తను వాళ్ళింట్లో డ్రాప్ చేస్తానని చెప్పాడు, అందుకే రోమాకోసం వెయిట్ చేస్తున్నాడు మనోహర్.
తను___
యాడ్ ఫిల్మ్ ళ వృత్తిలో ప్రవేశించినప్పటినుంచి తన వ్యాపార చిత్రాల్లో ఎక్కువ నటించింది కమలిని. ఆ తరువాత రోమాకౌర్. రోమాకౌర్ అంటే మనోహర్ కి అభిమానం.
ఆమెకు మనోహర్ పట్ల అపారమైన నమ్మకం. విశ్వాసం, అంతకు మించిన అభిమానం.
"అయామ్ రెడీ మనోహర్."
"రోమాకౌర్ డ్రెసింగ్ రూంలోంచి వస్తూ అంది. ఫిల్మ్ షూటింగ్ లో శృంగార దేవతలా వున్న రోమాకౌర్ ఇప్పుడు నిండుగా చూడముచ్చటగా వుంది___పట్టుచీరలో.
మనోహర్ లేచి నిలబడ్డాడు. హొటల్ బయటికి వస్తున్నప్పుడు, రోమాకౌర్ అంది.
"ఇవాళ ఉదయం పేపర్లో మీ అడ్వర్టయిజ్ మెంట్ చూశాను......బావుంది......కనీసం మాటమాత్రమైనా చెప్పకుండా.......వేశారే......ఎందుకు?"
మనోహర్ మాట్లాడలేదు.
"అదేం దేవ రహస్యమా?" మళ్ళీ అడిగింది రోమా.
కారులో కూర్చున్నారిద్దరూ. మనోహర్ కారు డ్రైవ్ చేస్తున్నాడు.
'ఆ ఎడ్మర్టయిజ్ మెంట్ లో మీరిచ్చిన కొలతలు నాకు లేవా?"
మళ్ళీ అడిగింది రోమా.
మనోహర్ మాట్లాడలేదు. ఆమెవైపు తలతిప్పి కూడా చూడలేదు.
"సమాధానం చెప్పాలని లేదా, లేక వినిపించుకోవడం లేదా?" రోమా గొంతులో అసహనం ధ్వనించింది.
మనోహర్ గొంతు విప్పాడు___డ్రైవింగ్ పైన మనస్సు కేంద్రీకరించి రోడ్డువైపు చూస్తూ.
"రోమా, ఇంతవరకు నేనుపట్టుదలగా దేన్నీతీసుకోలేదు.....ఎందుకు తీసుకోలేదంటే అప్పుడు నా ఆలోచనలన్నీ వేరేగా వుండేవి......ప్రస్తుతం అవి మారిపోయాయి.....ఆ మార్పుకు పర్యవసానమే ఇవాల్టి ప్రకటన....."
"ఏమిటో మీరు చెప్పేది నాకేం అర్ధంకావడంలేదు....." అంది రోమా.
"అర్థమయ్యే టైమొస్తుంది" గంభీరంగా అన్నాడు మనోహర్.
"అప్పటికి నేనుంటానా?" జోక్ గా అంది రోమా.
"డోంట్ బి సిల్లీ" అన్నాడు చనువుగా కసురుకుంటూ.
రోమా ఇంటిముందు కారాగింది రోమా కారు దిగింది.
"మనోహర్......రేపు ఈవెనింగ్ వస్తున్నారా మీరు?" అడిగింది.
"ఎందుకు?.......రాలేనేమో?" అన్నాడు మనోహర్.
"ఎందుకేమిటి? రేపు నా బర్త్ డే కదా.....మొన్న వస్తానని చెప్పి ఇవాళ రానని చెప్పడం ఏం మర్యాద?"
"ఓహ్ సారీ......మొన్న చెప్పాను కాని.....యివాల్టికి పరిస్థితులు మారిపోయాయి....మరి రేపటికెలా వుంటాయో.....అంచేత వస్తానని మాటివ్వలేను."
