శ్రీ నారసింహ  క్షేత్రాలు - 16
                           
                                                       
దక్షిణ సింహాచలం

 

సముద్రే పశ్చమతటే నారదేన ప్రతిష్టితః
నరసింహాలయం దృష్ట్వా పునర్జన్మనవిద్యతే

ఆంధ్రప్రదేశ్ లో సింహాచలంలోనేకాక శ్రీ వరాహ నరసింహస్వామి పూజలందుకుంటున్న క్షేత్రం ఇంకొకటున్నది తెలుసా మీకు?   అదే ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ.  ఆ ఊరికా పేరు రావటానికికూడా ఈ స్వామే కారణం.  ఎలాంటి సింహాలకైనా రాయడైన నరసింహస్వామి వెలసిన కొండకనుక అది సింగరాయకొండ..అదే ఊరి పేరు.

స్ధల పురాణం
ఈ కొండ పైన వరాహ నరసింహస్వామి కొలువై వుండగా, కొంచెం  దిగువగా యోగ నరసింహస్వామి వెలిసి వున్నాడు.  పూర్వం నారద మహర్షి ఇక్కడ తపస్సు చెయ్యగా నరసింహస్వామి ప్రత్యక్షమయినాడు.  ఆ యోగ నరసింహస్వామిని నారద మహర్షి ఇక్కడ ప్రతిష్టించాడు.   ఈయన ఆలయం చిన్నదే.  దీనిలోంచి మాల్యాద్రికి ఒక సొరంగ మార్గమున్నదని పూజారిగారన్నారు. యోగ నరసింహస్వామి గురించి ఒక విశేషం ప్రచారంలో వున్నది.  ఆయనది ఉగ్రరూపం.  సముద్రంలో వెళ్తున్న స్టీమర్లు ఈయన దృష్టి పడ్డవెంటనే కాలిపోయేవిట.  బ్రిటిష్ వారి సమయంలో ఈ స్వామి దృష్టి సముద్రంలో స్టీమర్ల మీద పడకుండా వాకిలి మార్పించారుట.  అప్పటినుంచీ ఈ సమస్య తొలగిపోయింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు యోగ నరసింహస్వామిది ఉగ్రరూపం కనుక ఇక్కడ శాంత రూపం కూడా వుండాలని కొండమీద వరాహ నరసింహస్వామిని ప్రతిష్టించారు.  ఇక్కడ వరాహ నరసింహస్వామి కొలువై వున్నాడు కనుకనే ఈ క్షేత్రాన్ని దక్షిణ సింహాచలం అంటారు. యోగ నరసిహస్వామికి పక్కనే వీరాంజనేయస్వామి ఉపాలయం వున్నది
.

 

ఆలయ నిర్మాణం

15వ శతాబ్దంలో విజయనగర రాజు దేవ రాయలు ఈ ఆలయాన్ని నిర్మించారని చారిత్రక ఆధారాలద్వారా తెలుస్తున్నది.  ఇక్కడ లభ్యమయిన శాసనం ప్రకారం క్రీ.శ. 1449-50 లో  బండారిసెట్టి, కునిసెట్టి అనేవారిచేత ఆలయం గోడలకి సిమెంటు పని చేయించినట్లు తెలుస్తున్నది. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ క్షేత్రాన్ని దర్శించి, ఆలయ నిర్వహణకోసం ఐదు ఊళ్ళు ఇచ్చారు.  ఆలయ గోపురాన్ని నిర్మింపచేశారు.  ఈయన సమయంలో ఆలయం సర్వతో ముఖాభివృధ్ధి చెందినది.

ఆలయ విశేషం

ఈ స్వామి దర్శనం అప్రయత్నంగా అవుతుందిట.  అంతేకాదు.  దర్శనం చేసుకున్నవాళ్ళకి తప్పకుండా ఏదో ఒక మంచి జరుగుతుందిట.  స్వామి దర్శనం వల్ల ఆ మంచి జరిగిందని తిరిగి ఈ స్వామి దర్శనానికి వచ్చే భక్తులు వున్నారుట.

మార్గం

ప్రకాశం జిల్లాలోని కందుకూరునుంచి 14 కి.మీ. లు, ఒంగోలు నుంచి 29 కి.మీ.లు, కనిగిరినుంచి 64 కి.మీ. ల దూరంలో వున్న సింగరాయకొండకి రైలు (విజయవాడ, చెన్నై), రోడ్డు మార్గాలున్నాయి.

 

- పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


More Punya Kshetralu