నాలుగు రోజులు గడిచాక అతడికింక ఫరవాలేదనిపించింది. ధైర్యంచేసి, ఆ యింటికి వెళ్ళాడు.
ఆ యింట్లో ఇప్పుడు మనుషులున్నారు. కానీ వేదవతి లేదు.
ముత్యాల్రావు వేదవతి స్నేహితుడని ఆ యింట్లో వారికి తెలుసు. అయితే అతడు చాలా మర్యాదస్థుడనే దురభిప్రాయం కూడా వారికి వున్నది.
"మేము నిన్ననే వచ్చామండి. వేదవతి ఊళ్ళోలేదు. ఇంటికి తాళం పెట్టి ఎదురింటి వాళ్ళకు ఇచ్చి వెళ్ళిందట" అన్నాడు ఇంటి వాళ్ళ చిన్నబ్బాయి ప్రసాద్.
"ఎప్పుడిచ్చిందట?" అన్నాడు ముత్యాల్రావు కుతూహలంగా.
ఆ అబ్బాయి చెప్పాడు.
ముత్యాల్రావు ఆశ్చర్యంగా-"నిజంగా?" అన్నాడు.
ఆ అబ్బాయి అతడివంక ఆశ్చర్యంగా చూస్తూ-"మీరంత ఆశ్చర్యపడ్డారేమిటండీ?" అన్నాడు.
ముత్యాల్రావు ఆశ్చర్యపడకేం చేస్తాడు? తానామెను నిర్జీవంగా చూసిన మర్నాడుదయం ఆమె ఆ పని చేసిందంటే ఎలా నమ్మగలడు?
"నువ్వు నాకో ఉపకారం చేయాలి. మీ ఎదురింటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి తాళంచెవి వాళ్ళకు వేదవతి స్వయంగా ఇచ్చిందో, యెవరిచేతనైనా పంపించిందో కనుక్కుని వచ్చి నాకు చెప్పాలి-" అన్నాడు ముత్యాల్రావు.
"ఎందుకండీ?" అన్నాడా కుర్రాడు.
"తర్వాత చెబుతాను...." అన్నాడు ముత్యాల్రావు.
రెండు నిమిషాల్లో ప్రసాద్ తిరిగివచ్చి-"మీరెలా ఊహించారో గానీ వాళ్ళింట్లో తాళంచెవి ఇచ్చింది వేదవతి కాదుట. యెవరో యువకుడట. సన్నంగా, పొడవుగా వున్నాడట. చిన్న గెడ్డం కూడా వుందట.." అన్నాడు.
"చాలా థాంక్స్!" అన్నాడు ముత్యాల్రావు అక్కన్నించి కదులుతూ.
సన్నగా, పొడవుగా వుండి చిన్న గెడ్డం వుండే ఆ యువకుడెవరో ముత్యాల్రావూహించగలిగాడు. అతడి పేరు మోహన్. వేదవతిని ఇంకో స్నేహితుడు. వేదవతి పెళ్ళి గురించి తనను బలవంత పెడుతున్నట్లే అతడు వేదవతిని పెళ్ళి గురించి బలవంత పెడుతున్నాడు. అయితే వేదవతి ముత్యాల్రావునే ప్రేమిస్తున్నానంటున్నది.
మోహన్ కారణంగా కూడా ముత్యాల్రావుకు వేదవతి సచ్చీలతపై నమ్మకం పోయింది. వాళ్ళిద్దరూ చనువుగా తిరగడం చాలాసార్లు చూశాడతను. వేదవతిని నిలదీసి అడిగితే-"అతడు చాలా మంచి స్నేహితుడు-" అని ఊరుకున్నది.
"మంచి స్నేహితుడు ప్రేమికుడు కాలేడా?" అన్నాడు ముత్యాల్రావు.
"నా ఆలోచనల్లో నువ్వుండగా మరే మగవాడూ నాకు ప్రేమికుడు కాలేడు-" అంది వేదవతి.
"అలాంటప్పుడు అతడితో యెందుకు తిరుగుతావ్? నలుగురూ అపార్ధం చేసుకునే అవకాశముంది-" అన్నాడు ముత్యాల్రావు.
"ఏం చేసేది? ఓసారి ఓ ఇరుకు సందులో నలుగురు రౌడీలు నన్నల్లరి పెట్టబోయారు. ఈ మోహన్ నన్ను రక్షించాడు."
"అది చాలా పాత ట్రిక్కు...."
"పాతదో, కొత్తదో నాకు అనవసరం. ఆ యిరుకు సందులో అతడు నన్నేం చేసినా నాకూ దిక్కుఎదు. అతడు నన్ను ఆడదానిగా వాంచించడం లేదు. భార్యను చేసుకోవాలనుకుంటున్నాడు. అలాంటి వాడు మంచి స్నేహితుడు కాడా?" అంది వేదవతి.
"నిన్ను భార్యను చేసుకోవాలనుకునేవాడు స్నేహితుడెలాగౌతాడు?"
"నేనలా అనుకోవడం లేదు కాబట్టి! అతడు నా మాటలను మన్నించే రకం కాబట్టి!"
"అతడు నువ్వు చెప్పినట్లే వినేపక్షంలో అతడినే పెళ్ళి చేసుకొనవచ్చు గదా!"
"ముందే చెప్పాను. ఆడది జీవితంలో ఒక్కసారే ప్రేమిస్తుంది. నేను ప్రేమించడం అప్పుడే అయిపోయింది-" అంది వేదవతి.
