పంచకృత్య పంచాక్షరీ మంత్ర అంతరార్థం!!

పంచ కృత్యాలు అంటే అయిదు కార్యాలు. సృష్టి, స్థితి, సంహర, తిరోభావ, అనుగ్రహాలే పంచకృత్యాలు అనబడతాయి. సృష్టి అంటే పుట్టుక అనే విషయం అందరికి తెలిసినదే, అలాగే సృష్టించబడినది క్రమశిక్షణతో సాగడమే స్థితి, ఈ ప్రపంచం యొక్క స్థూల రూపాన్ని విభజించి దాన్ని సూక్ష్మరూపంగా మార్చడమే సంహారం. ఆ తరువాత సూక్ష్మీకరించబడిన దాన్ని తిరిగి పునఃసృష్టి వరకు పరీక్షించడం తిరోభావం అని అర్థం. ఈ సృస్తి, స్థితి, సంహర, తిరోభావాలు ప్రపంచానికి సంబంధించినవి. అయితే చివరిదైన అయిదవదైన అనుగ్రహం మాత్రం ఆ పరమేశ్వరుడి వల్ల మాత్రమే సాధ్యమయ్యేది. ముక్తిని ఇచ్చేవాడు, మోక్షన్ని కలుగచేసేవాడు, అనుగ్రహాన్ని ప్రసాదించేవాడు ఆ పరమేశ్వరుడు మాత్రమే. భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం మొదలైన పంచభూతాల స్వరూపమే పంచముఖాలు కలిగిన రుద్రుడు. ఈయనే శివుడు.

పరమేశ్వరుని ప్రార్ధించినవారికి, ఆయన్ను పూజించే వారికి భౌతిక సుఖాల మీద మక్కువ ఉండదు. ఆయనలాగే ఈ భూమి మీద మనుషుల్ని కప్పి పెట్టె మాయను వదులుకుని మనుషులు శివసాన్నిధ్యంలో, శివ స్మరణలో ఈ ప్రాపంచిక విషయాలను వదిలి మోక్షం వైపు సాగిపోతారు. అయితే ఆ పరమశివుడి కృపకు దగ్గరగా వెళ్లే సాధనం ఒకటి స్వయానా ఆ శివుడే బ్రహ్మ, విష్ణువులకు ఉపదేశించాడు అదే శివ పంచాక్షరీ మంత్రం.

పంచభూతాల రుద్రస్వరూపము, పంచ అక్షరాల శివశక్తుల మహిమాన్విత పంచాక్షరీ మంత్రము ఎంతో శక్తిమంతమైనవి. ప్రణవ పంచాక్షరీ మంత్రం నుండి త్రిపాద గాయత్రి ఆవిర్భవిస్తే, ఆ గాయాత్రి నుండే సకల వేదాలు పుట్టాయి, మంత్రాలు అవిర్భవించాయి. ఆ మంత్రాలు ఒక్కొక్క దేవుడికి ఒక్కో విధంగా ఉన్నప్పుడు, ఆ మంత్రాలన్నీ గాయత్రి నుండి ఉద్భవించినపుడు, ఆ గాయత్రి కూడా పంచాక్షరిలో నుండి ఆవిర్భవించినపుడు, ఆ పరమేశ్వరుడి పంచాక్షరీ మంత్రం ఎంత గొప్పదో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. 

అందరి దేవుళ్లను మంత్రాలతో పూజించి ప్రసన్నం చేసుకుంటే కోరికలు తీరుతాయి, అయితే పంచాక్షరీ మంత్రాన్ని నిత్యం స్మరించేవారికి కోరికలు తీరడంతో పాటు మోక్షం కూడా లభిస్తుంది. అదే పంచాక్షరీ మంత్రంలో గొప్పదనం. 

ఇంతటి శక్తివంతమైన మంత్రాన్ని ఎప్పుడూ చెప్పుకోకపోయినా కనీసం శివుడికి ఎంతో ఇష్టమైన ఈ కార్తీకమాసంలో వీలైనన్ని సార్లు చెప్పుకోవడం, లేదా పంచాక్షరీ మంత్ర జపం చేయడం వల్ల జీవితంలో ఎంతో మంచి మార్పును చూడగలుగుతారు.

జపం చేయడానికి నిబంధనలు

భక్తవత్సలుడు, శంకరుడు చాలా తొందరగా కరిగిపోతాడు. ఆయనకు చేయవలసిన ఉపచారాలు ఏమీలేదు ఆ గరళ కంఠుడి శివలింగం మీద చెంబుడు నీళ్లు, కాసింత విభూతి, బిల్వపత్ర దళం సమర్పించితే చాలు ఎంతో తృప్తి పడతాడు. వీలైనవరకు కనీసం ఈవిధంగా ఆ పరమేశ్వరుడిని పూజించి, అందుబాటులో ఉన్న నూనెతో దీపం వెలిగించి, ప్రశాంతమైన ప్రదేశంలో సౌకర్యంగా ఉన్న ఆసనం వేసుకుని, శివుడు ఎలాగైతే ధ్యానముద్రలో ఉంటాడో, అలాగే ధ్యానముద్రలో కూర్చుని ఆ ప్రణవ పంచాక్షరీ మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలి. ఇక్కడ లెక్క కూడా అవసరం లేదు, ఎందుకంటే లీనమై చేసే పనిలో లెక్కపెట్టుకోవడం అనేది ఉండదు. అందుకే మనస్ఫూర్తిగా ఆ శివ ధ్యానముద్రను మనసులో నిక్షిప్తం చేసుకుని, అదే ధ్యానముద్రలో ఆయన్నే స్మరిస్తూ ఆ పంచాక్షరీ మంత్రాన్ని జపించడం వల్ల సాక్షాత్తు ఆ పరమశివుడి దగ్గరకు చేరే మోక్షమార్గం లభిస్తుంది.

◆ వెంకటేష్ పువ్వాడ


More Siva Stotralu