శ్రీ నారసింహ క్షేత్రాలు -13
కొసగుండ్ల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం
హైదరాబాదు నగర నిర్మాణం మొదలయి 400 ఏళ్ళు దాటిందంటే అవును కాబోలు అనుకున్నాము. కానీ ఈ నగరానికి 1600 ఏళ్ళ చరిత్రవున్నదంటే ఆశ్చర్యపోతాంకదా!. నిఝంగా నిజమండీ!! మరి వీటికి ఆధారాలెక్కడ దొరుకుతాయంటారా? పురాతన ఆలయాలకన్నా వేరే ఆధారాలేమన్నా వుంటాయా!? ఒక పాత గుడి చూపించి ఇది 700 ఏళ్ళ క్రితందంటే మీరు నమ్మరని తెలుసు. అందుకే అప్పటివారు శాసనాలు వ్రాయించేవారు. అప్పుడు ఈ కాయితాలూ, కంప్యూటర్లూ లేవుకదా. మరి ఆ శాసనం గురించి అందరికీ తెలియాలంటే రాళ్ళమీద చెక్కించేవారు. సాధారణంగా రాజులు అనేక సందర్భాలలో దేవాలయ దర్శనం చేసుకుని, ఆ దేవాలయాభివృధ్ధికి కానుకలిచ్చి వాటి గురించి ఆ దేవాలయంలోనే రాళ్ళమీద శాసనాలు చెక్కించేవారు. వారి కానుకలు ఆలయానికి ఎల్లప్పుడూ ఉపయోగపడేటట్లు భూదానాలు, ఖరీదయిన నగలు వగైరాలుండేవి. సాధారణంగా ఆ శాసనాలమీద వారు ఏ సందర్భంగా, ఏ రోజు ఆ ఆలయం దర్శించిందీ, ఇచ్చిన కానుకల వివరాలూ వుండేవి. వాటి ద్వారానే ఆ ఆలయం సుమారు ఎన్ని ఏళ్ళ క్రితం నిర్మింపబడింది, ఎవరి ద్వారా నిర్మింపబడింది వగైరా గత ఘన చరిత్ర తెలుస్తుంది. సరిగ్గా అలాంటి శాసనమే మన హైదరాబాదుకి 1600 సంవత్సరాల చరిత్ర వున్నదనటానికి ఆధారభూతమయింది.
క్రీ.శ 2015లో తెలంగాణా రిసోర్స్ సెంటర్, హేదరాబాదు వాళ్ళు ప్రచురించిన .. ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ హైదరాబాద్ .. అనే చిన్ని పుస్తకంలో ఈ శాసన వివరాలు ప్రచురించబడ్డాయి. దీని రచయిత శ్రీ ద్యావనపల్లి సత్యనారాయణ. ఈ శాసనం హైదరాబాదులోని చైతన్యపురిలో మూసీనది కుడి ఒడ్డునవున్న కొసగుండ్ల నరసింహస్వామి ఆలయంలో బండ గోడపై వున్నది. దానిని క్రీ.శ. 1983-84లో పురావస్తు శాఖవారు కాపీ చేసి పరిష్కరించారు. ఇక్కడే 50 అడుగుల ఎత్తున ఇంకో శాసనం కూడా వున్నది. సానీ దాని సమీపానికి మనిషి చేరుకోవటం కష్టమవటంవల్ల దానిని కాపీ చేయలేకపోయారు. అలాంటి చోట ఏ సాంకేతిక సహాయమూలేని ఆ రోజుల్లో ఎలా శాసనం చెక్కించారో ఆశ్చర్యంకదూ!? ఆ శాసనం హైదరాబాదు చరిత్రకి సంబంధించిన మొదటి చారిత్రిక ఆధారం. ఈ శాసనం ఆధారంగా సేకరించబడ్డ విషయాలు... ఇది క్రీ.శ. 400 ప్రాతానికి చెందినది.
