Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 39

                                 


                                         ప్రణయిని

                

    మానవ జీవిత మ్మొక అమాయికమైన గులాబి; దీని నే
    దానవహస్త మే క్షణము దాకి పుటుక్కున ద్రుంపివైచునో
    గానము - గాన, నీ యమరగాన సుధామధుపాత్ర మిమ్ము చం
    ద్రానన! మందహాస మధురాధర మించుక సంచలింపగన్.

    లేలెమ్మో సుషమా సువర్ణమయి! లేలే! సుప్రభాతోదయ
    శ్రీ లల్లల్లన దిక్కులందు ప్రసరించెన్; మందమందానిలం
    బాలోలాలకమైన నీ మొగము ముద్దాడెన్; పికస్వామి రా
    గాలాపంబులు సాగె మంజుల వసంతారామ కుంజమ్ములన్.

    నిద్దుర మేలుకొమ్ము తరుణీ! అరుణారుణ రాగమాలికల్
    దిద్దుచునుండె బాలరవి దీప్తులు నీ నునుజెక్కుదోయిపై;
    ముద్దులు మూటగట్టెను ప్రముగ్ధపయోరుహపత్రనేత్ర! నీ
    నిద్దపు నీలిముంగురులు నెన్నుదుటన్ నటనమ్మొనర్చుచున్.

    వలపుల బావిలో మునుకవైచెను జీవిత మాధురీ సుధా
    కలశము; పైకి చేదుకొనగావలె చంచల కాలచక్రపుం
    గిలకల మీదుగా; ప్రియసఖీ! క్షణమాత్రవిలంబమైన లో
    పల మధు వింకునో! పడునొ పాత్రము! సూత్రము చేయిజారునో!     

    పూల విధాన రాలి పడిపోదుము మేదినిమీద నెప్పుడో
    కాలవశాన; వాడి వరుగై తరుగై మరుగైన రూపుతూ
    ధూళిగ మారిపోదుము; మధూళి నొసంగుము; నిత్య మృత్యు నృ
    త్యాలయ మీ జగత్తు; తెరవా! తెర వాలకముందె మేలుకో!
    
    చిందులు వేసె నీ నగవుచిందు కపోలములందు ప్రత్యుష
    స్సుందర సుప్రభాత మధుశోభ లివే; మకరంద బిందువుల్
    విందులు చేసె తేంట్ల కరవిందము; నీ సువిశాల ఫాల మం
    దందము లారబోసె మలయానిలముల్; కనులెత్తు మో చెలీ!

    సూత్రనిబద్ధమైనటుల సూర్యుని చుట్టి భ్రమించు ధాత్రి; ఈ
    రాత్రి గతించినన్ మరలిరాదు చెలీ! తెలవారు నంతలో
    యాత్రికు లేగుదెంతురు; ప్రయాణము తప్పదు దూరభూమికిన్;
    పాత్రము నింపుమా! తడ వొనర్పకుమా! సుమనోమనోరమా!

    కాలము నిల్వబోదు క్షణకాలము; మృత్యువు చేతిలోని కూ
    జాలము; నిల్వజాలని నిజాలము; ఎప్పటి కేమొ చెప్పగా
    జాలము; గాన ఎందు కిక జాలము? బాలకురంగనేత్ర! నీ    
    వాలుగనుల్ తళుక్కుమన వంచుము శీధువు పానపాత్రలో!
    
    "నిన్న" గతించి పోయినది నెచ్చెలి! మచ్చునకైన లేక; "రే"
    పన్నది యెట్టులుండునొ రవంత యెరుంగము; "నేడు" వచ్చి ని
    ల్చున్నది యింటి ముంగిట; ఒక్కొక్క క్షణ మ్మొక చైత్రరాత్రిగా
    అన్నులమిన్న! నీ సుమధురాధర శీధువనుగ్రహింపుమా!
    
    రోజాపువ్వులు పిల్చెడిన్ మనల కారుణ్యంబు తారుణ్యమున్
    తాజా సౌరభముల్ వెలార్చుచు, మనస్తాపంబు చల్లార్చుచున్;
    పూజాపుష్పము లట్లు వాడి పడిపోవున్ మేను; లందింపు మా
    కూజాలోపలి గోస్తనీరసము తళ్కుల్ గుల్కు కెంగేలితో!

