సమస్తాన్ని శాసించే శివనామాష్టక అర్థం!!

 

శివుడికి ఎనిమిది పేర్లు ఉన్నాయి. వాటిని శివనామాష్టకం పేరుతో పిలుచుకుంటారు. ఏ పేరులో ఏమి అర్థం ఉందో తెలుపుతుంది ఈ వివరణ. 
శివుని యెనిమిది పేర్లు
1.శివాయనమః :- సర్వమందు మంగళము కలిగించువాడా నీకు నమస్కారం.
2. మహేశ్వరాయనమః :- తిరోధాన కర్తవైన స్వామీ - నీకు నమస్కారం.
3. రుద్రాయనమః :- వర్తమాన సర్వాపన్నివారకుడైన పరమాత్మ! నీకు నమస్కారం.

4. విష్ణవే నమః :- సర్వేసర్వత్రా వ్యాపించు యున్నవాడా! నీకు నమస్కారము.


5. పితామహాయ నమః - సర్వులకూ మూలకారకుడైనవాడా! నీకు నమ స్కారం.


6. సంసారభిషజే నమః :- చావు పుట్టుకలు, మోహ దుఃఖాదులూ అనే సమస్తమైన ప్రాపంచిక రోగాలనూ ఉపశమింపచేసే వైద్యుడవైన తండ్రీ! నీకు నమస్కారం. 


7. సర్వజ్ఞాయ నమః :- పంచభూతాలూ, ప్రకృతి, జ్ఞానం, అంతఃస్వరూపం, అనంతమైన ఈ సృష్టి, దీని లయకారకమువు అయిన సర్వేశ్వరా నీకు నమస్కారము.


8. పరమాత్మనే నమః :- సమస్తానికి అతీతుడవై వుండీ కూడా - సర్వుల యందూ మానవ భావన గలిగి స్వీయమైందీ - యితరమైనదీ కూడా

లేకుండా భాసించే భగవంతుడా నీకు నమస్కారం.


ఇవి శివుడి అష్టనామాలు. శివనామాష్టకం అని కూడా అంటారు. వీటిలో మొదటి అయిదు - పంచ సాధనలకు నెలవుగా, ఈ జగతికి ఆధారంగా ఉంటాయి. అంటే వాటన్నిటికీ ఆ అయిదు పేర్లలో ఉన్న అంతరార్థం, వాటిలో ఉన్న ఈశ్వరతత్వం ఆధారం అని. అందులో ఉన్న శక్తే ఈ ప్రపంచాన్ని ఆవరించి దీన్ని నడిపిస్తూ ఉంటుంది అని అర్థం.


   ఇక మిగిలిన  మూడు - శుద్ధ నివృత్తి కారకాలై మోక్షాన్ని ప్రసాదిస్తాయి.  ఈ ప్రపంచంలో ఉన్న భక్తులలో చాలామంది జీవితంలో కోరికలు, వరాలు తీర్చమని అడుగుతూ ఉంటారు ఆ దేవుణ్ణి. వాళ్ళను మినహాయిస్తే దేవుడిని ముక్తి ప్రసాదించమని కోరుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఆ పరమేశ్వరుడి చివరి మూడు పేర్లను ఆశ్రయించుకుంటే వాళ్లకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఆ పరమేశ్వరుడు. ఆ మూడు కూడా మోక్ష సాధనకు అంటే మనిషి ఆత్మ, అంతరజ్యోతి దాని ప్రయాణం, ఆత్మ స్వరూపాన్ని దర్శించడం వంటి వాటిని సఫలం చేసే దిశగా భక్తుణ్ణి నడిపిస్తాడు. భౌతిక చింతనలకు దూరం చేస్తాడు. మనిషికి ముక్తే జీవితానికి విముక్తి. 


 ఈ నామాష్టకం గురించి పూర్తిగా కాకపోయినా దాని గురించి ఎంతో కొంత తెలుసుకున్నా కూడా అది సత్ఫలాన్నే అనుగ్రహిస్తుంది. ఎంతగా అంటే ఆ శంకరుడికి ఏమీ లేకపోయినా మనిషి తన ఆత్మనే సమర్పించి భక్తిగా మ్రొక్కి ముక్తి ప్రసాదించమని అడిగినంత.


ఇక్కడ తెలుసుకోవడం అంటే కేవలం వాటి అర్థాలను వివరంగా చదవడం కాదు. ఆయా నామానికి అందులో ఉన్న అర్థానికి, ఆ అర్థం వెనుక ఉన్న కారణానికి ఇలా అన్నీ తెలుసుకుంటే అందులో ఉన్న శివతత్వం, ఆ పేరుకు ఉన్న మహత్తు తెలుస్తుంది. ఇవన్నీ తెలుసుకున్న వాడు ఎంతో అదృష్టం చేసుకున్న వాడు అవుతాడు.

◆ వెంకటేష్ పువ్వాడ


More Shiva