భాగవతంలో వేదశిరుడు, అశ్వశిరుడు ఎవరో తెలుసా!

కాళియుడు పూర్వజన్మలో వేదశిరుడనే ఒక మునీశ్వరుడు. ఆయన తపస్సు చేసుకునేందుకు అనువైన స్థలం కోసం వెదికి చివరికి వింధ్య పర్వతానికి వెళ్ళాడు.

అదే ప్రాంతానికి అశ్వశిరుడనే మరో మహర్షి కూడా తపస్సు చేసుకునేందుకు వచ్చాడు. అశ్వశిరుడు ఒక రాజు. జైత్రయాతలు చేస్తుండేవాడు. యజ్ఞశాలకు ఒకసారి కపిలుడు, జైగీషవ్యుడు అనే మునులు వచ్చారు. వాళ్ళను సత్కరించి, విష్ణుమూర్తిని ఏ విధంగా ఆరాధిస్తే ప్రసన్నుడవుతాడో చెప్పమని అశ్వశిరుడు అడిగాడు. 'మేమే నరనారాయణులం. మమ్మల్ని కొలిస్తే చాలు, నీకు సర్వశు భాలూ చేకూరుతాయి' అని కపిలుడు, జైగీషవ్యుడు అన్నారు.

మహారాజుకు కోపం వచ్చింది. 'వీళ్ళకి ఇంత అహంకారమా? తమని తాము నరనారాయణులతో పోల్చుకుంటారా?' అని అనుకుని, కోపాన్ని నిగ్రహించుకుని 'విష్ణుమూర్తి నాకు తెలియకపోలేదు. ఆయన పక్షివాహనుడు. శంఖ, చక్రాలు గలవాడు. మీరెందుకు నాకు అసత్యం చెబుతున్నారో, ఆయనతో ఎందుకు పోల్చుకుంటున్నారో తెలియడం లేదు' అన్నాడు.

ఆ మాటలు వినగానే కపిలుడు విష్ణుమూర్తిగా మారిపోయాడు. జైగీషవ్యుడు ఖగేంద్రుడయ్యాడు.

రాజుగారు అదీ నమ్మక "ఇది మీ మాయా ప్రభావం. నిజంగా నువ్వు విష్ణువే అయితే నీ నాభిలో పద్మమేది? అందులో బ్రహ్మ ఏడి?” అని అడిగాడు.

వెంటనే కపిలుని నాభిలో కమలం వచ్చి చేరింది. జైగీషవ్యుడు బ్రహ్మ అయ్యాడు. 'ఇదీ మాయే' అన్నాడు అశ్వశిరుడు. అప్పుడు మునులు అంతర్ధాన మయ్యారు. యాగశాల అంతా క్రూరమృగాలతో నిండిపోయింది. మహారాజు అది చూసి భయపడి మునులను ప్రార్థించాడు. వాళ్ళు ప్రత్యక్షమై మహారాజును దయతలచి మృగబాధను తొలగించి 'రాజా! భగవంతుడు ఎలా వశుడవుతాడని అడిగావు. భగవంతుడు సర్వవ్యాపి అని తెలుసుకో. సమస్త పదార్థాలలోనూ భగవంతుడు వుంటాడు. నీకా విషయం తెలిసేటట్టు చెయ్యడం కోసమే మేము ఇన్ని రూపాలు దాల్చాం' అని చెప్పారు.

వాళ్ళ బోధనలు విన్న అశ్వశిరుడు తన కుమారుడైన స్థూలశిరునకు రాజ్యం అప్పగించి తను తపోవనానికి తరలి వెళ్ళాడు. అక్కడ ఎన్నో ఏళ్ళు తపస్సుచేసిన తరువాత మరింత ప్రశాంతంగా వుండే స్థలం కోసం వెదుక్కుంటూ వింధ్యపర్వతం చేరుకున్నాడు. వేదశిరుడు ఆయనను చూసి 'నువ్వీ ప్రాంతంలో వుండటానికి వీలులేదు. మరోచోటుకి పోయి తీరాలి' అని గర్జించాడు.

వేదశిరుని గర్జన అశ్వశిరునికి ఆశ్చర్యం కలిగించింది. 'ఎందరో మునులు ఇంతకు పూర్వం ఇక్కడ తపస్సు చేసుకున్నారు. ఈ స్థలం మీద ఎవ్వరికీ అధికారం లేదు. నేనిక్కడ నుంచి కదిలేదిలేదు' అని ఖచ్చితంగా చెప్పాడు. వేదశిరుడు మండిపడ్డాడు. అశ్వశిరుడ్ని పరిపరివిధాలా తూలనాడాడు. అనవసరంగా తనను నిందించినందుకూ, తనమీద బుసలు కొట్టినందుకూ 'నువ్వు సర్వమై పుడ్తావు' అని వేదశిరుడ్ని అశ్వశిరుడు శపించాడు.

వేదశిరుడు అశ్వశిరుడ్ని వట్టి వాచాలునిగా భావించి, తన మాటను మన్నించకుండా తనను కారుకూతలు కూసినందుకు 'నువ్వు పక్షివై పుడతావు' అన్నాడు. 

  వేదశిరుడు, అశ్వశిరుడు ఇద్దరూ మహర్షులే. వారిద్దరి ఆశయం శ్రీహరిని ఆరాధించడమే. కాని, వారు కోపాన్ని మాత్రం వదులుకోలేకపోయారు. అది గ్రహించిన విష్ణుమూర్తి వారిని సమీపించి మునులకు ఆగ్రహం పనికిరాదని  బోధించి, సర్పమైన వేదశిరుడ్నీ, పక్షిగా మారిన అశ్వశిరుడ్నీ తనపక్కనే వుంచుకుంటానని వాగ్దానం చేసి వారి బాధను కొంత ఉపశమింపజేశాడు. ఆ తరువాత వేదశిరుడు కాళియుడైనాడు. అశ్వశిరుడు గరుడుడైనాడు. వారిద్దరికీ శ్రీకృష్ణుని అనుగ్రహం పరిపూర్ణంగా లభించింది.

                                     ◆నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories