Next Page 
వసుంధర కధలు-8 పేజి 1

                                 


                               గుడిసె భోజనం
                                                                         వసుంధర

                                       

    హత్య చేస్తే నేరమవుతుంది. కానీ చేయిస్తే నేరం కాదు.
    చిన్నప్పట్నించి ఈ సిద్దాంతం నాకు బాగా వంట బట్టింది. అమ్మ డబ్బాలో దాచిన లడ్లు తినాలని నాకుంటే తమ్ముడిని చేరదీసి దువ్వి ప్రోత్సహించేవాడిని. పట్టుబడితే తిట్లు వాడికి లేకపోతే ఇద్దరికీ సమంగా లడ్లు. అలా కొంతకాలం గడిచేసరికి తమ్ముడు నా ప్రోత్సాహం అవసరం లేకుండానే అలాంటి పనులను పాల్పడేవాడు, అన్నయ్యా -- చెగోడీలు తెస్తాను -- కలిసి తిందామా అనడిగేవాడు. నన్ను వాడు కేవలం మోరల్ సపోర్టుకు ఉపయోగించుకునేవాడు.
    ఇంట్లో ఇలాంటి చిన్న పిల్లల్లాగే సమాజంలోనూ కొందరు ప్రొఫెషనల్ నేరస్తులుంటారు. ఇతరుల నేరాలు వాళ్ళు చేసి పెడుతుంటారు. వారికి మోరల్ సపోర్టు పెద్దమనుషులనిపించుకునే కొందరు ఇస్తుంటారు. ఈ పెద్ద మనుషుల కారణంగా వాళ్ళు నేరస్తులై - కొంత కాలమయ్యాక తమకు తామే వారినీ వీరినీ అడిగి మరీ నేరాలు చేసే స్థితికి వస్తారు.
    నేనిప్పుడు అలాంటి మనిషి కోసం చూస్తున్నాను. అతడు కేవలం నేరస్తుడైతే సరిపోడు. హంతకుడు కావాలి. లక్ష్మణరావును హత్య చేయాలి.
    లక్ష్మణరావు అసలు స్వరూపం తెలియక నేను అతడితో కలిసి వ్యాపారం ప్రారంభించాను. ఏడాదిలో లక్ష రూపాయల నష్టం వచ్చింది. ఆ నష్టాన్నే చెరో యాభై వేలూ పంచుకుని వ్యాపారానికి గుడ్ బై కొట్టాం. ఆ ఋణభారం నుంచి నేనెలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుండగానే లక్ష్మణరావు భారీ ఎత్తున కొత్త వ్యాపారం ప్రారంభించాడు. పాతవ్యాపారంలో అయిదారు లక్షల దాకా రాగా దాంతో కొత్త వ్యాపారం ప్రారంభించాడని జనం చెప్పుకోగా విని నే నతడిని  కలిశాను.
    అతడు నవ్వి మర్యాదగానే పలకరించి మాట్లాడాడు. పాత వ్యాపారం గురించి మాటలు రాగానే "అదంతా ఒక పీడకల. నువ్వు వ్యాపారానికి బొత్తిగా పనికిరావు. నీ మూలంగానే లక్ష రూపాయల నష్టం వచ్చింది" అన్నాడు.
    అతను నాకేవిధమైన సాయమూ చేయనని కూడా చెప్పాడు. నేను దెబ్బలాడితే తను వెటకారంగా మాట్లాడాడు. నేను తిట్లు లంకించుకుంటే తన పనివాణ్ణి పిలిపించి ఇంట్లోంచి గెంటివేశాడు.
    అసలైన ద్వేషం అతడి పైన అప్పుడు పుట్టింది నాకు. కానీ అప్పటికీ నేను అశక్తుడిని.
    ముందు నాకున్న ఆస్తి పాస్తులన్నీ అమ్మీ ఋణ విముక్తుడినై బికారిలా వీధిలో నిలబడ్డాను. ఆ తర్వాత ఓ నాలుగు నెలలు నడి బజార్లో పకోడీలు అమ్మాను. అ లాభంతో ఓ బండి కొని పంచదార తినుబండారాలు దుకాణం పెట్టాను. ఏడాదిలో వచ్చిన లాభంలో ఓ రిక్షా కొని అద్దె కివ్వడం మొదలుపెట్టాను. నా వ్యాపారం పలుకుతోంది. అదృష్టం బాగుంది. ఉన్న ఒక్క రిక్షానూ బ్యాంకుకు చూపించి ఋణం తీసుకుని మరికొన్ని రిక్షాలు కొన్నాను. తినుబండారాలమ్మడానికి ఓ మనిషిని పెట్టి నేను ఓ కిళ్ళీ కొట్టు పెట్టాను.
    అయిదు సంవత్సరాలు తిరిగేసరికి నా కార్యదీక్ష ఫలించింది. లక్షాధికారినయ్యాను. అంతమాత్రాన ప్రయోజనమేమిటి? లక్ష్మణరావును చంపాలి. అదీ నా కోరిక.
