భీముఁడు
ఏమీ యిప్పటికైన ముందడుగు లేనేలేద! నేపథ్య మి
థ్యా మీమాంసల కంతు గల్గద! గదాదండంబు దుర్యోధన
ప్రేమాలింగాన మెప్పుడెప్పుడని సంప్రీతిన్ కురుక్షేత్ర సం
గ్రామక్షోణికి పర్వులెత్తెడి భుజాస్కంధమ్ము లంఘించుచున్!
శ్రీకృష్ణుఁడు
ఆశాస్యమ్ములు దీరు చెల్లి! సహదేవా మెచ్సితిన్! భీమసే
నా శాంతింపుము! సత్యమోయి నకులా! అట్లే కిరీటి! రణా
వేశుల్ సోదరు లాగఁబో రిక దయాబ్దీ! ధర్మరాజేంద్ర! మా
కాశీర్వాదము లిమ్ము లెమ్ము, కొనుమయ్యా! కేల కోదండమున్!
నిండిన పాపభాండ మవనిం బడి బ్రద్దలు గాకపో; దిఁకన్
పండిన దుష్క్రియాఫలము భళ్ళునఁ ద్రెళ్ళక పోదు; ప్రజ్వలత్
పాండవరోషవిస్ఫుర దభంగనిషంగసితాంబకాగ్నులన్
మండకపోవు భగ్గుమని మార్తుర వంశ మహాటవీస్థలుల్!
గ్రామము లైదు మీ రడుగఁగా కురురాజు నిరాకరించి సం
గ్రామ మొసంగినాఁ డొకటి; కాదనరా దిఁక లెండు ధార్మిక
గ్రామణులార! తోరణము గట్టి యథేచ్చగ నేలుకొండు ప్ర
జ్ఞామతులై; భవద్గుణగణంబులు దిక్కులా మాఱుమ్రోగఁగన్!
భీముఁడు
త్రిపథగాసుత కుంభజ మద్రరాట్
కృప జయద్రథ కర్ణుల కోడి మా
శపథముల్ విపథమ్ములఁ బుత్తుమే?
కుప్తవర్తనులన్ మననిత్తుమే?
అర్జునుఁడు
పర పరాభవ రోష పరీతుఁడౌ
నరుఁడు కింకరుఁడై నిదురించునే!
శరశరాసనముల్ గొని డుల్పఁడే
ధర విరోధి శిరోధి సమూహముల్!
నకులుఁడు
కుపిత పాండవ కాండ హత ద్విష
న్నృపతి రక్తనదుల్ తిలకింపకే
ఉపశమించునె పీడిత తాడిత
ద్రుపదరాజతనూజ మనోరుజల్?
సహదేవుఁడు
"ధణ ధణం ధణ" భీమ గదా ధ్వనుల్
"ఘణ ఘణం ఘణ" పార్ధ గుణ ధ్వనుల్
వ్రణములై శ్రవణమ్ములఁ దాక, మా
రణము గాంతురు గాక కురుప్రభుల్.
ధర్మరాజు
నలుగురు సోదరు లొకటై
యలుగులు సింగాణు లూని యలిగిన, నిలువం
గలుగుదు రెవ్వారలు? మఱి
కులక్షయమ్మునకు మనసు కుందు ముకుందా!
మా పాలు మా కొసంగఁగ
భూపాలున కింత బుద్ధి పుట్టాకపోయెన్;
కోపాలను లగు తమ్ముల
చాపలకు పనులు వెట్టె స్వార్ధపరుండై!
నెయ్యమునకు మే మంపిన
కయ్యమునకు దింపినారు కౌరవులు; వృథా
యయ్యె మదాంశయ, మిఁక నా
దయ్య మెఱుఁగు కురుకులంబు దశ యేమగునో!
ఏమయిన తప్ప దిక సం
గ్రామ; మ్మాపైన నీవె గల వన్నిటికిన్!
మా "మాతృశ్రీ" బిడ్డల
కేమని సందేశ మంపె నీ విషయమునన్.
శ్రీకృష్ణుఁడు
విశ్వవిఖ్యాత భారత వీరమాత
కుంతి పడియుండె కురురాజు కొంపలోన;
అశ్రుధారలు తన లోచనాంచలముల
యమునలై గంగలై కృష్ణలై స్రవింప!
బిడ్డలకు దూరమై యొక గ్రుడ్డిరాజు
రాజ్యమునఁ జిక్కియుండె మీ పూజ్యజనని;
వత్సమును బాసి రాకాసివనములోన
క్రూరమృగ మధ్యమున గంగగోవు వోలె.
నన్నుఁగని కౌఁగిలించి, యానందకరుణ
గద్గద గళమ్ముతోడ స్వాగత మొసంగి,
కన్న బిడ్డల, కోడండ్ర చిన్ని మనుమ
లందఱణు సేమ మడిగిన దత్తగారు.