"అలాగంటే కుదరదు. పది నిమిషాలు చాలు......ఆరుగంటలకు రండి.....ఆరుగంటళ పది నిమిషాలకు వదిలేస్తాను.....ఓ.కే."
"ట్రయ్ చేస్తాను."
కారు ముందు కెళ్ళిపోయింది.
* * *
ఆ గదిలో నలుగురు వ్యక్తులు కూర్చున్నారు. ఆ విశాలమైన గది గోడలు నీలం రంగులో వున్నాయి. నేలమీద బ్లూ కార్పెట్ వుంది.
అటూ- యిటూ ఎదురెదురుగా రెండు సోఫాలు. వాటిమధ్య గ్లాస్ టీపాయ్. దానిమీద ఓల్డ్ మాంక్ బాటిలుంది. అది అప్పటికి సగం ఖాళీయై వుంది. రెండు సోఫాలమీద ఎదురెదురుగా ఇద్దరు ఇద్దరుగా నలుగురు వ్యక్తులు కూర్చొని వున్నారు.
అందులో ఒకరు మనోహర్___అతనెప్పుడూ తాగడు. సిగరెట్ కాల్చడు____వక్కపొడి కూడా వేయడు.
రెండో వ్యక్తి మనోహర్ అసిస్టెంట్___మధుచక్రవర్తి__పేరుకి మాత్రమే అతను అసిస్టెంట్ మనోహర్. విశ్వసించే ఏకైక వ్యక్తి లైట్ గా తీసుకుంటాడు. డ్రింక్. మూడో వ్యక్తి రాంభూపాల్. రాంభూపాల్ హైదరాబాదులో పేరున్న యాడ్ ఫోటో గ్రాఫర్. అతను సంపాదించే దానిలో సగం అమ్మాయిలకే ఖర్చుపెడతానేది అందరికీ తెలిసిన విషయం.
అతను విదేశీ పత్రికలకు కూడా అమ్మాయిల ఫోటోలను సప్లయ్ చేస్తుంటాడు తద్వారా.
అతనికి చాలా ఆదాయం వుంది.
అతనికి మనోహరంటే ఎక్కువ ఇష్టం. పదేళ్ళుగా ఆ వృత్తిలో వుంటూ తను సంపాదించలేని పేరు - ప్రతిష్టలు మనోహర్ అతి తక్కువ కాలంతో సంపాదించడంతో___
మనోహర్ క్రమశిక్షణను తరచూ పొగుడుతుంటాడు.
మనోహర్ అప్పుడప్పుడు తనకొచ్చిన కొన్ని ఆఫర్లను రాంభూపాల్ కివ్వడం జరిగింది. దాంతో మనోహరంతే ఇష్టంతోపాటు గౌరవం ఏర్పడింది.
నాలుగో వ్యక్తి కిరణ్. మొదట్లో కొన్నాళ్ళు మనోహర్ తో కల్సిపనిచేసిన కిరణ్ తర్వాత మనోహర్ సహాయంతోనే స్వంతంగా అడ్వర్టయిజింగ్ ఏజన్సీ పెట్టుకున్నాడు. అందుకే మనోహర్ అంటే కిరణ్ కి ఎనలేని అభిమానం, గౌరవం.
తన వృత్తికి సంబంధించిన విషయాలను ఈ ముగ్గురితోనే నమ్మకంగా చెప్తుంటాడు మనోహర్. ఈ ముగ్గురూ కాక మనోహర్ నమ్మే మరొకరు.....కమలిని.
అందుకే___
"క్రొత్తగా తను నిలదొక్కుకోబోయే ప్రణాళికలో మొదటిభాగంగా తీసుకునే చర్యల గురించి సలహాలు అడుగుదామని ఆ పార్టీ ఎరేంజ్ చేశాడు మనోహర్.