    లక్ష్మణరావు కో చెల్లెలుంది. ఆమె పేరు రమ. తన అన్న నన్ను మోసం చేశాడని ఆమెకు నాపై జాలి వుంది. నేనామె జాలిని క్రమంగా ప్రేమగా మార్చగలిగాను. లక్ష్మణరావుకు చెల్లెలంటే ఇష్టం. అందుకని తన ఆస్తిలో ఆమెకూ వాటా యిచ్చాడు. కానీ తన కంఠంలో ప్రాణముండగా ఆ త్రాష్టుడితో నీ వివాహం జరుగదు -- అని చెల్లెల్ని హెచ్చరించాడు . ఆ త్రాష్టుడిని నేనే!
    నాతొ వివాహం జరిగితే రమకు చిల్లిగవ్వ కూడా రాదు లక్ష్మణరావు నుంచి.
    స్వయం కృషితో నేను పైకి రావడంతో రమ నన్ను అరాధించసాగింది. ఆమె కిప్పుడు ఇరవై రెండేళ్ళు. నేను వ్యాపారంలో పైకి రాకుండా ఉండడం కోసం లక్ష్మణరావు కూడా చాలా ప్రయత్నాలు చేశాడు. వాటిలో కొన్ని నాకు ముందుగానే రమవల్ల తెలియడం వల్ల తట్టుకోగలిగాను . కొన్ని అదృష్టం వల్ల తట్టుకోగలిగాను.
    నేనిప్పుడు లక్షాధికారినే కావచ్చు. కానీ నా అంతస్తు ఇప్పటికీ లక్ష్మణరావు కంటే తక్కువే!
    లక్ష్మణరావు రమకు సంబంధాలు చూస్తున్నాడు. రమ ఈ విషయం నాకు చెప్పింది.
    ఇంక నేను త్వరపడాలి. నాకో కిరాయి హంతకుడు కావాలి?
    ఈ సందర్భంలో నాకు ప్రదీప్ గురించి తెలిసింది.
    ప్రదీప్ తెల్లగా, పుష్టిగా , ఆరోగ్యంగా ఉంటాడు. తెల్లటి బట్టలు వేసుకుని అయ్యేయస్సాఫీసర్లా వుంటాడు. అతడికో ఆఫీసు కూడా ఉంది. అతనో కిరాయి హంతకుడంటే ఎవరూ నమ్మరు.
    అయితే ప్రదీప్ పేరు పోలీసుల లిస్టులో ఉంది. అది చిల్లర నేరాల మీద. చాలాసార్లు జైలుకు వెళ్ళి వచ్చాడు. రెండు సార్లు హత్యనేరాల మీద అరెస్టయి సరైన సాక్ష్యాలు దొరక్క చివర్లో వదిలిపెట్టబడ్డాడు. సరైన సాక్ష్యాలు ఉన్నవనీ- చివర్లో పెద్దలు కలుగజేసుకుని వాటిని మాఫ్ చేశారని చాలామంది అంటారు.
    నేను ప్రదీప్ ని కలిశాను. అతన్నే కలవడానికి మరో ముఖ్యకారణం, ఉళ్ళోని నేరస్తుల వర్గంలో అతడు లక్ష్మణరావు వర్గానికి చెందడు.
    ప్రదీప్ నా కోరిక విన్నాడు. నవ్వాడు, "పాతికవేలవుతుంది" అన్నాడు.
    "దటీజ్ టూ మచ్" అన్నాను.
    "సరే - అయితే నా మాట సరిగ్గా విను. పెద్ద హోటల్లో పది రూపాయల భోజనం గుడిసెలో రూపాయి కే దొరుకుతుంది. నాకు  రెండు రకాలూ వచ్చు. గుడిసె భోజనం చేశావనుకో, ఆతర్వాత నీ ఆరోగ్యం చెడి మందులకు ఓ వంద రూపాయలు ఖర్చు కావచ్చు. అంచేత బాగా ఆలోచించుకుని చెప్పు. లక్ష్మణరావు ని నేను పాతికవేలకీ చంపగలను. అయిదు వేలకీ చంపగలను ...." అన్నాడు ప్రదీప్.
    "నేను అయిదు వేలే ఇస్తాను' అన్నాను.
    "పాతికవేలు ఇచ్చే మాటైతే నేను నిన్నేమీ వివరాలాడగను. వెళ్ళి అతణ్ణి చంపి రావడమే. అయిదు వేలే యిచ్చే మాటైతే నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. లక్ష్మణరావు ను చంపాలను కోవడంలో న్యాయముందని నాకు అనిపిస్తేనే ఈ పనికి పూనుకుంటాను" అన్నాడు ప్రదీప్.
    నేనో క్షణం ఆలోచించాను. దీనికీ దానికీ ఇరవై వేలు తేడా! అది తక్కువేం కాదు, ముందు అతగాడి ప్రశ్నలకు జవాబిచ్చి - అంతగా ఒప్పుకోకపోతే అప్పుడే చూడొచ్చు.
    ప్రదీప్ ప్రశ్నలడిగితే నేను జవాబులు చెప్పాను. అంతా విని "వెరీ గుడ్! నువ్వు లక్ష్మణరావు ను చంపాలనుకోవడం లో న్యాయముంది. అయిదు వేలూ ముందిస్తేనే హత్య జరుగుతుంది" అన్నాడు ప్రదీప్. అతడికి నేను వెంటనే డబ్బు ఇచ్చేశాను.
    
