కుశలమైన కర్మను వివరించిన పరమాత్మ!!

 

【బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే౹

తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసుకౌశలమ్||

సమత్వ బుద్ధి కలవాడు తనకు వచ్చిన పుణ్యమును, పాపమును ఈ లోకములోనే విడిచిపెట్టేస్తాడు. కర్మఫలములు అతనికి అంటవు. కాబట్టి నీవు కూడా సమత్వ బుద్ధిని ఆశ్రయించి యుద్ధం చెయ్యి. కర్మలు చేయడంలో ఇది చాలా కుశలమైన మార్గము. దీని వలన ఈ యుద్ధము చేయడం వలన వచ్చే కర్మ బంధనములు నీకు అంటవు.】

ఈ శ్లోకంలో బుద్ధియుక్తుడు అని వాడారు. బుద్ధియుక్తుడు అంటే తన బుద్ధిని సక్రమంగా ఉపయోగించి కర్మలు చేసేవాడు. అటువంటి వాడు ఏవేవో కోరికల కోసం కర్మలు చేసి ఆ కర్మబంధనములలో చిక్కుకోడు. అనాసక్తంగా, నిష్కామంగా కర్మలు చేస్తాడు కాని శ్రద్ధతో చేస్తాడు. అటువంటి వాడికి వాడు చేసే కర్మల వలన కలిగే పుణ్య పాపములు అంటవు, ఎందుకంటే ఆసక్తితో, కోరికలతో కర్మలు చేస్తేనే ఆ కర్మల పుణ్యపాపములు, వాటి తాలూకు వాసనలు చేసిన వాడికి అంటుతాయి. కాబట్టి బుద్ధియుక్తులు అయిన వాళ్లు, నిష్కామ కర్మలను ఎటువంటి ఆసక్తి లేకుండా చేస్తారు.

ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది. బుద్ధిని ఉపయోగించి కర్మలు చేయడం అలవాటు అయితే, అతడు ఎటువంటి అధర్మ కార్యములను చేయడు. కేవలం పుణ్య కార్యములు ధర్మకార్యములు మాత్రమే చేస్తాడు. బుద్ధి ఉపయోగించకుండా, కేవలం మనసు చెప్పినట్టు చేసేవాడు, తన కోరికలు, విషయ వాంఛలు తీరడం కోసం, పాపపు పనులు కూడా చేసే అవకాశం ఉంది. ఆత్మజ్ఞానం సంపాదించడం కూడా బుద్ధితో చేసే కార్యమే. ఆత్మజ్ఞానం కోసం. ప్రయత్నించేవాడు  అనుచితకార్యముల మీద ఆసక్తి చూపడు. ఒక వేళ ఏపని అయినా చేయాల్సివస్తే దానిని నిరాసక్తంగా, ఏకోరికా లేకుండా చేస్తాడు. అటువంటి కార్యముల యొక్క పుణ్యపాపములు అతనికి అంటవు.

ఇక్కడ సు కౌశలమ్ అనే మాట వాడారు. కుశలత్వంతో అంటే నేర్పుగా, పుణ్య పాపములు అంటకుండా కర్మలుచేయడం. బుద్ధిని ఉపయోగించి, మంచి చెడులను విచారించి కర్మలు చేయడం. కేవలం మంచి కర్మలు, పుణ్య కర్మలు మాత్రమే చేయడం, చెడు కర్మల జోలికి పోకపోవడం, దీనినే కౌశలమ్ అంటారు. సుకౌశలమ్ అంటే ఇంకా అత్యంత నేర్పుతో కర్మలు చేయడం.

కృష్ణుడు ఇప్పటి దాకా, కర్మలను నిష్కామంగా ఏ విధమైన ఫలా పేక్ష లేకుండా చేయాలి. నిశ్చయాత్మకమైన బుద్ధితో చేయాలి. సమత్వ బుద్దితో చేయాలి. అంటే ఆకర్మకు మంచి ఫలం వచ్చినా చెడ్డ ఫలం వచ్చినా ఒకే విధంగా స్పందించాలి. చేయ బోయే కర్మ సిద్ధిస్తుందో సిద్ధించదో అనే సందేహము పనికిరాదు. చిత్తశుద్ధితో కర్మలను చేయాలి అని చెప్పాడు. ఇప్పుడు మరొక విషయం చెబుతున్నాడు. పైన చెప్పిన విధంగా కర్మలను చేస్తే వాడికి జ్ఞానం కూడా కలుగుతుంది. వాడిలో ఉన్న అజ్ఞానం, అవివేకము తొలగిపోతుంది. అది ఎలా జరుగుతుంది అంటే నిష్కామ కర్మలను చేయడం వలన వాడికి పాపము అంటదు, పుణ్యము రాదు. వాడిలో సుకృతము ఉండదు. దుష్కృతము ఉండదు. సమంగా ఉంటాడు. ఈ సమత్వ బుద్ధికలిగి ఉండటమే జ్ఞానము. 

నీవు ఆ పని చేయాలి కాబట్టి ఆ పని చేయడం నీ ధర్మం కాబట్టి, శ్రద్ధాభక్తులతో ఆపని చేస్తావు. ఆ పని తాలూకు పుణ్యపాపములకు అతీతంగా ఉంటావు అదే జ్ఞానము. అందువల్ల నీవు మామూలుగా కాకుండా యోగదృష్టితో అంటే సమత్వభావంతో యుద్ధం చేయాలి. నేను యుద్ధం చేస్తున్నాను, నేనే వీళ్లందరినీ చంపుతున్నాను అని అనుకుంటున్నావు కానీ "ఈ యుద్ధానికి నేను కర్తను కాను" అని అనుకొని యుద్ధం చేయాలి. అటువంటి కర్మనే మంచి కుశలమైన కర్మ అంటారు. నేర్పుగల కర్మ అంటారు. బంధనములను కలిగించని కర్మ అంటారు. పాపపుణ్యములకకు అతీతమైన కర్మ అని అంటారు. ఇంకా చెప్పాలంటే ఆలోచనతో చేసే పనిని కుశలమైన కర్మ అంటారు.

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories