స్కంధావారము
శ్రీకృష్ణుఁడు
మణిమయ స్వర్ణ కింకిణీ మంజులములు
అరిభయంకర కపికేతనాంకితములు
రంగదుత్తుంగ ధవళ తురంగమములు
జయము గను పార్ధ! నీ రధస్పందనములు!!
పరిచితాభీల సంగర ప్రాంగణములు
త్రాస పరిభూత కర్ణ దుశ్శాసనములు!
సంభృ తానేక నవయుగ స్వాగతములు
అలరు విజయ! త్వదీయ శంఖారవములు!
సత్వర పరాజి తారాతి సంచయములు
దివ్య మహిమ విశేష సందీపితములు
శమిత శతకోటి సంభ్రమములు
వెలయు గాండీవి! నీ ధనుర్విభ్రమములు!
ముందుఁ గూర్చుండి నే పగ్గములను బట్టి
రధము నడపింతు సంగ్రామ పధమువెంట!
చేత విలు దాల్చి లక్ష్యమ్ము చెదరకుండ
కార్యసిద్దికి నీ వింకఁ గడఁగుమయ్య!
అర్జునుఁడు
రణ ముహూర్తము డాసె యుద్దా
రంభ ఘంటలు మ్రోగనున్నవి
క్షణము మన మిట సైన్య సమవే
క్షణము సేయుదమే!
దుష్ట దుర్యోధనుని కొఱకై
కష్టపడి కయ్యమ్ము సేయఁగ
వసుమతీపతు లెవ్వ రెవ్వరు
వచ్చియున్నారో!
రాజరాజు సహయులై ఘో
రాజి నలుపఁగ నరుగుదెంచిరి
రాజసూయము మఱచిరో మన
రాజనందనులు.
మాధవా! రధ ముభయ సేనా
మధ్యమున నడపింపుమయ్యా!
యోధులను పరికింత మింత సు
యోధనాసుగులన్.
శ్రీకృష్ణుఁడు
అతిరధులు వీరు; అల్ల వా రర్ధరధులు;
అరుగొ సమరధు లచట; మహారధు లిట;
యుద్దసన్నద్డులై నిల్చియున్నవారు
రాజసుతులు నిజధ్వజ రాజి వెలయ.
భట హుంకృతు లొక యెడ, గజ
ఘట ఘీంకృత లొక్కయెడ, నఖండిత భేరీ
పటు భాంకృతులు లింకొక యెడ,
అట నట జ్యాటంకృతులు, ధ్వజాహంకృతులున్.
కేల పెనువిల్లు వెలయ, నుత్తాల తాల
కేతనమ్ము ధరించి మీ తాతగారు
కౌరవాధీశు సేనాముఖమ్మునందు
అలరుచున్నాఁడు చూచినావా కిరీటీ!
"కదలివచ్చిన హిమవన్నగంబో!" లేక,
"గడ్డకట్టిన పుంస్త్వమో!' కాక "రూపు
నందుకొన్నట్టి వీర రసావతార
మో" యన వెలుంగు వృద్దగాంగేయమూర్తి.
ప్రాత రుత్పుల్ల పంకజశ్రీ తలిర్చు
ఆ కనుల కెంత బ్రహ్మచర్య ప్రదీప్తి!
కదలుచున్న ఆ తెల్లని గడ్డమెంత
పండిపోయెనో క్షాత్ర తపస్సునందు!
ఈ మహామహుఁడైన పితామహునకు
ప్రేమ యదికంబు మీ మీఁద ; నేమి సేయు
తప్పదయ్యే - వేల్పులు మింటఁ గుప్పవడిరి
తాత మనుమల ద్వంద్వయుద్దమ్ము సూడ!
భీష్మ పార్శ్వాన ధీరగంబీరమూర్తి
కురుకులాచార్యుఁ డున్నాడు కుంభజుండు;
కంటే కాంచనమయవేధికాపతాక!
సమరజయలక్ష్మీ కదియ విశ్రాంతిపీఠి!
అస్త్రవిద్యా రహస్యము లన్ని తెలిపె;
కుంభభవునకు నీవన్న కూర్మి పెద్ద;
శైశవాభ్యస్త మగు ధనుశ్శాస్త్రమందు
శిష్యుని గురూత్తముఁడు పరీక్షించు నేఁడు.
అతఁడె! శకునాలపక్షి; పండితుఁడు మాయ
పాచికల; మ్రుచ్చు కనుబొమల్ సూచినావె!
దొంగజూదమ్ములో సిరుల్ దోచుకొన్న
మీ సుయోధను గారాబుమేనమాయ!
అల్లదే! ముద్దుబావ జయద్రధుండు
సింధుడేశాధిపతి దయచేసినాఁడు
సోదరీమణి పాంచాలి జోలికేగి
తియ్య తియ్యఁగ తన్నులు దిన్నవాఁడు !!
భద్రగజము వీపుపైన, అక్షౌహిణుల్
పదునొకండు తన్ను బలిసి కొలువ;
వెల్లగొడుగు క్రింద వేంచేసియున్నాఁడు
పెద్దతండ్రిగారి పెద్ద కొడుకు!
ఇండ్లు గాల్చుటందు, ఇల్లాండ్ర వస్త్రమ్ము
లొల్చుటందు, మేటి యుక్కలుండు!
కుటిలబుద్ది; వీని గుణము నూహింపంగ
పడగమీఁది నాగుబాము చాలు.
రాజు ప్రక్క నంగరాజు వీక్షించితే!
శక్తిశాలి; సూర్యసన్నీభుండు;
పౌరుషమ్ము మొలచె కోర మీసాలలో;
విప్ర శాప లుప్త వీర్యుఁడితడు!
అరుగొ! దుశ్శాసనాది సోదరశతంబు
అన్న కిరువైపులం గాచియున్నవారు;
లక్ష్మణాదులు వచ్చి రాలమ్ముకొఱకు
కురుకుల కిశోరములు కనుంగోను కిరీటి!
మనకు సాయమ్ము సలుప రా; మార్గమందే
మాయచేసి స్వపక్షమ్ము మలపే రాజు;
మద్రదేశాధినేత మీ మామగారు
శల్యుఁ డల్లడుగో వచ్చె సమరమునకు.
అతఁడు భగదత్తుఁ! డితఁడు బృహద్బలుండు!
వాఁడె కృతవర్మ! భూరిశ్రవస్సు వీఁడె!
బాహ్లిక సుదక్షిణాదు లాప్రక్క! సోమ
దత్తుఁ డీప్రక్క నిలిచి రాయత్తు లౌచు!
ఆప్తులు కౌరవేశ్వరున కత్యధికంబుగ; శౌర్య ధైర్య సం
దీప్తులు; నిగ్గుదేరి చలిదీరిన వా; రొకపాటి పోరికిన్
దృప్తి వహింపఁబోరు; సమితింజయు లందఱు రాజువెంట సం
శప్తకు లున్నవా రదే సుశర్మముఖుల్ పదివేవు రర్జునా!
అరదము లొప్పు దీవుల క్రియన్, ధరణీధర సన్నిభమ్ములై
ద్విరదము లొప్పు, నంబువు గతిన్ రజ మొప్పు, భటాళీ వొల్చు వా
శ్చరములటుల్, తురంగము లెసంగు తరంగములో యనన్, మహా
శరనిధి భంగి సున్న కురుసైన్యముఁ గంటె ప్లవంగకేతనా!