సర్వాంగ పూజ అంటే ఏమిటో మీకు తెలుసా?

 

''సర్వాంగ పూజ ఎందుకు?''
భగవంతునికి ధన,వస్తువులను ఇవ్వలేము, మాట సహాయమూ చేయలేము. అయితే, ఆయన మనకు శరీరాన్ని, అందులో ఎంతో అమూల్యమైన అంగాలను సృజించి ఇచ్చాడుకదా! ఆయా అంగాలతో, చేయవలసిన కర్మలను ధర్మపరంగా చేయటమే ఆయనకు మనంచేసే ప్రత్యుపకారం. దానితోనే ఆయన సంతోష పడతాడు అని పెద్దలు నిర్ధారించుకొని, ఒక 'పూజా' విధానాన్ని సూచించారు. దానినే ''సర్వాంగ పూజ లేదా అధాంగ పూజ'' అని అంటారు. ఈ పూజావిధానం ఈ క్రింది విధంగా వుంటుంది. ఇది చాలామందికి తెలిసే వుంటుంది. అయితే, చాలామంది ఈ పూజను యధాలాపంగా చేసేస్తుంటారు. అలాకాకుండా, తత్త్వాన్ని తెలుసుకొని, అనుభవిస్తూ పూజ చేయాలి.

 

 

Share the Best Article About Sarvanga Pooja In Indian Traditions

 

* పాదౌ పూజయామి (పాదాలు) :- ఏదైనా సాధించాలంటే ముందుకు ఒక అడుగు వెయ్యాలికదా. ఆ అడుగు వెయ్యాలంటే పాదాలు వుండితీరాలి. చీకటిలోకూడా ముందుకు పోవటానికి పాదాలకి కళ్ళుంటాయి(స్పర్శ)! షిరిడి సాయిబాబా అంటారు: 'నీవు నావైపుకు ఒక అడుగు వెయ్యి, నేను నీవైపు నాలుగు అడుగులు వేస్తానని'. రేడియో తరంగాలను పొందటానికి ‘యాన్‍టెనా’ ఎట్లా ఉపయోగపడుతుందో, మన శరీరానికి కావాలిసిన శక్తిని; ఆ శక్తిని నియమబద్ధం చేయటానికి అరికాళ్ళు, అరిచేతులు పనిచేస్తాయి. మన శరీరంలోని నాడీమండల వ్యవస్థలో ప్రతి అంగానికి సంబంధించిన నాడులయొక్క ఒకవైపు కొనలు అరిచేతుల్లో, అరికాళ్ళల్లో వ్యాపించివుంటాయి. ఆక్యుప్రెజర్ వైద్య విధానంలో అరిచేతుల్లో, అరికాళ్ళల్లో వున్న అన్ని నాడులను ప్రత్యేకంగా నొక్కటంద్వారా మనలోని శక్తి క్రమబద్ధీకరించబడుతుంది. సహజంగా ఈ ప్రక్రియ మనం రోజూ నడవటంద్వారా జరుగుతుంది. పాదాలకి ఇంత ప్రాముఖ్యత వున్నది కాబట్టే, అలాంటి పాదాలను మనకు ఇచ్చినందుకు కృతజ్ఞతాభావంతో భగవంతుడి పాదాలను పూజించాలి.

* గుల్ఫౌ పూజయామి (చీలమండల బుడుపెలు):- పాదాలను పిక్కలతో అనుసంధానం చేయటానికి ఇవి తోడ్పడతాయి. పాదాలలోకి వచ్చే అన్ని నాడులకు ఇవి రక్షణ కల్పిస్తాయి; పాదాలు కదలటానికి ఇవి ఉపయోగపడతాయి. అందుకనే వీటిని పూజిస్తాము.

* జంఘే పూజయామి (పిక్కలు):- మోకాలుకి పాదాలకి అనుసంధానమై వుంటాయి. పాదాలకి కావలసిన శక్తిని కొవ్వురూపంలో నిల్వచేసుకుంటాయి. అందుకే పిక్కబలం బాగా వుండాలి అని అంటుంటారు. ఇక్కడ వుండే రెండు ముఖ్యమైన ఎముకలే మనిషిని నిటారుగా నిలబెడతాయి. కాబట్టి వీటికి పూజ చేస్తాము.

