మహా వటవృక్షం
మా తాత ఒక
మహా వటవృక్షం
ఇటు ముంగిట్లో అటు పెరట్లో
ఎటు చూచినా తనే ప్రత్యక్షం
చల్లదనాన్ని ఆప్యాయంగా
ఎల్లప్పుడూ వెదజల్లుతుంటాడు
పచ్చదనాన్ని ఒడినిండా
పరచుకొని కూచుంటాడు.
మఱ్ఱిచెట్టు కొమ్మలపై
మదించిన మయూర కిశోరాలు
మైమరచి వినిపిస్తుంటాయి
మధుర మంజుల క్రేంకారాలు.
ఊడలు పట్టుకొని ఆడుతూ పాడుతూ నీడలలో
ఉయ్యాల లూగుతుంటారు పసివాళ్ళు!
కొమ్మలనందు రెమ్మల్లో
గుమ్మటాలవంటి పిట్టగూళ్ళు!
ముచ్చటైన ముక్కులతో
వచ్చీరాని రెక్కల పిచ్చుక కందులు
చిన్నిచిన్ని గూళ్ళల్లో కిచకిచలాడుతూ
చేస్తుంటాయి వీనుల విందులు.
అదోలా నవ్వుతుంటాడు మా తాత
అవ్యక్తంగా అప్పుడప్పుడు
అది సమాధానం చెప్పలేక ఆశ్చర్యచకితుడైన
చిన్నారి శిశువు చిరుపెదవుల చప్పుడు.
పురుగును కూడా జొరనీయకుండా
పొలాన్ని రక్షించే "కంచె" అతడు
కాకులూ గద్దలూ కంకుల్ని తన్నుకు పోకుండా
కాపలా కాసే "మంచె" అతడు
ఐతే నే నెప్పుడో ఆయనకు
"తిధి పెట్టి" "తిలాంజలి' వదలిపెట్టాను
అజ్ఞాతయుగంలోకి త్రోసివేసి
విజ్ఞానసర్వస్వంలో అయన పేరు జమకట్టాను.
అందుకనే నాకు అందనంత - నే నందుకోలేనంత - దూరంలో
అయన ఉన్నాడని గ్రహించాను
స్వయంగా నేనే మా యింట్లోకి ప్రవేశించి
భయంగా పెరటిబావిలోకి వంగి తొంగి చూచాను.
విచిత్రం ఏమంటే వటవృక్షం
వేరుతన్ని ఉన్నది లోపలి రాళ్ళల్లో
పచ్చగా చెట్టంతా
ప్రతిబింబించి కన్పించుతున్నది బావి నీళ్ళల్లో.
నాకు ఆవేశం వచ్చింది
తాత మీకా ఆగ్రహం హెచ్చింది
ఒక వింత జంతువును
వెంట పట్టుకు వచ్చాను.
నిండా బోచ్చున్నా - దాన్ని
కొండముచ్చు అనరాదు
నల్లగా కనబడుతున్నా - అది
భల్లూకం అసలే కాదు.
అచ్చం మనిషిలాంటి దాన్ని
అదేదో ఒక వింత జంతువును కొని తెచ్చాను
ముసలితాత మీదికి "బౌ బౌ" అంటూ
కసిగా ఉసికొల్పాను.
విరగబడి వికావిక నవ్వుతూ ఆ
వింత దృశ్యం తిలకించాను
అల్లరి చేస్తూ గంతులేస్తూ
ఆనందంతో పులకించాను.
పచ్చని చెట్టు పైన
పటపటా పతసులు పెల్చాను
చిచ్చుబుడ్లు తోటాలు
చిచింద్రీలు చిటచిటా కాల్చాను.
కుర్రజట్టు గొంతుల్లో
కోటి బాంబులు ఫెళఫేళా మ్రోగించాను
వెఱ్రిగా కేకలు వేస్తూ
వేళాకొళాలు సాగించాను.
తాత కదలలేదు - మెదలలేదు-
పలుకలేదు - ఉలుక లేదు - నాకేమీ తోచలేదు
ఐనా అబద్దమెందుకు మనలో మాట -
నట్టింటిలోనే ఒక మూల
"నమూనా" గొయ్యి తీశాను
రంగురంగుల తోపీలతో
అంగరఖాలతో హంగు చేశాను.