అప్పటికే హైదరాబాదు కోట గోడలున్న నగరం. చారిత్రకంగా విష్ణుకుండి రాజవంశ స్ధాపకుడు గోవిందరాజు అని, గోవిందరాజ విహారం ఇప్పటి చెతన్యపురిలో వుందని తెలిసింది. దీనిని ఎవరు కట్టించారో తెలిపే రెండు శాసనాలను శ్రీ బియన్. శాస్త్రి నల్గొండ జిల్లా తుమ్మలగూడెంలో సేకరించారు. వీటి ఆధారంగా గోవిందరాజు దక్షిణాపధంలో అనేక స్ధూప, విహారాలను కట్టించారని, తన పేరున చైతన్యపురిలో గోవిందరాజ విహారాన్ని కట్టించారని తెలుస్తున్నది. పూర్వం దీని పేరు పుటగిరి అని, పాండవులు అని పిలువబడిన గిరిజనుల ఆవాసమని కూడా తెలిసింది. శాసనం అని తెలియక దానిమీద సున్నం కొట్టారు. ఇప్పుడది స్పష్టంగాలేదు. కెమికల్ వాష్ చేయించాలి. రెండవ శాసనానికి వెళ్ళే దోవలేదు. దానిని కూడా పరిష్కరించి ఆలయాన్ని అభివృధ్ధి చెయ్యాలని కాలనీవాసులు కోరుతున్నారు.
దేవాలయం విశేషాలు
అతి ప్రాచీనమైన ఈ కొండ ప్రదేశం కాలగమనంలో మనుషులు కాలు పెట్టటానికి కూడా వీలుకాని స్ధలంగా మారింది. ఆ గుట్టలమీదకు ఒక్క మనిషి వెళ్ళే దోవ కూడా లేకుండా పోయింది. అలాంటి ఈ ఆలయాన్ని భక్తుల దర్శనార్ధం పునరుధ్ధరించినవారు శ్రీ శేషాచార్యగారు. ఆయనకి ఒక రోజు స్వప్నంలో నాగుపాము కనబడి తనకి దోవ చూపిస్తూ ఈ గుళ్ళోకి ప్రవేశించినట్లు గమనించారు. ఇది క్రీ.శ. 1951 లో జరిగిన సంఘటన. మర్నాడు ఆయన నాగుపాము చూపించిన ప్రదేశంలో ఆ స్వామి వుండి వుండవచ్చని, కొబ్బరికాయ తీసుకుని ఆ దోవలో వెతుక్కుంటూ వెళ్ళారు, దుర్గమమైన ఆ మార్గంలో కష్టపడి వెతికి, పెద్ద బండరాయి కింద వున్న స్వామి స్పష్టాస్పష్టమైన రూపాన్ని చూశారు. అప్పటినుంచీ ఆయన స్వామికి ధూప, దీప నైవేద్యాలు సమర్పించసాగారు. ఒక మనిషికూడా పట్టే స్ధలం లేని ఆ ప్రదేశాన్ని కొంచెం తొలిచి 2, 3 మనుషులు నుంచునే స్ధలమేర్పరచారు. ముందు మండపం కట్టించి, ధ్వజ స్తంభం ప్రతిష్టించారు.
ఆలయ నిర్మాణం
ఇది ఒక పెద్ద బండరాతి కింద వున్న గుహలో సహజంగా ఏర్పడిన ఆలయం. (ఫోటో చూడండి) గర్భగుడి సహజసిధ్ధంగా వున్నదే. ఈ పెద్ద బండ రాతి కింద వున్న ఒక గోడమీద శ్రీ నరసింహస్వామి, లక్ష్మీ దేవులు దర్శనమిస్తారు. స్వామి శంఖం, చక్రం, తలపైన శేషుడి పడగతో దర్శనమిస్తారు. పక్కనే వున్న ఇంకొక రాతి గోడమీద 5 తలల ఫణీంద్రుడు దర్శనమిస్తాడు. పక్కనే వున్న సన్నటి గుహలో శ్రీ వెకటేశ్వరస్వామి, శ్రీ మహలక్ష్ముల పెద్ద ఫోటోలున్నాయి. వాటి వెనుక గోడమీద వారి ఆకారాలున్నాయట. అవి స్పష్టంగా లేకపోవటంతో అక్కడ ఫోటోలు పెట్టామన్నారు. ఈ బండరాళ్ళ పక్కగా పారుతున్న మూసీ నది మధ్యలో చిన్న శివాలయం వున్నది. తూర్పు ముఖంగా కొలువైన శివుడు త్రిశూలం, ఢమరుకం చేతిలో పట్టుకున్న విగ్రహం వున్నది. కొండ దిగువనే ఆంజనేయస్వామికి చిన్న ఆలయం ఉన్నది. ఈ స్వామి ఉత్తరం ముఖంగా ప్రతిష్టింపబడ్డాడు. ఈయనని సేవిస్తే సకల సంపదలనిస్తాడని విశ్వాసం.
