వాలిని గుర్తు పట్టడానికి రాముడి ఉపాయం!!


సుగ్రీవుడు రాముడితో రామా!! మనం ఇప్పుడు వాలి దగ్గరకు వెళదామా?? అని అడిగాడు. 


"తప్పకుండా సుగ్రీవ, బయలుదేరదాము", అని రాముడు అనడంతో అందరూ బయలుదేరారు. ముందు సుగ్రీవుడు వేగంగా వెళుతున్నాడు, ఆయన వెనకాల రామలక్ష్మణులు, సుగ్రీవుడి మంత్రులైన హనుమంతుడు, నీలుడు, నలుడు మొదలైన వారు వెళుతున్నారు.

ముందు వెళుతున్న సుగ్రీవుడు కిష్కింద పట్టణంలోకి వెళ్ళిపోయాడు. మిగిలిన వారందరూ దట్టమైన చెట్ల చాటున, పైకి కనపడకుండా దాగి ఉన్నారు. లోపలికి వెళ్ళిన సుగ్రీవుడు గట్టిగా కేకలు వేసి వాటిని బయటకి రమ్మన్నాడు. సుగ్రీవుడు ఇంత ధైర్యంగా పిలిచేసరికి వాలి ఆశ్చర్యంతో బయటకి వచ్చి

"ఏరా బుద్ధిహీనుడా మళ్ళీ వచ్చావు. నా ప్రతాపం ఏమిటో చూద్దువు కాని, రా" అన్నాడు. 

అప్పుడా వాలి తన పిడికిలిని బిగించి సుగ్రీవుడి శిరస్సు మీద ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి సుగ్రీవుడి నవరంధ్రముల నుండి రక్తం ఏరులై పారింది. సుగ్రీవుడు తేరుకొని వాలిని కొట్టడం ప్రారంభించాడు. వాలి కూడా సుగ్రీవుడిని కొడుతున్నాడు. ఇద్దరూ అలా మోచేతులతో పొడుచుకుంటున్నారు, పాదాలతో కొట్టుకుంటున్నారు, శిరస్సులతో కుమ్ముకుంటున్నారు. అలా కొంత సేపు కొట్టుకున్నాక, ఇంకా బాణం వెయ్యడం లేదు, రాముడు ఎక్కడున్నాడని సుగ్రీవుడు అటూ ఇటూ చూశాడు. కాని రాముడు కనపడలేదు. ఇంక వాలితో యుద్ధం చెయ్యలేక సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీదకి పారిపోయాడు. అప్పుడు వాలి కూడా తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు.

సుగ్రీవుడు ఆ ఋష్యమూక పర్వతం మీద ఒక శిల మీద కూర్చొని, ఒంట్లోనుండి కారిపోతున్న రక్తాన్ని తుడుచుకుంటూ, ఆయాసపడుతూ, ఏడుస్తూ ఉన్నాడు. ఇంతలో లక్ష్మణుడితో కలిసి రాముడు అక్కడికి వచ్చాడు. వాళ్ళని చూడగానే సుగ్రీవుడు "ఏమయ్యా! నేను నిన్ను వాలిని చంపు, అని అడిగాన, నువ్వు వాలిని చంపుతాను అని ప్రతిజ్ఞ చేస్తేనే కదా నేను యుద్ధానికి వెళ్ళాను. నేను వాలిని చంపను అని నువ్వు ఒకమాట చెబితే నేను వెళతాన. ఎందుకు కొట్టించావయ్య నన్ను ఇలాగ" అని రాముడిని ప్రశ్నించాడు.

అప్పుడు రాముడు "సుగ్రీవ! నేను ఇంతకముందు ఎప్పుడూ  వాలిని చూడలేదు. నువ్వు వాలితో యుద్ధం చేస్తున్నప్పుడు వాలి మీద బాణం వేద్దామని అనుకొని వచ్చాను. తీరా వాలి బయటకి వచ్చాక నేను విస్మయం చెందాను. ఎందుకంటే నువ్వు, వాలి ప్రతి విషయంలో ఒకేలా ఉన్నారు. మీరిద్దరూ దెబ్బలాడుకుంటుంటే అశ్విని దేవతలు దెబ్బలాడుకున్నట్టు ఉంది. మీలో ఎవరు వాలి, ఎవరు సుగ్రీవుడో నాకు తెలీలేదు. పోని కంఠ స్వరంలో మార్పు ఉంటుందేమో అని చూశాను, కాని ఇద్దరూ ఒకేలా అరిచారు. ఇద్దరూ ఒకేలా పరిగెడుతున్నారు, ఒకేలా అలంకారం చేసుకున్నారు. ఇద్దరూ ఒకే వేగంతో కొట్టుకున్నారు. నేను ఎలాగోలా నిర్ణయించుకొని, ఇతడే వాలి అయ్యుంటాడు అని బాణ ప్రయోగం చేశానే అనుకో, సుగ్రీవా! అది తగిలినవాడు ఈ లోకములో  ఉండడు. ఒకవేళ ఆ బాణము పొరపాటున నీకు తగిలిందనుకో, నువ్వు నేను కూడా ఉండము.

నిన్ను వాలికన్నా వేరుగా గుర్తుపట్టాలంటే ఒకటే లక్షణం ఉంది. లక్ష్మణా! అక్కడ గజపుష్ప తీగ ఒకటి పాకుతోంది. నువ్వు దానిని పీకి సుగ్రీవుడి మెడలో కట్టు. అప్పుడు పెద్ద పెద్ద పువ్వులచే విరాజితుడై సుగ్రీవుడు ఉంటాడు. అటువంటి మాల లేనివాడై వాలి ఉంటాడు. అప్పుడు నేను వాలిని గ్రహించగలను. సుగ్రీవ! ఆ మాల వేసుకొని మళ్ళి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళు" అన్నాడు.

◆వెంకటేష్ పువ్వాడ.


More Purana Patralu - Mythological Stories