తెలుగు రాష్ట్రాల్లోని హిందువులకు మరీ ముఖ్యంగా ఆర్యవైశ్యులకు ‘శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి’ అంటే ఎంతటి భక్తో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. వారి కులదైవం అయిన ఈ తల్లిని తలచుకోనిదే వారి జీవితం గడవదు. అలాంటి వాసవి జయంతి వైశాఖ శుద్ధదశమి నాడు, అంటే ఈ నెల 21 (కొన్ని పంచాంగాల ప్రకారం 22)న వస్తోంది. ఇంతకీ ఎవరీ కన్యకాపరమేశ్వరి. ఈసారి వచ్చే వాసవి జయంతి ప్రత్యేకత ఏమిటి తెలుసుకుందాం రండి!

సాక్షాత్తు ఆ పరమేశ్వరి అవతారమైన వాసవీదేవ కథ వెయ్యేండ్ల నాటిది. అప్పట్లో ‘కుసుమ శ్రేష్టి’ అనే నాయకుడు పెనుగొండ రాజధానిగా అక్కడి వైశ్యులకు రాజుగా పరిపాలిస్తున్నాడు. తన భార్య పేరు కుసుమాంబ. ఆ దంపతులకు ఎన్నేళ్లు గడిచినా సంతాన భాగ్యం లేకపోయింది. దాంతో తన గురువు భాస్కరాచార్యుల సలహా మేరకు… పుత్ర కామేష్టి యాగాన్ని చేశారు. యాగ ఫలితమో మరేమో కానీ ఆ దంపతులకు వైశాఖ శుద్ధ దశమి, శుక్రవారం నాడు ఒక బాబు, ఒక పాప… కవల పిల్లలుగా జన్మించారు.

కుసుమ శ్రేష్టి తన కుమారుడికి విరూపాక్షుడనీ, కుమార్తెకు వాసవాంబ అని పేరు పెట్టారు. రోజులు గడిచేకొద్దీ ఇద్దరూ అద్భుతమైన వ్యక్తిత్వాన్ని అందుకున్నారు. కొడుకు యుద్ధవిద్యలలో ఆరితేరి రాజ్యభారాన్ని మోసేందుకు సిద్ధమయ్యాడు. వాసవాంబ సంగీతం, తర్క శాస్త్రాల్లో ఆరితేరి యువతులందరికీ ఆదర్శంగా నిలిచింది. పెనుగొండ అప్పట్లో వేంగి రాజ్యంలో భాగంగా ఉండేది. విష్ణువర్ధనుడు ఆ దేశాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఓ రోజు విష్ణువర్ధనుడు తన రాజ్యాన్ని పర్యటిస్తూ పెనుగొండకు చేరుకున్నాడు. అక్కడ కుసుమ శ్రేష్టి పక్కనే ఉన్న వాసవిని చూసి మనసు పారేసుకున్నాడు. కొన్నాళ్లకి ఆమెను చేసుకుంటానంటూ కుసుమశ్రేష్టికి వర్తమానం పంపాడు.

ఈ సంబంధం కుసుమ శ్రేష్టి కుటుంబానికి ఏమాత్రం ఇష్టం లేదు. అప్పటికే వివాహమై, వయసులో చాలా పెద్దవాడైన విష్ణువర్ధనుడికి… అందాలరాశి, సకలగుణ శీలి అయిన వాసవాంబను ఇచ్చి కట్టబెట్టాలన్న ఆలోచన వారికి సుతరమూ నచ్చలేదు. ఈ తిరస్కారం గురించి విన్న విష్ణువర్ధనుడు మండిపడ్డాడు. వాసవాంబను బలవంతంగా తీసుకురమ్మంటూ తన సైన్యాన్ని పంపాడు. వారిని అడ్డుకునేందుకు పెనుగొండ చుట్టుపక్కల ఉండే 714 గోత్రాల ఆర్యవైశ్యులు సమావేశమయ్యారు. వారిలో కొందరు ఆత్మగౌరవం కోసం చివరి శ్వాస వరకూ విష్ణువర్ధనుడికి వ్యతిరేకంగా పోరాడాలని నిశ్చయించుకోగా, మరికొందరు ఆమెను అప్పగిస్తే ఏ సమస్య ఉండదనే అభిప్రాయంతో ఉన్నారు.

ఈ వాదనలన్నీ విన్న వాసవిదేవి, తన కోసం ఎలాంటి రక్త తర్పణం జరగడానికి ఇష్టపడలేదు. అందుకు బదులుగా, తనకు అనుకూలంగా ఉన్న కొద్దిమందితో కలిసి హోమగుండంలో ఆత్మబలిదానానికి సిద్ధపడింది. ఆ బలిదానం కోసం హాజరైనవారందరి ముందూ… తన అవతార రహస్యాన్ని తెలిసి, నిజరూపాన్ని చూపింది.

వాసవి బలిదానం గురించి వినగానే విష్ణువర్ధనుడు రక్తం కక్కుకుని మరణించాడు. నాటి ప్రజలందరూ వాసవి దేవి మహత్యాన్ని గ్రహించి ఆమెను కొలుచుకుంటూ, విలువలతో జీవిస్తూ కాలం గడిపారు. వాసవిదేవి సోదరుడు విరూపాక్షుడు… పెనుగొండను గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాడు. అహింసకు కట్టుబడినందుకు, స్త్రీల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినందుకు, విలువల కోసం ప్రపంచ సుఖాలను వదులుకున్నందుకు వాసవిదేవి గొప్ప పుణ్యమూర్తిగా, వైశ్యులకు పూజ్యురాలిగా నిలిచిపోయింది.

వాసవిదేవిని కేవలం ఆర్యవైశ్యులే కాదు, వైశ్యులలోని ఇతర శాఖలవారూ, జైనులు కూడా పవిత్రంగా కొలుచుకుంటారు. ఆమెను పూజిప్తే ఎలాంటి కష్టమైనా మాయమైపోతుందని విశ్వసిస్తారు. అమ్మవారికి శుక్రవారం అంటే ఎంత ఇష్టమో తెలియనిది కాదు. అందునా వాసవిదేవి అవతరించింది కూడా ఈ రోజునే. ఈ ఏడాది వాసవిజయంతి కూడా శుక్రవారం నాడు వచ్చింది కాబట్టి… ఈ రోజు అమ్మవారిని పూజిస్తే మరింత విశేషమైన అనుగ్రహం లభించడం ఖాయం.

- మణి


More Others