పరులపంచల పడు భంగపాటు లెల్ల
చెప్పివాపోయె గుండెలు చెఱువుగాగ;
బాష్పముల నాగి, జయవాక్కు పలికి; మీకు
తెలుపుమన్నది "మాతృ సందేశ" మిట్లు -
(మాతృసందేశము)
"స్వచ్చజ్యోత్స్నలు చిందు చందురుని వంశమ్మందు జన్మించి యే
కచ్చత్రేశుని బిడ్డలై, భరతరక్తమ్మూని నెమ్మేనులన్,
స్వచ్చందప్రియ భావి జీవన సుధాస్వాదంబుఁ గావింతురో!
స్వేచ్చాలక్ష్మికి స్వస్తిచెప్పి పరులన్ సేవించి జీవింతురో!
విపరీతమ్ముగా విశ్వవిప్లవ మహావిర్భూతికై మాయదా
రి పిశాచమ్ములు ఱెక్క లార్చుచును గర్జించెన్ సముద్రాలపై;
ఎపుడోలే యనుకొన్న యుద్ద మది రానేవచ్చె, మీ దొడ్డి గు
మ్మపు మెట్లెక్కిరి శాంతి ఘాతుకులు సామ్రాజ్యక్షుథాబాధితుల్!!
భారతభాగ్యదీపికలపై మసిపూఁతలు పూయువార లె
వ్వారలురా? యపార మనపద్య మపూర్వ మఖండ మైన మీ
వీర విజృంభణమ్మునకు విశ్వము విస్మయ మందురా! భవత్
పౌరుషలక్ష్మి కారతులు బట్టనురా సకలప్రపంచముల్!
సంపాదించిన తండ్రి వైదొలఁగ, తత్సంతానమౌ మిమ్ము గ
ర్హింపన్ సాగెను పెద్దతండ్రి; కపట ప్రేమం బ్రదర్శించి ని
ర్మింపన్ సాగెను స్నేహసౌధ; మటుపై మీ సొంపు మీ పెంపు మీ
కంపే గిట్టకపోయె కౌరవులకుం గాలప్రభావమ్మునన్!
దేశ కల్యాణ దివ్యసందేశదీక్ష
నందుకొని, స్నేచ్చకొఱకు విల్లందుకొనుఁడు!
భరతసంతతి భావిసౌభాగ్యమునకు
సాగుఁగావుత స్వాతంత్రసమరరథము!
వీరభారతభూమి నావిర్భవించి
పౌరుషము లేని బానిస బ్రతుకు లేల?
ఈ యయోమయ శృంఖలా లింకనైన
త్రెంపుకొని బైటఁబడి విజృంభింప రేల?
తన కుమారుల పరతంత్ర దశ తలంచి
తల్లి హృదయము పడు-బాధ-తపన-యెఱుఁగ
రెట్టిదో యెవ్వరును; ఆశ పెట్టుకొంటి
సుతుల అతుల భుజా బలోద్దతుల మీఁద!
దిక్కు చెడియున్న మీతల్లి దిక్కుఁ జూచి
గుండెలోని సెగల్ రగుల్కొల్పుఁడయ్య!
దాస్య దారిద్ర్య గాడాంధతమసమందు
జ్యోతి వెల్గింపవలె యుగాభ్యుదయమునకు!
ఏ మహోద్దేశ సిద్ధి లో నిచ్చగించి
ప్రియకుమారులఁ గనును క్షత్రియసవిత్రి;
ఆ మహోద్దేశ సంసిద్ధి నాత్మ నెంచి
నడుములు బిగించి ముందుకు నడువుఁడయ్య!
క్షాత్ర తేజస్సు భారతక్షేత్ర మెల్ల
చల్లబోయెడి శ్రమిక కర్షకుల మీరు;
కృష్ణమేఘము మిముఁ గటాక్షించెనింక
మీకు సులభము విజయలక్ష్మీఫలమ్ము."
అనుచుఁ దెలుపుమనియె అత్త మీతో - పాఠ
మప్పగించినాను చెప్పినటుల;
ఇంక సిద్దపఱచుఁడీ కురుక్షేత్ర సం
గ్రామమునకు గదలు గాండివములు.
ఆలకించినారలా! బావలార! మీ
యేపుఁ జూపవలయు ఱేపు మొదలు;
"దూతకృత్య" మెట్టులో తీరిపోయె; నే
"సూతకృత్యము"నకుఁ జొత్తు నింక.
* * *
అని చిఱునవ్వు నవ్వుచు మురారి కిరీటిని దట్టి యూరకుం
డెను; కుతుకమ్ముమై వడముడిం గనుఁగొన్నది కృష్ణ; ధర్మ నం
దనుఁడు ప్రసన్నతం గనె;గదం గదలించెను భీమసేనుఁ; డ
ర్జునుఁడును గాండివమ్ము దెసఁజూచె; కవల్ పులకించినారలున్!
అం దేకాంత రహస్సభాంతరమునం దాయోధనప్రక్రియా
సందర్భమ్ములు సంప్రదించుకొను పాంచాలీయుతుల్ పాండవుల్
"వందేమాతర" మంచు భక్తి మెయి సంభావించి రాత్మ ప్రసూ
సందేశమ్ము, వినమ్ర శీర్షములతో!! సంతోషబాష్పాలతో!!