ద్రౌపది ఆలయం – యామిగాని పల్లె
(Draupadi Devalayam – Yamiganipalle)
చిత్తూరు జిల్లా ప్రతి గ్రామంలో ధర్మరాజు ఆలయం, పాండవుల గుడి, ద్రౌపదమ్మ నిలయం పేరుతో పాండవులకు సంబంధించి అనేక
ఆలయాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని అనేక ధర్మరాజు ఆలయాల్లో కుప్పం తాలూకా యామిగాని పల్లెలోని ఆలయం అతి ముఖ్యమైంది. ఈ ఆలయం దాదాపు 5,6 శతాబ్దాలకు పూర్వమే నిర్మించినట్లు స్థానికుల కథనం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ధర్మరాజు తిరునాళ్ళు జరుపుతూ ఉంటారు. ఈ ఉత్సవం, వైశాఖ శుద్ధ పంచమి నుండి, బహుళ అష్టమి వరకు 18 రోజులు జరుగుతుంది. అంకురార్పణతో ప్రారంభమై తిలక తర్పణంతో అంతమవుతుంది.
తిలక తర్పణం ఉత్సవాన్ని గౌడ బ్రాహ్మణులు తొలి రోజు అంటే అంకురార్పణ (ధ్వజారోహణం) రోజున ఆలయంలో పూజలు జరిపి, పసుపు బట్టలు ధరించి ఉత్సవంలో జరిగే 18 రోజులు ఆలయమందే నివాసముంటారు. ఈ ఉత్సవ దినాల్లో పూజారులు స్త్రీలు వండిన భోజనాన్ని ఆరగించరు. ఉత్సవ దినాలలో 12 రోజులు ప్రతి రోజు ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 5 గంటలు (ఉదంక చరిత్రతో ప్రారంభించి, ధర్మరాజు పట్టాభిషేకం వరకు మహాభారత పురాణ శ్రవణం జరుగుతుంది.
పగటి పూట వినిపించిన కథనే రాత్రులందు నాటకరీతిలో ప్రదర్శిస్తారు. ఈ నాటకకర్తలు చిత్ర విచిత్రమైన అలంకరణలతో హావభావాలతో కౌరవ, పాండవ పాత్రలు ధరిస్తారు. ఈ ఉత్సవంలో పేర్కొనదగిన ఘట్టాలు 9వరోజు జరిగే బకాసురవధ, దాదాపు 10 మూటల బియ్యం అన్నం వండి ఒక బండిలో పోసి, బండిని అలంకరించి బీమవేషధారి దానిపై ఆసీనుడై, బకాసురుని వద్దకు వెళ్ళి వానితో పోరాడి అతడిని హతమారుస్తాడు. బండిలోని అన్నాన్ని గ్రామ ప్రజలందరూ ఒక చోట చేరి వేడుకతో భుజిస్తారు. 13వ రోజు ధర్మరాజు రాజసూయయాగాన్ని ప్రదర్శిస్తారు. యాగసమయంలో అచ్చట చేరిన భక్తులందరికీ తాంబూల, ఫల, పుష్పాలు పంచుతారు. 14వ రోజున అర్జున తపస్సు, అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సాధించడం కోసం ఆచరించే యాగం, ప్రజలు ఆలయం ముందు పెద్ద (పొడవాటి) తాటి చెట్టు నాటుతారు. అర్జునుడు ఆ మానును పూజిస్తాడు.
ఆ తరువాత ఉత్సవాలలో ఉత్తర గోగ్రహణం, శ్రీ కృష్ణ రాయబారం, భక్తులనెంతగానొ ఆకర్షిస్తాయి. 18వ రోజు దుర్యోధన వధ ఎంతో ఆకర్షణీయంగా ప్రదర్శించబడుతుంది. ఆ రోజు సాయంకాలం, పూజారులు ఏడు బావులలో నీటిని తోడుకొని వేపాకు, పసుపు, కుంకుమలతో పూజించిన కుండలతో తెచ్చి, అప్పటికే ఏర్పాటు చేసిన అగ్ని గుండంలో పోసి పూజ చేస్తారు. దీన్నే ‘గార్గేయ పూజ’ అంటారు. పూజారి ఒక కుండను నెత్తిన పెట్టుకొని అగ్ని గుండం చుట్టూ మైమరచి నృత్యం చేస్తాడు. ఉపవాసం వున్న పూజారి, అతడి తోటి ఆ రోజు అంతా ఉపవాసం ఉన్న భక్తులు అగ్ని గుండంలో ప్రవేశిస్తారు. వారు గుండమందు ఒక వైపు నుంచి మరొక వైపు సలసలమండే అగ్నిలో నడుస్తారు. మహాభారత ఉత్సవం ధర్మరాజు పట్టాభిషేకంతో ముగుస్తుంది.



