పూర్వం పంచపాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో..., వారి యోగక్షేమాలు విచారించాలని శ్రీకృష్ణుడు వారి దగ్గరకు వచ్చాడు. శ్రీకృష్ణుని చూడగానే ధర్మరాజు చిరునగవుతో ఎదురేగి స్వాగత మర్యాదలతో సత్కరించి ఉచితాసనం ఇచ్చి గౌరవించాడు. కొంతసేపు కుశలప్రశ్నలు జరిగాక.., ‘కృష్ణా..మేము పడుతున్న కష్టాలు నీకు తెలియనివి కాదు. ఏ వ్రతం చేస్తే మా కస్టాలు తొలగిపోతాయో దయచేసి మాకు ఉపదేశంచు’ అని ప్రార్థించాడు ధర్మరాజు. అప్పుడు శ్రీకృష్ణుడు ‘ధర్మరాజా..మీ కష్టాలు తీరాలంటే ‘అనంత పద్మనాభస్వామి వ్రతం’ ఆచరించండి’ అని సలహా ఇచ్చాడు. అప్పుడు ధర్మరాజు ‘కృష్ణా..అనంతుడంటే ఎవరు? అని ప్రశ్నించాడు. ‘ధర్మరాజా.. అనంత పద్మనాభుడంటే మరెవ్వరో కాదు, నేనే. నేనే కాలస్వరూపుడనై సర్వం వ్యాపించి ఉంటాను. రాక్షస సంహారం కోసం నేనే కృష్ణునిగా అవతరించాను. సృష్టి, స్థితి, లయ కారణభూతుడైన అనంత పద్మనాభస్వామిని కూడా నేనే. మత్స్య కూర్మ వరాహాది అవతారాలు నావే. నాయందు పదునలుగురు ఇంద్రులు, అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, సప్తరుషులు, చతుర్దశ భువనాలు,ఈ చరాచర సృష్టి చైతన్యము ఉన్నాయి. కనుక అనంత పద్మనాభస్వామి వ్రతం ఆచరించు’ అన్నాడు శ్రీకృష్ణుడు. ఈ వ్రతాన్ని ‘ఎలా చెయ్యాలి, ఇంతకు ముందు ఎవరైనా చేసారా’ అని అడిగాడు ధర్మరాజు. కృష్ణుడు చెప్పడం ప్రారంభించాడు. పూర్వం కృతయుగంలో వేదవేదాంగవిదుడైన సుమంతుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు దీక్షాదేవి. వీరి ఏకైక కుమార్తె పేరు సుగుణవతి. ఈమెకు దైవభక్తి ఎక్కువ. సుగుణవతికి యుక్తవయస్సు వచ్చేసరికి ఆమె తల్లి మరణించడంతో.. సుమంతడు మరొక యువతిని వివాహం చేసుకున్నాడు. ఇతని రెండవ భార్య పరమ గయ్యాళి. అందుచేత సుమంతుడు తన కుమార్తె అయిన సుగుణవతిని, కౌండిన్యమహర్షికి ఇచ్చి వివాహం జరిపించాడు. సుమంతుడు తన అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వాలని అనుకున్నాడు. ఈ విషయం తన భార్యతో చెప్తే..ఆమె అల్లుడని కూడా చూడకుండా అమర్యాదగా ప్రవర్తించింది. సుమంతుడు తన భార్య ప్రవర్తనకు బాధపడి, పెండ్లికోసం వాడగా మిగిలిన సత్తుపిండిని అల్లునికి బహుమానంగా ఇచ్చి పంపాడు. సుగుణవతి తన భర్తతో కలసి వెడుతూ మార్గమద్యంలో ఒక తటాకం దగ్గర ఆగింది. అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు ధరించి, అనంత పద్మనాభస్వామి వ్రతం చేస్తున్నారు. సుగుణవతి ఆ వ్రతం గురించి ఆ స్త్రీలను అడిగింది. వారు ఇలా చెప్పారు. ‘ఓ పుణ్యవతీ...ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి పర్వదినమందు ఆచరించాలి. వ్రతం ఆచరించే స్త్రీ, నదీస్నానం చేసి, ఎర్రని చీర ధరించి, వ్రతంచేసే ప్రదేశాన్ని గోమయంతో అలికి, పంచవర్ణాలతో అష్టదళ పద్మం వేసి, ఆ వేదికకు దక్షిణ భాగంలో  ఉదకపూరిత కలశాన్ని ఉంచి, వేదికు మరో భాగంలోకి యమునాదేవిని, మద్య భాగంలో దర్భలతో చేసిన సర్పాకృతిని ఉంచి అందులోకి శ్రీ అనంత పద్మనాభస్వామిని ఆవాహన చేసి, షోడశోపచారాలతో అర్చించాలి. పూజాద్రవ్యాలన్నీ 14 రకాలుండేలా చూసుకోవాలి. పదునాలుగు ముడులుగల కుంకుమతో తడిపిన నూతన తోరాన్ని ఆ అనంత పద్మనాభస్వామి సమీపంలో ఉంచి పూజించి, ఏడున్నర కిలోల గోధుమపిండితో 28 అరిసెలు చేసి, స్వామికి నైవేద్యం పెట్టి, వాటిలో 14 అరిసెలు బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని భక్తిగా భుజించాలి. ఇలా 14 సంవత్సరాలు వ్రతం ఆచరించి ఉద్యపన చేయాలి.’ అని చెప్పారు.

