Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం-2 పేజి 27


    కుటిల కీటక శత విషచ్చటలఁజిక్కి
    కురుకుల లతామతల్లి సుందరత తఱిగె!
    కుంతికొమరుల ముత్యాల గొడుగునీడ
    నేఁడు మొద లది నవనవలాడుఁగాక!
    
    కలిత లలితేందు కుల యశోగ్రాసన కాంక్ష
    కలలుగనుచున్న దా నూఱుతలల నాగు;
    పడగ పైకెత్తి నెత్తిపైఁ బడకమున్నె
    పుడమిఁబడు వీర నకుల విస్ఫూర్తిలోన.
    
    సహదేవుఁడు
    దోసమొ మోసమో జరిగె ద్యూతము; గెల్చిరి వారు; దుష్ట దు
    శ్శాసన హస్త మెత్తిన నృశంస ప్రభుత్వముముందు దాసియై
    దోసిలియొగ్గి తెచ్చుకొనె ద్రోవది రాజ్యము; దానికోసమై
    చేసిరి రాయబారము లిసీ! పసచాలని పాండునందనుల్!
    
    ఆడితి మోడిపోయితి మనంత; అనంత! అనంతమ్మునన్
    గోడలి కిచ్చె నిచ్చకపుఁ గూరిమి పెంపున గ్రుడ్డిరాజు! ము
    న్నోడిన దానినే మరల నోడి, వనుల్ దిరుగాడి, నేఁడు వా
    యోడక భాగ మిమ్మనుటయున్-కురువల్లభుఁ డీయకుంటయున్!
    
    ఆడది యేడ్చి తెచ్చుకొనినట్టి దయారస ధర్మభిక్షకై
    గూడలు క్రుంగి కుంతికొడుకుల్ చెయిచాచుట యెగ్గుసిగ్గులన్
    వీడుటగాదె? 'దేహి'యని వేడుదురే పగవారి? నేఁ డిటుల్
    బూడిద పా లొనర్చితిమిపో అమృతాంశుకులప్రతిష్ఠలన్!
    
    బావను హస్తినాపురము బంపెడిచో "నిదమిత్ద" మంచు నా
    భావములోని భావనలు స్పష్టము సేయదలచింయున్, శుభం
    భావుక సంధియాత్ర కశుభం బని మ్రింగితి - మిన్నకుంటి - మా
    బావ సుఖంబుగా తిరిగివచ్చె నిదే పదివేలు నేఁటికిన్!
    
    పాంచాలి
    భుజాగ్రముల్ పొంగ పురోగమింతురో!
    ధ్వజాగ్రముల్ వంగ తిరోగమింతురో!
    శరమ్ములన్ దాల్చి పరాక్రమింతురో!
    కరమ్ములన్ మోడ్చి పరిక్రమింతురో!
    
    త్యజింతురో క్షాత్రకుల ప్రతిష్ఠలన్!
    భజింతురో శాత్రవ పాదపద్మముల్!
    భుజింతురో కానల కందమూలముల్!
    సృజింతురో తాత్త్విక ధర్మశాస్త్రముల్!
    
    స్మరింపుడీ భూత సభా ప్రమాణముల్!
    ధరింపుఁడీ చేత ధనుష్ కృపాణముల్!
    హరింపుఁడీ కౌరవ గర్వసంహతుల్!    
    భరింపుఁడీ పౌరవ గౌరవద్యుతుల్!
    
    అధిష్ఠితోద్ధండ రథిప్రకాండుఁడౌ
    యుధిష్ఠిరుండెంతటి సార్ధకాఖ్యుఁడో!
    అజాతశత్రుత్వ యశోభిలాషలో
    స్వజాతి చైతన్యము విస్మరింతురో!
    
    ధర్మరాజు
    సంధి యగు; బాల్యవైర
    గ్రంథి తొలఁగు; లోకశాంతి గలుగు నని జగ
    ద్భాంధవు నిను బుత్తెంచిన
    గాంధారేయులకుఁ జనునె కదనాకాంక్షల్?
    
    "తగవులు సహోదరులలో
    తగ" వని, సగ మొసఁగి మనుట తగవని, మే మిం
    తగ వారిఁ గోరినందుకు
    తెగించిరఁటె! బిఱ్ఱబిగిసి ధృతరాష్ట్రసుతుల్!!

    హింసామయ జీవనులఁ బ్ర
    శంసింతురఁటయ్య ధర్మశాస్త్రజ్ఞు; లసృ
    ఙ్మాంసాహుతు లందక యీ
    సంసార మహామఘంబు సాగదఁటయ్యా!
    
    సింహాసనమ్ము కొఱకై
    సంహార మొనర్పఁజల సంబంధుల; మా
    యంహశ్చరితల "భారత
    సంహిత"ణు కళంకితమ్ము సలుపఁగజాలన్!
    
