గురువుకు ఉండవలసిన గొప్ప గుణం?

శిష్యుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే గురువు అంతగొప్ప వాడయి వుండాలి అవి భావిస్తూ ఉంటారు చాలామంది. సంఘటిత మతాలు బలంగా వున్న కాలంలో ఒక్కొక్క గురువుకి వేలాదిమంది శిష్యులు ఉండేవారు. ఈ గురువులకు ఊరూరా శిష్యులు, ఆ శిష్యులకు మళ్ళీ శిష్యులే కాక, ఏనుగులు ఒంటెలు వంటి వాహనాలు కూడా వుండేవి. వీరు ఒక ఊరినుండి మరో ఊరికి వెళ్ళాలంటే పల్లకీలలో ప్రయాణం చేసేవారు. అని మోసేందుకు బోయీలుండేవారు. వీరితో బాటు ఈ పటాలమంతా తరలివస్తుండేది. వీరంతా తరలి వచ్చినప్పుడు విడిది ఏర్పాటు చేయడం చాలా పెద్దపనిగా తయారయేది.

ఈ అట్టహాసమంతా చూసి బుద్ధుడు వీరిని "మీ పూర్వీకులు కూడా ఇలా శిష్యగణంతో భోగభాగ్యాలతో ఇలాగే తిరుగుతుండేవారా.” అని నిలదీశాడు.

బుద్ధుడైతే ఈ గురువుల ఆర్భాటాన్ని నిరసించాడు. కానీ, తను వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీద తన శిష్యులు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారని అతడెలా ఊహించగలడు? తన ఆనుయాయులు తాను బోధించిన "సింపుల్" జీవితాన్నే అనుసరిస్తారని ఆశించాడు "సింప్లిసిటీ" లేని ఆధ్యాత్మికత బూటకమవుతుందని చాటి చెప్పాడు. కానీ హర్షవర్ధనుడి కాలంలో ఆ రాజు బౌద్ధుల్ని తన నగరానికి ఆహ్వానిస్తే ఆ బౌద్ధులందరూ తమ శిష్యకోటితో సహా వచ్చేశారు. వీరందరికీ విడిదీ, కావలసిన ఏర్పాట్లు చేసి, బహుమానాలు, కానుకలిచ్చి వెనక్కు పంపేసరికి, హర్షవర్ధనుడి ధనాగారమంతా ఖాళీ అయిపోయిందంటారు.

ఈ గురువులు శిష్యుల్ని దగ్గరకు చేర్చడంలోని ఉద్దేశం మంచిదే అవచ్చు, తాను నేర్చిన విద్య మరొకరికి నేర్పి పోతే, ఆ దీపం ఆరిపోకుండా అలా కొనసాగుతుందనే ఆలోచనే గురువుచేత ఈ పని చేయిస్తుంది. కానీ ఈ గురువు వద్ద చేరిన శిష్యులు విద్యమీద శ్రద్ధ ఎలావున్నా, ఒకరితో ఒకరు పోటీ పడడం ప్రారంభిస్తారు. ఎవరు గురువుయొక్క మన్నన అధికంగా చూరగొంటున్నారు. ఆయన ఎవర్ని ప్రధాన శిష్యుడుగా గుర్తించమన్నారు. ఈయన తదనంతరం ఈ ఆశ్రమం, దీనికి సంబంధించిన ఆస్తులు ఎవరి యాజమాన్యంలోకి రానున్నాయి, ఇవే వారిని వేధించే ప్రశ్నలు. ఈ రకమైన తగాదాలు లేకుండా, కోర్టుల కెక్కకుండా ఉన్న సమాజాలు ఎనున్నాయో, అసలు ఉన్నాయో లేవో లెక్కించి చూస్తే తెల్లబోతారు అందరూ.

ఇదిలావుండగా "మీ గురువుకన్నా మాగురువు గొప్పవాడు. మా గురువుకు దేశ విదేశాల్లో అరవై అయిదు బ్రాంచీలున్నాయి. వాటిల్లో వేల, లక్షల మంది పనిచేస్తున్నారు. మా గురువుకు ఇంత ఆస్తివుంది. మీ గురువుకు ఏమున్నాయి?” అని సవాలు చేసేవారున్నారు.

"మా గురువు రాశిని లెక్కచేయుడు. మాకు వాసి ప్రధానం. మా గురువుకు రష్యా చైనాలలో కూడా శిష్యులున్నారు. మాశిష్య వర్గంలో సగం మంది స్త్రీలు, స్త్రీలకు సముచిత స్థానమిచ్చినవాడు మా గురువే. మా గురువుమాటను ఇన్స్పెక్టరు జనరల్ ఆఫ్ పోలీసు, గవర్నమెంటు ఛీప్ సెక్రటరీ, సేల్స్ టాక్స్ కమీషనర్ శిరసావహిస్తారు. ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఏ గురువుకుంటుంది?” అని ఎదురు సవాలు విసురుతాడు.

"ఇందరు శిష్యుల్ని నేనాకర్షించగలిగాను" అని ఎవరైనా అతిశయం ప్రదర్శిస్తున్నారంటే, ఆధ్యాత్మికతను ఆకర్షణీయంగా చేయడానికి ఏవో తప్పుడు మార్గాలను అనుసరిస్తున్నారన్నమాట. అధ్యాత్మికత, ఆకర్షణ అనేవి పరస్పర విరుద్ధమయిన విషయాలు. ప్రపంచంలోని విషయాల వ్యర్థతను కనుగొని కట్టకడపట ఆధ్యాత్మికతను ఆశ్రయించినవాడే శ్రద్ధాళువు అవుతాడు.

అందుచేత గురువులు తమ శిష్యగణాన్ని పెంచుకోవాలని చూడటం అనర్థదాయకం. నిజమైన గురువు తన ప్రవర్తన ద్వారా ఇతరులకు సత్ప్రవర్తన నేర్పుతాడు. శిష్యులకై ఆరాటపడతాడు.

అమెరికాలో స్థిరపడిన పరమహంస యోగానందను “మాస్టరు గారూ, ఈ అమెరికా దేశంలో డాక్టర్ లీ విన్ మీ ప్రథమ శిష్యుడు కదండీ?" అని ఎవరో అడిగారు.

“అని కొందరంటారు” అన్నాడు యోగానంద. 

పృచ్ఛకుడు కాస్త కంగారైనట్లు గమనించి "నేను ఎవరినీ శిష్యులుగా పరిగణించనండీ. దేవుడొక్కడే గురువు. మనమందరం కూడా ఆయన శిష్యులమే" నని చిరునవ్వుతో ముగించాడు యోగానంద.

ఇదీ గురువుకు ఉండవలసిన గుణం.


                                        ◆నిశ్శబ్ద.


More Subhashitaalu