ఎన్నో రాష్ట్రాల పండుగ ఉగాది!

ఉగాది సరికొత్త కాలానికీ, కొత్త సంవత్సరానికీ సూచన కాబట్టి… మన దేశంలో ఇంచుమించుగా ప్రతి రాష్ట్రమూ ఏదో ఒక సందర్భంలో ఉగాదిని పోలిన పండుగ చేసుకుంటుంది. పంజాబులో వైశాలి, తమిళనాటు పుత్తాండు, అసోంలో బిహు, కేరళలో విషు… ఇవే కాకుండా చేతీచాడ్‌, నవరేహ్‌ లాంటి ఎన్నో పేర్లతో ఉగాదిని జరుపుకొంటారు. అయితే ఇవన్నీ వేర్వేరు సమయాల్లో వస్తాయి. ఉదాహరణకు తమిళనాడులోని పుత్తాండు మన ఉగాదికి రెండు వారాల తర్వాత వస్తుంది. అలాగే వైశాఖిని సౌరమానం ప్రకారం నిర్వహిస్తారు. 

కొన్ని ప్రాంతాల్లో మాత్రం- చైత్ర శుద్ధ పాడ్యమి, అంటే తెలుగువారి ఉగాది సమయంలోనే కొత్త సంవత్సరాన్ని పాటిస్తారు. వాటిలో కొన్ని…
 

గుడిపడ్వ- మరాఠీలు ఉగాది రోజునే తమ నూతన సంవత్సరాన్ని జరుపుకొంటారు. గుడి అంటే జెండా అని అర్థం. ఈ రోజున ప్రతి ఇంటి ముందూ ఒక వెదురు కర్రని ఉంచి… దాన్ని వేప, మామాడి ఆకులు పూలతో అలంకరిస్తారు. ఆ కర్ర మీద ఇత్తడి, రాగి లేదా వెండి చెంబును బోర్లిస్తారు. రావణాసురుని ఓడించిన రాముడు, అయోధ్యకు తిరిగి వచ్చిన విజయానికి సూచనగా దీన్ని పేర్కొంటారు. మరికొందరు దీన్ని బ్రహ్మధ్వజంగా కూడా ఆరాధిస్తారు. మన తెలుగువారిలాగానే మహరాష్ట్రాయులు కూడా ఇంటి ముంగిళ్లను రంగురంగుల ముగ్గులతో అలంకరిస్తారు. మన ఉగాది పచ్చడిలాంటి వంటకాన్నీ చేసుకుంటారు.
 

చేతిచాంద్‌- సింధీలు ఈ రోజు జరుపుకొనే పండుగ పేరు ఇది. చాలా ఏళ్ల క్రితం, ఒక దుర్మార్గుడైన పాలకుడి నుంచి రక్షించమంటూ సింధీలు వరుణదేవుడిని ప్రార్థించారట. వారి వేడుకోళ్లకు కరుణించిన వరుణుడు, ఝూలేలాల్‌ పేరుతో

అవతరించి వారి కష్టాలను తీర్చాడు. ఆ సందర్భాన్ని తల్చుకుంటూ దగ్గర్లో ఉన్న చెరువుకు ఊరేగింపుగా బయల్దేరతారు. ప్రసాదం, దీపం, కలశం లాంటి పూజాసామగ్రితో సాగే ఈ యాత్రను బహరానా సాహిబ్‌ అంటారు. 

కర్ణాటక- కన్నడనాట ఉగాది దాదాపుగా తెలుగువారి ఉగాదిని పోలి ఉంటుంది. ఉదయాన్నే లేచి తలార స్నానం చేయడం, ముగ్గులు వేయడం, మామిడితోరణాలు కట్టడం, కొట్ట బట్టలు వేసుకోవడంతో పాటుగా… విగ్రహాలకు కూడా శుద్ధి చేసుకుంటారు. మన ఉగాది పచ్చడిలాగానే బేవు బెల్ల అనే ప్రసాదాన్ని తయారుచేస్తారు.
 

కాలం అనంతమైనది. దాన్ని విభజించడం అసాధ్యం. అలాగే కాలానికి తుది, చివర అని విడగొట్టడమూ అసంభవమే. కాకపోతే ఆ కాలంతో పాటుగా ప్రయాణించే మనిషి జీవితం తాత్కాలికమే కాబట్టి… అనంతమైన కాలాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటాడు. ఇక నుంచి కొత్త సంవత్సరం మొదలు అంటూ భవిష్యత్తు మీద ఆశలు పెంచుకుంటాడు. తన సామర్థ్యాన్ని సమీక్షించుకుని మరింత మెరుగ్గా రాణించే ప్రయత్నం చేస్తాడు. అందుకనే ప్రాంతాలకు, పేర్లకు అతీతంగా ఉగాది అందరి పండుగే!

 

- నిర్జర.


More Ugadi