                                      2
    ఆ తర్వాత సరిగ్గా నాలుగు రోజులకు లక్ష్మణరావు హత్య గావించబడ్డాడు. హత్య డబ్బు కోసం జరిగిందనడానికి ఋజువులు దొరికాయి. కానీ డబ్బేమీ పోలేదు.
    నేను రమను కలుసుకుని ఒదార్చాను.
    "ఇప్పుడు మన పెళ్ళికి అడ్డంకులేమీ లేవు. కానీ అన్నయ్యను చంపిన హంతకుడు పద్దుబడేదాకా నాకు మనశ్శాంతి వుండదు. వాడు ఉరి కంబం మెక్కగా చూడాలని ఉంది" అంది రమ.
    నేను తడబడి "అలాగే ఆశిద్దాం" అన్నాను.
    'ఆశించడం కాదు . నీ సామర్ధ్యం మీద నాకు నమ్మకముంది. నువ్వే ఆ హంతకుణ్ణి పట్టుకోవాలి" అంది రమ.
    రమ మాటలను బట్టి ఆమెకు ఆ హంతకుడి మీద పీకెలదాకా ద్వేషం ఉన్నదని గ్రహించాను. అది నాకు మంచిది కాదు. నెమ్మదిగా ఆమె మనసు మార్చాలి.
    ఓవారం పది రోజులు గడిచాక రమ నన్ను అడిగింది. హంతకుణ్ణి పట్టేటందుకు నేను యెటువంటి ప్రయత్నాలు చేస్తున్నానని.
    అప్పుడు నేను నెమ్మదిగా లక్ష్మణరావు నాకు చేసిన అన్యాయాలన్నీ వివరించి చెప్పి "నిజానికి నా స్థానంలో మరోకడుంటే మీ అన్నయ్యని తనే హత్య చేసి వుండేవాడు. నాది శాంతిపధం" అన్నాను.
    "ఇలా ఎందుకు చెబుతున్నావ్? మా అన్నయ్య హత్య కావించబడడం నీకు సంతోషంతో వుందా? ఆ హంతకుణ్ణి నువ్వు అభినందిస్తున్నావా?" అనడిగింది రమ.
    'అబ్బే -- అదేం కాదు. హంతకుల్ని నేనెప్పుడూ సమర్ధించలేను. ఎటొచ్చీ మీ అన్నయ్య బుద్దులు మంచివి కావు. అతను నాకులా ఇంకా ఎంతమందిని మోసం చేశాడో తెలుసుకుంటే -- వాళ్ళలో హంతకుడెవరో తెలుసుకునేందుకు ప్రయత్నించవచ్చు. అది నాకంటే నీకే సులభం" అన్నాను.
    ఇలా చెప్పడంలో నా ఆలోచన వేరు. రమ లక్ష్మణరావు జీవితం గురించి మరికాస్త లోతుగా తెలుసుకున్నదంటే ఆమెకూ అతడి మీద రోత పుట్టవచ్చు. కానీ అన్నా చెల్లెళ్ళ ఆత్మీయతను నేను తప్పు అంచనా వేశాను.
    మరో పది రోజుల తర్వాత రమ నాకు పదిహేను పేర్లు చెప్పి వాళ్ళ వివరాలిచ్చింది. లక్ష్మణరావు వాళ్ళకు చేసిన అన్యాయాలు సామాన్యమైనవి కావు. కానీ రమ వాటి గురించి ఆలోచించడం లేదు. వాళ్ళలో హంతకుడుంటే పట్టుకోమని నాకు మరీ మరీ చెబుతోంది.
    రమ తన పట్టుదల వదలదని నాకు అర్ధమయింది. నేనే హంతకుడని తెలిస్తే ఆమె నన్ను పెళ్ళి చేసుకుందుక్కూడా ఒప్పుకోదని నేను గ్రహించాను.

Next Page