వెంటనే సుగుణవతి అక్కడే శ్రీ అనంత పద్మనాభస్వామి వ్రతం ఆచరించి, తన తండ్రి ఇచ్చిన సత్తుపిండితో అరిసెలు చేసి బ్రాహ్మణునికి వాయనం ఇచ్చింది. ఆ వ్రత ప్రభావం వల్ల సుగుణవతి అఖండ ఐశ్వర్యవంతురాలైంది. కౌండిన్యునకు గర్వం పెరిగింది. ఒకయేడు సుగుణవతి వ్రతంచేసుకుని, తోరం కట్టుకుని భర్త దగ్గరకు వచ్చింది. కౌండిన్యడు ఆ తోరాన్ని చూసి, కోపంగా ‘ ఎవర్ని ఆకర్షించాలని ఇది కట్టావు’ అంటూ ఆ తోరాన్ని నిప్పుల్లో పడేసాడు. అంతే...ఆ క్షణం నుంచే వారికి కష్టకాలం మొదలై, గర్భ దరిద్రులైపోయారు. కౌండిన్యునిలో పశ్చాత్తాపం మొదలై  ‘అనంత పద్మనాభస్వామిని’ చూడాలనే కోరిక ఎక్కువైంది. ఆ స్వామిని అన్వేషిస్తూ బయలుదేరాడు. మార్గమధ్యంలో పండ్లతో నిండుగా ఉన్న మామిడిచెట్టు పైన ఏ పక్షి వాలకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. అలాగే...పచ్చగా, నిండుగా ఉన్న పొలంలోకి వెళ్లకుండా దూరంగా ఉన్న ఆబోతుని.., పద్మాలతో నిండుగా ఉన్న సరోవరంలో దిగకుండా నిలబడి ఉన్న జలపక్షులను..మరో ప్రదేశంలో ఒంటరిగా తిరుగుతున్న ఒ గాడిదను, ఏనుగును చూసి.... ఆశ్చర్యపోతూ ‘మీకు అనంత పద్మనాభస్వామి తెలుసా?’ అని అడిగాడు.‘తెలియదు’ అని అవన్నీ జవాబిచ్చాయి. ఆ స్వామిని అన్వేషిస్తూ తిరిగి తిరిగి ఒకచోట సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు అనంత పద్మనాభస్వామికి అతనిపై జాలికలిగి ఓ వృద్ధబ్రాహ్మణుని రూపం ధరించి అతని దగ్గరకొచ్చి, సేదదీర్చి తన నిజరూపం చూపించాడు. కౌండిన్యుడు ఆ స్వామిని పలువిధాల స్తుతించాడు. తన దరిద్రం తొలగించి, అంత్యకాలంలో మోక్షం అనుగ్రహించమని కోరుకున్నాడు. ఆ స్వామి అనుగ్రహించాడు. కౌండిన్యుడు తను మార్గ మధ్యంలో చూసిన వింతలు గురించి ఆ స్వామిని అడిగాడు. ‘విప్రోత్తమా.. తను నేర్చిన విద్యను ఇతరులకు దానం చేయనివాడు అలా ఒంటరి మామిడిచెట్టుగానూ, మహాధనవంతుడై పుట్టినా..అన్నాతురులకు అన్నదానం చేయని వాడు అలా ఒంటరి ఆబోతుగానూ, తాను మహారాజుననే గర్వంతో బ్రాహ్మణులకు బంజరు భూమి దానం చేసేవాడు నీటి ముందు నిలబడిన పక్షుల్లాగానూ, నిష్కారణంగా పరులను దూషించేవాడు గాడిదగానూ, ధర్మం తప్పి నడచేవాడు ఏనుగులాగ జన్మిస్తారు. నాకు కనువిప్పు కలగాలనే వాటిని నీకు కనిపించేలా చేసాను. నీవు ‘అనంత పద్మనాభవ్రతాన్ని’ పదునాలుగు సంవత్సరాలు ఆచరిస్తే నీకు నక్షత్రలోకంలో స్థానమిస్తాను’ అని చెప్పి మాయమయ్యాడు...శ్రీ మహావిష్ణువు. అనంతరం కౌండిన్యుడు తన ఆశ్రమం వచ్చి జరిగినదంతా భార్యకు చెప్పి పదునాలుగు సంవత్సరాలు అనంత పద్మనాభస్వామి వ్రతం ఆచరించి భార్యతో కలిసి నక్షత్రలోకం చేరుకున్నాడు... అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ‘అనంత పద్మనాభస్వామి వ్రతం’ గురించి వివరించి చెప్పాడు.

-యం.వి.యస్.సుబ్రహ్మణ్యం


More Vratalu