సమస్త సంతోషాలను చేకూర్చే పోలాల అమావాస్య!

శ్రావణమాసం అంటేనే సందడి. పండుగలు, వ్రతాలు, పెళ్లిళ్లు. ఆ మహాలక్ష్మీ స్వరూపాల్లా ఆడవాళ్లు కనిపిస్తారు. సాధారణంగా పౌర్ణమికి ఉన్న ప్రాధాన్యత అమవాస్యకు ఉండదు. కానీ శ్రావణ పౌర్ణమి మాత్రమే కాదు శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య కూడా శ్రేష్ఠమైనదే, అదెంతో విశిష్టమైనది. శ్రావణమాసంలో వచ్చే బహుళ శుద్ధ అమావాస్యను  పోలాల అమావాస్య అని అంటారు. పోలాల అమావాస్య రోజు చాలా మంది చాలా రకాలుగా పూజలు చేస్తారు. 

పశువుల పూజ!!

పోలాల అమావాస్య రోజు పశువుల పూజ అచేయడం చాలా చోట్ల కనిపిస్తుంది. భారతదేశం వ్యవసాయాధారిత దేశం. వ్యవసాయానికి మూలం పశువుల శ్రమ. పోలాల అమావాస్య రోజు పశువులకు పూజ చేసి తమ కృతజ్ఞత తెలుపుకుంటారు. 

పోలాల అమవాస్యకు ముందు రోజు పశువులను చేలలోకి తీసుకెళ్లకుండా ఇంటిపట్టునే ఉంచుతారు. రైతులు దగ్గరలో ఉన్న చిన్నపాటి అడవులకు వెళ్లి అక్కడ కొన్నిరకాల ఆయుర్వేద గుణాలు నిండిన మొక్కల ఆకులను, చెట్టు బెరడులను తీసుకొస్తారు. ఆ తరువాత వాటిని బాగా నూరి మిశ్రమంగా తయారు చేస్తారు. 

మరుసటిరోజు ఉదయమే లేచి పశువులకు బాగా స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగుల కాగితాలు, కాళ్ళకు గజ్జెలు, మూపురానికి రంగుల బట్టలు వంటివి వేసి అలంకరిస్తారు. ఈ అలంకరణకు రంగురంగుల కాగితాలు, పువ్వులు, బట్టలు, శబ్దం చేసే గజ్జెలు ఉపయోగిస్తారు. ఆ తరువాత పశువులకు హారతి ఇచ్చి దంచిన ఆయుర్వేద మిశ్రమాన్ని పెడతారు.అది పశువులకు ఏ రోగాలు రాకుండా కాపాడుతుంది. ఆ తరువాత పశువులను గ్రామ దేవత దగ్గరకు తీసుకెళ్లి దేవత దర్శనం చేసుకున్న తరువాత ఇంటికి తీసుకొస్తారు. పశువులకు దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్లి పిండి వంటలను పెడతారు. వాటికి విశ్రాంతి ఇస్తారు. ఇలా పదువుల పట్ల ఎంతో బాధ్యతగా ఉంటారు.

పురాణాల ప్రకారం శివపార్వతులకు ఎద్దులంటే ఒక అవినాభావ సంబదముంది. ఎద్దులు నందీశ్వరులని పేర్కొంటారు. పార్వతీదేవికి పుత్రసమానులైన ఎద్దులకు ఇలా చేయడం చూసి పార్వతి దేవి సంతోషిస్తుందని. తద్వారా తాము పిల్లాపాపలతో సహా  సంతోషంగా ఉంటామని భావిస్తారు. అలాగే తమతో కష్టం చేసే పశువుల వల్లనే తాము సంతోషంగా ఉంటున్నామనే కృతజ్ఞత కూడా ఉంటుంది. 

పిల్లల కోసం పూజ!!

పోలాల అమావాస్య రోజు ఎంతో కాలంగా సంతానం లేక బాధపడేవారు సంతానం కోరుకుంటూ వ్రతం చేస్తారు. కంద మొక్కకు పూజ చేయడం ఈ వ్రతంలో ఒక భాగం. 

