భగవంతుడి సాక్షాత్కారానికి ఓ చక్కని ఉదాహరణ!
జీవితంలో చాలామంది కోరుకునేది ఆ భగవంతుడి సాక్షాత్కారం. అయితే అది కోరుకున్నంత సులభంగా లభించదు. భగవత్సాక్షాత్కారం అనేది భగవంతుడి అవ్యాజ కృప వల్ల లభిస్తుందే తప్ప, దాన్ని మూల్యమిచ్చి పొందలేం. మనిషి తన అన్వేషణలో ప్రతిగా ఏదో పొందాలనే స్వభావాన్ని వదిలిపెట్టాలి. ప్రాపంచిక విషయాలను పరిత్యజించడం అన్నది ఈ రక్షమైన జీవితంలో ముఖ్యమైన దశ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. అయితే అతడు ప్రాపంచిక విషయాలకు పూర్తిగా దూరమయ్యాడని ఎవరూ చెప్పలేరు. గ్రహించడానికి వీలు కాని అతి సూక్ష్మమైన అంశం అది.
ఉదాహరణకు ఒక వ్యక్తి బాహ్యంగా సంపదలన్నీ విడిచిపెట్టి ఏకాంతంలో ఉండవచ్చు, అయినా అతని మనస్సు మారుమూలల్లో అతనికి తెలియని కోరికలెన్నో ఉండవచ్చు. అంతేకాకుండా తానొక గొప్ప పరిత్యాగిని అన్న భావనే స్వల్ప లౌకికత. ఒక వ్యక్తికి తనకు 'సంపదలున్నాయనే గర్వం ఎలా ప్రతిబంధకమవుతుందో, అలాగే తాను గొప్ప విరక్తుణ్ణి, లేక సమస్తం పరిత్యజించాను అన్న భావనతో అభిమానం ప్రారంభమై అతడిలో అహాన్ని పెంచుతుంది. ప్రాథమికంగా మనం విడిచిపెట్టాల్సింది. “నేను, నాది” అన్న భావనను (మనలోని అహాన్ని)! ప్రాపంచిక జీవితాన్ని పరిత్యజించడం అనేది దానికి మొదటి మెట్టు. అది సంపదలనూ, కోరికలనూ పరిత్యజించడానికి పరాకాష్ఠ. మనలోని అల్పమైన అహాన్ని పరమాత్మకు అప్పగించి, భగవంతుడు తప్ప మరో ఆధారం లేనివారమవ్వాలి.
భగవంతుడి సాక్షాత్కారం కోసం లౌకికతను పూర్తిగా పరిత్యజించి, అపారమైన శాంతిని అలవరచుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేసే కథ ఒకటి ఉంది. దీన్ని రామకృష్ణ పరమహంస గారు తన శిష్యులకు చెబుతూ ఉండేవారు. ఆ కథ ఏమిటంటే…
“ఒకమారు నారదమహర్షి శ్రీమహావిష్ణువు దర్శనార్థం వైకుంఠానికి వెళుతున్నాడు. తోవలో తీవ్రమైన జపధ్యానాదులు చేసే ఒక సాధువు కనపడ్డాడు. నారదుడు వైకుంఠానికి వెళుతున్నట్లు తెలిసి, తనకు ముక్తి లభించడానికి ఇంకా ఎంత కాలం పడుతుందో మహావిష్ణువును అడగమన్నాడు. సరేనని చెప్పి నారదుడు ముందుకు సాగుతుంటే సాధారణ జీవితం గడుపుతున్న ఇంకో మనిషి కనపడ్డాడు. అతను కూడా తనకు ముక్తి ఎప్పుడు లభిస్తుందో శ్రీమహావిష్ణువును అడగమన్నాడు.
వైకుంఠం వెళ్ళి తిరిగి వస్తూ, నారదుడు తన సమాధానం కోసం ఎదురుచూస్తున్న సాధువును కలిశాడు. నారదుడు ఆ సాధువుతో, అతడికి మరో ఏడు జన్మల తరువాత ముక్తి లభిస్తుందని మహావిష్ణువు చెప్పినట్లు తెలియచేశాడు. ముక్తి కోసం అంత కాలం వేచి ఉండాలని తెలిసిన సాధువు దుఃఖించాడు. ఇక నారదుడు రెండో వ్యక్తిని కలిసి, అతనికి ముక్తి లభించడానికి పక్కనే ఉన్న చింత చెట్టును చూపి ఆ చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలు అతడు ఎత్తాల్సి ఉంటుందని తెలియజేశాడు. భగవంతుడి అభీష్టం అదే అయితే అంతవరకూ నిరీక్షించడం తన అదృష్టం అంటూ అతను ఏ మాత్రం విచారించకుండా ఆనందంతో తల ఆకాశం వైపు ఎత్తి చిందులు వెయ్యసాగాడు.
వెంటనే “నీలో పరిత్యాగం, తితీక్ష అన్న గుణాలున్నాయి. నీకు ఇప్పుడే ముక్తి లభిస్తుంది" అని అశరీరవాణి పలికింది. ఆ వెంటనే ఆ సాధారణ వ్యక్తికి ముక్తి లభించింది. కాబట్టి, భగవంతుడి సాక్షాత్కారం లభించాలంటే లౌకికతను పూర్తిగా పరిత్యజించి భగవంతునిపై అపారమైన విశ్వాసాన్ని అలవరచుకోవాలి.
◆నిశ్శబ్ద.
