గణపతికి ఏనుగు తల ఎందుకు వచ్చిందో తెలుసుకునే కథ...
శ్రీ గణేశాయ నమః
శ్రీ గురుభ్యో నమః
గణాధిపతి అయిన వినాయకుడు పసిపిల్లలు, పెద్దవారు అన్న తేడా లేకుండా పూజించి ఆనందించేలా ఉండే దేవుడు. ఏదైనా చూసి మరచి పోయేలా కాకుండా, ఆలోచింపచేసేలా ఉంటేనే మన మనస్సు శ్రద్ధ పెడుతుంది. వినాయకుడిని చూడగానే ముందుగా ఆకర్షించేది ఆయన ముఖము. ఏనుగు ముఖము. మరి ఆ ఏనుగు ముఖానికి ఉన్న విశిష్టత ఏమిటో తెలుసుకుందామా?
దేవతలకు రాజు అయిన ఇంద్రుడి వాహనము "ఐరావతము" అనే పేరు కల ఏనుగు. ఆ ఐరావతము ఒకసారి శాపకారణముగా "గజాసురుడు" అనే అసురుడిగా జన్మించి వరబలముతో, తపోబలంతో లోకాలను అల్లాడించాడు. దేవత ప్రార్థన పైన శివుడు ఆ రాక్షసుని సంహరించాడు. మరణించే ముందు గజాసురుడు తన చర్మాన్ని శివుడు ధరించాలని, తన శిరస్సు త్రిలోక పూజ్యం అవ్వాలని పరమ దయాళువైన శివుడిని వేడుకున్నాడు. అతని ఆఖరి కోరికను మన్నించిన శివుడు అలాగే అతని చర్మాన్ని తాను ధరించి "గజ చర్మాంబర ధారి" గా పేరు పొందాడు. ఆ తరువాత ఆ గజాసురుని తలను పార్వతీ దేవి నలుగు పిండితో చేసి ప్రాణము పోసిన కుమారుడి తల స్థానములో పెట్టారు. అలా గజాసురుడి తల త్రిలోక పూజితం అయింది.
అయితే ఇక్కడో సందేహం వస్తుంది. ఈ ఏనుగు తలే ఎందుకు? మన పురాణాలలో ఎన్నో ఏనుగులు కనిపిస్తాయి కదా అంటే భగవద్గీతలోని విభూతి యోగమును ఒకసారి చూడాల్సిందే. జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత లోని విభూతియోగములో 27 వ శ్లోకములో
ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం
అని చెప్పారు.
ఏనుగులలో తానే ఐరావతం అని చెప్పారు. అందుకే ఈ గజాసురునిగా పుట్టిన ఐరావతముకు ఈ అదృష్టం పట్టింది. మన అందరకు ఈ చల్లని స్వామి వరంగా లభించాడు. మన అందరకు బాగా తెలిసిన శ్లోకము
శుక్లామ్బరధరమ్ విష్ణుం
శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్
సర్వవిఘ్నోపశాంతయే
మనందరకు బాగా తెలిసిన ఈ శ్లోకము విష్ణు భగవానునికి సంబంధించిందా? గణేశుడిదా అన్న ఒక సందేహం కూడా ఉంది. "విష్ణు:" అన్న శబ్దానికి సర్వ వ్యాపకుడు అన్న అర్ధం ఉంది. ఎక్కడెక్కడ ఒక సమూహము ఉంటే అక్కడక్కడ గణపతి ఉండాలి. గణము అంటే సమూహము. ఈ గణములు ప్రపంచములో ప్రతి చోటా ఉంటాయి కాబట్టి ఇక్కడ "విష్ణుః " అనే పదానికి సర్వ వ్యాపకుడు అయిన భగవంతుడు అంటే గణపతి అని ఇక్కడ అన్వయం సరిపోతుంది కదా. ఇలా సర్వ వ్యాపకుడు అయిన భగవంతుడు గణేశుడికి ఇలా 10 రోజుల పాటు పందిళ్ళలో పూజించడం అనేది మన స్వాతంత్ర సంగ్రామ సమయములో బాల గంగాధర తిలక్ గారి ఆశయ సిద్ధికి తోడ్పాటుగా వచ్చింది. నలుగురు ఈ పూజ పేరుతో ఒక చోట కలుసుకుంటే మనమంతా ఒకటి, మనది ఒకే దేశము, భారత దేశము అన్న ఐక్యత వర్ధిల్లుతుంది అన్న ఆలోచన సాకారమై స్వతంత్ర సంగ్రామములో తన వంతు పాత్ర పోషించింది.
అందుకే ఆ స్వామిని, తెల్లని వస్త్రము ధరించి, ధవళ కాంతులతో మెరిసిపోతూ, నాలుగు భుజాలతో చక్కగా చిరునవ్వుతో ఉండి, అన్ని విఘ్నాలను శాంతింప చేయగలిగిన ఆ స్వామిని కొలిచి తరించాలి. అందుకే విష్ణువు అన్నా, గణపతి అన్నా ఒకటే. మన హిందుత్వములో ఉన్న గొప్పదనం ఏమిటి అంటే మనము ఏ దేవుడిని కొలిచినా ఆ పరమాత్ముడికి చెందుతుంది. అందుకే ఆనందముగా ఆ గణపతిని మనసారా పూజించి తరిద్దాము.