Previous Page Next Page 
ఔనంటే కాదంటా పేజి 3

నిన్న బీచ్ లో తారసపడిన యువకుడు నవ్వుతూ కనిపించాడు.
'లేదు గువ్వలాడుకుంటున్నాను' అనాలనిపించినా, అనకుండా గంభీరంగా తలవూపింది.
"బాబూ..... నిలబడలేకపోతున్నానయ్యా!" అంటున్న ఓ వృద్దుడు అతని పక్కన వున్నాడు.
"అయిపోయింది. మీరు కూర్చోండి మనకి తెలిసిన అమ్మాయి ఇక్కడ వుంది కూడానూ" ఆయనతో చెబుతూ కూర్చోబెట్టి వచ్చాడు అతను.
"చూడండి మిస్.... నా పేరు ఇంద్రనీల్ ఈ ముసలాయన ఫ్రీడం ఫితర్ రెండుమాసాలుగా పెన్షన్ తీసుకోలేకపోయారట. ఆయన కుడిచెయ్యి స్వాధీనంలో లేదు. ఇప్పుడు ఆ రెండు నెలలదీ చూసి ఇప్పిస్తే మేలు చేసిన వారౌతారు" అన్నాడు.
"అందులో మేలేముందీ? ఫార్మ్స్ తెచ్చారా?" అడిగింది శక్తి.
"ఆ... ఆ..." అతను అందించాడు.
శక్తి వాటిని చూసి "సంతకం టాలీ కావడంలేదు" అంది.
ఇంద్రనీల్ గొంతు సవరించుకుని "దేశంకోసం జీవితాన్నీ, ప్రాణాన్నీ త్యాగం చెయ్యడానికి వెనుకాడని ఇలాంటివారికి మనం ఇవ్వవలసిన మన్నన ఎలాగూ ఇవ్వడంలేదు. పైనుంచి వాళ్ళని ఏడాదికోసారి "మేం ఇంకా బతికే వున్నాం" అనో, స్వాతంత్ర్య సమరయోధుల భార్యలైతే "మేం మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు" అనో గెజిటెడ్ ఆఫీసర్ల సంతకాలతో ధ్రువీకరించాలనడం మానవత్వం కాదు. ఆయన కుడిచెయ్యి స్వాధీనంలో లేక ఎడమచేతితో సంతకం పెట్టారు. అందుకే అక్షరాలు అలా ఒంకర టింకరగా వున్నాయి. రూల్స్..... రెగ్యులేషన్స్ పక్కనపెట్టి ఒక్కసారి భారత పౌరురాలిగా ఆలోచించండి" అన్నాడు.
శక్తి ఆలోచించి ఫారాలు తీసుకుంటూ "ఆయన మీకేమౌతారు?" అంది.
"ఇప్ప్దుడే బస్ లో పక్కన కూర్చున్నప్పుడు పరిచయం అయ్యారు" అన్నాడు.
"ఓ..... మార్చేపోయాను మీరు పరోపకారి పాపన్నగారు కదూ!" అంటూ ఆమె నవ్వి డబ్బు లెక్కపెట్టి అందించింది.
ముసలాయన అతనికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుని వెళ్ళిపోయాడు.
మధ్యాహ్నానికల్లా శక్తి మూడ్ లో మార్పు వచ్చింది. లంచ్ టైంలో బయటికి వచ్చి ఓ మూలగా వున్న లంచ్ రూంవైపు వెళుతుండగా "హలో.....మేడమ్..." అంటూ ఇంద్రనీల్ దగ్గరకు వచ్చాడు.
"మీరింకా వెళ్ళలేదా?" అంది.
స్కూటర్ స్టార్ట్ చేసుకుంటున్న ఓ అమ్మాయిని చూపిస్తూ "ఆ అమ్మాయి ఏదో సలహా అడిగితే చెబుతున్నాను. ఇంతకీ మీ పేరు చెప్పనేలేదు" అన్నాడు.
"అపరిచితులకి పేర్లు చెప్పడం, ఎడ్రస్ లూ, ఫోన్ నెంబర్లూ ఇవ్వడం నాకు ఇష్టం వుండదు" అంది శక్తిమతి.
"రెండుసార్లు కలిసాం.... ఇంకా అపరిచితులమేనా?" అడిగాడు.
"నేను మిమ్మల్ని కలవాలని ప్రయత్నించనంతవరకూ అంతే!" అని శక్తి వెళ్ళిపోయింది.
