Previous Page Next Page 
వసుంధర కధలు-6 పేజి 4


                                      4
    "పిల్లలీరోజింటికి రాలేదు...." అంది జ్యోత్స్న.
    "స్కూల్లో యేమైనా ఫంక్షనుందా ------" అన్నాడు జగదీష్ సోఫాలో వాలిపోతూ , అతడి ముఖంలో యేవిధమైనా ఆత్రుతా లేదు.
    "మధ్యాహ్నం మనింటికి పాండు రంగ  విఠల్ వచ్చాడు" అందామె.
    "వాడెవడు?" అన్నాడు జగదీష్ కుతూహలంగా.
    జ్యోత్స్న అతడికి క్లుప్తంగా జరిగింది చెప్పింది. సుకుమార్ గురించి ఆమె అతడికి చెప్పలేదు.
    జగదీష్ కంగారుగా -- 'అయితే పిల్లలేమయ్యారు?' అన్నాడు.
    జ్యోత్స్న కళ్ళు తుడుచుకుంది.
    "ఇప్పుడే వెడతాను...." అన్నాడు జగదీష్.
    "ఎక్కడికి?"
    "ఎక్కడికో జగదీష్ కి తెలియలేదు. అతడు భర్య వంక ప్రశ్నార్ధకంగా చూస్తుండి పోయాడు.
    " విఠల్ మళ్ళీ వస్తానన్నాడు. అతడోచ్చే దాకా ఎదురు చూడ్డం మినహా మనం చేయగలిగిందేమీ లేదు" అంది జ్యోత్స్న, నిట్టురుస్తూ.
    "కానీ ఏదో చేయాలనుంది నాకు...." అన్నాడతడు ఆవేశంగా.
    "మీరా వేశపడకండి. నిదానంగా ఆలోచించండి. వాళ్ళకేదో కాగితాలు కావాలి. అవిచ్చే దాకా వాళ్ళు మనని వేపుకు తింటారు. అవేమిటో ఇచ్చేయండి...." అందామె.
    జగదీష్ ఆలోచనలో పడుతూ -- "నేను ముఖ్యమా -- నా దేశంముఖ్యమా అన్నది ఆలోచించుకోమంటున్నావా?" అన్నాడు.
    "ఇందులో ఆలోచించడానికేముంది? మనమంతా కలిస్తేనే మన దేశం. మనముంటేనే దేశం...." అంది జ్యోత్స్న.
    "నేను అందరిలాంటి వాణ్ణి కాదు జ్యోత్స్న! నాకోసం చూసుకోకపోతే నేనొక్కడినే పోతాను. నాకోసం చూసుకొంటే నా దేశమే పోతుంది------"
    "అంటే?"
    "దేశభద్రతకు సంబంధించిన రహస్యాలు నా దగరున్నాయి. అవి నేను బయటపెడితే దేశ ద్రోహమవుతుంది...." అన్నాడు జగదీష్.
    'అయితే ఏమంటారు?"
    "ఆ కాగితాలు నేను బయట పెట్టలేను...."
    "మరి వాళ్ళు మనని నాశనం చేస్తే....?'
    "అందుకేదో ఉపాయం చూడాలి...."
    "ఏ ఉపాయమూ ఉండదు. మీరే నన్ను, మన పిల్లల్ని రక్షించాలి...."
    జగదీష్ పిడికిళ్ళు బిగిశాయి----"మన జోలికి వచ్చిన వాళ్ళ అంతు చూస్తాను. నువ్వేమీ భయపడకు...."
    అప్పుడు పక్కింటి తలుపు చప్పుడయింది.
    జ్యోత్స్న తనే వెళ్ళి తలుపు తీసి ఉలిక్కిపడింది.
    ఎదురుగా పాండురంగ  విఠల్!
    "ఇలా వచ్చావా?" అందామె ఆశ్చర్యంగా.
    "సుకుమార్ నా స్నేహితుడులే!' అంటూ ముందుకు వచ్చి --"హలో! మిస్టర్ జగదీష్ . అయాం మిస్టర్ పాండురంగ  విఠల్!" అన్నాడతడు.