"మోహన్ కు లేని-నాలోవున్న ఆ విశిష్టత ఏమిటి?"
"మోహన్ మనిషి మంచివాడే....కానీ అన్ని దురలవాట్లూ ఉన్నాయి. తాగుతాడు, వ్యభిచరిస్తాడు. నా భర్త అతడిలాకాక నీకులా ఉండాలన్నది నా సహజ మైన కోరిక..."
"అన్ని దురలవాట్లున్న వాడిని నువ్వు స్నేహితుడిగా మాత్రం ఎలా భరిస్తున్నావ్?" అన్నాడు ముత్యాల్రావు.
వేదవతి నవ్వింది-"కొందరు పైకి ఎంతో పెద్ద మనుషుల్లా కనబడుతుంటారు. వాళ్ళకు దురలవాట్లుండక పోవచ్చు. కానీ ఏ మాత్రం అవకాశం వచ్చినా ఆడదాన్ని మోసం చేయాలనే చూస్తూంటారు. అలాంటి వారే ప్రమాదకరమైన స్నేహితులు. మోహన్ దురలవాట్లకు బానిస కావచ్చు. కానీ అతడు మనసున్న మనిషి. నాపట్ల అతడెంతో మర్యాదగా వ్యవహరిస్తాడు. నన్ను తాకడానికి కూడా నా అనుమతి కావాలి అతడికి. అతడి తీరు చూస్తూంటే నాకెంతో ఆశ్చర్యంగా వుంటుంది. అన్నింటికీ మించి అతడిలో నిజాయితీ వున్నది. తన దురలవాట్ల గురించి అతడే నాకు చెప్పుకున్నాడు. లేకుంటే నాకు అతడి గురించి తెలిసేది కాదు. అన్ని విధాలా మంచివాడైన ఆ స్నేహితుడు నన్ను ప్రేమిస్తున్నానంటే అతడి బారినుంచి తప్పించుకొనడం కోసం త్వరగా నిన్ను వెతుక్కున్నాను. నువ్వు నాకు దొరకడం నా అదృష్టం-"
ముత్యాల్రావుకీ మాటలు విన్నాక చాలా అనుమానాలు వచ్చాయి. తన్ను తాకడానికి కూడా అనుమతి కావాలంది. మోహన్ కెప్పుడయినా అయే అలాంటి అనుమతి ఇచ్సిందా? మోహన్' బారినుండి తప్పించుకొనడంకోసం తనను వెతుక్కున్నానంటున్నది. మోహన్ ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా? చేస్తున్నాడంటే ఎందుకు? ఆమె ఏదైనా తప్పు చేసిందా? ఆ తప్పు శీలానికి సంబంధించిందా? తనామెకు దొరకడం అదృష్టంగా భావిస్తోంది. తనకోసం ఏమైనా చేస్తుందా?
మర్యాదగా కనబడుతూ ఆడదానికి ద్రోహం తలపెట్టేవారి గురించి ఆమె మాట్లాడిందన్న విషయం మాత్రం అతడి ఆలోచనల్లోకి రాలేదు.
ఆ మోహన్ కి అన్ని దురలవాట్లూ ఉన్నాయి. పెళ్ళికోసం ఆమె వెంటబడుతున్నాడు. అయితే ఆమె నిరాకరించింది. నిన్న తను పూర్తిగా ముత్యాల్రావుకు వశమైపోతున్నానని ఆమె మోహన్ కు చెప్పిందా? అప్పుడు మోహన్ ఆమెను...
ముత్యాల్రావు ఓసారి మోహన్ ను కలుసుకుని మాట్లాడాలనుకున్నాడు.
3
"నమస్కారమండీ-మీరు మా యింటికి వస్తారని ఎప్పుడూ అనుకోలేదు-" అన్నాడు మోహన్ ముత్యాల్రావును సాదరంగా ఆహ్వానిస్తూ.
ఆ యిల్లు చూస్తూ ముత్యాల్రావు చాలా ఆశ్చర్యపోయాడు.
మోహన్ తాననుకున్నంత చౌకబారు మనిషికాడు.
నలుగు గదుల ఇల్లు అది. డ్రాయింగ్ రూంలో కార్పెట్ పరిచి వుంది. గదిలో స్టీరియో సెట్టు, టెలివిజన్ ఉన్నాయి. ఆ ఊళ్ళో టెలివిజన్ రాదు. కానీ బూస్టర్ పెడితే అప్పుడప్పుడు మద్రాసు వస్తుందట. గది అలంకరణ కూడా ఉన్నతాభిరుచులతో ఉంది.
ముత్యాల్రావు ఇబ్బందిగా సోఫాలో కూర్చుని-"వేదవతి గురించి తెలుసుకుందామని వచ్చాను-" అన్నాడు.
"వేదవతి ఊళ్ళో లేదుగా-ఊరు వెడుతున్నట్లు మీకు చెప్పలేదా?" అన్నాడు మోహన్ ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ.
"నాకు చెప్పలేదు. ఏ ఊరు వెళ్ళిందో యెప్పుడు వెళ్ళిందో చెబుతారా? ఆమెను నేను అర్జంటుగా కలుసుకుని మాట్లాడాలి-" అన్నాడు ముత్యాల్రావు.
"వెళ్ళింది అమలాపురం. మీరు వెళ్ళి కలుసుకోవడం అవసరం. రేపు తిరిగి వచ్చేస్తుంది-" అన్నాడు మోహన్.