ఈరోజే శుక్ర ప్రదోష వ్రతం.. సాయంత్రం ఈ కథ చదివితే శివానుగ్రహం తథ్యం!
.webp)
ప్రతి నెల ప్రదోష వ్రతం వస్తుంది. ప్రతి మాసంలో వచ్చే కృష్ణపక్ష త్రయోదశి తిథి రోజు ప్రదష ప్రతాన్ని జరుపుకుంటారు జూలై నెలలో ఈ ప్రదోష వ్రతం జూలై 12వ తేదీన జరుపుకుంటారు. ఈ తిథి శుక్రవారం రోజు రావడంలో దీన్ని శుక్రప్రదోష వ్రతం అంటున్నారు. ఈ రోజున, ప్రదోష కాలంలో సాయంత్రం 7:36 గంటల నుండి రాత్రి 9:20 గంటల వరకు.. అంటే 1 గంట 44 నిమిషాలు సమయంలో పరమేశ్వరుడిని ఆరాధించడం, ప్రదోష వ్రతానికి సంబంధించిన కథ వినడం లేదా చదవడం చేయడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది.
శివారాధన ఇలా..
శుక్ర ప్రదోష వ్రత సమయంలో బిల్వ పత్రాలు,, ఉమ్మెత్త, గంగాజలం, అక్షింతలు, పువ్వులు, పండ్లు , చందనంతో శివుడిని పూజించాలి. కొందరు పరమేశ్వరుడి అర్చనలో గంజాయి పాలు లేదా గంజాయిని కూడా అర్పిస్తారు. పూజ తర్వాత ప్రదోష వ్రత కథను వినడం లేదా పారయణ చేయడం చాలా అవసరం. కథను ద్వారా ద్వారా వ్రతం పూర్తవుతుందని , భక్తులకు వ్రతం ఫలితాలు పూర్తీగా లభిస్తాయని అంటారు. శివుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని అంటారు.
శుక్రప్రదోష వ్రత కథ..
పూర్వకాలంలో, ఒక నగరంలో ముగ్గురు ప్రాణ స్నేహితులు నివసించేవారట. ఒకరు రాజు కొడుకు, రెండవవాడు ధనవంతుడైన వర్తకుడి కొడుకు, మూడవవాడు బ్రాహ్మణుడి కొడుకు. ఆ ముగ్గురికీ వివాహమైంది. రాజు కొడకుకు, బ్రాహ్మణుడి కొడుకుకు పిల్లలు కూడా పుట్టారు. కానీ వర్తకుడి కుమారుడికి మాత్రం పిల్లలు లేరు. అతని భార్య పుట్టింట్లోనే ఉంది. మిగిలిన ఇద్దరు స్నేహితులు పిల్లాపాపలతో సంతోషంగా ఉన్నారు, కానీ వర్తకుడి కొడుకు మాత్రం భార్యకు దూరంగా, పిల్లలు లేక జీవితంలో సంతోషం లేకుండా ఉన్నాడు.
ఒకరోజు ఆ ముగ్గురు స్నేహితులు కలిసి మాట్లాడుకుంటున్నారు. స్త్రీ లేని ఇల్లు నిర్జనంగా, నిస్తేజంగా మారుతుందని బ్రాహ్మణ స్నేహితుడు చెప్పాడు. ఇది విన్న వర్తకుడి కొడుకు ఆలోచనలో పడి, తన భార్యను పుట్టింటి నుండి తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. అతను ఇంటికి వెళ్లి తన తండ్రికి తన కోరికను తెలియజేశాడు.
ఆ సమయంలో శుక్రుడు క్షీణదశలో ఉన్నాడని, ఆ సమయంలో కూతురిని గానీ కోడలిని గానీ ఇంటికి తీసుకురావడం అశుభమని తండ్రి వివరించాడు. శుక్రుడు బలంగా మారిన తర్వాతే తన భార్యను ఇంటికి తీసుకురమ్మని కొడుకుకు సలహా ఇచ్చాడు, కానీ ఆ యువకుడు ఆ సలహాను పెడచెవిన పెట్టి తన అత్తగారి ఇంటికి వెళ్ళాడు.
అత్తారింటికి చేరుకున్నాక తన భార్యను తీసుకువెళతానని అతను అత్తమామలను అడిగాడు. వారు అతన్ని వారించడానికి ప్రయత్నించారు, కానీ చివరికి అతని పట్టుదలకు తలొగ్గారు, చివరికి, అతను తన భార్యను తీసుకుని పట్టణం విడిచి వెళుతుండగా, బండి చక్రం విరిగి, ఎద్దులలో ఒకదానికి గాయమైంది. ఆ ప్రమాదంలో అతని భార్య కూడా గాయపడింది.
అయినప్పటికీ, ఆ యువకుడు ఆగకుండా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. మార్గమధ్యంలో, కొంతమంది బందిపోట్లు అతనిపై దాడి చేసి, అతని డబ్బంతా దోచుకుని పారిపోయారు. ఎలాగోలా అతను ఇంటికి చేరుకున్నాడు, కానీ అతని దురదృష్టం అక్కడితో ముగియలేదు. అతను ఇంటికి చేరుకోగానే, ఒక పాము అతన్ని కాటు వేసింది.
పరిస్థితి విషమించడంతో, తండ్రి వెంటనే వైద్యుడిని పిలిచాడు. ఆ యువకుడు మూడు రోజుల కన్నా ఎక్కువ బ్రతకడని వైద్యుడు చెప్పాడు. సరిగ్గా అదే సమయానికి, అతని బ్రాహ్మణ స్నేహితుడు అక్కడికి వచ్చి, శుక్రుడు అస్తమించే సమయంలో భార్యను పుట్టింటి నుండి అత్తింటికి తీసుకురావడం వల్లే ఈ సంఘటనలు అన్నీ జరిగాయని, కోడలిని, కొడుకుతో పాటు తిరిగి పుట్టింటికి పంపమని సలహా ఇచ్చాడు. ఆ సలహా మేరకు వర్తకుడు తన కొడుకు, కోడలిని పంపాడు. అలా పంపాక వర్తకుడి కొడుకు ఆరోగ్యం క్రమంగా బలపడి అతను కోలుకున్నాడట. శుక్ర గ్రహం బలంగా లేనప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని, మరీ ముఖ్యంగా దాంపత్య జీవితంలో సమస్యలు ఏర్పడతాయని, శుక్ర ప్రదోష వ్రతం రోజు పరమేశ్వరుడిని ఆరాధించడం వల్ల ఇలాంటి సమస్యలు అధిగమించవచ్చని పండితులు చెబుతున్నారు.
*రూపశ్రీ.


