లోకం గురించి పరశురాముని ఆలోచన ఏమిటి?

ఒక రోజు పరశురాముడు దత్తాత్రేయుని సందర్శించడానికి బయలుదేరి మార్గమధ్యలో లోకవ్యవహారం గురించి ఆలోచిస్తూ ఇలా అనుకొన్నాడు…

“అయ్యో! నేను ఇంతవరకు దేనిని గురించి ఆలోచించాలో ఆ ముఖ్య విషయం గురించి ఆలోచించలేదు. ప్రవాహంలో పడి కొట్టుకొనిపోతున్నవాడిలా - ఎలా వెళుతున్నానో, ఎందుకు వెళ్ళుతున్నానో తెలియకుండానే అందరితోపాటు నేను కూడా వ్యవహారం చేస్తున్నాను.

గ్రుడ్డివాని వెంట వెళ్ళే గ్రుడ్డివారివలె ప్రజలందరూ ఒకరిని చూసి మరొకరుగా వ్యవహారములలో మునిగిపోతున్నారు. తాము చేస్తున్న పనికి పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసుకోకుండానే ప్రజలు వ్యవహరిస్తున్నారు. ఎవనికైనా ఒకనికి ఏదో కొంచెం ఫలం దైవికంగా సంభవించడం చూసి, తమకు కూడా అటువంటి ఫలమే అంతకన్నా అధికంగా లభిస్తుందనే పేరాశతో, శక్తికి మించిన పనులను పూనుకొని ఆపదలను కూడా పొందుతున్నారు. ఇదంతా - ఎరను చూసి దానికొరకు గాలములో చిక్కుకొంటున్న చేపలాగా ఉంది. అలాగాక ఈ దిక్కుమాలిన సంసారంలో సుఖం ఏముంది?

దేవతల నుండి క్రిమికీటకముల వరకు అందరూ సుఖం పొందాలనే మిక్కిలి ఆరాటంతో వ్యవహరిస్తున్నారు. నాలుక వలన కలిగే రుచి, మైధునం వలన సుఖం క్రిమికీటకములతో సమానంగానే త్రిలోకాధిపతికీ కలుగుతున్నది. భౌతికమైన ఈ దేహం కొరకే సర్వం కోరబడుతున్నది. ఇది మల మూత్ర మాంసం మొదలైనవాటితో పూర్ణమై, కుత్సితమై, దుఃఖమూలమై ఉంది. దీని మూలంగానే పుత్ర-మిత్ర-కళత్ర రూపమైన సంసారం ఏర్పడుతున్నది. ఇటువంటి దేహమునే తననుగా భావిస్తూ దీనికోసమే పామరుడు, పండితుడు కూడా నింద్యకృత్యములకు పాల్పడుతున్నారు. 

దేహం రోగగ్రస్తమై ముసలితనంలో కృశించి హేయమవడం ఇతరులలో చూస్తున్న ప్రతివ్యక్తి, నా శరీరం మాత్రం అటువంటి బాధలకు లోను కాదు అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. ఈ కుత్సితమైన శరీరమునందే స్త్రీలు, పురుషులు సౌందర్యమును భావిస్తూ భోగలంపటులు అవుతున్నారు. నాలుకయొక్క రుచికి, మైధున సుఖమునకు లోబడి మానవులు ఎల్లపుడూ అతి సమీపంలోనే ఉండే మృత్యువును గమనించడం లేదు.

తమ జీవితం ఎంత అల్పమైందో గుర్తించని ఈ మానవులు దీర్ఘ కాలంలో, ఎప్పటికో లభించు ఫలములను కోరి నిరంతరం పాటుపడుతున్నారు. స్వార్థం కోసం వీరు ఇతరులను చంపడానికి కూడా వెనుకాడరు. ఇలా కామక్రోధ పరాయణులై వీరు పొందే సుఖం ఏమిటి? అల్పసుఖంకోసం వీరు అధిక దుఃఖమునే పొందుతున్నారు. వీరి ఆశలకు అంతం ఎక్కడ? ఆశ ఉన్నంతవరకు సుఖం ఎక్కడ? మనస్సు కామానికి లొంగడమే  మహాదుఃఖము. సర్వసంపదలతో సామ్రాజ్యం లభించినవానికైనా సుఖం ఎక్కడిది? వాటిని ఇంకా అభివృద్ధి చేయాలనే ఆశ వలన, శత్రువులు వచ్చి చంపుతారేమో అనే భయం వలన రాజులకు, ధనవంతులకు కూడా ఎల్లపుడూ దుఃఖమే కలుగుతోంది.

 ఎంతో కష్టపడి మనుష్యులు సంపదలను పొందుతున్నారు. వాటికొరకే మిత్రులు శత్రువులు అవుతున్నారు. పుత్రులు తండ్రులపై తిరగబడుతున్నారు. ప్రియురాలు ప్రియునికి ద్రోహం చేస్తున్నది. భార్యాపుత్రులు కూడా ధనవంతునకు మృత్యువును కోరుతున్నారు. అలా మృత్యువుతో సమానమైన ధనమును కోరుతూ మానవులు కుటుంబమును తమచుట్టూ గూడువలె అల్లుకొని, అందులో చిక్కుపడి బయటకు రాలేక తన్నుకొంటున్నారు. 

ఎవడు ఏ కుటుంబంతో ఎటువంటి సంబంధమును, ఎంతకాలం కలిగి ఉన్నా ఒకప్పటికి వియోగం పొందక తప్పదు. కానీ, భార్యా పుత్రులతో సంబంధం అత్యంత స్థిరమైనట్లుగా స్నేహమును పెంపొందించుకొని, మనుష్యులు చివరకు మహాదుఃఖమును పొందుతున్నారు. ధనములు, జనములు మొదలుగా సర్వము అత్యంత బలిష్ఠమైన మృత్యువుచేత ఆక్రమింపబడి ఉంది. కావున మనశ్శాంతిని కోరే బుద్ధిమంతుడు ఎవడూ వాటిమీద ఆసక్తి చెందకూడదు. ఏది ప్రాప్తిస్తే భయమే ఉండదో, అటువంటి పదమునే బుద్ధిమంతుడు కోరుకోవాలి.  కాబట్టి అభయమును కలిగించే విజ్ఞానం కోసం నేను మహనీయుడైన దత్తాత్రేయుని ఆశ్రయిస్తాను అనుకున్నాడు పరశురాముడు.

                                                   ◆నిశ్శబ్ద.


More Punya Kshetralu