చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా దీపావళి జరుపుకుంటున్నామని పెద్దలు చెబుతారు. నరకాసుర వధకు గుర్తుగా, ఆనందంగా జరుపుకునేది దీపావళి పండగ అని కొందరు చెబితే; రావణుడిని జయించి, రాముడు అయోధ్యకు చేరిన సందర్భంగా జరుకునే పండగ దీపావళి అని మరికొందరు చెబుతారు. సిరులు కురిపించమని కోరుతూ దీపావళి సందర్భంగా భాగ్యలక్ష్మిని కొలిచే సంప్రదాయం కూడా దేశంలో అనేకచోట్ల ఉంది. దీపావళితో సిక్కులకు కూడా అవినాభావ సంబంధం ఉంది. సిక్కుల గురువు గురుగోవిందసింగ్ ను మొగలు చక్రవర్తి జహంగీర్ గ్వాలియర్ కోటలో బంధించాడు. కొన్నాళ్ళకు చక్రవర్తి గురుగోవిందసింగ్ ను మాత్రం విడుదల చేయటానికి నిశ్చయించుకున్నాడు కాని, గురుగోవిందసింగ్ తానొక్కడే విడుదల అవటానికి ఇష్టపడక, కోటలోని వారందరినీ కూడా తనతో పాటు విడుదల చేయాలని పట్టుపట్టాడు. జహంగీర్ ఆయన మాట మన్నించి అందరినీ విడుదల చేశాడు. ఆ శుభదినం కూడా దీపావళే. భారతదేశంలో ఉన్న అన్ని సంప్రదాయాలకీ దీపావళితో ఏదో ఒక విధమైన సంబంధం ఉంది. అందరూ పవిత్రదినంగా భావించి, వేడుకలు జరుపుకుంటారు.


More Deepavali