 

 

Share the Best Article About Sarvanga Pooja In Indian Traditions

 

* జానునీ పూజయామి (మోకాళ్ళు):- ఇవి తొడలని, పిక్కలనీ అనుసంధానం చేస్తాయి. తిరుపతిలో మోకాళ్ళ పర్వతాన్ని ఎక్కాలన్నా, హిమాలయ పర్వతాలని ఎక్కాలన్నా మోకాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఎంతో మనకి తెలిసిందే. అందుకే వాటికి పూజచేస్తాము.

* ఊరుః పూజయామి (తొడలు):- ఇవి పై భాగమైన నడుముకు అనుసంధానించబడి వుంటాయి. వీటికి చాలా ప్రాధాన్యంవుంది. వీటిల్లో కొవ్వు ఎక్కువగావుండి మెత్తగావుంటాయి. మనం కూర్చున్నప్పుడు పరుపులాగా పనిచేస్తాయి. వీటిల్లో కొవ్వు ఎక్కువుగా వుండి, మెత్తగావుండి మన మర్మాంగాలకు దెబ్బతగలకుండా కాపాడుతాయి. వెన్నుపూసలోని ఆఖరి పూసకు కూడా దెబ్బతగలకుండా కాపాడతాయి. ఇంత ముఖ్యమైనవికాబట్టే వీటికి పూజ చేస్తాము.

* కటిం పూజయామి (నడుము):- మన శరీరం మొత్తానికి మధ్యభాగం. పై శరీర భాగంయొక్క మొత్తం బరువు దీనిపై ఆధారపడివుంటుంది.

 

 

Share the Best Article About Sarvanga Pooja In Indian Traditions

 

* ఉదరం పూజయామి:- మనిషి ఆహార రసంనుండి పుడుతున్నాడు. అలంటి ఆహారాన్ని జీర్ణంచేసి, ఆహారరసాన్ని తయారుచేసి శరీరానికి అందచేసే ఒక మహాద్భుత రసాయన కర్మాగారం ఇది అనటంలో అతిశయోక్తి లేదు. తల్లి తన ప్రతిరూపానికి ప్రాణంపోసి, నిలుపుకుని, నవమాసాలు మోసే ప్రధాన అంగం ఇదే. అమ్మ కడుపు చల్లన అనే నానుడి ఎంతో గొప్పది. విషాన్ని అయినా హరించే శక్తి ఈ ఉదరానికి వుంది. వాడి కడుపునిండా ఆలోచనలే అంటుంటాం, కారణం ఆహారం లేకపోతే మెదడుకూడా పనిచేయదు. "కడుపు ఆకలితో వున్నవాడికి దేవుడి గురించి చెప్పొద్దు'' అని శ్రీ వివేకానందుడు అంటాడు, కారణం ఆకలితో అలమటించినప్పుడు ఏ మాటా రుచించదు, తలకెక్కదు కూడా. ఇంతటి ముఖ్యమైన అంగం కాబట్టే, దీనికి పూజ చేస్తాము.

* నాభిం పూజయామి:- త్రిమూర్తులలో బ్రహ్మ పుట్టుకకు, భూమిమీద ప్రాణుల్లో మనుషులకు ఆధారమైనది నాభి. నవమాసాలు అమ్మ పొట్టలో పుట్టి, పెరిగే ప్రాణికి తల్లినుంచి అందే ఆహారం, రక్తం, గాలి అన్నీ బొడ్డుతాడు ద్వారానే కడుపులోవున్న బిడ్డకి అందుతాయి. అందుకే దీనికి పూజ.

* హృదయం పూజయామి:- ఉదరం ఆహార రసాన్ని తయారుచేసినా, దానిని శరీరంలోని ప్రతి కణానికి అందచేయాలంటే, రక్తప్రసరణ ద్వారా హృదయమే కదా చేసేది! 'అమ్మ కడుపులో ప్రాణం పోసుకున్న క్షణంనుంచి, చనిపోయే క్షణంవరకూ అవిశ్రాంతంగా పనిచేసేదే ఈ హృదయం! అందుకే పూజ.

