Previous Page Next Page 
వసుంధర కధలు-7 పేజి 3


    ముత్యాల్రావు ఉలిక్కిపడి-"రేపే వచ్చేస్తుందా-అదెలా సాధ్యం-అసంభవం?" అన్నాడు. అతడి కనులముందు నిర్జీవంగా వున్న వేదవతి శరీరం మెదుల్తున్నది.
    "అసంభవమా-ఎందుకని?" అన్నాడు మోహన్.
    ముత్యాల్రావుకు ఏం బదులివ్వాలో తోచలేదు-"ఇంతకీ ఆమె అమలాపురం యెప్పుడు వెళ్ళిందో చెప్పలేదు-..." అన్నాడు.
    మోహన్ చెప్పాడు.
    "అరె-అదెలా సాధ్యం-అసంభవం?" అన్నాడు ముత్యాల్రావు. తనామెను నిర్జీవంగా చూసిన మర్నాడుదయం ఆమె అమలాపురం బయల్దేరి వెళ్ళిందంటే తానెలా నమ్ముతాడు?
    "మీరేమంటున్నారో నాకు అర్ధం కావడంలేదు. నేనే స్వయంగా వెళ్ళి ఆమెను బస్సు ఎక్కించి వచ్చాను-..." అన్నాడు మోహన్.
    "సరే లెండి. వేదవతి రాగనే నాకు కబురు చేస్తారా?" అన్నాడతడు.
    "నేను మీకు కబురు చేయడమెందుకు? రాగానే తనే ఆమె మిమ్మల్ని కలుసుకుంటానని అన్నది...." అన్నాడు మోహన్.
    "ఏమో-అలా జరుగదని నాకు అనిపిస్తున్నది, రేపు మీరు ఏ సమయంలో ఇంట్లో ఉంటారో చెబితే వచ్చి కలుసుకుంటాను...."
    "మీకు అంత శ్రమ ఎందుకు? ఫోన్ చేయండి చాలు....నా నంబరిస్తాను...." అన్నాడు మోహన్.
    అప్పుడే గ్రహించాడు ముత్యాల్రావు-అతనికి ఫోను కూడా ఉన్నదని!
    నెంబరు తీసుకుని ఆ యింటి నుంచి బయటపడినాక ముత్యాల్రావు ఆలోచించసాగాడు. మోహన్ కు ఎలాంటి అలవాట్లున్నాయో తనకు తెలియదు....కానీ...అతడు సొసైటీలో మర్యాదస్థుడని అనిపించుకునే విధంగానే జీవిస్తున్నాడు. అతఃది ముందు తను చాలా విధాలుగా తీసికట్టు. అతడిని కాదని వేదవతి తనను ప్రేమిస్తున్నదంటే అందుకు కారణం ఏమిటి?
    వేదవతి ఏమైంది? ఆమె చావలేదా? మోహన్ తనే ఆమెను స్వయంగా అమలాపురం బస్సుయెక్కించానంటున్నాడు. అది నిజమా?మరి తను చూసిన సంగతి ఏమిటి?
    మోహన్ వేదవతిని చూశానంటున్నాడు. అందుకు అతడు తప్ప వేరే సాక్ష్యం లేదు. వేదవతిని అతడే చంపి రాత్రికి రాత్రి ఆ శవాన్ని మాయంచేసి ఈ విధంగా నాటకమాడుతున్నాడా?    
    మోహన్ ని చూస్తూంటే హత్య చేసినవాడిలా అగుపించడంలేదు. చిద్విలాసంగా, నిర్భయంగా ఉన్నాడు. బహుశా గుండెలు తీసిన బంటు అయుండాలి.
    పైగా రేపే ఆమె అమలాపురం నుంచి వచ్చేస్తుందంటున్నాడు. ఆమె నిజంగా వస్తుందా? ఒక్కరోజు చూస్తే అన్నీ తెలుస్తాయి.
    ఆ ఒక్కరోజూ ఆగడం ఎంతో కష్టమనిపించింది ముత్యాల్రావుకి.
