ప్రదక్షిణలు వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయా!
ప్రదక్షిణ, ఆ తరువాత సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల ఆరోగ్య ఉపయోగాలు కూడా ఉన్నాయి. సాష్టాంగ నమస్కారం చేయడంలో మనకు తెలియకుండానే, మూడు యోగాసనాలు దాగి ఉన్నాయి. అవి - శవాసనం, భుజంగాసనం, అధో ముఖ శ్వాసాసనం.
శవాసనం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకూ విశ్రాంతి లభిస్తుంది. భుజంగాసనం వల్ల వీపు నొప్పి పోతుంది. మలబద్ధకం నివారణ అవుతుంది. థైరాయిడ్ లోపాలు పోతాయి. అధోముఖ శ్వాసాసనం వల్ల పొత్తి కడుపులోని అవయవాలన్నిటికీ వ్యాయామం లభిస్తుంది. కాళ్ళు చేతులు బలం పుంజుకొంటాయి.
ఇలా చూస్తే, ప్రదక్షిణ నమస్కారమనేది శరీరానికి ఓ మంచి వ్యాయామంగా కూడా ఉపయోగపడుతుంది.
ఎవరికెన్ని ప్రదక్షిణలు?
దేవతా ప్రదక్షిణ విధుల గురించి మన ప్రాచీన గ్రంథాల్లో ఇలా పేర్కొన్నారు:
ఏకం గణాధి పే దద్యా ! ద్వే సూర్యే త్రీణి శంకరే ॥ చత్వారి కేశవే దత్యాత్ ! సప్తాశ్వత్థ ప్రదక్షిణమ్ ॥
'వినాయకుడికి ఒక ప్రదక్షిణం చేయాలి. సూర్యుడికి రెండు ప్రదక్షిణలు ఆచరించాలి. శివుడికి మూడు ప్రదక్షిణలు, విష్ణుమూర్తికి నాలుగు ప్రదక్షిణలు చేయాలి. రావి చెట్టుకు ఏడు ప్రదక్షిణలు చేయాలి' అని పెద్దలు చెబుతారు. మరో గ్రంథంలో ఇలా చెప్పారు:
ఏకం వినాయకే కుర్యాత్ | ద్వే సూర్యే త్రీణి శంకరే |
చత్వారి కేశవే కుర్యా ! తృప్త శక్తేః ప్రదక్షిణమ్ ||
'గణపతికి ఒక ప్రదక్షిణం చేయాలి. సూర్యుడికి రెండు, శివుడికి మూడు, విష్ణువుకు నాలుగు, దుర్గాదేవికి ఏడు ప్రదక్షిణలు చేయాలి.
తదేక దీక్షతో అధిక సంఖ్యలో ప్రదక్షిణలు చేయడం వల్ల అధిక ఫలం లభిస్తుంది. సర్వసాధారణంగా దేవుని చుట్టూ 5 నుంచి 11 సార్లు ప్రదక్షిణం చేయడం చాలా ప్రాంతాల్లో అలవాటు.
ఎవరెలా చేయాలి?
అపసవ్యం యతీనామ్ తు । సవ్యం తు బ్రహ్మచారిణామ్ || సవ్యాసవ్యం గృహస్థస్య | శంభోర్నిత్య ప్రదక్షిణమ్ ॥
శివాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు యతులు అపసవ్య దిశలో చేయాలి. బ్రహ్మచారులు సవ్యంగా చేయాలి. గృహస్థులు సవ్యాపసవ్యాలుగా ప్రదక్షిణ ఆచరించాలి' అని శాస్త్రం చెబుతోంది.
కాబట్టి పైన చెప్పుకున్న విధంగా ప్రదక్షిణలు చేయడం ఆరోగ్యాన్ని, దైవ కృపను కూడా ఇస్తుంది.
◆నిశ్శబ్ద.