమేనా?" "కావొచ్చు, కాకపోవచ్చు" మహతి పరశురాంముఖంలోకి ఇదేంజవాబన్నట్టుగా చూసింది. పరశురాం తన ధోరణిలో చెప్పుకు పోసాగాడు.
"రాజ్యలక్ష్మి తల్లిదండ్రులు విఠల్ రావు తమ కూతుర్ని చంపాడని నమ్మారు. అతని తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి వల్లనేతమ కొడుకు చనిపోయాడని నమ్మారు. ఆ ఘర్షణ అలా వాళ్ళు చచ్చేంతవరకూ సాగుతూనే ఉంది. మధ్యలో అభం శుభం తెలియనిపసివాడు నలిగిపోయాడు. తొమ్మిదవ ఏటనుంచి అమ్మమ్మలకూ, నాయనమ్మలకూ దూరంగా కొత్త ప్రదేశంలో, నూతన వాతావరణంలో, పెరగడంవల్ల చీలిన ఆ వ్యక్తిత్వాలు సబ్ కాన్ షస్ లో మరుగున పడి ఉన్నాయి. నువు అతని జీవితంలో ప్రవేశించావు. అవి విడివిడిగా బయటపడి నీకోసం పోటీపడ్డాయి". గ్లాసు అడుగున ఉన్న నాలుగు చుక్కలుచప్పరించి" ఆంటీచూడకుండా ఒకే ఒక పెగ్గు" అంటూ ప్రొఫెసర్ గ్లాసు మహతి చేతిలో పెట్టాడు. "ముందీ సంగతి చెప్పండి. ఒకటి కాదు. రెండు పెగ్గులుతెచ్చిస్తా. నాతోపరిచయమయాక ఇలా ఎందుకు జరిగింది?" "అతఃడికి వయసొచ్చింది. నీ ప్రేమలో పడ్డాడు. ఆ కారణంగా..." "నేను నమ్మలేకపోతున్నాను. అదే నిజమయితే అతడు నన్ను రవిగా నో కిరణ్ గానో ప్రేమించవచ్చు. రెండవ వ్యక్తిత్వం పూర్తిగా మరుగున పడిమాసిపోయి ఉండొచ్చుగా?" యా ఆర్ రైట్ బేబీ! ఆబ్ సల్యూట్లీ యూ ఆర్ రైట్ అదే ఆలోచననన్ను పీడిస్తున్నది. నీ ప్రశ్నకు సమాధానం రవో, కిరణో చెప్పాలి. అది అతనిచేత చెప్పించగలిగితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. రెండు వ్యక్తిత్వాలు ఏకం అవడమో లేక ఒకటి అయిపూ ఆనవాలూ లేకుండా పోవడానికో ఆస్కారం వుంది. ప్లీజ్! బేబీ! వన్ మోర్" ప్రొఫెసర్ గ్లాసును ముందుకు జరిపి మహతిని ప్రాధేయపడుతున్నట్టుగా అడిగాడు. మహతి గ్లాసు తీసుకొని లేచింది. తిరిగొచ్చిన ఆమెచేతిలోని గ్లాసు చూస్తూ "రెండు పెగ్గులు ఒక్కసారే" అన్నాడు. "మళ్ళీ మళ్ళీ వెళితే ఆంటీ చూస్తుందేమోనని ఒక్కసారే తెచ్చా" "గుడ్! గుడ్!" ప్రొఫెసర్ మహతి చేతిలోనుంచి గ్లాసు అందుకొన్నాడు. "అంకుల్! రాలేదేం?" "రాలేదు" "వస్తాడని చెప్పారుగా?" "అనే చెప్పాను. బహుశా మీ ఇంటికి వెళ్ళాడేమో? సోడా ఏదీ?" "అయిపోయినై" "ఫ్రిజ్ లో వాటర్ బాటిల్ తెస్తావా" మహతి లేచింది.
బెల్ మ్రోగడం విని మహతి త్రుళ్ళిపడింది. "అంకుల్ అతడొచ్చినట్లున్నాడు" "గుడ్ వెళ్ళి తలుపులుతియ్" "నాకు భయం వేస్తుంది. మీరే వెళ్ళితియ్యండి" "ఓ.కే." ప్రొఫెసర్ లేచి వెళ్ళితలుపు తెరిచాడు. మహతి ఊపిరిబిగబట్టి స్థాణువులా నిలబడిపోయింది. "ఎక్స్యూజ్ మీ సర్! అడ్వకేట్ అల్లం అప్పారావుగారి ఇల్లెక్కడండీ" మెట్లమీద నిలబడి వున్న ఓ లావుపాటి పెద్దమనిషి అడిగాడు. "అప్పారావుగారిల్లా? రండిచూపిస్తా" అని పరశురాం మెట్లుదిగాడు. మహతికి వళ్ళుమండిపోయింది. ఈయనగారికి అప్పుడప్పుడు మైండ్ అబ్ సెంట్ అవుతూ వుంటుంది. పైగా తాగుతున్నాడు. ఆ పెద్దమనిషి ఈ టైంలో వచ్చి అడగడం ఏమిటీ? అడిగాడే పోనీ, ఈయనగారు చూపిస్తానంటూ బయటికివెళ్ళడమేమిటి? అందుకే ఆంటీ తలబాదుకుంటూ వుంటుంది. విస్కీ తీసుకెళ్ళి లోపలపెడితే సరి. ఆయనగారి తిక్క వదిలిపోతుంది. ఆలోచనయితే బాగానే వుంది. కానిగ్లాసు బల్లమీద లేదు. పిచ్చిమాలోకం గ్లాసుతోనే బజారెక్కాడు. మహతి ఒక్క పరుగుతో బయటికివచ్చింది. ఆయనగేటు లోపలే వుండి, బయట వున్న పెద్దమనిషికి చెయ్యిచూపిస్తున్నాడు. ఫర్వాలేదు. అంకుల్ ఇంకా సెన్సస్ లోనే వున్నాడు. మహతి తృప్తిగా నిట్టూర్పు విడిచింది. "థాంక్యూ" అంటూ ఆ పెద్దమనిషివెళ్ళిపోయాడు. "అంకుల్ ఆ కారు?" ఆశ్చర్యంగా కారుకేసి చూస్తూంది మహతి. ప్రొఫెసర్ ఆగి వెనక్కు తిరిగిచూశాడు. గోడ వారగా కారుపార్కు చేసి వుంది. "ఆ కారు అతడిదే అంకుల్" గొంతు తగ్గించి అంది. ఆమె గుండె దడదడ కొట్టుకుంటోంది. "నీ కోసమే వెయిట్ చేస్తున్నట్టున్నాడు వెళ్ళు" "నేనా? ఇప్పుడా? అతడితోనా?" "ప్రేమించిన వాడితో ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళదానికి వెనకాడకూడదు స్త్రీ" "కాని అతడూ...." "అయినా నిన్ను ప్రేమిస్తూనే వున్నాడు" "నాకు ధైర్యం చాలడంలేదు" "మనస్ఫూర్తిగా నువతడ్ని ప్రేమించడం లేదన్నమాట" మహతి మరోమాట మాట్లాడకుండా గేటు తెరుచుకొని చరచర బయటికి నడిచింది. మంత్రించినబొమ్మలా కారు దగ్గరకు వచ్చింది.