అతను చెప్పే విషయం అందరూ జాగ్రత్తగా వింటున్నారు.
"మనకున్న టైం ముప్పైరోజులు. వచ్చేఆదాయం పాతికలక్షలు. ఈ ముప్పయ్ రోజుల్ని రెండుగాచేస్తే రెండు పదిహేనురోజులు. మొదటి పదిహేను రోజుల్లో మనం మోడల్స్ ని పట్టుకోవాలి. రెండో పదిహేను రోజుల్లో మనం షూటింగ్ పని ప్రారంభించాలి.
అందుకు మనకి కావాల్సింది.......
ఒక అమ్మాయి.....
ఒకే ఒక అమ్మాయి?.....అత్యద్భుతమైన అమ్మాయి. లిరిల్ సోప్ మోడల్ తలదన్నేట్లుండే అమ్మాయి. ఆ ఒకే ఒక అమ్మాయిని సెలక్టు చెయ్యడానికి మనం కొన్ని వందలమంది అమ్మాయిల్ని చూడాల్సి వుంది.
"ఇంతకు ముందు....." అని ఏదో చెప్పబోతున్న మనోహర్ మాటలకు రాంభూపాల్ అడ్డొచ్చాడు.
"మనోహర్ చూడు సస్పెన్స్ సినిమాకధలాచెప్తే నాకేం అర్థం గావటంలేదు.
ఒక అమ్మాయిద్వారా నెలరోజుల్లో అన్ని లక్షలెలా వస్తాయి? ఆ ప్లానేమిటి? అదిచెప్పు ముందు.....ఆ తర్వాత మిగతావన్నీ"
మనోహర్ సంశయించాడు. చురుగ్గా, కోపంగా రాంభూపాల్ వైపు చూశాడు.
"నేను తీయబోయే యాడ్ ఫిల్మ్ ద్వారానే ఈ పాతికలక్షలు వస్తాయి. కానీ యిందులో గుమ్మత్తేమిటంటే....పందెం....."
"పందెం?...." రాంభూపాల్ ఆశ్చర్యంగా చూసాడు.
"ఎవరితో?" అడిగాడు కిరణ్.
చెప్పాడు మనోహర్.
మిగతా ముగ్గురూ ఆశ్చర్యపోయారు.
"నువ్వు కొండను ఢీకొంటున్నావ్ బ్రదర్......ఇది కానిపని!"
"నీకు డబ్బు, పేరూ రావచ్చు. కాని నువ్వు హత్యల్ని ప్రేరేపిస్తున్నావ్?"
"ఇందులో నాశనమయ్యేది యెవరో తెల్సా?"
"నాకుతెల్సు......బాగాతెల్సు.....జీవితంలో రిస్క్ లేనినే థ్రిల్ లేదు ఇది నా తెలివితేటలకు పని. మీ సహకారానికి పరీక్ష. చివరివరకూ నాతో ఉంటానని ప్రమాణం చెయ్యండి. మిగతావి నేను చూసుకుంటాను."
ముగ్గురూ ఒకరి ముఖాలోకరు చూసుకున్నారు.
ఆ తర్వాత మనోహర్ ముఖంవైపు చూశారు.
మనోహర్ చేతిలో చెయ్యివేశారు.
"నీ ప్రయత్నం సక్సెస్ కావడానికి చివరివరకూ నిలుస్తాం.....ద్రోహం తలపెడితే నువ్వు మమ్మల్ని కాల్చిచంపినా మేంఅందుకు సిద్ధపడతాం" మనోహర్ పెదవుల పై చిరునవ్వు లాస్యం చేసింది. అక్కడ కాసేపు మౌనం. లోతయిన ఆలోచనలనుంచి వస్తూన్న మౌనం....." మౌనం అంత గంభీరంగా వుంది.
అందరూ ఎవరి ఆలోచనల్లో వారున్నారు.
