మంచి చెడుల గురించి వేమన చెప్పిన ఉదాహరణలు!

మంచి, చెడు అనేవి జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.మనిషి మంచితనంతో ఉంటేనే గౌరవించబడతాడు. మంచితనమే మనిషికి ఆభరణం కూడా. ఇదే విషయాన్ని వేమన తన పద్యాల్లో  ఇలా చెబుతాడు ….

కానివాని తోడ గలసి మెలగుచున్న 

గానివాని గానె కాంతు రతని 

తాటి క్రింద పాలు ద్రాగిన చందమౌ 

విశ్వదాభిరామ వినుర వేమ.

మంచివాడైనా, దుష్టులతో కలసి తిరిగితే చెడ్డవాడనే పరిగణనకే గురవుతాడు. తాటి చెట్టు కింద కూచుని పాలు తాగుతున్నా, తాటికల్లు తాగుతున్నాడనే అనుకుంటారు కదా! వ్యక్తి జీవితంలో ఇది చాలా ముఖ్యమైన విషయం. తాను ఎలాంటి వాడు అనేది ఇతరులకు చెప్పినా… తాను తప్పు చేయకపోయినా, చెడు జరుగుతున్నచోట ఉన్నాడంటే తప్పకుండా ఆ చెడులో అతనికి భాగం ఉందని అనుకుంటారు చాలామంది. 

'వాడి మిత్రులెవరో చూపించు. వాడు ఎటువంటివాడో నేను చెప్తాను' అంటాడు ఒక తత్త్వవేత్త.

అంటే, మన స్నేహితుల ద్వారా మన వ్యక్తిత్వం ప్రస్ఫుటమౌతుందన్న మాట.

సాధారణంగా, ప్రతి వ్యక్తికీ, ఇష్టాయిష్టాలు ఉంటాయి. ఆ ఇష్టాయిష్టాలు అతడు పెరిగిన వాతావరణం, సంస్కారం వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఆ ఇష్టాయిష్టాల ఆధారంగా అతడు కొందరు వ్యక్తులకే దగ్గర అవుతాడు. తన ఇష్టాయిష్టాలకు విరుద్ధంగా ఉన్నవారితో అతను ఎంతమాత్రం కలవలేడు.  అందరితో కలసి తిరుగుతున్నా, కొందరి తోటే అత్యంత సన్నిహితంగా వెళ్ళగలుగుతాడు. ఆ సన్నిహితులు ఎవరో గమనిస్తే చాలు, వ్యక్తి స్వభావం , స్వరూపాలు అర్థమైపోతాయి. వారు మంచివారైతే పరవాలేదు. వారు చెడ్డవారైతే, ఇవతల వ్యక్తి మంచివాడైనా అనుమానాస్పదుడే అవుతాడు. ఎందుకంటే, అటువంటి వారి సాంగత్య ప్రభావం వ్యక్తిపై ఎంతో కొంత తప్పకుండా ఉంటుంది. ఏదో ఓ రోజు అది ఫలితాన్ని చూపిస్తుంది. ఎందుకంటే….

వేరుపురుగు చేరి వృక్షంబు చెరచును.

చీడపురుగు చేరి చెట్టు వెఱుచు 

కుత్సితుండు చేరి గుణవంతు చెఱచురా

విశ్వదాభిరామ వినురవేమ! 

వేరు పురుగు వృక్షాన్ని, చీడపురుగు చెట్టును నాశనం చేసినట్టు. దుర్మార్గుడు గుణవంతుడిని పాడు చేస్తాడు. అని చెబుతాడు వేమన...

అందుకే ఓ సందర్భంలో వివేకానందస్వామి, "మీరు గుహలో దాక్కుని అయినా ఓ మంచి ఆలోచన చేయండి. ఎందుకంటే ఆలోచన అత్యంత శక్తిమంతమైనది. గుహలో దాక్కుని చేసిన ఆలోచనే అయినా అది గుహలో గోడలను దాటుకుని, అనంత విశ్వంలోకి ప్రయాణిస్తుంది. ప్రజల ఆలోచనలపై ప్రభావం చూపిస్తుంది" అంటాడు. 

కాబట్టి ఎల్లప్పుడు మంచి ఆలోచనలపైనే దృష్టి నిలపాలి. అలా కాక దుర్మార్గులు, దుష్టులుగా పరిగణించే వారి సాంగత్యంలో ఉంటే, వాళ్ళ నడుమ తుచ్ఛమైన ఆలోచనలే వస్తాయి. ప్రభావం చూపిస్తాయి.  అందుకే మనిషి ఎప్పుడూ ఆలోచనల్లోనూ… ఆచారణల్లోనూ…. సన్నిహితంగా వెళ్లడంలోనూ… మంచితనమనే మార్గంలోనే వెళ్ళాలి. కొందరు అనుకుంటూ వుంటారు. వాడితో మనకు అవసరం ఉంది. వాడు చెడ్డవాడు అయితేనేమి?? మనం మంచిగా ఉన్నంత వరకు మనకేమీ సమస్య ఉండదులే అనుకుంటారు. కానీ…. మంచివాడు అయినా అవసరం కోసమో… లేక పని కోసమో… చెడ్డవాడితో కలసి తిరుగుతూ ఉంటే చుట్టూ ఉన్నవారి దృష్టిలో వీడు ముందు మంచిగానే ఉండేవాడు కదా… డబ్బు కోసమో… సుఖాల కోసమో చెడుబాట పట్టాడు.. అనుకుంటారు. అందుకే మంచితనంగా ఉండటమే కాదు… మంచివారితో ఉండటం, మంచి మార్గంలో వెళ్లడం కూడా మనిషికి అవసరం.

                                        ◆నిశ్శబ్ద.


More Subhashitaalu