    మర్నాడు సాయంత్రం అతడు మోహన్ కు ఫోన్ చేశాడు.
    "వేదవతి రాలేదండీ-పనులు కాలేదనీ-యింకా రెండ్రోజుల వరకూ రాలేననీ టెలిగ్రాం ఇచ్చింది. కానీ అదిప్పుడే అందింది. మీ ఫోన్ నంబరు చెప్పండి. ఆమె రాగానే ఫోన్ చేసి మీకు తెలియబరుస్తాను...." అన్నాడు మోహన్ ఫోన్లోంచి.
    ముత్యాల్రావు ముఖం చిన్నబోయింది-"నాకు ఫోన్ లేదు. నేనే మిమ్మల్ని కంటాక్టు చేస్తాన్లెండి..." అని ఫోన్ పెట్టేశాడు.
    అతడు తన ఆఫీసు నుంచి చేశాడు ఫోన్ ఈ సమాచారం ఆఫీసుకు చేరడం అతడి కిష్టంలేదు. మోహన్ యెలాంటివాడంటే అతడు వేదవతి గురించిన సమాచార మంతా మరెవరికయినా చెప్పి ముత్యాల్రావుకి అందజేయమనవచ్చు.
    మోహన్ కి ఫోను ఉంది. తనకు లేదు.
    ఆ విషయమలా వుంచితే యిప్పుడు వేదవతి బ్రతికి ఉన్నట్లా, లేనట్లా?
    మోహన్ ఏదో నాటకమాడుతున్నాడు. వేదవతి గురించి తన కేమీ తెలియదనడానికి బదులు-ఆమె యింకా బ్రతికి ఉన్నదన్న భ్రమ తనకు కలిగించాలను కుంటున్నాడు. అతడాశించే ప్రయోజన మేమిటి?
    తను శవం చూసినట్లు అతడికి తెలియదు. తెలిస్తే ఏమవుతుంది?
    మోహన్ హంతకుడు. వేదవతిని హత్య చేశాడు.
    వేదవతి హత్య కాలేదని తన్ను నమ్మించాలని చూస్తున్నాడు మోహన్.
    ఇప్పుడు తనేం చేయాలి?
    హఠాత్తుగా వేదవతి గుర్తొచ్చింది.
    పాపం-వేదవతి తనను మనసారా ప్రేమించింది. తన్ను పెళ్ళి చేసుకుని తనతో హాయిగా జీవించాలని కలలు గన్నది. అందుకోసం మోహన్ వంటి వాణ్ణి కూడా వదులుకోవాలనుకున్నది. పెళ్ళికి ముందే తనకు సర్వస్వం అర్పించాలనుకున్నది.
    ఇప్పుడు వేదవతి జీవించి లేదు. ఆమెను చంపినవాణ్ణి తను బయట పెట్టవద్దూ?    
    ముత్యాల్రావు బాగా ఆలోచించాడు. అతడి బుర్రచురుగ్గా పనిచేసింది.
    తను మోహన్ ని బ్లాక్ మెయిల్ చేస్తే!.....
    వేదవతి చనిపోయిందని తనకు తెలుసు. ఆ చావుకు కారణం హత్య అనీ తెలుసు. హంతకుడు మోహన్ అని ధృవపడుతోంది.
    అలాంటప్పుడు.... ......
    వేదవతి వంటి అమాయకురాలీని చంపినందుకు మోహన్ కు జీవితంలో మనఃస్థిమితం లేకుండా చేయాలి. అందులోనూ వేదవతి తనకు ప్రియురాలు.
    ఆ పైన.....డబ్బు కూడా సంపాదించవచ్చు....
    ముత్యాల్రావు రాత్రి తన ఇంట్లో గదిలో ఒంటరిగా కూర్చుని ఓ ఉత్తరం తయారుచేశాడు.
    "డియర్ మోహన్!