 

 

Share the Best Article About Sarvanga Pooja In Indian Traditions

 

* బాహూమ్ పూజయామి (బుజాలు):- చేతులను శరీరభాగానికి కలిపివుంచే భాగమే భుజస్కంధాలు. ఎంత బరువునైనా ఇవి మోయగలవు. కేవలం భుజబలంతో ప్రపంచాన్నే గెలిచిన మహాధీరులు ఎంతోమంది వున్నారు చరిత్రలో. అంత శక్తి కలవి కాబట్టి వీటికి పూజ చేస్తాము.

* హస్తౌ పూజయామి:- ఇంతకుముందే చెప్పుకున్నాం అరచేతుల్లోకూడా నాడీ కొనలు వ్యాపించివుంటాయి అని. అతి చిన్న పనినుంచి అతి పెద్ద పనులు చేయాలంటే చేతులయొక్క ప్రాముఖ్యం ఎంత గొప్పదో మనకి తెలుసు. కంటిలో నలుసును తీయాలన్నా, పిల్లల్ని ఎత్తుకోవాలన్నా చేతులయొక్క అవసరం ఎంతో వుంది. ఏ పని చెయ్యాలన్నా మన శరీరంలో ఎక్కువగా వాడబడేవి చేతులే. ఆఖరికి భగవంతుడికి నమస్కారం చేయాలన్నా చేతుల్నే వాడతాం. దానం చేసినా-తీసుకున్నా, ఒక ప్రాణిని పెంచినా-చంపినా; రాజదండాన్ని ధరించినా, ముసలితనంలో చేతికర్రను పట్టుకున్నా, తినాలన్నా, మరొకరికి పెట్టాలన్నా, అనుభూతిని స్పర్శద్వారా తెలిపినా, అభయం ఇచ్చి ఆదుకున్నా అన్నింటికీ ఈ చేతులే! అందుకే వీటికి పూజ.

 

 

Share the Best Article About Sarvanga Pooja In Indian Traditions

 

* కంఠం పూజయామి:- మెదడునుంచి మన శరీరంలోని అన్ని అంగాలను అనుసంధానిస్తూ సాగే 'నాడు'లన్నీ కంఠం నుంచే వెళ్తాయి. ఇక గాలి, ఆహారం ఇవి రెండూ కలిసిపోకుండా చూసే ప్రక్రియకూడా కంఠంలోనే జరుగుతుంది. మంచి మాట మాట్లాడాలన్నా, మంచి పాట పాడాలన్నా కంఠం సహకరించాల్సిందే. చెవు, ముక్కు, కళ్ళు, నోరు వీటన్నిటి అంతర్భాగాల సంధానం కంఠంలోనే జరుగుతుంది. ఒక వ్యక్తిని గౌరవిస్తూ పూలదండ వేయాలన్నా, స్త్రీ తన అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవటానికి నగలు ధరించాలన్నా కంఠం ఒక్కటే ఆధారం. ఇంత ముఖ్యమైనది కాబట్టే, కంఠాన్ని పూజిస్తాం.

* దంతం పూజయామి:- ఏ ఆహారాన్ని అయినా కొరకాలన్నా, నమిలి తినాలన్నా, స్వరపేటికనుండి వచ్చే శబ్దాలను నియంత్రిస్తూ ఉఛ్చారణను స్పష్టపరచాలన్నా దంతాలు ఎంతో ఉపయోగపడతాయి. అందుకనే వీటికి పూజ.

* వక్త్రం (నోరు) పూజయామి:- దంతాలను, నాలుకను తన అధీనంలో వుంచుకున్నదే నోరు. చిన్ని కృష్ణుడు యశోదమ్మకు తన నోటిలోనే సమస్త భువనభాండాలనీ చూపించాడు. కనుకనే దీనికి పూజ.