    "ఎవర్నువ్వు?" అన్నాడు జగదీష్.
    "నీ పిల్లలు మా దగ్గరున్నారు. మేం తలచుకుంటే ఎవర్నయినా యేమైనా చేయగలం...." అన్నాడు  విఠల్.
    "గ్లాడ్ టూ మీట్యూ...." అన్నాడు జగదీష్ చేతులు సాచి.
    "నమస్కారం!" అన్నాడు  విఠల్ చేయి చాపకుండా.
    జగదీష్ అతడి వంక ఆశ్చర్యంగా చూశాడు. తనతో చేయి కలిపినా వాడు పది పల్టీలు కోట్టల్సిందే! ఆవిషయమతడికి ముందే తెలుసా?"
    'అలా చూడకు....మనం కూర్చుని మాట్లాడుకుందాం. పక్కింట్లో మా మనుషులు నలుగురున్నారు. నలుగురూ మెరికల్లాంటి వాళ్ళు. ఏ క్షణం లోనైనా వాళ్ళిక్కడికి రాగలరు. ఈ యింట్లో ఇప్పుడు నీకు రక్షణ లేదు. నేను మాత్రమే నీకు రక్షణ కల్పించ గలను. బాగా అలోచించుకుని నామాటలకు బడులివ్వు...." అన్నాడు  విఠల్.
    జగదీష్ అతడి వంకే ఆశ్చర్యంగా చూస్తూ కూర్చున్నాడు.  విఠల్అతడి కెదురుగా కూర్చుని -- "పాకిస్తాన్ కు ఎఫ్ -16  బాంబర్ విమానాలు సరఫరా చేసింది  అమెరికా. వాటిని దెబ్బతీయడానికి దేశంలో జడ్ -17 బాంబర్ విమానాలున్నాయి. ఈ విషయం అతి గోప్యంగా ఉన్నప్పటికీ పాకిస్తాన్ తెలుసుకుంది. ఆ విమానాలు పూర్తీ నమూనా నీ దగ్గరుంది. ఈ వ్యవహారం మొత్తం నీ ద్వారా నడుస్తోందని మాకు తెలిసింది. అందుకే నమూనా కాగితాల కోసం నేను నీ దగ్గరకు వచ్చాను అన్నాడు.
    "నువ్వు పాకిస్తాన్ ఏజంటువా ....?" అన్నాడు జగదీష్.
    "నా పేరు  పాండురంగ విఠల్ ....."
    "పేరులో ఏముందిలే...." అన్నాడు జగదీష్.
    "ఆ మాత్రం తెలిసినవాడివి -- దేశం పేరు గురించి అలాగే అనుకుంటే నాకు సాయపడతావు...." అన్నాడు  విఠల్.
    "మరి నువ్వు నీ దేశానికి కెందుకు సాయపడుతున్నావు?"
     విఠల్ నవ్వి --" నేను భారతీయుడ్ని , డబ్బుకోసం రహస్యా నమ్ముతున్నాను. నాకు దేశం పేరుతొ నిమిత్తం లేదు. ఏ దేశమైనా నా కొక్కటే...." అన్నాడు.
    "ఈ రహస్యం కోసం నీకెంత ముడుతుంది?"
    "అవన్నీ నీకనవసరం...." అన్నాడు  విఠల్- "నువ్వు నా కర్జంటూగా ఆ నమూనా కాగితాలివ్వాలి..."
    జగదీష్ నవ్వి ---"నీకు మతిపోయిందా? అమెరికా చేసిన ఎఫ్-16 బాంబర్ విమానాల గురించే మా దేశానికి సరిగ్గా తెలియదు. అవి పాకిస్తాన్ కు చేరినందుకు మా దేశం బెంగ పెట్టుకుంది. అలాంటిది వాటిని దెబ్బ తీయగల  విమానాలు తయారు చేసేటంత టెక్నాలజీ భారత దేశంలో ఉందనుకోవడం నీ భ్రమ......" అన్నాడు.
    "నువ్వు విషయం తప్పు దారి పట్టిస్తున్నావు...." అన్నాడు  విఠల్- "నాకు జెడ్ --17 బాంబర్ విమానాల గురించి తెలిసింది చెప్పనా?"