              

    "ఒక్కొక్కరోజు తక్కువగుచున్నది మీ బ్రతుకం చెరుంగలే
    రొక్కొరొకో! యిదేటి కునుకో" యని వెచ్చని హెచ్చరింపుగా
    "కొక్కొరొకో" యటం చదిగొ కూయుచునున్నది కోడి పాకపై
    కెక్కి; లతాంగి! మేలుకొనవే! కొనవే మధుపూర్ణపాత్రమున్!

    చెలువరొ! లెమ్ము! సౌరభముచిమ్ము నవాసవ మీయ రమ్ము నీ
    కలువకరమ్ముతో; శ్రవణకర్కశ మృత్యుగళంబు నిన్ ననున్
    బిలువకముందె; దుర్విధి దభీలున తల్పులు దట్టి చెంగటన్
    నిలువకముందె; ముందు గమనింపుము! నింపుము పానపాత్రమున్!

    కాయము రోగసంచయ నికాయము; సంపదసొంపు బుద్బుద
    ప్రాయము; జీవితమ్ము నిరపాయము కాదనినారు పెద్ద; లో
    ప్రేయసి! వేగ రమ్ము! మురిపించి, మెయిన్ మరపించి, యిమ్ము పా
    నీయము యుష్మదీయ రమణీయ సుధామధురాధరీయమున్!

    ఏడ్చుచు పుట్టినా రెపుడొ! యేడ్చుచు పోదురు రేపు! సాటివా
    రేడ్చుదు రీర్ష్యతోడ; పెడయేడ్పుల సంత, జగ మ్మిదంత; ఇ
    ట్లేడ్చుచు మొండి బండబ్రతు కీడ్చుట మంచిదొ! గోస్తనీ రస
    మ్మోడ్చుక త్రావి కన్ను లరమోడ్చుట మంచిదొ నిశ్చయింపుమా!

    అధరముపై రసార్ద్ర దరహాసము చిందులిడన్, బుజమ్ముపై
    మధుకలశంబు దాల్చిన సుమధ్యను గంటిని పానశాల స
    న్నిధి; "ఇదియేమి"టంటిని; కనీ కననట్లు కనెన్; "మనోజ్ఞ మీ
    మధుర రసంబు నీ వ్యథలు మాన్పగజాలు మహౌషధం" బనెన్.

    "శుభ" మని గజ్జె కట్టి సురసుందరి దోసెడు మల్లెపువ్వులన్
    "నభ"మను నాట్యమందిరమునన్ విరజిమ్మెను; రమ్ము చూతమీ
    యభినవ తారహార సముదంచిత శారదచంద్రచంద్రికా
    విభవ, ముదాత్త సౌమనస వీథుల శీధురసంబు నానుచున్.

    రసమయివై, సదా హృదయరంజనివై, యనురాగపూర్ణవై,
    కుసుమితవల్లివై, మధుర కోమల హాస విలాస రేఖవై,
    అసదృశ సుప్రసన్నముఖివై, సఖివై, మురిపించు నిన్ను కై
    వస మొనరించుకొంటి భగవంతుని చెంతకు చేరు కోర్కెతో.

    దయ గల దేవదేవుడు గదా కరుణించెను నాకు "శ్రీ శుభో
    దయ" వగు నిన్ను; "సుందర సుధా మధురాధర గోస్తనీరస
    ప్రియ" వగు నిన్ను; "శాంతిసముపేత సముజ్జ్వల సాహితీ సమా
    శ్రయ" వగు నిన్ను; నా వలపుజంటగ! నా తొలినోము పంటగా

    నీసు కుమార భావ సరణిన్ కవితాపథ మందుకొంటి; నే
    నీ సుషమావిశేష ధరణిన్ రసరాజ్యము నేలుకొంటి; నీ
    హాసవిలాస విభ్రమములందున విశ్వవిపంచి వింటి; నీ
    ఆసవపాత్రమందు పరమాత్ముని గంటి; కళాస్వరూపిణీ!

    గబగబ లేచిరమ్ము చెలి! కమ్మని ఆసవమిమ్ము! గుండియల్
    గుబగుబలాడుచుండె; విధి క్రూరము; చంచల జీవనుల్ జనుల్;    
    దబదబ నెత్తిపై చరచి దారుణమృత్యువు లాగ; దీనులై
    లబలబ మొత్తుకొందు;రబలా! ప్రబలంబులు కాలపాశముల్!

 Previous Page Next Page