అతనూ వెళ్ళిపోబోతుండగా వాచ్ మన్ పెద్దకర్రతో పరిగెత్తుకొచ్చి "సార్.... ఇటువైపు పెద్ద పామువచ్చి లంచ్ రూమ్ లోకి వెళ్ళడం ఫ్యూన్ చూశాడుట. లోపలి ఎవరైనా వెళ్ళారా?" అని ఆదుర్దాగా అడిగాడు.
ఇంద్రనీల్ జవాబిచ్చేలోగానే లోపల్నుంచి శక్తి "కె....వ్వు...." మన్న కేక వేసింది.
"అయిపోయింది అసలే తాచుపాము కూడానట" అన్నాడు ఫ్యూన్.
ఈలోగా మిగతా స్టాఫ్ అంతా వచ్చి అక్కడ గుమిగూడారు.
"ఇప్పుడేం చెయ్యడం?" ఒకావిడ భయంగా అడిగింది.
"ఈపాటికి కాటేసి వుంటుందా?" ఒకాయన అడిగాడు.
"చూసొచ్చి చెప్తాను" అంటూ ఇంద్రనీల్ రూమ్ తలుపు నెమ్మదిగా తోశాడు.
అది తెరుచుకుంది. శక్తి పాదాలకి రెండు అడుగుల దూరంలో పడగవిప్పి.... కాటెయ్యడానికి సిద్దంగా వున్నట్లు చూస్తోంది తాచుపాము!
తలుపు తెరుచుకున్న శబ్దానికి కళ్ళుమాత్రం త్రిప్పి ఇంద్రనీల్ ని చూసింది శక్తి.
అతను చటుక్కున వంగి పాము పీకదగ్గర పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు. అది అతనిచేతిలో తల అటూయిటూ తిప్పటానికి ప్రయత్నిస్తోంది. దాన్ని తీసుకెళ్ళి ఓ రాయికేసి కొట్టాడు. గాయపడిన దాన్ని కింద వదిలేస్తే వాచ్ మెన్ వచ్చి కర్రతో కొట్టి చంపేశాడు.
అందరూ అతనిచుట్టూ చేరి అభినందిస్తూ అతని ధైర్యాన్ని పొగుడుతున్నారు.
శక్తి కొద్దిగా షాక్ నుంచి తేరుకుని చుట్టుపక్కలవాళ్ళ ప్రశ్నలకి జవాబు లిస్తూనే అతనికోసం వెతికింది.
అతను జనంమధ్య వున్నాడు. అతనికి కృతజ్ఞతలు చెప్పుకోవటానికి అందర్నీ తప్పించుకొని అతనివైపు వెళ్ళింది.
ఆ సంఘటన జరిగిన నాలుగుగంటల తరువాత.... శక్తి ఇంద్రనీల్ ఎదురుగా కూర్చుని వుండగా అతను బెడ్ మీద నీరసంగా పడుకుని ఆమెవైపు చూసి నవ్వాడు.
అదొక ప్రైవేట్ నర్సింగ్ హోమ్!
"ఈ డాక్టర్ నాకు ప్రాణస్నేహితురాలవటంవల్లా మీ ఒంట్లోకి విషం పూర్తిగా ఎక్కకపోవడం వల్లా మీరు బతికారు. ఎందుకంత రిస్క్ తీసుకున్నారు?" కొద్దిగా వణుకుతున్న గొంతుతో అంది శక్తి అతని ముంజేతిమీద పాము కాటు వెయ్యడంతో అక్కడ కొద్దిగా కట్ చేసి, స్టిచెస్ వేయాల్సొచ్చింది.
అతను నవ్వి "అక్కడ మీరు కాకుండా యింకో పుల్లమ్మ వున్నా అలాగే చేసేవాడ్ని" అన్నాడు.
"పుల్లయ్య అయితే?" కొంటెగా అడిగింది.
"అలాగే చేసేవాణ్ణి" అన్నాడు.
ఆమె కళ్ళల్లో అల్లరిస్థానే ఆసక్తి చోటుచేసుకుంది.
"రిస్క్ అంటే సరదానా?" అడిగింది.
"సరదా కాదు ఒకప్పుడు అనవసరంగా వుండేది. పదేళ్ళవయసులో వున్నప్పుడు బన్ రొట్టెకోసం భూమికి ముఫ్ఫై అడుగుల ఎత్తులో తాడుమీద నడిచాను. ఆ చివర్నుంచి ఈ చివరికి నడిస్తే బన్ రొట్టె ఇస్తానని గారడీవాడు ఆశ పెట్టాడు. కడుపులో ఆకలి కరకరమంటోంది. కళ్ళల్లో రొట్టెతప్ప ఇంకేం కనపడటం లేదు. ఏకాగ్రతంతా కాళ్ళల్లోకి తెచ్చుకుని నడిచాను" అన్నాడు.

 Previous Page Next Page