    దారుణ రణాంగణమ్మున
    మారణ మొనరించి కురుకుమారుల, తద్ర
    క్తారుణ ధరణీరాజ్య
    శ్రీరమణుఁడ నగుట సిగ్గుచేటు మురారీ!
    
    అర్ధములకోసమై పర
    మార్దమ్మును విస్మరించి యన్యోన్యమ్మున్
    స్పర్ధించి రణము సేసిన
    వర్ధిల్లునఁటయ్య భరతవంశము కృష్ణా!
    
    చుట్టాలఁ జంపి పట్టము
    గట్టుకొని సుఖించు కాంక్ష కంటె, విరక్తిన్
    నట్టడవి కావిపుట్టము
    గట్టుకొని తపమ్ముసేఁత కార్యము గాదే!
    
    సంతోషించితి కురురా
    ట్సంతానము సమ్మతించు సంధి కని; యిఁకన్
    శాంతియొ క్రాంతియొ ముందిడి
    కౌంతేయులఁ గావుమయ్య! కమలదళాక్షా!
    
    పాంచాలి
    మారనిమాట లేటి కిటు మాటికి? కూటికి సాటిరాజుతో
    బేరము లాడుటే మిగుల పేలవ! మంతటఁబొక సంధికిన్
    వారు తిరస్కరించి కరవాలము లెత్తినా నిర్నిమిత్త ని
    స్సారవిచారులై మెడలు సాచుట శోచ్యము నైచ్య మెంతయున్.
    
    ఆయెను బోయె సంధి; యిఁకనైనను నాయకు లాయుధమ్ములన్
    దీయక ధర్మశాస్త్రములు త్రిప్పుత నమ్మిన వారి గొంతుకల్
    గోయుటగాదె-మీరు గయికొన్న యహింసలు హింసలయ్యె నా
    త్మీయులయందు-చాలు గురుతింపుఁడు పీడిత జాతియాతనల్!
    
    పుట్టితి పూజ్యుఁడౌ ద్రుపదభూపతికిన్; జగబెట్టి పాండు స
    మ్రాట్టుల కోడలైతి; నభిమానధనుల్ ఘనులైనవారిఁ జే
    పట్టితి; శౌర్య ధైర్య గుణపాత్రుల పుత్త్రులఁ గంటి; నూడిగం
    బెట్టులఁ జేయఁజాలుదు నిసీ! మగవారలు సిగ్గుమాలినన్!
    
    అన్నయు నాన్నగారు చతురంగబలమ్ముల తోడ నస్మద
    భ్యున్నతిఁ గోరి వచ్చిరి; మహోదయు లీక్రియ నీళ్ళుమ్రింగుచున్
    మిన్నులు సూచిరేని విషమించు పరిస్థితు; లైనవారిలోఁ
    జిన్నతనమ్ము మోయుదురె!"ఛీ"యని నల్వురు నవ్విపోవరే!
    
    హింస యహింస యంచు నొకటే యొకటే తిరుమంత్ర మేదొ మీ
    మాంసకుఁ దెచ్చి, మా రుధిరమాంసములన్ బలియిచ్చి, ఇష్ట వి
    ధ్వంస పథమ్మునన్ నడచు వైఖరి నేఁటికి జాలు; దుష్ట వి
    ధ్వంసన మాచరింప విలు దాల్పుఁడు; నిల్పుఁడు క్షాత్రదీపికల్!
    
    చాలితిరేని ముందునకు సాగి, సపత్నుల నాగి, పత్ని పాం
    చాలి కచాలి కూర్పుఁడు! విచారము దీర్పుఁడు! శౌర్యధైర్యముల్
    చాలవయేని ధర్మములు చాలిక పెద్దలు మిన్నకుండుడీ;
    బాలురు దీర్తు రీ సమరభారము "భారత భాగ్యమూర్తులై".
    
    మండిత పాండవాన్వయుఁడు మా యభిమన్యుఁడు, ఖండితద్విష
    న్మండలుఁడా ఘటోత్కచకుమారుఁడు చాలరె ధార్త రాష్ట్రులన్
    పిండియొనర్ప; హెచ్చు పయిపెచ్చులు నచ్చుకొనన్ ధనుష్కళా
    పండితుఁ డన్న లేఁడె! యుపపాండవు లేమి కృపాణహీనులే!
    
    "భారతవీరమాత" యగు భాగ్యము ప్రాప్తిలు అత్తగారి కం
    చూరక "చూచి చూడ" నటు లుంటిమి; ఆమెకు దక్కకున్న యా
    గౌరవలక్ష్మి లభ్యమగుఁగాక కుమారులఁగన్న మా హిడిం
    బా రమణీలలామకు; సుభద్రకు! ఈ ద్రుపదాత్మజాతకున్!

 Previous Page Next Page