కొద్దిసేపటికి___
రాంభూపాల్ గొంతువిప్పాడు. "మనోహర్! నీ మనసులో వున్న ఆలోచన చెప్పు అసలేం జరిగిందో చెప్పు.....ఇందులో మా కమీషనెంతో చెప్పు."
"......."
"... ...."
అరవయ్ నిముషాలు గడిచాయి.
బాటిల్ ఖాళీఅయింది. రాంభూపాల్ కిరణ్ బాగాత్రాగారు.మనోహర్ చెప్పడం పూర్తిచేశాడు.
గదంతా నిశ్శబ్దంగా వుంది.
మధుచక్రవర్తి ఆశ్చర్యపోయాడు. తన బాస్ మానోహార్ చెప్పిందివిని.
"ఎప్పుడు జరిగింది?" కిరణ్ అడిగాడు.
"వారంరోజుల క్రితం" మనోహర్ చెప్పాడు.
"ఆఫర్ బాగుంది. కానీ నీ ఛాలెంజ్ డేంజరస్. నువ్వు సక్సెస్ కాగలవన్న నమ్మకం నీకుందా?" అడిగాడు కిరణ్.
"ఉంది."
"సరే......అయితే మేం యిప్పుడేం చెయ్యాలి?" రాంభూపాల్ అడిగాడు.
"ఇప్పుడు ప్రస్తుతం మీ యిద్దరి పనులు కట్టిపెట్టండి. నెలరోజులు మీరు నా అధీనంలో వుండాలి. మీకయ్యే ఖర్చంతా నాది. వనంతా కాగానే మీ కమిషన్ మీకిస్తాను.....ఓ.కే?"
"ఓ.కే డన్....."
"అయితే ప్రస్తుతం మీరు చెయ్యాల్సినపని.....చాలా సులభమైంది. అమ్మాయిలను వెదకడం......యెలా వెదకాలంటే.....ఈ విషయం మన శతృవులకు అసలు తెలీగూడదు. మీ యిద్దరికితోడు మధు వుంటాడు......కాని కాస్త ఆలస్యంగా మీతో కలుస్తాడు నాకుతోడు నా అసోసియేట్ గిరీష్ వుంటాడు.
ఇప్పుడు మనం తీసుకోబోయే అమ్మాయిలు సినీస్టార్స్ కాకూడదు. అలాగే యింతకుముందు మోడలింగ్ వృత్తిలో వున్నవాళ్ళు కాకుండా వుండాలి. మోడలింగ్ వృత్తికి కొత్త అయిన అమ్మాయిల్ని పాలిష్ చెయ్యడం ప్రేమతో కూడుకున్న పనే___తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే అద్భుతమయిన అందం, అంగసౌష్టవం ఉన్న పేరులేని, రాణి మోడల్స్ ని వెతకండి. మీ వేటని అతిగోప్యంగా ఉంచాలి. అందుక్కావలసిన ఏర్పాట్లు చేశాను.
మీరు మొదట వెతకాల్సింది కాలేజీలు....
యూనివర్శిటీలు......కొన్ని పల్లెటూర్లు.....నేననుకున్న అమ్మాయి దొరకటానికి ఈ మూడు ప్రదేశాలే అనువయినవి నాకా నమ్మకంవుంది. అలాగే మనం ఏ పనులు యొలాచెయ్యాలో చెబుతాను.....మొదటివారంలో రాంభూపాల్. కిరణ్ మీరిద్దరూ రాష్ట్రంలో కాలేజీల దగ్గర కాపుకాయాలి. పల్లెటూళ్ళు తిరగాలి. మీకు అందమయిన వాళ్ళుగా అనిపించే అమ్మాయిల వివరాలు సంపాదించండి. వీలయితే వాళ్ళతో మాట్లాడండి.....నాకు తెలియపర్చండి. మేం యిక్కడ హైదరాబాద్ లో మిగతా ప్రిపరేషన్స్ లో వుంటాం.....