వాలిని తార ఏమని హెచ్చరించింది?


సుగ్రీవుడు వాలి ఇద్దరూ ఒకేలా ఉండటంతో అయోమయానికి గురైన శ్రీరాముడు వాలిని గుర్తుపట్టేందుకు ఒక గజపుష్ప తీగను తెప్పించి దాన్ని హారంలాగా చేసి జయగ్రీవుడి మెడలో వేయించి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళు సుగ్రీవా నేను నిన్ను, వాలిని సులభంగా గుర్తుపట్టగలను ఇప్పుడు అన్నాడు.

వాళ్ళందరూ కిష్కింద చేరుకున్నాక సుగ్రీవుడు వెళ్ళి గట్టిగా తొడలు కొట్టి, కేకలు వేసి "వాలి బయటకురా!!" పిలిచాడు. అప్పుడు వాలి గబగబా బయటకి వస్తుండగా ఆయన భార్య అయిన తార (తార సుషేణుడి కుమార్తె) ఆపింది.

"నన్ను అడ్డుకుంటావు ఎందుకు?? వాడికి ఎంత పొగరు చూడు. మళ్ళీ నన్ను పిలుస్తున్నారు. ఈసారి వాడు నా చేతిలో చచ్చినట్టే" అని ఆవేశంగా ముందుకు వెళ్లబోయాడు వాలి.

తార వాలిని అడ్డుకుంటూ  "ఎందుకయ్యా అలా తొందరపడి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడే ఒక గంట క్రితం వచ్చాడు కదా సుగ్రీవుడు, నవరంధ్రముల నుండి నెత్తురు కారేటట్టు నువ్వు కొడితే ఏడుచుకుంటూ, బాధగా దిక్కులు పట్టి పారిపోయాడు కదా. నువ్వు ఇంట్లోకి వచ్చి ఎంతో సేపు కాలేదు, ఇప్పుడు సుగ్రీవుడు వచ్చి నిన్ను మళ్ళి యుద్ధానికి రమ్మంటున్నాడు. నీకు అనుమానం రావడం లేదా. సుగ్రీవుడు మళ్ళి వచ్చి "వాలి యుద్ధానికి రా" అంటున్నాడంటే నాకు శంకగా ఉందయ్యా. సుగ్రీవుడు నిన్ను ఇప్పుడు పిలవడంలో తేడా నీకు కనపడడం లేదా, చాలా ధైర్యంగా పిలుస్తున్నాడు నిన్ను. ఇప్పుడే దెబ్బలు తిని వెళ్ళినవాడిలో ఉండే బలహీనతలు ఎంవె సుగ్రీవుడిలో కనపడడం లేదు. ఆ స్వరంలో ఒక పూనిక, ఒక గర్వం కనపడుతోంది. సుగ్రీవుడికి వెనకాల ఎవరిదో సహాయం ఉంది, నువ్వు సుగ్రీవుడితో యుద్ధం చేసేటప్పుడు నీకు వేరొకరితో ప్రమాదం పొంచి ఉంది. సుగ్రీవుడికి స్నేహం చెయ్యడంలో మంచి తెలివితేటలు ఉన్నాయి. నేను గూఢచారుల ద్వారా, అంగదుడి (అంగదుడు వాలి, తారలు కుమారుడు) ద్వారా తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఇక్ష్వాకు వంశంలో జన్మించిన అపారమైన శౌర్యమూర్తులైన దశరథ మహారాజు కుమారులైన రామలక్ష్మణులతో ఇవ్వాళ సుగ్రీవుడు స్నేహం చేశాడు అంట. నువ్వు నీ బలాన్ని నమ్ముకున్నావు, కాని సుగ్రీవుడి బుద్ధి బలాన్ని గూర్చి ఆలోచించడంలేదు.

సుగ్రీవుడు నీ తమ్ముడన్న విషయాన్ని మరిచిపోయి, నీ తమ్ముడి భార్యను నీ భార్యగా అనుభవిస్తున్నావు. నీ తమ్ముడిని పక్కన పెట్టుకోవడం మానేసి శత్రుత్వాన్ని పెంచుకుంటున్నావు. మీ ఇద్దరి మధ్యలోకి మూడవ వ్యక్తి రావలసిన అవసరం ఏమిటి, ఇది నీ ఇంటి సమస్య. నా మాట వినీ సుగ్రీవుడిని పిలిచి యువరాజ పట్టాభిషేకం చెయ్యి, అప్పుడు నీ బలం పెరుగుతుంది. నువ్వు, సుగ్రీవుడు ఇద్దరూ చాలా బలమైన వాళ్ళు. మీరిద్దరూ కలిగే ఆ బలం ఇంకా ఎక్కువ జనంటుంది. కానీ మీరు వేరయ్యి మీ బలాలను ఇలా పాడుచేసుకుంటున్నారు. ఇవాళ నీ తమ్ముడు రాముడి నీడలో ఉన్నాడు. రాముడిలా నీడ ఇవ్వగలిగే చెట్టు ఈ ప్రపంచంలో లేదు" అని చెప్పింది.

వాలి శరీరం పడిపోవలసిన కాలం ఆసన్నమయ్యింది, ఈశ్వరుడు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభించాడు అందుకే అంతకాలం తార మాటలు వినడానికి అలవాటుపడ్డ వాలి ఆమె మాట వినడం మానేసి సుగ్రీవుడితో యుద్ధానికి వెళ్ళాడు.

                                    ◆వెంకటేష్ పువ్వాడ.


More Purana Patralu - Mythological Stories