రధసప్తమి రోజున ఈ దానం చేస్తే బాధలన్నీ బలాదూర్..

 

 

మాఘశుక్ల సప్తమీ పుణ్యదినంలో సూర్యుడు జన్మించడమే కాకుండా, భూమికి మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చి రథాన్ని అధిరోహించాడని మత్స్యపురాణం చెబుతుంది. అందుకే ఈ రోజుని రథసప్తమి అంటారు. జీవకోటికి చలి తొలగించి, నూతన ఉత్తేజాన్ని నింపే సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగే రథసప్తమి. రథ సప్తమి రోజు చేసే స్నానాలు, వ్రతాలు సూర్యుడికి చేసే పూజలు, దానాలు, తర్పణాదులు అధిక ఫలాన్నిస్తాయి. సూర్యుడు త్రిమూర్తుల ఏకరూపమనీ, సర్వభూతాలు ఆయన వల్లే ఏర్పడ్డాయనీ, సూర్యుడే పరబ్రహ్మ అని సూర్యోపనిషత్తు తెలిపింది. వేదకాలం నుంచే సూర్యారాధన ఉంది. వేదాల్లోని సౌర సూక్తులు, ఆదిత్య హృదయం, గాయత్రీ మంత్రం మొదలైనవి ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. సూర్యుడు నవగ్రహాల్లో ప్రధముడే కాదు, ప్రధానం కూడా. ఆయన పన్నెండు రాశుల్లో సంచరిస్తూ జీవకోటికి శుభాశుభ ఫలితాలు కలిగిస్తాడు.

మాఘ శుద్ధ సప్తమినాడు సూర్యరథం ఉత్తర దిక్కువైపు తిరుగుతుంది. అందుకే మాఘ శుద్ధ సప్తమి రథ సప్తమి అని పేరు వచ్చింది.  సూర్యుడి జన్మతిధిని పురస్కరించుకొని కోణార్క్ దేవాలయంతో పాటు, అరసవిల్లి సూర్యనారాయణ దేవాలయం, తిరుపతి పుణ్యక్షేత్రాలలో.... రథసప్తమి వేడుకలు వైభవోపేతంగా చేస్తారు. భూమి పైకి సూర్యకాంతులు ప్రసరించిన తొలి దినాన్ని రధ సప్తమిగా జరుపుకుంటారు. జీవ కోటికి నూతన ఉత్తేజాన్ని నింపే సూర్యకిరణాలను పూజస్తూ పవిత్ర స్నానాలు పూజలు ఆచరించటం రధ సప్తమి సంప్రదాయంగా వస్తోంది. రధ సప్తమి వేడుకని వైష్ణవాలయాలు సర్వాంగసుందరంగ ముస్తాబయ్యాయి. సూర్యుడి జన్మతిధిని పురస్కరించుకొని ఈ క్షేత్రంలో ఉత్సవాలు చేస్తారు. కోణార్క్ సూర్యనారాయణ ఆలయంతో పాటు తెలుగు రాష్ట్రాలలో వైష్ణవాలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి.

తిరుమలలో ఈ ఉత్సవాన్ని అద్భుతంగా నిర్వహిస్తారు. రధ సప్తమిని ఒక్క రోజుని బ్రహ్మోత్సవంగా భావిస్తారు. తెల్లవారు జామున ఐదున్నర గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు సాయంత్రం చంద్ర ప్రభవాహనసేవతో ముగుస్తుంది. చిన శేష, గరుడ, హనుమంత, కలప్పవ్రుక్ష, సర్వభూపాల ఇలా సప్తవాహనములపై తిరువీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు. మొదట ఉత్తర మాడ వీధిలో ఉత్సవ మూర్తులని ఉంచుతారు. సూర్యోదయం కాగానే తొలికిరణాలు స్వామి వారి నుదుట నుండి నాభి పాదాలను తాకుతాయి.. ఆ వెంటనే వాహన సేవలు...మొదలవుతాయి...మధ్యాహ్నం పుష్కరిణిలో చక్రస్నానఘట్టం. అత్యద్భుతంగా సాగుతుంది. అద్భుతాలకు నిలయమైన కోణార్క్ సూర్యదేవాలయంలో రధ సప్తమి రోజు మరిన్ని అద్భుతాలను భక్తులు చూడవచ్చు. ఈ క్షేత్రంలో సూర్యభగవానుడు, 24 రేఖల చక్రంతో, ఏడు అశ్వాలతో లాగ బడిన రధం మీద ఉన్నట్టు కనిపిస్తుంది.... చక్రం సంవత్సరానికి ప్రతీక..