* నాసికాం పూజయామి:- ప్రాణవాయువుని క్రమబద్ధంగా ఊపిరితిత్తులకు పంపాలన్నా, ప్రాణయామంచేస్తూ, నాసికాబంధనం చేస్తూ శరీరంలో ప్రవహించే పంచప్రాణాలను నియంత్రిస్తూ మహా ఋషులు కావాలన్నా ఆధారం నాసికే! అందుకే దీనికి పూజ.

 

 

Share the Best Article About Sarvanga Pooja In Indian Traditions

 

* నేత్రాణి పూజయామి:- ఆశ్చర్యకరమైన ఈ ప్రపంచాన్ని చూడాలన్నా; మన మనస్సులో అలోచనలు కలిగించి, వస్తు, విషయ జ్ఞానాన్ని పొందాలన్నా నేత్రాలదే ప్రధమ స్థానం. మనలోని నవరసాలను ప్రతిబింబించేది నేత్రాలద్వారానే. అన్ని దానాలలో కెల్లా నేత్రదానమే అతి గొప్పది అని పెద్దలు చెప్పటంలో అతిశయోక్తి లేదు. కనుకనే దీనికి పూజ.

* లలాటం పూజయామి:- మనిషి మెదడులోని కొంత ముఖ్య భాగం లలాటం అనబడే ముందుభాగం లోపల వుంటుంది. ధ్యానం చేసేటప్పుడు లలాట భాగంలోని మెదడు ( frontal lobo) నియంత్రించబడుతుంది. యోగభాషలో 'ఆజ్ఞా చక్రం' అని అంటారు. అంటే, మన శరీరంలో జరిగే అన్ని ప్రక్రియలను ఇది ఆజ్ఞాపిస్తుంది. కనుకనే దీనికి పూజ.

* కర్ణౌ పూజయామి:- ఒక మనిషి ఎంత గొప్ప పండితుడైనా, అతను చెప్పేది వినాలంటే మనకి చెవులుంటేకదా సార్ధకత! చెవులు కేవలం వినటమనే పనికాకుండా మరొక ముఖ్యమైన పనినికూడా చేస్తాయి: ఒక చేత్తో బరువులు మోసేటప్పుడు, జారుడుగా వుండే నేలమీద నడిచేటప్పుడు మన శరీరం తూలి క్రింద పడిపోకుండా వుండటానికి చెవులులోని ద్రవం సహాయం చేస్తుంది మనకు తెలియకుండానే!! అందుకనే వీటికి పూజ.

* శిరం పూజయామి:- మన శరీరం మొత్తానికి ఆధిపత్యం వహించేది శిరమే! ఇందులోని మెదడు లేనిదే అసలు ఈ శరీరమేలేదు. మనిషిలోని మానవత్వం, జాలి, కరుణ, కోపం, ప్రేమ, ద్వేషం, అనురాగం, ఆత్మీయత, తెలివి ఒకటేమిటి ప్రతిదీ ఈ శిరస్సులోంచి వచ్చేదే. భగవాన్, ఇన్ని అమూల్యమైన అంగాలను నాకిచ్చావయ్యా అని చెప్పే తెలివిని కలిగివుండేదికూడా ఈ శిరస్సే. కనుకనే ఈ శిరం పూజ.
ఉపసంహారం:- ఏ పని చేసినా, ఏది మాట్లాడినా, ఏ పూజ చేసినా 'త్రికరణ శుద్ధి'గా చేయాలని పెద్దలు చెబుతారు. త్రికరణ శుద్ధిగా అంటే, మనసా, వాచా, కర్మణా అని అర్ధం. భగవంతుడు మనిషికి సంకల్పించటానికి మనసు, మనసులోని సంకల్పాన్ని బయటకు చెప్పటానికి మాట, ఆ మాటను కార్యరూపంలోకి మార్చటానికి జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను ఇచ్చాడు. ఫలితాలను ఆశించినా, ఆశించికపోయినా త్రికరణ శుద్ధిగా చేసిన ఏ కర్మలకైనా సిద్ధించే ఫలితం ఉత్తమమైనదిగా వుంటుంది.


More Aacharalu