ఈ వ్రతం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ఒక బ్రాహ్మణుడికి ఏడుమంది కొడుకులు పుట్టారు. ఆ ఏడుమంది పెరిగి పెద్దయ్యాక వారికి పెళ్లిళ్లయి వారికి కూడా పిల్లలు పుట్టారు. వారందరూ పోలాల వ్రతం చేసుకోవాలని అనుకున్నారు. కానీ వ్రతం రోజు ఖచ్చితంగా ఏడవ కోడలు బిడ్డ చనిపోయాడు. దాని కారణంగా వారు వ్రతం చేసుకోలేకపోయారు. అలా ప్రతి సంవత్సరం జరుగుతూ వచ్చింది. క్రమంగా మిగిలిన కోడళ్లకు ఏడవ కోడలిమీద కోపం పెరిగింది. వారు తనని ఎన్నో మాటలు అంటున్నారని బాధపడిన ఏడవ కోడలు మళ్ళీ ఏడాది వ్రతం అప్పుడు తన బిడ్డ చనిపోతే ఆ విషయం బయట పెట్టకుండా చనిపోయిన బిడ్డను ఇంట్లో దాచి వ్రతానికి వెళ్ళింది. వ్రతం జరుగుతున్నా మనసంతా ఇంట్లో బిడ్డ మీదనే ఉందేది. 

వ్రతం అయ్యాక ఆమె ఇంటికి వెళ్లి చీకటి పడ్డాక చనిపోయిన బిడ్డ శవాన్ని మోసుకుని శ్మశానానికి వెళ్లి అక్కడ పాతిపెట్టి ఏడుస్తుండగా, ఊరి పొలిమేరలో ఉన్న పోలేరమ్మ ఊరంతా తిరిగి, తిరిగి తన గుడికి వస్తున్నప్పుడు ఏడుస్తున్న ఏడవకోడలి దగ్గరకు వెళ్లి విషయం ఏమిటని అడగగా, ఏడవ కోడలు జరిగింది మొత్తం చెప్పింది.

అప్పుడు పోలేరమ్మ కొన్ని అక్షింతలు ఆ ఏడవ కోడలికి ఇచ్చి ఇవి నీ పిల్లల సమాధుల మీద చల్లి పేర్లతో పిలువు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె చెప్పినట్టు చేయగానే, సమాధులలో నుండి పిల్లలు నిద్రలేచి వచ్చినట్టు వచ్చేసారు. ఏడవకోడలు ఎంతో సంతోషంతో పిల్లలను తీసుకెళ్లి అందరితోనూ జరిగింది చెప్పగానే అందరూ సంతోషించారు. అప్పటి నుండి పోలాల వ్రతం అనేది అందరూ చేసుకోవడం మొదలు పెట్టారు.

ఆరోజు కందమొక్కకు పూజచేస్తారు. కందమొక్కలోకి మంగళగౌరిని కానీ సంతానలక్ష్మిని కానీ అవగాహన చేసి షోడశోపచార పూజ చేస్తారు. తొమ్మిదిరకాల కూరగాయలతో నవకాయ పులుసు చేస్తారు. ఇంకా పిండి వంటలు, పూర్ణం బూరెలు, గారెలు చేస్తారు. మగపిల్లలు సంతానం కావాలని అనుకునేవారు పూర్ణం బూరెలను, ఆడపిల్లలు సంతానం కావాలి అనుకునేవారు గారెలను ముత్తైదువులకు వాయనంగా ఇస్తారు. 

ఇదీ పోలాల అమావాస్య వివిధ రకాలుగా జరిగే తీరుతెన్ను. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఏరువాక పున్నమి తరువాత నుండి పశువులకు వ్యవసాయ పనులతో విశ్రాంతి అనేది ఉండదు. పొలాల్లో చాలా కష్టపడతాయి. అలాంటి పశువులకు పోలాల అమావాస్య నాటికి విశ్రాంతి లభిస్తుంది. 

                                     ◆నిశ్శబ్ద.


More Others