ఆరు ఆకులు ఆరు రుతువులకు ప్రతీక...
ఏడు అశ్వాలు...ఏడు కిరణాలకు ప్రతీక...
సూర్యుడు ఉదయం పూట....బ్రహ్మలాగ...
మధ్యాహ్నం పూట........మహేశ్వరుడిలాగ
సాయంకాలం పూట....విష్ణువు లాగ భాసిల్లుతాడట.

ఇక రధ సప్తమి నాడు జరిగే పూజా విధానం గురించి... తెలుసుకుందాం....
రథసప్తమినాటి శిరస్నానంలో జిల్లేడు, రేగు ఆకులను (రేగుపండ్లు కూడా) తలపై, భుజాలపై, చేతులపై పెట్టుకొని స్నానం చేయాలట.మన భారతీయ ఆచారాలు మూఢవిశ్వాసాలు కావు. వీటి వెనుక ఎన్నో ఆరోగ్యకరమైన విజ్ఞానాంశాలు నిలిచి వున్నాయి. జిల్లేడు ఆకులకు అర్క పత్రములని పేరు. సూర్యునికి ‘‘అర్కః’’ అని పేరుంది. జిల్లేడులో సూర్యతేజస్సు, సౌరశక్తి ఎక్కువగా ఉంటుంది..అందుకే వీటికి అర్క అని పేరు పెట్టారు. అది గుర్తుండాలనే రథ సప్తమినాడు, సప్త అశ్వములకు చిహ్నంగా ఏడు జిల్లేడు ఆకులను ధరించి స్నానం చేస్తారు. రేగి ఆకులలోను, చిక్కుడు ఆకులలోనూ, సూర్యశక్తి నిక్షిప్తంగా ఉంటుంది. రేగి ఆకులను కూడా శిరస్సున ఉంచుకొని, స్నానం చేస్తారు. జిల్లేడు రేగు ఆకులను కలిపి శిరస్సు భుజముల మీద ఉంచి స్నానం చేస్తారు. సప్త అశ్వములే సప్త స్వరములు, సప్త ఛందస్సులు, సప్త ఋషులు రథ సప్తమీ సూర్యారాధన- ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం. తల స్నానం ముగించి సూర్యుడికి అర్ఘ్యం వదలాలి. 

రథ సప్తమినాడు స్త్రీలు గుమ్మం ముందు 'రథం ముగ్గును' వేసి మధ్యలో జాజుతొ వర్తులాకారం వేయాలి. ముగ్గు పైన గోమయంతో చేసిన పిడకలు వెలిగించి, దాని పైన మట్టితో చేసిన గురిగిని పెట్టి అందులో ఆవు పాలు పోసి పొంగించాలి. ఆ పాలతో పాయసం చేసి సూర్యుడికి నివేదన చేసి అందరూ స్వీకరించాలి. ఇంట్లో సూర్యుడి పటం ఉంటే ఆ చిత్రపటానికి అలంకరణ చేసి యధాశక్తిగా పూజించాలి. సూర్య అష్టోత్తరం, ఆదిత్య హృదయం. సూర్యాష్టకం పఠించాలి. సూర్యుడికి గోధుమలతో చేసిన పాయసం నివేదన చేసి అందరూ స్వీకరించాలి. ఈ రోజు సూర్య నమస్కారాలు చేయడం చాలా విశేషం. ఈ రోజున చేసే స్నాన దాన అర్ఘ్యాలు కోటి రెట్లు పుణ్యం ఇస్తుంది. జాతకంలో రవి దశ జరుగుతున్నవారు, జాతకంలో రవి బాగులేని వారు, రోగ బాధలు అనుభవిస్తున్న వారు ఈ రోజున ఎరుపు వస్త్రము చుట్టిన రాగి చెంబులో గోధుమలు పోసి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి... అంతా అయ్యాక..సూర్యభగవానుడికి నమస్కారం చేసుకొని..

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్....
తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ అంటూ...

నమస్కరించుకొని విశ్రమించండి...


- కుల శేఖర్


More Ratha Saptami