స్వామి వెలసిన గుహ పైన బండరాయి పొడుగ్గా కొసదేరినట్లుంటుంది. ఇక్కడ చాలా బండరాళ్ళు ఒక దానిమీద ఒకటి పేర్చినట్లు కొసదేరి వుంటాయి. అందుకే ఈ ప్రదేశానికి కొసగుండ్ల అనే పేరు. అలాగే ఆలయంలో నాగేంద్రుడు నరసింహ స్వామి తలమీద, విడిగా పక్కన కూడా దర్శనమిస్తాడు. అందుకని ఫణిగిరి అనే పేరు. శాసనం ప్రకారం కూడా ఇదివరకు దీనిని ఫుపగిరి అని వున్నది.
1981 మొదటిసారిగా ఈ ఆలయానికి ఒక కమిటీ ఏర్పడింది. అయినా జనారణ్యానికి కొంచెం దూరంగా వుండటంతో, సరైన ప్రచారం లేక అంతగా అభివృధ్ధి కాలేదు. 2008 లో దేవాదాయ కమిషనర్ శ్రీ సుందర్ రామన్ ఈ ఆలయాన్ని దర్శించి ఇంత పురాతన ఆలయాన్ని యాదగిరిగుట్ట ఆలయంవారిని దత్తత తీసుకోమన్నారు. అప్పటినుంచి ఈ ఆలయం యాదగగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం అధీనంలో వున్నది. ఈ మధ్యనే ఆంజనేయస్వామికి, నవగ్రహాలకీ మండపం ఏర్పరచారు. కళ్యాణ మండపం నిర్మాణంలో వున్నది.
ఉత్సవాలు
నరసింహ జయంతి సందర్భంగా 500 జంటలకు కళ్యాణం జరుగుతుంది. మహాకుంభ అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరుగుతాయి.
మార్గము
దిల్ షుక్ నగర్ దాటిన తర్వాత వచ్చే బస్ స్టాప్ చైతన్యపురి..అక్కడ ఎడమవైపు రోడ్డులో లోపలకి ఒక కిలోమీటరు వెళ్ళాక మళ్ళీ ఎడమవైపు వెళ్ళాలి. అక్కడ ఎవరినడిగినా చెబుతారు.
దర్శన సమయాలు
ఉదయం 6-30 నుంచీ మధ్యాహ్నం 12 గం. ల దాకా, తిరిగి సాయంత్రం 5-30 నుంచీ రాత్రి 8 గం. ల దాకా.
దిల్ష్కుక్ నగర్, చైతన్యపురి హడావిడి ట్రాఫిక్ నుంచి ఆలయం చేరుకునేసరికి ఆ ప్రాంతమంతా ప్రశాంతంగా వుంటుంది. కొండపైకి చేరటానికి దాదాపో 30 మెట్లు ఎక్కవలసి వుంటుంది. చల్లగా వుండే సమయంలో వెళ్తే ఆ సుందర ప్రకృతిలో సేద తీరవచ్చు.
ఆలయాన్ని పునరుధ్ధరించినది శ్రీ శేషాచార్య సెల్ నెం. 944046437
వారి శిష్యులు శ్రీ వేణుగోపాల మూర్తి సెల్ నెం. 9491878376
హైదరాబాదు వాస్తవ్యులు తప్పక దర్శించవలసిన అతి పురాతన ఆలయం ఇది.
- పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)