పాతకోత్తల భావభంగిమలను
తాతకు తగినట్టే చూపెట్టాను
లోతైన ఆ గోతిలో
తాతను మెల్లగా పడుకోబెట్టాను.
అటూ ఇటూ చూసి అట్టహాసం చేసి
అతి జాగ్రత్తగా పరికించాను
ఐనా ఒక్కసారైనా పొరపాటుగా నైనా
అయన "అదేం" అనలేదు.
కనీసం 'అబ్బా" అని అరవనైనాలేదు
అదరలేదు - బెదరలేదు -
ఆ ఉక్కుమనిషి భావసౌష్టవం
ఏమాత్రం చెక్కు చెదరలేదు.
అలాగే కదలకుండా
గంభీరంగా - నిబ్బరంగా
నిర్మలంగా - నిశ్చలంగా
చూస్తున్నాడు తాత.
అయన సనాతన సంస్కృతికి సన్నిధి
మంచికీ మర్యాదకీ పెన్నిధి
ప్రాచీన గౌరవానికి ప్రతీక
మానవత్వానికి మహనీయ పతాక.
మా తాత ఒక
మహా వటవృక్షం
ఇటు ముంగిట్లో అటు పెరట్లో
ఎటు చూచినా తనే ప్రత్యక్షం.
రమ్య రసతరంగ!
'ఇష్షు కదలకండి నిశ్సబ్దముగ నుండి
అలకింపవలయు నండి మీరు
అరవబోకు ' డంచు అరచె నద్యక్షుండు
రమ్య రసతరంగ! రామలింగ!
పాతకైత వ్రాసె పదునైన గంటంబు,
నేటి కవిత వ్రాసె ఊటకలము;
రంగు సుద్దముక్క వ్రాయు రేపటికైత;
రమ్య రసతరంగ! రామలింగ!
జబ్బ చరచి పలికి జాతీయకవి యయ్యె;
వెన్ను విరిచి పలికి విప్లవ కవి;
అరచి కరచి పలికి అతినవ్యకవి యయ్యె;
రమ్య రసతరంగ! రామలింగ!
కప్పులెత్తి రసము గటగటమని త్రాగె
కావ్యరసము లేని కవి యొకండు;
కప్పు లెన్నో చెల్లె; కవితారసం బిల్లె;
రమ్య రసతరంగ! రామలింగ!
"నీవు కాపి కొట్టుతావురా!" అని వాచ
రడిగే నొక పరీక్షహాలులోన;
"తప్పకుండ కొట్టుతా" ననే విద్యార్ధి
రమ్య రసతరంగ! రామలింగ!
పగలు రాత్రి బాబు "భాగ్యలక్ష్మీ" యంచు
పలవరించు లక్ష్మీ భాగ్యమేమొ!
లాలన పేరు గాదు లాటరీ పేరది
రమ్య రసతరంగ! రామలింగ!
పట్టుబట్టి ప్రజలు ఫారన్ రిటర్ న్డును
తోడి తెచ్చినారు దుర్గాగుడికి;
అమ్మవారి నడిగె 'హౌ ఆర్ యు" అని వాడు
రమ్య రసతరంగ! రామలింగ!
దుమికె భీము డాగ్రహమున మీసము దువ్వి
చీరలోల్చు దుస్ససేను పైకి;
మీస మూడివచ్చే రోస మేపాటిదో
రమ్య రసతరంగ! రామలింగ!
జిడ్డుగాడు ఎంత చెప్పిన వినకుండ
మైకు చేతబట్టి మాటలాడె;
"ఆపు" చేయువరకు ఆపుచేయ డతండు
రమ్య రసతరంగ! రామలింగ!
దుడ్డుకర్ర బట్టి నడ్డి విరుగగొట్టి
పద్యములను భంగపరతు నంచు
ఘను డొకండు దూకి కాల్జారి పడేనయా
రమ్య రసతరంగ! రామలింగ!
***