    నువ్వు వేదవతిని చంపిన విషయం నాకు తెలుసు. నీ నేరం బయటపెట్టే ఉద్దేశ్యం నాకు లేదు. పదివేల రూపాయలు ఓ బ్రీఫ్ కేసులో పెట్టి రాత్రి సమయంలో పూర్వం వేదవతి ఉండే యింటి దొడ్లో-విడిగా ఉండే ఎర్ర ఆకుల క్రోటన్సు మొక్కక్రింద పాతిపెట్టు. ఈ రాత్రికే అది జరగాలి.....
                                                                                                నీ
                                                                                          శ్రేయోభిలాషి"
    ఉత్తరం పూర్తిచేసి కవర్లో పెట్టి మోహన్ యింటి అడ్రసుకు పోస్టు చేశాడు ముత్యాల్రావు. అలవాటు లేని పని కావడంవల్ల అతడికి చేతులు వణికాయి. అయితే అలవాటులేని పని అయినప్పటికీ అతడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.
    ఉత్తరం వ్రాసేటప్పుడు చేతికి గ్లవ్స్ తొడుక్కున్నాడు. ఉత్తరం కష్టపడి ఎడమచేతితో వ్రాశాడు. పోస్టు చేసేటప్పుడు కూడా కవరుమీద వ్రేలిముద్రలు పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నాడు. తన మీదకు అనుమానం రాకుండా అది వేరే వీధిలోని పోస్టు డబ్బాలో వేశాడు.
    ఆ ఉత్తరం అందేక మోహన్ ఏం చేస్తాడు? తను చెప్పిన విధంగా వెళ్ళి అక్కడ డబ్బు పాతి పెడతాడా?....
    పాతిపెడితే తను వెళ్ళి ఆ డబ్బు ఎలా తీసుకొనడమో అతడు ముందే ఆలోచించాడు. అంతకు ముందే అతడింకో పథకమూ ఆలోచించాడు. మోహన్ కి తనమీద అనుమానం రాకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్త అది!
    
                                       4

    "అరే-ఫోన్ చేయవచ్చుగా-యింటికే వచ్చారేమిటి? అదీ కాక వేదవతి రావలసిన రోజు రేపు గదా-..." అన్నాడు మోహన్.
    "నేను వేదవతి కోసం రాలేదు. మీ కో కొత్త విశేషం చెప్పడానికి వచ్చాను-" అంటూ ముత్యాల్రావు మోహన్ కో ఉత్తరం చూపించాడు.
    డియర్ ముత్యాల్రావ్!
    నువ్వు వేదవతిని చంపిన విషయం నాకు తెలుసు. నీ నేరం బయటపెట్టే ఉద్దేశ్యం నాకు లేదు. పదివేల రూపాయలు ఓ బ్రీఫ్ కేసులో పెట్టి రాత్రి సమయంలో పూర్వం వేదవతి ఉండే యింటి దొడ్లో-విడిగా ఉండే ఎర్ర ఆకుల క్రోటన్సు మొక్కక్రింద పాతిపెట్టు. ఈ రాత్రికే అది జరగాలి...
                                                                                                 నీ
                                                                                            శ్రేయోభిలాషి"
    మోహన్ ఆ ఉత్తరాన్ని ఆశ్చర్యంగా చదివి-"అంటే వేదవతి బ్రతికి లేదంటారా? అమలాపురం చేరేక ఆమె నెవరయినా చంపేసే రంటారా...?" అన్నాడు.
    "ఏమో-అదేమీ నాకు తెలియదు. కానీ వీడెవరో నన్ను బ్లాక్ మెయిల్ చేస్తాడేమిటీ?" అన్నాడు ముత్యాల్రావు.
    మోహన్ గతుక్కుమని-"అవును....వాడెవరో కానీ యెందుకు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు? మీ గురించిన ఆధారమేధో వాడికి చిక్కి ఉంటుంది. అయినా ఆమె అమలాపురంలో ఉన్నట్లు మీకూ, నాకూ తప్ప యెవ్వరికీ తెలియదు. మీరుగానీ అమలాపురం వెళ్ళారా? అక్కడ ఆవేశంతో ఆమెను.... ..... ...." అని ఆగిపోయాడు.

 Previous Page Next Page