    జగదీష్ తలాడించాడు.
    అమెరికా దేశం యే ఆయుధాలు తయారు చేసినా వాటిని మరో దేశానికి అమ్మేముందు వాటిని దెబ్బతీయగల ఆయుధాల్ని కూడా సిద్దం చేసుకొంటుంది. అమెరికాయే కాదు- అయుదాలమ్మే ఏ దేశమైనా అంతే ! లేకుంటే తామమ్మిన ఆయుధాలు తమపైనే ప్రయోగించబడవచ్చు.
    పాకిస్తాన్ కు ఎఫ్-16 బాంబర్ విమానాలమ్మడానికి ఒప్పందం కుదురేటప్పటికే - వాటిని దెబ్బ తీయగల జడ్ -17 టెక్నాలజీ అమెరికాలో సిద్దంగా వుంది. అమెరికాలోని భారత గూడచారి సంస్థ ఆ టెక్నాలజీ కి సంబంధించిన నమూనా సంపాదించి భారతదేశానికి చేరవేసింది.
    "అమెరికా నుంచి టెక్నాలజీ చేరవేయడం అంత సులభం కాదు...." అన్నాడు జగదీష్.
    "ఆ విషయం నాకూ తెలుసు. కానీ అక్కడే అమెరికన్ దౌత్యనీతి తెలుస్తుంది. అటు పాకిస్తాన్ కు ఎఫ్ - 16 బాంబర్ విమానాలమ్మి- ఇటు జడ్-17 టెక్నాలజీ లీక్ అవడంలో చూసీ చూడనట్టూరుకోవడం ద్వారా అమెరికా రెండు దేశాలతోనూ సత్ససంబంధాలు నేర్పరచుకోగల్గుతుంది--" అన్నాడు  విఠల్.
    "నువ్వు చెప్పేది చాలా తమాషాగా వుంది. బాంబర్లిచ్చింనందుకు పాకిస్తాన్ సంతోషిస్తుంది కానీ ఇండియా కు గుర్రుగా వుండదా?" అన్నాడు జగదీష్.
    "ఉండదు, ఎందుకంటె?" అని ఆగాడు  విఠల్.
    పాకిస్తాన్ కు అయుదాలమ్మినందుకు ఇండియా పెద్ద గొడవ చేస్తుంది. సంబంధాలు తెంచుకోనెందుకు సిద్దపడుతుంది. ఆ సమయంలో టెక్నాలజీ ఇండియాకు లీకవుతుంది. ఆ విషయం అమెరికాకు తెలిసినా తెలియనట్లు నటిస్తుంది. ఇండియా తమ దేశాన్నే మాత్రం అల్లరి పెట్టినాఆ విషయం పరిశోధించి భారతి గూడచారుల చర్యలను బయట పెట్టగలమని పరోక్షంగా బెదిరిస్తుంది. తమ గూడచారుల కార్యకలాపాలు బయట పడడానికే దేశమూ సుముఖంగా వుండదు. తమకెలాగూ ఇపుడు ఎఫ్- 16 ల భయం లేదు. అందుకని భారతదేశమూ ఊరుకుంటుంది.
    "ఇదీ రాజకీయం...." అన్నాడు  విఠల్.
    "నువ్వు చెబుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా వుంది.నాకిదంతా తెలియదు...." అన్నాడు జగదీష్ అమాయకంగా.
    "నీ అమాయకత్వం నా దగ్గర చూపకు .....నీకన్నీ తెలుసు...."
    "నిజంగా నాకేమీ తెలియదు...."
    "ఏమీ తెలియని అమాయకుడు-- పది లక్షల రూపాయలు ఎరగా చూపిస్తుంటే లొంగకుండా ఉండలేడు" అన్నాడు  విఠల్.
    "పది లక్షలేమిటి?" అంది జ్యోత్స్న ఆశ్చర్యంగా.
    "నీ ఆశ్చర్యంలో నిజాయితీ కనబడుతోంది. నీ భర్త నీకీ విషయం చెప్పలేదన్న మాట....." అన్నాడు  విఠల్.

 Previous Page Next Page